సమగ్ర సస్యరక్షణ చర్యలు తీసుకోవాలి
Published Sat, Aug 27 2016 12:08 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
జైనథ్ : రైతులు పత్తి పంట సాగులో వ్యవసాయ అధికారుల సలహాల ప్రకారం సమగ్ర సస్యరక్షణ చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ ఏడీఏ పుల్లయ్య అన్నారు. శుక్రవారం ఆయన ఏవో వివేక్‌తో కలిసి గూడ గ్రామంలో పత్తి పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పత్తిలో ఈ సంవత్సరం కొత్తం గులాబి రంగు పురుగు ఉధతి ఎక్కువగా కనిపిస్తోందన్నారు.
వాస్తవానికి బీటీ–2 పత్తి విత్తనంలో ఉన్న విషం వలన ఈ పురుగు పంటలను ఆశించడం జరగదని పేర్కొన్నారు. కాకపోతే రైతులు పంటల సాగులో సరైన సస్యరక్షణ చర్యలు తీసుకోకపోవడం వలన బీటీలోని విషాన్ని సైతం ఈ పురుగులు తట్టుకోగలుగుతున్నాయి. పంటను నాశనం చేస్తోందని వివరించారు. అయితే బీటీ పత్తి వేసేటప్పుడు చుట్టు 5 వరసల్లో నాన్ బీటీ వేసుకోవడం, వేసవి కాలంలో లోతుగా దుక్కులు దున్నుకోవడం, మితిమీరిన పురుగుల మందులు వాడకపోవడం వలన ఈ పురుగు ఉధృతిని అరికట్టవచ్చన్నారు.
అయితే ఈ పురుగు ఉధృతిని తెలుసుకునేందుకు రైతులు తమ చేళలో లింగాకర్షక బుట్టలను ఏర్పాటు చేయాలన్నారు. ప్రాథమిక దశలో ఈ పురుగును గుర్తిస్తే, లీటరు నీటికి 5 మి.లీ వేప నూనెను కలిపి పిచికారీ చేసుకోవాలన్నారు. ఉధృతి ఎక్కువగా కనిపిస్తే, 200లీటర్ల నీటిలో 400 మి.లీ ప్రొఫెనోపాస్ లేదా క్వినాల్‌ఫాస్ అనే మందులను కలిపి ఎకరం విస్తీర్ణంలో పిచికారీ చేసుకోవాలన్నారు.
Advertisement