ఖరీఫ్‌ భళా.. రుణాలు ఎలా? | Neglect of banks in giving crop loans | Sakshi
Sakshi News home page

ఖరీఫ్‌ భళా.. రుణాలు ఎలా?

Published Tue, Jul 17 2018 1:38 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

Neglect of banks in giving crop loans - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఖరీఫ్‌ ప్రారంభమై నెలన్నర దాటింది.. సాగు విస్తీర్ణం ఇప్పటికే సగానికి మించింది.. కానీ రైతులకు రుణాలందించడం లో బ్యాంకులు అంతులేని నిర్లక్ష్యాన్ని కనబరుస్తున్నాయి. ఈ సీజన్‌లో రూ.25 వేల కోట్ల మేర రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నా.. ఇప్పటిదాకా అందులో ఐదో వంతు కూడా ఇవ్వ లేదు. రైతులకు ఖరీఫ్‌ పంట రుణాలు ఇవ్వడంలో బ్యాంకులు అనేక కొర్రీలు పెడుతు న్నాయి. ‘ఔను ఖరీఫ్‌ రుణాలు ఇంకా పుంజుకోలేదు. కొత్త పట్టాదారు పాసు పుస్తకాలు కావా లని కొన్నిచోట్ల బ్యాంకులు రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి’అని వ్యవసాయ శాఖ ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారంటే పరి స్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం అవుతోంది. దీంతో అనేకచోట్ల అన్నదాతలు ప్రైవేటు అప్పుల కోసం పరుగులు తీస్తున్నారు. మళ్లీ అప్పులు, వడ్డీలే దిక్కవుతున్నాయి. అయినా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడంలేదన్న ఆరోపణలున్నాయి. దీనిపై వ్యవసాయ శాఖ అధికారులు బ్యాంకర్లతో సమీక్ష చేయకపోవడాన్ని రైతు సంఘాలు విమర్శిస్తున్నాయి. 

ఇచ్చింది రూ.5 వేల కోట్లే: రాష్ట్రంలో పంటల సాగు 49 శాతానికి చేరింది. ఖరీఫ్‌ పంటల సాధారణ సాగు విస్తీర్ణం 1.08 కోట్ల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 52.72 లక్షల ఎకరాల్లో సాగైనట్లు వ్యవసాయ శాఖ అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయి. పత్తి సాధారణ సాగు విస్తీర్ణం 42 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు ఏకంగా 30.30 లక్షల ఎకరాల్లో సాగవుతోంది. సోయాబీన్‌ సాధారణ సాగు విస్తీర్ణం 5.76 లక్షల ఎకరాలు కాగా, కేవలం 3.91 లక్షల ఎకరాల్లోనే సాగైంది. కంది సాధారణ సాగు విస్తీర్ణం 7.15 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 5.64 లక్షల ఎకరాల్లో సాగైంది.

మొక్కజొన్న సాధారణ సాగు విస్తీర్ణం 13.40 లక్షల ఎకరాలు కాగా, 5.01 లక్షల ఎకరాల్లో సాగైంది. ఓవైపు పంటల సాగు పెరుగుతోంది. మరోవైపు వర్షాలు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో పంటల రుణాలు మాత్రం 20 శాతానికి మించలేదని వ్యవసాయ శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఖరీఫ్‌లో బ్యాంకులు రైతులకు ఇవ్వాల్సిన పంట రుణాల లక్ష్యం రూ.25,496 కోట్లు కాగా, ఇప్పటివరకు ఐదో వంతు అంటే రూ.5,099 కోట్లే ఇచ్చినట్లు వెల్లడించాయి. వాస్తవంగా పత్తి రైతులకు రూ.8,279 కోట్ల రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంటే, రూ.3 వేల కోట్లకు మించలేదని అంచనా. 

