మళ్లీ తెరపైకి మైనింగ్ జోన్!
సాక్షి, రంగారెడ్డి జిల్లా : మైనింగ్ జోన్ మళ్లీ తెరపైకి వచ్చింది. ప్రజాపోరాటాలు, రాజకీయ పార్టీల ఒత్తిడితో గతంలో మైనింగ్ జోన్ ఏర్పాటు విషయం సద్దుమణిగింది. యాచారం, మంచాల, కందుకూరు, మహేశ్వరం మండలాల్లో పెద్దఎత్తున గుట్టలు ఉన్న ప్రాంతాలను పూర్తిగా మైనింగ్‌జోన్‌గా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం గతంలో భావించింది. దాదాపు 1.5 లక్షల ఎకరాల్లో ఈ జోన్ ఏర్పాటుచేస్తే ఖజానాకు సైతం భారీగా ఆదాయం వస్తుందని భావించిన సర్కారు.. ఆ మేరకు గతంలో భూములను గుర్తించింది.
కానీ స్థానికంగా అన్ని వర్గాల నుంచి ఒత్తిడి పెరగడంతో ఈ ప్రక్రియకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. అయితే కొత్త ప్రభుత్వం కొలువుదీరిన నేపథ్యంలో మైనింగ్ లీజులు పొందిన హక్కుదారులు తిరిగి ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తీసుకురావడంతో తలొగ్గిన పాలకులు తిరిగి మైనింగ్ జోన్‌కు సంబంధించిన ఫైళ్ల దుమ్ము దులపాలని ఆదేశించారు.
రెండు రోజుల్లో ఫైళ్లు పంపాలి..
ప్రస్తుతం తాండూరు డివిజన్ పరిధిలో మైనింగ్ పనులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్ డివిజన్‌లోని యాచారం, కందుకూరు, మహేశ్వరం, మంచాల మండలాల్లోని లక్ష ఎకరాలను మైనింగ్‌జోన్‌గా గుర్తించారు. అంతేకాకుండా వాటి లీజులను కాంట్రాక్టర్లకు సైతం కట్టబెట్టారు. అయితే మైనింగ్ జోన్ ఏర్పాటుతో దుమ్ము రేగుతుందని, తద్వారా సాగు ఆందోళనకరమవ్వడంతోపాటు పర్యవరణ కాలుష్యం పెరిగి జనజీవనానికి విఘాతం కలుగుతుందని గతంలో అన్ని పక్షాలు తీవ్రంగా ప్రతిఘటించాయి.
దీంతో అప్పట్లో మైనింగ్‌జోన్ ఏర్పాటు ప్రక్రియకు బ్రేక్ పడగా.. ప్రస్తుత ప్రభుత్వం ఈ ఫైళ్లకు సంబంధించి సమాచారాన్ని రెండ్రోజుల్లో సమర్పించాలని స్పష్టం చేసింది. దీంతో ఆయా మండల తహసీల్దార్లకు వివరాలు పంపాల్సిందిగా జాయింట్ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో రెవెన్యూ అధికారులు అందుకు సంబంధించిన ఫైళ్లను యంత్రాంగానికి సమర్పించే పనిలో నిమగ్నమయ్యారు.