- సీఎం వద్దకు చేరిన జెడ్పీ చైర్మన్ పంచాయతీ
- నాగరాజును చైర్మెన్‌గా చేయాల్సిందేనంటున్న కాలువ వర్గం
- దిగేందుకు ససేమిరా అంటున్న చమన్
- రూ. 2 కోట్లకు బేరం..?
జెడ్పీ చైర్మెన్ పదవి నుంచి చమన్‌సాబ్ దిగిపోతారా..? లేదా..? తెలుగుదేశం పార్టీలోనే కాదు జిల్లా ప్రజల్లో కూడా ఇదే ఇప్పుడు హాట్ టాపిక్. ఒప్పందం మేరకు ఈనెల 5తోనే ఆయన పదవీకాలం ముగిసింది. దీంతో టీడీపీలోని ఓ వర్గం నేతలు చెప్పిన ప్రకారం మావారికి పదవి ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్నారు. మరోవైపు చమన్‌సాబ్ మాత్రం పదవిని కాపాడుకునేందుకు తనదైన శైలిలో చక్రం తిప్పుతున్నట్లు తెలిసింది.
అనంతపురం సిటీ : గత ఎన్నికల్లో జిల్లా పరిషత్ పీఠాన్ని తెలుగు దేశం పార్టీ కైవసం చేసుకున్న తర్వాత జెడ్పీ చైర్మెన్ పదవి కోసం ఆ పార్టీలోని ఇరు వర్గాల మధ్య తీవ్ర పోటీ జరిగింది. మంత్రిఽ పరిటాల సునీత వర్గం తరపున చమన్‌సాబ్, ప్రభుత్వ చీఫ్ విప్ కాలువ శ్రీనివాసులు వర్గం తరపున పూల నాగరాజులు ఆ పదవి కోసం పోటీ పడ్డారు. ఆఖరికి అధిష్టానం సూచనతో మొదటి రెండున్నర సంవత్సరాలు చమన్... ఆ తర్వాత రెండున్నరేళ్లు పూల నాగరాజు పదవిని చేపట్టేలా అప్పట్లో నిర్ణయం తీసుకున్నారు. కచ్చితంగా ఈనెల 5తో ఆ సమయం కూడా ముగిసిపోయింది.
సీఎం వద్ద పంచాయతీ
రెండున్నరేళ్లు పూర్తవుతున్నా జెడ్పీ చైర్మెన్ పదవిని వదులుకునేందుకు చమన్‌సాబ్ సిద్ధంగా లేనట్లో కనిపిస్తోంది. మరోవైపు ప్రభుత్వ చీఫ్ కాలువ శ్రీనివాసులు వాల్మీకి వర్గానికి చెందిన పూల నాగరాజుకు ఎలాగైనా పదవి వచ్చేలా చేయాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే మొన్న బుక్కపట్నం సభకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు ముందు జెడ్పీ చైర్మన్ పదవి పంచాయతీ పెట్టారని సమాచారం. సమయం ముగిసిన తర్వాత మీ అనుకూలాన్ని బట్టి మార్పులు చేసుకోండని సీఎం చెప్పారని తెలిసింది. 5వ తేదీ ముగిసి 9వ తేదీ అయినా చమన్‌సాబ్ ఈ వ్యవహారంపై ఎలాంటి ప్రకటన చేయకపోవడం చర్చనీయాంశమైంది.
దిగనంటే దిగను...
జెడ్పీ చైర్మెన్ పదవి నుంచి వైదొలిగేందుకు తాను ఏమాత్రం సిద్ధంగా లేనని చమన్‌సాబ్ అన్నట్లు అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ప్రస్తుత పరిస్థితుల్లో పదవి పోగొట్టుకుంటే తన రాజకీయ జీవితంపై అది తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుందని చమన్ భావిస్తున్నట్లు సమాచారం.
మంత్రి సునీతపైనా ఒత్తిడి
జెడ్పీ చైర్మెన్ పదవి విషయంలో మంత్రి సునీత కూడా ఒత్తిడికి గురవుతున్నట్లు తెలిసింది. చమన్ పదవిని వదలనంటే వదలనని అంటుండటంతో ఏం చేయాలో సునీతకు పాలుపోవడం లేదని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. మరోవైపు మంత్రి పరిటాల సునీత కూడా ఈ అంశంపై పట్టనట్లే వ్యవహరిస్తున్నట్లు సమాచారం. చమన్ తన మాటకు విలువ ఇవ్వడం లేదన్న అసంతృప్తితో ఆమె ఉన్నారని తెలిసింది.
రూ.2 కోట్లకు బేరం
జిల్లా పరిషత్ చైర్మెన్ పదవిని దక్కించుకునేందుకు చమన్ అన్ని విధాలా యత్నిస్తున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో ఓ మీడియా ప్రతినిధిని పూలనాగరాజు వద్దకు రాయబారిగా పంపినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే నాగరాజు తనకు పదవే కావాలని, డబ్బు వద్దని తెగేసి చెప్పినట్లు తెలిసింది.అయితే కొంత మంది మాత్రం పూల నాగరాజు రూ. 2 కోట్లు డిమాండ్ చేశారని అంటున్నారు. ఇంతకీ ఈ బేరసారాలు నిజమేనా? లేక పుకార్ల అన్నది అంతుచిక్కడం లేదు.
రెండు వర్గాలుగా చీలిన నేతలు
జెడ్పీ చైర్మెన్ వ్యవహారంలో ఆ పార్టీ నేతలు రెండుగా చీలిపోయారు. బీసీ వర్గానికి చెందిన పార్థసారధి జిల్లా టీడీపీ జిల్లా అధ్యక్షుడుగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే బీసీలకు అన్యాయం జరిగితే సహించమని కాలువ శ్రీనివాసులు వర్గం గట్టిగానే చెబుతోంది. మరోవైపు పరిటాల వర్గం నేతలు పట్టునిలుపుకునేందుకు యత్నిస్తున్నారు.
బీసీల బతుకులతో ఆడుకున్నట్లే
జిల్లా పరిషత్ చైర్మెన్‌గా బాధ్యతలను పూల నాగరాజుకు అప్పగించాలని బీసీ సామాజిక వర్గానికి చెందిన న్యాయవాది గంగాధర్ ‘సాక్షి’తో అన్నారు. ఇచ్చిన హామీని నిలబెట్టుకుని బీసీలకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. నాగరాజుకు అన్యాయం జరిగితే టీడీపీకి బీసీలు దూరమయ్యే అవకాశం ఉందని అన్నారు.
చూద్దాంలే..!
Published Sun, Jan 8 2017 10:12 PM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM
Advertisement