కొత్త పాసు పుస్తకాలు రాలేదంటూ.. 
భూ రికార్డుల ప్రక్షాళన తర్వాత రాష్ట్రంలో రైతుల సంఖ్య 58.33 లక్షలుగా తేలింది. కానీ వారిలో 43 లక్షల మందికే కొత్త పట్టాదారు పాసుపుస్తకాలు వచ్చాయి. సర్కారు లెక్కల ప్రకారం 15 లక్షల మందికి కొత్త పట్టాదారు పాసు పుస్తకాలు రాలేదని తేలింది. ఇలా పాసు పుస్తకాలు రాని రైతులకు బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి తిరస్కరిస్తున్నాయి. మరోవైపు పాసు పుస్తకాలు వచ్చినా వాటిని బ్యాంకుల వద్ద కుదువ పెట్టాల్సిన పనిలేదని, ఆన్‌లైన్‌లో చూసుకుని రుణాలు ఇవ్వాలని సర్కారు నిర్దేశిం చినా బ్యాంకులు పట్టించుకోవడంలేదు. పాసు పుస్తకాలను కుదువ పెట్టాల్సిందేనని బ్యాంకు లు ఒత్తిడి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రైతుల కు కొత్త రుణాలు అందడం కష్టంగా మారింది. 

‘రైతుబంధు’ కూడా జమ! 
బ్యాంకులు రైతుల నుంచి పంట రుణంపై వడ్డీని వసూ లు చేస్తున్నాయి. రైతు రూ.లక్ష పంట రుణం తీసుకుని ఏడాదిలోగా తిరిగి చెల్లిస్తే వడ్డీ కట్టక్కరలేదని వ్యవసాయ శాఖ చెబుతుంటే, బ్యాంకులు మాత్రం పట్టించుకోవడంలేదు. కొత్త రుణం కావాలని వెళ్లిన రైతుల నుంచి అసలు, వడ్డీ ముక్కుపిండి వసూలు చేస్తున్నా యి. ‘రైతుబంధు’చెక్కులను తమ పొదుపు ఖాతాల్లో జమ చేయగా ఆ సొమ్మును పాతబాకీ వడ్డీ కింద జమ చేసుకుంటున్నాయి. ఇప్పటివరకు రూ.500 కోట్లకుపైగా ఉన్న బాకీ సొమ్మును విడుదల చేస్తే, వాటిని రైతు ల ఖాతాల్లో వడ్డీ కింద తిరిగి జమ చేస్తామని బ్యాం కులు తెలిపాయి. ప్రభుత్వం విడుదల చేయకపోవడం తో బ్యాంకులు రైతుల నుంచే వసూలు చేస్తున్నాయి. వడ్డీ వసూలు చేయవద్దని ప్రభుత్వం పదేపదే చెబు తున్నా బ్యాంకర్లు ఏమాత్రం అంగీకరించడంలేదు.

‘రుణమాఫీ’పై వడ్డీ భారం
రాష్ట్ర ప్రభుత్వం రూ.లక్ష లోపు రుణాన్ని నాలుగు విడతలుగా మాఫీ చేయడంతో రైతులపై విపరీతమైన వడ్డీ భారం పడింది. బ్యాంకులో ఉన్న పట్టా పాసు పుస్తకాలను విడిపించుకునేందుకు వడ్డీని రైతులే భరించాల్సి వస్తోంది. ఉదాహరణకు ఒక రైతు 2013లో రూ.లక్ష పంట రుణం తీసుకున్నాడు. 2014లో ప్రభుత్వం మొదటి విడత కింద రూ.25 వేలు చెల్లించగా రుణాన్ని రెన్యువల్‌ చేసుకున్నాడు. ఇలా నాలుగు విడతలు రూ.25 వేల చొప్పున ప్రభుత్వం చెల్లించింది. కానీ రూ.లక్షకు ఈ మొత్తం కాలంలో పడిన వడ్డీని మాత్రం ప్రభుత్వం చెల్లించలేదు. ఇలా ప్రభుత్వం నుంచి రీయింబర్స్‌మెంట్‌ రాకపోవడంతో బ్యాంకులు వడ్డీలు వసూలు చేస్తున్నాయి. ప్రభుత్వం చెల్లించాల్సిన వడ్డీ భారం తమపైనే పడుతుండటం, రుణాలు ఇవ్వకుండా వేధించడంపై రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement