యాచారంలో మైనింగ్ జోన్ కింద క్వారీలు ఏర్పాటు చేయడానికి నిర్ణయించిన గుట్టల సమీపంలో వ్యవసాయ భూమి
సాక్షి, యాచారం(ఇబ్రహీంపట్నం): రంగారెడ్డి జిల్లా యాచారంలో మైనింగ్ జోన్ మళ్లీ తెరపైకి వచ్చింది. దీంతో స్థానిక రైతుల్లో భయాందోళన మొదలైంది. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో యాచారం రెవెన్యూ పరిధిలోని సర్వే నంబరు 105, 121, 126, 132, 200లోని 662.16 ఎకరాల్లో మైనింగ్ జోన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. స్టోన్ క్రషర్లు, క్వారీలు నెలకొల్పేం దుకు అప్పట్లో వివిధ కంపెనీలకు చెందిన 47 మంది ప్రతినిధులు దరఖాస్తు చేసుకున్నారు. అయితే, పచ్చటి పొలాల మధ్య మైనింగ్ జోన్ ఏర్పాటు చేస్తే వ్యవసాయ రంగం దెబ్బతింటుందని, స్టోరీ క్రషర్లు, క్వారీల వల్ల యాచారం గ్రామంతో పాటు మొండిగౌరెల్లి, చింతపట్ల, గడ్డమల్లయ్యగూడ, గునుగల్, నక్కగుట్టతండా, మొగుళ్లవంపు, చౌదర్‌పల్లి, గాండ్లగూడెం గ్రామాలకు ముప్పు ఏర్పడుతుందని రైతులు, స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. మైనింగ్ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన హద్దురాళ్లను, గుర్తులను తొలగించారు. అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లో ఉన్నా స్థానికుడైన కాంగ్రెస్ నాయకుడు, మాజీ ఎ మ్మెల్యే ముదిరెడ్డి కోదండరెడ్డి రైతులకు మద్దతుగా ఆం దోళనలో పాల్గొన్నారు. అప్పట్లో టీడీపీలో ఉన్న స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి కూడా మైనింగ్ జోన్ రద్దు పోరాటాల్లో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన కొత్తలో మైనింగ్ జోన్ ఏర్పాటు తెరపైకి రావడంతో రై తుల్లో మళ్లీ ఆందోళనలు చేశారు. ప్రజల ఒత్తిడికి దిగివచ్చిన తెలంగాణ ప్రభుత్వం కూడా రెండేళ్ల కింద మైనింగ్ జోన్‌ను విరమించుకుంటున్నట్లు ప్రకటించింది. దీం తో మైనింగ్ జోన్ రద్దయినట్లేనని రైతులు భావించారు.
అభ్యంతరాల కోసం గ్రామ పంచాయతీ వద్ద నోటీసు
అప్పట్లో మైనింగ్ జోన్ కింద ఎంపిక చేసిన యాచారం రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 200లోని భూమిలో స్టోన్ క్రషర్లు, క్వారీలకు అనుమతులు ఇవ్వాలని మైనింగ్ శాఖ అధికారులు కొన్ని రోజుల క్రితం యాచారం తహసీల్దార్ పద్మనాభరావుకు లేఖ ఇచ్చారు. స్థానికంగా మైనింగ్ జోన్ వ్యవహారంపై ప్రజలు మర్చిపోయారని భావించిన అధికారులు గుట్టుచప్పుడు కాకుండా నెల రోజుల క్రితం 105, 121, 126, 132, 200 సర్వే నంబర్లల్లోని 662.16 ఎకరాల భూమిని పరిశీలించారు. 200 సర్వే నంబర్‌లోని 90.17 ఎకరాల్లో మొదటగా కార్వీలు, స్టోన్ క్రషర్లు ఏర్పాటు చేయడానికి నిర్ణయించి శాఖపరమైన అనుమతుల (ఎన్‌ఓసీ) కోసం తహసీల్దార్‌ను సంప్రదించారు. దీంతో స్టోన్ క్రషర్లు, క్వారీల ఏర్పాటుకు అభ్యంతరాల కోసం సోమవారం యాచారం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద తహసిల్దార్ నోటీసు అంటించారు. కొద్ది రోజులుగా యాచారం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద భూరికార్డుల ప్రక్షాళన జరుగుతుండడం వల్ల వందలాది మంది రైతులు పంచాయతీ కార్యాలయానికి వస్తున్నారు. సోమవారం గ్రామ పంచాయతీ నోటిస్ బోర్డుపై మైనింగ్ జోన్ కోసం అభ్యంతరాల నోటిసు అందించిన విషయం తెలుసుకుని రైతుల్లో మళ్లీ భయాందోళన మొదలైంది. దీనికి వ్యతిరేకంగా మరోసారి ఉద్యమించడానికి రైతులు సన్నద్ధమవుతున్నారు.
మైనింగ్ జోన్ రద్దు చేసినట్లు ప్రకటించాక...
యాచారంలోని పలు సర్వే నంబర్లల్లో ఏర్పాటు చేయడానికి నిర్ణయించిన మైనింగ్ జోన్‌ను రద్దు చేసినట్లు అధికారులే ప్రకటించారు. ప్రస్తుతం ఉన్న జిల్లా కలెక్టర్ రఘునందన్‌రావు కూడ హామీ ఇచ్చారు. అయినా మళ్లీ మైనింగ్ జోన్ వ్యవహరం తెరపైకి రావడం జీర్ణించుకోలేకపోతున్నాం. ప్రభుత్వం పునరాలోచన చేయకపోతే మళ్లీ ఉద్యమాలకు సిద్ధం కావాల్సి వస్తది. ఆందోళనలు తప్పవు.స్టోన్ క్రఫర్లు, క్వారీలు ఏర్పాటు చేస్తే భూగర్భజలాలు అడుగంటిపోతాయి.
జోగు యాదయ్య, రైతు యాచారం
నోటీసు అందించింది వాస్తవమే
యాచారం రెవెన్యూ పరిధిలోని సర్వే నంబరు 200ల్లో 90.17 ఎకరాల్లో క్వారీలు ఏర్పాటు చేయడానికి ప్రజల అభ్యంతరాల కోసం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద నోటిసు అతికించింది వాస్తావమే. మైనింగ్ శాఖ అధికారులు వ్యపారులకు స్థలాలు అప్పగించాలని కోరారు. మైనింగ్ శాఖ అధికారుల సూచన మేరకు ఎన్‌ఓసీ జారీ చేయడానికి ముందు ప్రజల అభ్యంతరాలు తెలుసుకుంటాం. ప్రజల నిర్ణయం మేరకు మైనింగ్ శాఖ అధికారులకు నివేదిక పంపుతాం. నోటిసు అందించిన వెంటనే మైనింగ్ జోన్‌కు వ్యతిరేకంగా ప్రజలు ఫిర్యాదులు చేస్తున్నారు.
పద్మనాభరావు, తహసీల్దార్ యాచారం
Comments
Please login to add a commentAdd a comment