mining zone
-
కలకలం: మళ్లొస్తోంది.. మైనింగ్ జోన్ !
సాక్షి, యాచారం(ఇబ్రహీంపట్నం): రంగారెడ్డి జిల్లా యాచారంలో మైనింగ్ జోన్ మళ్లీ తెరపైకి వచ్చింది. దీంతో స్థానిక రైతుల్లో భయాందోళన మొదలైంది. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో యాచారం రెవెన్యూ పరిధిలోని సర్వే నంబరు 105, 121, 126, 132, 200లోని 662.16 ఎకరాల్లో మైనింగ్ జోన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. స్టోన్ క్రషర్లు, క్వారీలు నెలకొల్పేం దుకు అప్పట్లో వివిధ కంపెనీలకు చెందిన 47 మంది ప్రతినిధులు దరఖాస్తు చేసుకున్నారు. అయితే, పచ్చటి పొలాల మధ్య మైనింగ్ జోన్ ఏర్పాటు చేస్తే వ్యవసాయ రంగం దెబ్బతింటుందని, స్టోరీ క్రషర్లు, క్వారీల వల్ల యాచారం గ్రామంతో పాటు మొండిగౌరెల్లి, చింతపట్ల, గడ్డమల్లయ్యగూడ, గునుగల్, నక్కగుట్టతండా, మొగుళ్లవంపు, చౌదర్పల్లి, గాండ్లగూడెం గ్రామాలకు ముప్పు ఏర్పడుతుందని రైతులు, స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. మైనింగ్ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన హద్దురాళ్లను, గుర్తులను తొలగించారు. అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లో ఉన్నా స్థానికుడైన కాంగ్రెస్ నాయకుడు, మాజీ ఎ మ్మెల్యే ముదిరెడ్డి కోదండరెడ్డి రైతులకు మద్దతుగా ఆం దోళనలో పాల్గొన్నారు. అప్పట్లో టీడీపీలో ఉన్న స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి కూడా మైనింగ్ జోన్ రద్దు పోరాటాల్లో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన కొత్తలో మైనింగ్ జోన్ ఏర్పాటు తెరపైకి రావడంతో రై తుల్లో మళ్లీ ఆందోళనలు చేశారు. ప్రజల ఒత్తిడికి దిగివచ్చిన తెలంగాణ ప్రభుత్వం కూడా రెండేళ్ల కింద మైనింగ్ జోన్‌ను విరమించుకుంటున్నట్లు ప్రకటించింది. దీం తో మైనింగ్ జోన్ రద్దయినట్లేనని రైతులు భావించారు. అభ్యంతరాల కోసం గ్రామ పంచాయతీ వద్ద నోటీసు అప్పట్లో మైనింగ్ జోన్ కింద ఎంపిక చేసిన యాచారం రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 200లోని భూమిలో స్టోన్ క్రషర్లు, క్వారీలకు అనుమతులు ఇవ్వాలని మైనింగ్ శాఖ అధికారులు కొన్ని రోజుల క్రితం యాచారం తహసీల్దార్ పద్మనాభరావుకు లేఖ ఇచ్చారు. స్థానికంగా మైనింగ్ జోన్ వ్యవహారంపై ప్రజలు మర్చిపోయారని భావించిన అధికారులు గుట్టుచప్పుడు కాకుండా నెల రోజుల క్రితం 105, 121, 126, 132, 200 సర్వే నంబర్లల్లోని 662.16 ఎకరాల భూమిని పరిశీలించారు. 