రాఘవాపురం (నందిగామ రూరల్) : మునేటి వాగునీటిని నమ్ముకొని దాళ్వా వరి సాగు చేసిన రైతులకు తిప్పలు తప్పటం లేదు. మునేటి వాగులో నీరు వట్టిపోవడంతో పంటను కాపాడుకునేందుకు రైతులు నానా అవస్థలు పడుతున్నారు. వివరాల్లోకి వెళితే రాఘవాపురం గ్రామ సమీపంలో మునేటి తీరాన శ్రీసీతారామ అగ్రికల్చరల్ ఇంప్రూవ్‌మెంట్ కో-ఆపరేటివ్ సొసైటీ స్కీమ్ ఉంది. ఈ స్కీమ్ పరిధిలో రాఘవాపురం, కమ్మవారిపాలెం గ్రామ పరిధిలో సుమారు 650 ఎకరాల మాగాణి భూములు ఉన్నాయి. ఈ ఏడాది ఖరీఫ్‌లో పలు కారణాల వలన స్కీమ్ పనిచేయక పంట సాగు కాలేదు.
ఈ నేపథ్యంలో మునేటిలో నీరు అధికంగా ఉందనే ఆలోచనతో రైతులు సుమారు 400 ఎకరాల్లో దాళ్వా వరిసాగు చేశారు. ప్రస్తుతం పంట పొట్టదశలో ఉంది. ఈ నేపథ్యంలో మునేటి వాగులో నీరు పూర్తిగా ఎండిపోయింది. పంటలను కాపాడుకునేందుకు స్కీమ్ నిర్వాహకులు ఇప్పటికే పొక్లెయిన్‌ల ద్వారా మునేటిలో పూడిక తీతలు తీసి సాగు నీటి కోసం ప్రయత్నాలు చేశారు.
అయినా నీరు లేకపోవడంతో ప్రస్తుతం లంకప్రాంతంలో బోరులు వేసి వాటి ద్వారా వచ్చే నీటిని కాలువల ద్వారా పంట పొలాలకు పంపించే ప్రయత్నాలు చేస్తున్నారు. అయినా నీరు సరిపోకపోవడంతో పలువురు రైతులకు చెందిన పంటలు ఇప్పటికే ఎండుదశకు చేరుకోగా కొన్ని భూములు నీరు లేక బీటలు వారి దర్శనమిస్తున్నాయి. పంట సాగు కోసం వేలాది రూపాయలు పెట్టుబడులు పెట్టిన రైతుల కళ్లముందే పంటలు ఎండుతుండడంతో కన్నీరు పెట్టుకుంటున్నారు.
ఆందోళన చెందుతున్న రైతులు
శ్రీ సీతారామ అగ్రికల్చరల్ ఇంప్రూవ్‌మెంట్ కో-ఆపరేటివ్ సొసైటీ స్కీమ్ పరిధిలో రైతులందరూ దాదాపుగా చిన్న, సన్నకారు వారే. మాగాణిలో దిగుబడి వచ్చిన ధాన్యాన్ని ఎక్కువశాతం మంది రైతులు తిండి గింజలకే వినియోగించుకుంటారు. ఈ ఏడాది పలు కారణాల వలన ఖరీఫ్‌లో స్కీమ్ పరిధిలో పూర్తిగా పంట సాగు కాలేదు. ఈ నేపథ్యంలో దాళ్వా సాగు ద్వారా అయినా తిండిగింజలు సంపాదించుకుందామనుకున్న రైతులకు నిరాశే మిగిలింది. పొట్టదశలో సమయానికి నీరందించకపోవడంతో ధాన్యం ఎక్కువ శాతం తాలుగా మారే ప్రమాదం ఉందని పలువురు రైతులు ఆందోళన చెందుతున్నారు. బీటలు వారిన భూములను చూసిన రైతులు కంటతడి పెడుతున్నారు.
సాగర్ ద్వారా నీరు విడుదల చేయాలి
వరి పొట్ట దశలో నీరు లేకపోవడం వలన పంట పూర్తిగా నష్టపోయే ప్రమాదం ఉంది. ప్రభుత్వం చొరవ తీసుకొని ఒక్కసారి సాగర్ జలాలను మునేటికి విడుదల చేస్తే పంటలకు జీవం పోసినట్లు అవుతుంది. ఈ ఏడాది కౌలుకు తీసుకొని 50 ఎకరాల్లో దాళ్వా వరిసాగు చేశాను. పంట సాగుకు సుమారు రూ.10లక్షల వరకు పెట్టుబడి పెట్టా. లక్షలాది రూపాయలు పెట్టుబడులు పెట్టినా నీరు లేకపోవడంతో పంటలు కళ్లముందే ఎండిపోతున్నాయి.
-కోట శ్రీనివాసరావు, రైతు
పంట పూర్తిగా ఎండిపోయింది
ఎకరాకు రూ.25వేల వరకు పెట్టుబడి పెట్టి రెండు ఎకరాల్లో దాళ్వా వరిసాగు చేశా. పంట పొట్టదశలో ఉంది. పొలాలకు నీరందకపోవడంతో పంట కళ్లముందే తెల్లబారిపోతోంది. ఎండిపోయిన పంట చివరకు పశువుల మేతకు కూడా పనికిరాని విధంగా ఉంది. ఏమి చేయాలో తెలియడం లేదు. ఇదే పరిస్థితి కొనసాగితే వ్యవసాయం రానురాను మరింత భారం అవుతుంది. సాగర్ నీరు ఇచ్చి పంటలను కాపాడాలి.
-ఓరుగంటి ఆంజనేయులు, రైతు
ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నాం
స్కీమ్ పరిధిలో పంట పొలాలకు నీరందించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి పెట్టాం. మునేటిలో నీరు పూర్తిగా నీరు ఎండిపోవడంతో పంట పొలాలకు నీరందించేందుకు అధిక వ్యయ ప్రయాసల కోర్చి లంక ప్రాంతంలో 12 బోర్లు వేశాం. వాటిలో 4 బోరుల్లో నీరు పడాయి. ఆ నాలుగు బోరుల్లో రెండు బోర్లలో నీరు వెంటనే ఇంకిపోయింది. ప్రస్తుతం రెండు బోర్ల ద్వారా సుమారు రెండు కిలోమీటర్ల పైప్‌లైన్ వేసి కాలువల ద్వారా పంట పొలాలకు నీరందించే ప్రయత్నాలు చేస్తున్నాం.
-చెన్నుపాటి వెంకటేశ్, స్కీమ్ అధ్యక్షుడు
నోళ్లు తెరుస్తున్న పంటపొలాలు
Published Mon, Mar 23 2015 1:41 AM | Last Updated on Tue, Oct 2 2018 6:42 PM
Advertisement
Advertisement