రాళ్లల్లో రతనాల సేద్యం
రాళ్లల్లో రతనాల సేద్యం
Published Sat, Jul 30 2016 6:40 PM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
సదాశివనగర్: ఎటు చూసినా కనిపించేవన్ని రాళ్లే.. ఎందుకూ పనికి రాని బీడు భూములే.. అలాంటి భూముల్లో రతనాల సేద్యం చేస్తున్నారు రైతులు. రాళ్ల నడుమ పంటలు పండిస్తూ సిరులు కురిపిస్తున్నారు. మండలంలోని లింగంపల్లి, జనగాం, భూంపల్లి గ్రామ శివారులోని భూములన్నీ రాళ్లురప్పలతో నిండినవే. వాటిని సైతం లెక్క చేయకుండా వివిధ రకాల పంటలను సాగు చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు ఆయా గ్రామాల రైతులు. ఈ గ్రామాల్లో నల్లరేగడి భూములు చాలా తక్కువ విస్తీర్ణంలో ఉన్నాయి. ఎక్కువ మంది రైతులకు రాళ్లతో కూడిన భూములే అధికంగా ఉన్నాయి.
ఆ రాళ్ల భూములను నమ్ముకొని రైతులు నడుం బిగించారు. మొక్కవోని దీక్షతో సేద్యానికి ఉపక్రమించారు. కలుపు తీయడానికీ ఇబ్బందిగా ఉన్నా.. పట్టుదలతో సాగు చేపట్టారు. రాళ్లతో కూడిన భూముల్లో బంగారు పంటలు పండిస్తున్నారు. ఆ రాళ్ల భూముల్లోకి కలుపు తీసే పనులకు వచ్చేందుకు కూలీలు వెనుకడుగు వేస్తున్నా.. కుటుంబ సభ్యుల సహకారంతో సమర్థవంతంగా సేద్యం చేస్తున్నారు. కరడ్‌పల్లి, మాధవపల్లి, పద్మాజివాడి, కల్వరాల్, దగ్గి గ్రామాల నుంచి కూలీలకు ఎక్కువ డబ్బులు చెల్లిస్తూ కలుపు మొక్కలను తొలగిస్తున్నారు. వారికి ఆటో చార్జీలతో పాటు కూలీ డబ్బులు కూడా చెల్లిస్తున్నారు.
ఈ రాళ్ల భూముల్లో 220 ఎకరాల్లో సోయా, 180 ఎకరాల్లో మొక్కజొన్న, 80 ఎకరాల్లో కంది పంటలను సాగు చేశారు. గతేడాది వర్షాభావంతో చాలా తక్కువ విస్తీర్ణంలో ఈ రాళ్ల మధ్యన పంటలు సాగు చేశారు. కానీ ఈసారి వర్షాలు మెరుగ్గా ఉండడంతో సాగు విస్తీర్ణం రెట్టింపైంది. కొన్నేళ్లుగా బీళ్లుగా ఉన్న భూములు సైతం ప్రస్తుతం పచ్చని పంటలతో కనువిందు చేస్తున్నాయి. పెరిగిన విస్తీర్ణానికి అనుగుణంగా వర్షాలు సమృద్ధిగా కురిస్తే మంచి దిగుబడులు సాధిస్తామని ధీమాగా చెబుతున్నారు ఆయా గ్రామాల రైతులు.
Advertisement