200 సర్వే నంబర్లోని 90.17 ఎకరాల్లో మొదటగా కార్వీలు, స్టోన్ క్రషర్లు ఏర్పాటు చేయడానికి నిర్ణయించి శాఖపరమైన అనుమతుల (ఎన్ఓసీ) కోసం తహసీల్దార్‌ను సంప్రదించారు. దీంతో స్టోన్ క్రషర్లు, క్వారీల ఏర్పాటుకు అభ్యంతరాల కోసం సోమవారం యాచారం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద తహసిల్దార్ నోటీసు అంటించారు. కొద్ది రోజులుగా యాచారం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద భూరికార్డుల ప్రక్షాళన జరుగుతుండడం వల్ల వందలాది మంది రైతులు పంచాయతీ కార్యాలయానికి వస్తున్నారు. సోమవారం గ్రామ పంచాయతీ నోటిస్ బోర్డుపై మైనింగ్ జోన్ కోసం అభ్యంతరాల నోటిసు అందించిన విషయం తెలుసుకుని రైతుల్లో మళ్లీ భయాందోళన మొదలైంది. దీనికి వ్యతిరేకంగా మరోసారి ఉద్యమించడానికి రైతులు సన్నద్ధమవుతున్నారు. మైనింగ్ జోన్ రద్దు చేసినట్లు ప్రకటించాక... యాచారంలోని పలు సర్వే నంబర్లల్లో ఏర్పాటు చేయడానికి నిర్ణయించిన మైనింగ్ జోన్‌ను రద్దు చేసినట్లు అధికారులే ప్రకటించారు. ప్రస్తుతం ఉన్న జిల్లా కలెక్టర్ రఘునందన్‌రావు కూడ హామీ ఇచ్చారు. అయినా మళ్లీ మైనింగ్ జోన్ వ్యవహరం తెరపైకి రావడం జీర్ణించుకోలేకపోతున్నాం. ప్రభుత్వం పునరాలోచన చేయకపోతే మళ్లీ ఉద్యమాలకు సిద్ధం కావాల్సి వస్తది. ఆందోళనలు తప్పవు.స్టోన్ క్రఫర్లు, క్వారీలు ఏర్పాటు చేస్తే భూగర్భజలాలు అడుగంటిపోతాయి. జోగు యాదయ్య, రైతు యాచారం నోటీసు అందించింది వాస్తవమే యాచారం రెవెన్యూ పరిధిలోని సర్వే నంబరు 200ల్లో 90.17 ఎకరాల్లో క్వారీలు ఏర్పాటు చేయడానికి ప్రజల అభ్యంతరాల కోసం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద నోటిసు అతికించింది వాస్తావమే. మైనింగ్ శాఖ అధికారులు వ్యపారులకు స్థలాలు అప్పగించాలని కోరారు. మైనింగ్ శాఖ అధికారుల సూచన మేరకు ఎన్ఓసీ జారీ చేయడానికి ముందు ప్రజల అభ్యంతరాలు తెలుసుకుంటాం. ప్రజల నిర్ణయం మేరకు మైనింగ్ శాఖ అధికారులకు నివేదిక పంపుతాం. నోటిసు అందించిన వెంటనే మైనింగ్ జోన్‌కు వ్యతిరేకంగా ప్రజలు ఫిర్యాదులు చేస్తున్నారు. పద్మనాభరావు, తహసీల్దార్ యాచారం -
మళ్లీ తెరపైకి మైనింగ్ జోన్!
సాక్షి, రంగారెడ్డి జిల్లా : మైనింగ్ జోన్ మళ్లీ తెరపైకి వచ్చింది. ప్రజాపోరాటాలు, రాజకీయ పార్టీల ఒత్తిడితో గతంలో మైనింగ్ జోన్ ఏర్పాటు విషయం సద్దుమణిగింది. యాచారం, మంచాల, కందుకూరు, మహేశ్వరం మండలాల్లో పెద్దఎత్తున గుట్టలు ఉన్న ప్రాంతాలను పూర్తిగా మైనింగ్‌జోన్‌గా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం గతంలో భావించింది. దాదాపు 1.5 లక్షల ఎకరాల్లో ఈ జోన్ ఏర్పాటుచేస్తే ఖజానాకు సైతం భారీగా ఆదాయం వస్తుందని భావించిన సర్కారు.. ఆ మేరకు గతంలో భూములను గుర్తించింది. కానీ స్థానికంగా అన్ని వర్గాల నుంచి ఒత్తిడి పెరగడంతో ఈ ప్రక్రియకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. అయితే కొత్త ప్రభుత్వం కొలువుదీరిన నేపథ్యంలో మైనింగ్ లీజులు పొందిన హక్కుదారులు తిరిగి ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తీసుకురావడంతో తలొగ్గిన పాలకులు తిరిగి మైనింగ్ జోన్‌కు సంబంధించిన ఫైళ్ల దుమ్ము దులపాలని ఆదేశించారు. రెండు రోజుల్లో ఫైళ్లు పంపాలి.. ప్రస్తుతం తాండూరు డివిజన్ పరిధిలో మైనింగ్ పనులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్ డివిజన్లోని యాచారం, కందుకూరు, మహేశ్వరం, మంచాల మండలాల్లోని లక్ష ఎకరాలను మైనింగ్‌జోన్‌గా గుర్తించారు. అంతేకాకుండా వాటి లీజులను కాంట్రాక్టర్లకు సైతం కట్టబెట్టారు. అయితే మైనింగ్ జోన్ ఏర్పాటుతో దుమ్ము రేగుతుందని, తద్వారా సాగు ఆందోళనకరమవ్వడంతోపాటు పర్యవరణ కాలుష్యం పెరిగి జనజీవనానికి విఘాతం కలుగుతుందని గతంలో అన్ని పక్షాలు తీవ్రంగా ప్రతిఘటించాయి. దీంతో అప్పట్లో మైనింగ్‌జోన్ ఏర్పాటు ప్రక్రియకు బ్రేక్ పడగా.. ప్రస్తుత ప్రభుత్వం ఈ ఫైళ్లకు సంబంధించి సమాచారాన్ని రెండ్రోజుల్లో సమర్పించాలని స్పష్టం చేసింది. దీంతో ఆయా మండల తహసీల్దార్లకు వివరాలు పంపాల్సిందిగా జాయింట్ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో రెవెన్యూ అధికారులు అందుకు సంబంధించిన ఫైళ్లను యంత్రాంగానికి సమర్పించే పనిలో నిమగ్నమయ్యారు. -
గ‘లీజు’ ఒత్తిళ్లు!
మళ్లీ తెరపైకి మైనింగ్ జోన్ వ్యవహారం యాచారం: కొంతకాలంగా సద్దుమణిగిన మైనింగ్ జోన్ వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది. స్థానిక రైతుల ఆందోళనతో గత ప్రభుత్వం మైనింగ్ లీజు అంశాన్ని తాత్కాలికంగా నిలిపివేయగా.. ప్రస్తుతం ఆ ఫైళ్ల కదలిక వేగవంతమైంది. ఏకంగా అమాత్యుల అండదండలతో ఈ గనుల లీజును సఫలీకృతం చేసేందుకు కొందరు పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగా స్థానిక రెవెన్యూ అధికారులపై ఒత్తిళ్లు తీవ్రం చేశారు. ఈ క్రమంలో గత వారం కొందరు లీజుదారులు రెవెన్యూ అధికారులతో చర్చించి.. లీజుకు కేటాయించిన స్థలాలను పరిశీలించడంతో స్థానికంగా కలకలం మొదలైంది. యాచారంలోని సర్వే నంబర్లు 105, 121, 126, 132, 200లలోని దాదాపు 662 ఎకరాలను మైనింగ్ జోన్‌కు కేటాయిస్తూ గత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు 47 మందికి గనుల లీజును జారీ చేస్తూ ఉత్తర్వులివ్వడంపై స్థానిక రైతాంగం తీవ్ర ఆందోళన వ్య క్తం చేసింది. మైనింగ్‌జోన్ ఏర్పాటుతో పంట పొలాలు దెబ్బతినడంతో పాటు నీటి కాలుష్యం, ఇతర సమస్యలు తలెత్తుతాయని స్థానిక ప్రజల వాదన. ఈ నేపథ్యంలో మైనింగ్ జోన్‌ను వ్యతిరేకిస్తూ స్థానిక ప్రజాప్రతినిధులు, ఇతర ప్రజాసంఘాలు పలు ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. గ్రామ పంచాయతీ, మండల పరిషత్ సర్వసభ్య సమావేశాల్లో ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబడుతూ తీర్మానాలు చేశారు. కలెక్టర్‌తో పాటు ఇతర ఉన్నతాధికారులు, మంత్రుల దృష్టికి తీసుకె ళ్లారు. దీంతో ఈ వ్యవహారం కాస్త చల్లబడడంతో ప్రజలు కొంత ఊరట చెందారు. తాజాగా గనుల లీజుకోసం లీజుదారులు మళ్లీ భూముల పరిశీలన చేపట్టడడంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. పైస్థాయిలో ఒత్తిడి చేస్తూ.. మైనింగ్ జోన్ ఏర్పాటుతో లీజుదారులు స్థానికంగా స్టోన్ క్రషర్, క్వారీల ఏర్పాటుకు చకచకా అనుమతులు పొందారు. కానీ స్థానికంగా నెలకొన్న ఆందోళనలతో వీటి ఏర్పాటుకు తాత్కాలికంగా బ్రేకు పడింది. తాజాగా లీజుదారులు అనుమతులను అమలు చేయాలంటూ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. ఉపముఖ్యమంత్రితో పాటు ఓ కేబినెట్ మంత్రికి సన్నిహితులుగా చెప్పుకొంటున్న కొందరు లీజుదారులు ఏకంగా మంత్రుల పేషీనుంచి ఆర్డీఓ, తహసీల్దార్లకు వరుసగా ఫోన్లు చేయిస్తున్నట్లు సమాచారం. తమకు లీజు కేటాయించిన భూములను వెంటనే అప్పగించాలని ఒత్తిడి చేస్తున్నారు. ఈ క్రమంలో వారంరోజులుగా తహసీల్దార్ కార్యాలయం చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. ఒకరిద్దరు లీజుదారులు బుధవారం మండల రెవెన్యూ అధికారులను వెంటబెట్టుకుని లీజుభూములను పరిశీలించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ ఒత్తిళ్లు ఫలించి భూములు అప్పగిస్తే స్థానికంగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగే అవకాశం ఉంది. మళ్లీ ఆందోళన తప్పదు యాచారంలో మైనింగ్‌జోన్ ఏర్పాటును స్థానికృులు కొన్నేళ్లుగా వ్యతిరేకిస్తున్నారు. యాచారం గ్రామం, మండల పరిషత్ కార్యాలయంలోనూ తీర్మానాలు కూడా చేశారు. మళ్లీ వ్యాపారులు అధికారులపై ఒత్తిడి చేయడం న్యాయం కాదు. స్టోన్ క్రషర్లు, క్వారీలు ఏర్పాటైతే పలు గ్రామాల్లో తీవ్ర నష్టం జరుగుతుంది. ప్రభుత్వం తక్షణమే మైనింగ్‌జోన్‌ను రద్దు చేయాలి. కాలుష్య రహిత పరిశ్రమలు ఏర్పాటు చేసి స్థానికులకు ఉపాధి కల్పించాలి. లేదంటే ఆందోళన తప్పదు. - రమావత్ జ్యోతి నాయక్, ఎంపీపీ, యాచారం -
మైనింగ్ జోన్ రద్దయ్యేనా!
యాచారం, న్యూస్‌లైన్: తెలంగాణలో టీఆర్ఎస్ విజయం సాధించడంతో యాచారం, నందివనపర్తి గ్రామాల రైతుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. మండల పరిధిలోని ఈ రెండు గ్రామాల్లో గత ప్రభుత్వ హయాంలో దాదాపు 900 ఎకరాల్లో ైమైనింగ్ జోన్ ఏర్పాటుకు నిర్ణయించారు. అయితే స్థానిక రైతులు మాత్రం జోన్ ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వ్యాపారులతో కుమ్మక్కైన అధికారులు.. ఆ భూముల్లో సాగు సాగడంలేదని తప్పుడు రికార్డులు సృష్టించి మైనింగ్ జోన్ ఏర్పాటుకు కుట్రలు చేశారని రైతులు ఆరోపిస్తూ ఆందోళనలకు దిగారు. వివిధ రాజకీయపక్షాలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పలుమార్లు ఆందోళనలు, ధర్నాలు నిర్వహించి కలెక్టర్‌తోసహా ఇతర ఉన్నతాధికారులకు వినతి పత్రాలు సమర్పించారు. ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ముదిరెడ్డి కోదండరెడ్డిలు కూడా పలుమార్లు జిల్లా కలెక్టర్లను కలిసి రద్దు విషయంలో తక్షణమే స్పష్టమైన ప్రకటన చేయాలని కోరారు. అయితే మైనింగ్ జోన్ రద్దుకు ఇప్పటికీ ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన రాలేదు. కాగా రెండేళ్ల కిందట జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించి తెలంగాణ ప్రభుత్వం వస్తే మైనింగ్ జోన్ రద్దుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వంలో తమకు అన్యాయం జరగదనే ఆశతో అన్నదాతలున్నారు. ఈ రెండు గ్రామాల్లో వందలాది మంది రైతులు ఏళ్ల కొద్ది ఆ భూములను సాగుచేసుకొని జీవనోపాధి పొందుతున్నారు. ఈ మైనింగ్ జోన్లో అత్యధికంగా ఇతర జిల్లాలకు చెందిన వ్యాపారులే స్టోన్ క్రషర్లు, క్వారీల ఏర్పాటుకు అనుమతులు పొందారు. అయితే స్థానికుల ఆందోళనలకు భయపడి సదరు భూముల్లో ప్రభుత్వం స్టోన్ క్రషర్లకు, క్వారీల ఏర్పాటుకు మాత్రం అనుమతులివ్వడం లేదు. ప్రస్తుతం టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడనుండడం, తన సన్నిహితుడైనా కేసీఆరే త్వరలో రాష్ట్రానికి సీఎం కానున్నట్లు స్పష్టం కావడంతో ఈ విషయంపై కోదండరాం ప్రత్యేక దృష్టి సారించాలని మండల రైతులు కోరుతున్నారు. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మైనింగ్ జోన్‌ను రద్దు చేస్తూ ఉత్తర్వులివ్వాలని వారు కోరుతున్నారు. -
యాచారం పై ఏపీఐఐసీ పంజా
యాచారం, న్యూస్‌లైన్: యాచారం మండలంలో మైనింగ్ జోన్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ రైతులు, ప్రజల ఆందోళనలు కొనసాగుతుండగానే.. ఉరుము ఉరమకుండానే వారిపై మరోసారి భూసేకరణ పిడుగు పడనుంది. పారిశ్రామికవాడ కోసం భూములు తీసుకోవడానికి ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పనా సంస్థ (ఏపీఐఐసీ) సిద్ధమైంది. మొదటి విడత కుర్మిద్ద గ్రామంలో వెయ్యి ఎకరాలను తీసేసుకోవడానికి నిర్ణయించిన ఏపీఐఐసీ, రెండో విడతలో యాచారం, చౌదర్పల్లి, చింతుల్ల గ్రామాల్లో మరో 2,160 ఎకరాలను లాక్కోవడానికి గోప్యంగా రంగం పూర్తి చేసింది. యాచారం మండలంలోని ఈ భూములే కాకుండా మంచాల మండలం ఖానాపూర్, కాఘజ్గట్, ఇబ్రహీంపట్నం మండలం పెద్దతుల్ల, ఎలిమినేడు తదితర గ్రామాల్లో కూడా భూములను తీసుకోవడానికి సిద్ధమైనట్లు తెలిసింది. అవుటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న పరిశ్రమలను బయటకు తరలించేందుకు అవసరమైన భూ సేకరణ కోసం గత మార్చిలో ప్రభుత్వం జీఓ నంబర్ 20 జారీచేసిన నేపథ్యంలో ఏపీఐఐసీ రంగంలోకి దిగింది. స్థానిక రైతులకు కనీసం సమాచారం ఇవ్వకుండానే మూడు గ్రామాల్లోని భూములను లాక్కోవడానికి సిద్ధమైంది. వీటికి సంబంధించిన సర్వే నంబర్లు, ఎకరాల విస్తీర్ణాన్ని ఇంటర్నెట్లో పొందుపర్చింది. జీవనోపాధి కోల్పోనున్న 500మందికి పైగా రైతులు పారిశ్రామికవాడ ఏర్పాటు కోసం మూడు గ్రామాల్లో ఏపీఐఐసీ తీసుకోదల్చిన 2,160 ఎకరాల్లో 70శాతానికి పైగా సాగులో ఉన్న భూములే ఉన్నాయి. 500కి పైగా కుటుంబాల రైతులు పంటలు, పండ్లు, కూరగాయలు, పూలతోటలు సాగు చేసుకుంటున్నారు. వీరితో పాటు మూడువేల మందికి పైగా కౌలు రైతులు కాస్తులో ఉన్నారు. పంటల సాగు కోసం రైతులు రూ.