సాక్షి, హైదరాబాద్: రైతు బంధు చెక్కులకు సంబంధించి అనేక లోపాలు బయటపడుతున్నాయి. రైతులకు ఉన్న భూమి కంటే ఎక్కువగా, తక్కువగా ఉన్నట్టుగా నమోదవడం.. ఎక్కువ భూమి ఉన్నవారికి తక్కువ సొమ్ము, తక్కువ భూమి ఉన్నవారికి ఎక్కువ సొమ్ముతో చెక్కులు అందడం, చాలా చోట్ల చెక్కుల పంపిణీ పూర్తిగాకపోవడం, తప్పుల కారణంగా చెక్కులు పంపిణీ చేయలేకపోవడం వంటి వాటితో వ్యవసాయ శాఖ అధికారులు బెంబేలెత్తుతున్నారు. ముందుగా నిర్ణయించుకున్న గడువు తీరిపోయినా.. రాష్ట్రవ్యాప్తంగా ఇంకా 13 లక్షలకుపైగా చెక్కులు పంపిణీ కాకపోవడం గమనార్హం.
40 వేల చెక్కుల్లో ‘నగదు’తప్పులు
పలుచోట్ల ‘రైతు బంధు’చెక్కుల్లో.. రైతులకు ఉన్న భూమికంటే ఎక్కువ సొమ్ము ఉండటం, మరికొన్ని చోట్ల తక్కువగా ఉండటంతో గందరగోళం నెలకొంది. ఉదాహరణకు నాలుగెకరాలు ఉన్న రైతుకు ఐదెకరాల సొమ్ముతో చెక్కులు రావడం, ఆరు ఎకరాలున్న రైతుకు రెండే ఎకరాల పేరిట రూ.8 వేల చెక్కు రావడం వంటివి బయటపడుతున్నాయి. సొమ్ము తక్కువగా వచ్చిన రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఎక్కువ సొమ్ముతో చెక్కులిచ్చిన పరిస్థితిపై అధికారులు కిందామీదా పడుతున్నారు. అలా ఎక్కువ సొమ్ము అందుకున్న రైతుల నుంచి ఆ అధిక మొత్తాన్ని ఎలా రాబట్టాలనుకుంటూ తల పట్టుకుంటున్నారు. నిజామాబాద్ జిల్లాలో ఓ రైతు ఇలా ఎక్కువ సొమ్ము పొందినట్టు గుర్తించిన అధికారులు వెళ్లి అడిగితే.. తిరిగి ఇస్తానని అంగీకరించాడు. మిగతా చోట్ల కూడా ఇలాగే చేయాలని భావిస్తున్నారు. ఇక తక్కువ సొమ్ము అందిన రైతులకు.. తిరిగి సరైన మొత్తంతో ఇస్తామంటూ ప్రస్తుత చెక్కులను వెనక్కి తీసుకుంటున్నారు. పలుచోట్ల మిగతా మొత్తాన్ని విడిగా అందిస్తామని హామీ ఇస్తున్నారు. మొత్తంగా 40 వేల చెక్కుల్లో ఇలాంటి పొరపాట్లు జరిగినట్టు వ్యవసాయశాఖ వర్గాలు అంచనా వేశాయి. ఈ తప్పిదంపై ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.
భారీగా పేరుకుపోతున్న చెక్కులు
ఈ నెల 10వ తేదీన రైతుల చెక్కుల పంపిణీని ప్రారంభించిన సర్కారు.. 17 నాటికి పూర్తి చేయాలని భావించింది. 17వ తేదీ నాటికి 10,052 గ్రామాల్లో గ్రామసభలు పెట్టి 51 లక్షల చెక్కులను పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అవసరమైతే గడువు పెంచినా.. మొత్తంగా 22వ తేదీ నాటికి పూర్తి చేయాలని నిర్ణయించింది. అనుకున్న షెడ్యూల్ ప్రకారమే అన్ని చోట్లా గ్రామసభలు నిర్వహించినా.. 37.65 లక్షల చెక్కులే పంపిణీ చేసినట్టు వ్యవసాయ శాఖ వర్గాలు వెల్లడించాయి. ఇంకా 13.35 లక్షల చెక్కులు పంపిణీ కాకుండా మిగిలిపోయాయి. కొన్నిచోట్ల రైతులు గ్రామసభలకు రాకపోవడం, మరికొన్నిచోట్ల చెక్కుల్లో తప్పుల వల్ల వాటిని పంపిణీ చేయలేకపోయారు. గ్రామాల్లో పంపిణీ అనంతరం మిగిలిపోయిన చెక్కులను నెల రోజులపాటు తహసీల్దార్ కార్యాలయాల్లో అందజేస్తారు. ఆ గడువులోనూ తీసుకోని చెక్కులను హైదరాబాద్‌లోని వ్యవసాయశాఖ కమిషనరేట్‌కు తరలించి.. అక్కడ తీసుకోవడానికి వీలు కల్పిస్తారు. మరోవైపు విదేశాల్లో స్థిరపడిన, వలస వెళ్లిన రైతుల భూములకు సంబంధించి చెక్కుల పంపిణీ అంశంపై ఇప్పటికీ స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదు. ఇక గ్రామసభల్లో చెక్కులు తీసుకోని పరిస్థితి అక్రమాలకు తావిచ్చే అవకాశముందని వ్యవసాయశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. గ్రామసభల్లో అయితే రైతులను ఎవరైనా గుర్తుపట్టగలరని, మండల కేంద్రాలు, హైదరాబాద్ కమిషనరేట్‌లో చెక్కులిచ్చేటపుడు గుర్తుపట్టడం కష్టమని.. దీంతో అక్రమాలు జరిగే అవకాశముందని అభిప్రాయపడుతున్నాయి.
‘చెక్కు’ల్లో చిక్కులు!
Published Sat, May 19 2018 3:17 AM | Last Updated on Tue, Jun 4 2019 5:16 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment