సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత ఖరీఫ్ పంటలకు మద్దతు ధరలు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. మద్దతు ధర పెంపు ఊరట మాత్రమేనని ఓవైపు.. ఈ పెంపుతో రైతుకు ఒరిగేదేమీ లేదని మరోవైపు వాదనలు వినిపిస్తున్నాయి. పంటల సాగు వ్యయానికి కనీసం 1.5 రెట్లు అధికంగా మద్దతు ధర నిర్ణయిస్తామని కేంద్రం చెప్పిందని, కానీ ఆ స్థాయిలో ధరలు నిర్ణయించలేదని విమర్శలు వినిపిస్తున్నాయి. స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను పరిగణనలోకి తీసుకోకుండా సొంత ఫార్ములా ప్రకారం మద్దతు ప్రకటించారని ఆరోపణలొస్తున్నాయి. వరికి క్వింటాకు రూ. 200 పెంచామని చెబుతున్నారని, కానీ డీఏపీ బస్తా కూడా రూ. 200 పెంచారని.. దీని వల్ల రైతుకు ఏం లాభమని ప్రశ్నిస్తున్నారు.
మొత్తం 14 పంటలకు..
పంటల మద్దతు ధరలు పెంచుతామని 2014 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా బీజేపీ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే ఈ బడ్జెట్‌లో దీనికి కార్యరూపం తీసుకొచ్చారు. ఆ ప్రకారం మొత్తం 14 ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధరలను కేంద్రం పెంచింది. క్వింటా వరి (సాధారణ రకం) ధర రూ. 1,550 నుంచి రూ. 1,750కు పెరిగింది. గ్రేడ్ ఏ రకం వరి క్వింటా ధర రూ. 1,590 నుంచి రూ. 1,750 పెంచారు. పత్తి ధర రూ. 4,020 నుంచి రూ. 5,150కు పెంచారు. పప్పు ధాన్యాల్లో కందులు క్వింటా ధర రూ. 5,450 నుంచి రూ. 5,675, పెసర్లను రూ. 5,575 నుంచి రూ. 6,975, మినుములను రూ. 5,400 నుంచి రూ. 5,600, వేరుశనగల పాత ధర రూ. 4,450 ఉండగా, కొత్త ధర రూ. 4,890కు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. వరి ధాన్యం క్వింటా మద్దతు ధరను గతేడాదికన్నా రూ. 200 ఎక్కువ పెంచినట్లు కేంద్రం వెల్లడించింది. అలాగే కందులకు రూ. 225, పత్తికి రూ. 1,130, పెసర్లకు రూ.1,400, జొన్నలకు రూ.700 ఎక్కువ పెంచినట్లు పేర్కొంది. సాగు వ్యయానికి ఒకటిన్నర రెట్లు పెంచామని కేంద్రం చెప్పినా ఏ ప్రాతిపదికన పెంచారో మాత్రం స్పష్టం చేయలేదు.
సొంత ఫార్ములా ప్రకారం!: రాష్ట్ర వ్యవసాయ శాఖ.. జాతీయ వ్యవసాయ వ్యయ, ధరల కమిషన్ (సీఏసీపీ) ఈ ఏడాది జనవరిలో సమర్పించిన సాగు వ్యయాల ప్రకారం క్వింటా వరి పండించేందుకు రూ. 2,202 ఖర్చు అవుతుంది. స్వామినాథన్ కమిటీ సిఫార్సుల ప్రకారం సాగు ఖర్చుకు 50 శాతం అదనంగా కలిపి క్వింటాకు రూ. 3,303 మద్దతు ఇవ్వాలని కేంద్రాన్ని రాష్ట్రం కోరింది. సీఎం కేసీఆర్ కూడా ఈ విషయాన్ని పదే పదే ప్రస్తావిస్తూ వరి, మొక్కజొన్నకు క్వింటాకు కనీసం రూ. 2 వేల పైన ఇవ్వాలని కేంద్రంపై ఒత్తిడి చేశారు. కానీ ఫలితం లేకుండా పోయింది. పత్తి లాంగ్ స్టాపిల్ క్వింటాకు రూ. 6,087.. క్వింటా కందికి రూ. 5,896 ఖర్చవుతుందని రాష్ట్ర ప్రభుత్వం నివేదించింది. వీటికి 50 శాతం అదనంగా మద్దతు ఇస్తేనే రైతుకు సాగు లాభసాటిగా ఉంటుందని పేర్కొంది. వీటినీ కేంద్రం పట్టించుకోలేదు. మరోవైపు క్వింటా వరి మద్దతు ధరను రూ.2,000 చేస్తే బాగుండేదని రైతన్నలు అభిప్రాయపడుతున్నారు.
ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా ఖర్చు
సాగు ఖర్చులో ఒకటిన్నర రెట్లు పెంచామని కేంద్రం చెప్పడంలో అర్థం లేదు. ఖర్చు ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా ఉంటుంది. తెలంగాణలో వరి సాగు ఖర్చు క్వింటాకు రూ. 2,100 ఉంటుందని ప్రభుత్వం తెలిపింది. ఆ ప్రకారం ఒకటిన్నర రెట్లు కలిపితే రూ. 3,100 కావాలి. కానీ కేంద్రం తెలంగాణ ప్రతిపాదనను పట్టించుకోలేదు. పైగా డీఏపీ బస్తా ధర రూ. 200 పెంచి మద్దతు ధరను రూ. 200 పెంచింది. – సారంపల్లి మల్లారెడ్డి, రైతు సంఘం జాతీయ నేత
పెంపులో ఫార్ములా ఏదీ
ప్రస్తుతం నిర్ధారించిన ధరలు రైతుకు ఊరట మాత్రమే. మద్దతు ధరల పెంపులో వ్యవస్థీకృత ఏర్పాటు చేయలేదు. ఫార్ములా అంటూ ఏమీ లేకుండానే చేశారు. దేనికి ఎంత, ఎందుకు పెంచుతున్నారో కూడా స్పష్టత లేదు.
– డి.నర్సింహారెడ్డి, జాతీయ వ్యవసాయ నిపుణులు
ఎన్నికల స్టంట్
స్వామినాథన్ సిఫార్సులను పరిగణనలోకి తీసుకోకుండానే మద్దతు ధరలు ఖరారు చేశారు. సొంత ఫార్ములా ప్రకారమే కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇదంతా ఎన్నికల స్టంట్ మాత్రమే.
– పిడిగం సైదయ్య, ఉద్యాన శాస్త్రవేత్త
Comments
Please login to add a commentAdd a comment