కోట్లు ఖర్చు చేసుకొని బోరుబావులు తవ్వించుకున్నారు. పంట పొలాలను ఏపీఐఐసీ సేకరిస్తే రైతులంతా జీవనోపాధి కోల్పోయే ప్రమాదం ఉంది. చట్టాన్ని తుంగలో తొక్కి... ప్రభుత్వం భూములను తీసేసుకోవడానికి నిర్ణయించినప్పుడు ముందు కచ్చితంగా ప్రజాభిప్రాయం సేకరించాలి. గ్రామసభల్లో ప్రజల అభ్యంతరాలను తెలుసుకొని పరిష్కరించడంతోపాటు పంచాయతీల్లో తీర్మానం చేయించాల్సి ఉంటుంది. ఇవేమీ పట్టించుకోని అధికారులు స్థానికులకు, రైతులకు సమాచారం ఇవ్వకుండానే తీసుకోదల్చిన భూములను ఖరారు చేసుకున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం తెచ్చిన భూసేకరణ చట్టాన్ని పూర్తిగా తుంగలో తొక్కారు. కొత్త చట్టం ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో భూములు సేకరించాలంటే మార్కెట్ ధరకు నాలుగు రెట్ల పరిహారం చెల్లించాలి. కానీ పరిహారం చెల్లించే విషయం ఊసెత్తకుండానే ఏపీఐఐసీ అధికారులు గోప్యంగా భూముల సేకరణ ప్రక్రియ ముగించుకున్నారు. ఇదిలా ఉంటే ఏపీఐఐసీ తీసుకుంటున్న భూములు నగరానికి సమీపంలో, నాగార్జునసాగర్ రహదారిపై ఉండటంతో ధరలు విపరీతంగా ఉన్నాయి. ప్రస్తుతం ఈ భూములను ప్రభుత్వం తీసుకోనున్నట్టు తెలియడంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. ఇదే విషయమై ఆర్డీఓ సూర్యారావును ‘న్యూస్‌లైన్’ సంప్రదించగా... పూర్తి సమాచారం తనకు తెలియదని, పాత జీఓ ప్రకారం ఏపీఐఐసీకి భూములు తీసుకోవడానికి నిర్ణయించి ఉండొచ్చని అన్నారు. మూడు గ్రామాల్లో ఏపీఐఐసీతీసుకోనున్న భూములు గ్రామం సర్వే నంబర్లు ఎకరాలు యాచారం 164 -255 834 చింతుల్ల 129- 183 767 చౌదర్పల్లి 148- 260 559 జీవనోపాధి కోల్పోతాం మొదటినుంచి వ్యవసాయం మీదనే ఆధారపడి కుటుంబాన్ని పోషించుకుంటున్నాం. ప్రభుత్వం మా భూములు లాక్కుంటుందని తెలిసి గుండెలో రాయిపడ్డట్టైంది. భూమిని ప్రభుత్వం లాక్కుంటే జీవనోపాధి కోల్పోతాం. - ఎం.జనార్దన్, రైతు, యాచారం ఇది అన్యాయం... ప్రజలకు తెలియకుండానే భూముల సర్వే నంబర్లు గుర్తించడం, ఇన్ని ఎకరాలు తీసుకుంటున్నామని ఇంటర్నెట్లో పెట్టడం అన్యాయం. మా గ్రామంలో ఏపీఐఐసీ తీసేసుకోవడానికి నిర్ణయించిన భూముల రైతులు వలసపోవాల్సిందేనా? - గౌర నర్సింహ, సర్పంచ్, చౌదర్పల్లి ఇది అన్యాయం... ప్రజలకు తెలియకుండానే భూముల సర్వే నంబర్లు గుర్తించడం, ఇన్ని ఎకరాలు తీసుకుంటున్నామని ఇంటర్నెట్లో పెట్టడం అన్యాయం. మా గ్రామంలో ఏపీఐఐసీ తీసేసుకోవడానికి నిర్ణయించిన భూముల రైతులు వలసపోవాల్సిందేనా? - గౌర నర్సింహ, సర్పంచ్, చౌదర్పల్లి ఆ భూముల్లో పరిశ్రమలు పెట్టండి ప్రభుత్వం పారిశ్రామికవాడలు నెలకొల్పడానికి జిల్లాలో వేలాది ఎకరాల భూములను తీసేసుకుంది. అవన్నీ నిరుపయోగంగా ఉన్నాయి. వాటిల్లో పరిశ్రమలు ఏర్పాటైన తర్వాతే కొత్త పారిశ్రామికవాడల కోసం భూసేకరణ చేయాలి. - నాయిని సుదర్శన్ రెడ్డి, వైఎస్సార్ సీపీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు