సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా రబీ సీజన్‌లో రైతులు వరి వైపే మొగ్గుచూపుతున్నారు. దీంతో ఇతర పంటల సాగు విస్తీర్ణం తగ్గి వరి విస్తీర్ణం పెరుగుతోంది. ఈ పరిస్థితి తెలంగాణలోనూ కనిపిస్తుండటం గమనార్హం. అక్టోబర్‌లో అనేకచోట్ల భారీ వర్షాలు కురవడం, చెరువులు, బావుల్లోకి నీరు వచ్చి చేరడంతో వరి పంట వేయడమే మంచిదని రైతులు భావిస్తున్నట్లు వ్యవసాయశాఖ వర్గాలు చెబుతున్నాయి. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు రబీలో 11.05 కోట్ల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. గతేడాది ఇదే సమయానికి 11.21 కోట్ల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. గతేడాదితో పోలిస్తే 16 లక్షల ఎకరాల్లో తేడా కనిపిస్తోంది. గతేడాది ఇదే సమయానికి 5.08 కోట్ల ఎక రాల్లో గోధుమ పంట సాగు చేయగా, ఈ ఏడాది ఇప్పటివరకు 4.77 కోట్ల ఎకరాల్లో మాత్రమే గోధుమ వేశారు. ఏకంగా 31 లక్షల ఎకరాల్లో గోధుమ సాగు విస్తీర్ణం తగ్గినట్లు కేంద్ర వ్యవసాయశాఖ నివేదిక వెల్లడించింది. ఇక నూనె గింజలను గతేడాది ఇదే సమయానికి 1.80 కోట్ల ఎకరాల్లో సాగు చేయగా, ఈ ఏడా ది ఇప్పటివరకు 1.69 కోట్ల ఎకరాల్లో మాత్రమే సాగు చేశారు. అయితే వరి మాత్రం గతేడాదితో పోలిస్తే గణనీయంగా పెరిగింది.
తగ్గిన ఇతర పంటల సాగు
దేశవ్యాప్తంగా ఉన్న సరళిలో భాగంగా రాష్ట్రంలోనూ రైతులు వరి పంటవైపే మొగ్గు చూపుతున్నారని వ్యవసాయశాఖ వర్గాలు చెబుతున్నాయి. అయితే రబీ సాగు విస్తీర్ణం మాత్రం గతేడాదితో పోలిస్తే నిరుత్సాహంగా ఉంది. ఇటీవల రాష్ట్ర వ్యవసాయశాఖ విడుదల చేసిన నివేదిక ప్రకారం తెలంగాణ రబీ సాధారణ సాగు విస్తీర్ణం 31.8 లక్షల ఎకరాలు. కాగా గతేడాది ఇదే సమయానికి 9.77 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. కానీ ఈ ఏడాది ఇప్పటివరకు 7.50 లక్షల ఎకరాలకు సాగు పడిపోవడం గమనార్హం. గతేడాదికి ఇప్పటికి 2.27 లక్షల ఎకరాల తేడా కనిపిస్తోంది. ఇతర పంటల సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోవడమే దీనికి కారణంగా చెబుతున్నారు.
నీటి నిల్వలతో వరివైపే చూపు
మరోవైపు అక్టోబర్‌లో కురిసిన వర్షాలతో నీటి నిల్వలు కనిపిస్తుండటంతో రైతులు వరి వైపు మొగ్గుచూపుతున్నారని వ్యవసాయశాఖ చెబుతోంది. రబీలో వరి సాధారణ సాగు విస్తీర్ణం 15.1 లక్షల ఎకరాలు కాగా, గతేడాది ఈ సమయానికి 25 వేల ఎకరాల్లో నాట్లు వేశారు. ఈ ఏడాది ఇప్పటివరకు 40 వేల ఎకరాల్లో నాట్లు వేశారు.
వరి వైపే రైతుల మొగ్గు!
Published Mon, Dec 11 2017 3:19 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment