మళ్లీ తెరపైకి మైనింగ్ జోన్ వ్యవహారం
యాచారం: కొంతకాలంగా సద్దుమణిగిన మైనింగ్ జోన్ వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది. స్థానిక రైతుల ఆందోళనతో గత ప్రభుత్వం మైనింగ్ లీజు అంశాన్ని తాత్కాలికంగా నిలిపివేయగా.. ప్రస్తుతం ఆ ఫైళ్ల కదలిక వేగవంతమైంది. ఏకంగా అమాత్యుల అండదండలతో ఈ గనుల లీజును సఫలీకృతం చేసేందుకు కొందరు పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగా స్థానిక రెవెన్యూ అధికారులపై ఒత్తిళ్లు తీవ్రం చేశారు. ఈ క్రమంలో గత వారం కొందరు లీజుదారులు రెవెన్యూ అధికారులతో చర్చించి.. లీజుకు కేటాయించిన స్థలాలను పరిశీలించడంతో స్థానికంగా కలకలం మొదలైంది.
యాచారంలోని సర్వే నంబర్లు 105, 121, 126, 132, 200లలోని దాదాపు 662 ఎకరాలను మైనింగ్ జోన్‌కు కేటాయిస్తూ గత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు 47 మందికి గనుల లీజును జారీ చేస్తూ ఉత్తర్వులివ్వడంపై స్థానిక రైతాంగం తీవ్ర ఆందోళన వ్య క్తం చేసింది. మైనింగ్‌జోన్ ఏర్పాటుతో పంట పొలాలు దెబ్బతినడంతో పాటు నీటి కాలుష్యం, ఇతర సమస్యలు తలెత్తుతాయని స్థానిక ప్రజల వాదన. ఈ నేపథ్యంలో మైనింగ్ జోన్‌ను వ్యతిరేకిస్తూ స్థానిక ప్రజాప్రతినిధులు, ఇతర ప్రజాసంఘాలు పలు ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. గ్రామ పంచాయతీ, మండల పరిషత్ సర్వసభ్య సమావేశాల్లో ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబడుతూ తీర్మానాలు చేశారు. కలెక్టర్‌తో పాటు ఇతర ఉన్నతాధికారులు, మంత్రుల దృష్టికి తీసుకె ళ్లారు. దీంతో ఈ వ్యవహారం కాస్త చల్లబడడంతో ప్రజలు కొంత ఊరట చెందారు. తాజాగా గనుల లీజుకోసం లీజుదారులు మళ్లీ భూముల పరిశీలన చేపట్టడడంతో రైతుల్లో ఆందోళన మొదలైంది.
పైస్థాయిలో ఒత్తిడి చేస్తూ..
మైనింగ్ జోన్ ఏర్పాటుతో లీజుదారులు స్థానికంగా స్టోన్ క్రషర్, క్వారీల ఏర్పాటుకు చకచకా అనుమతులు పొందారు. కానీ స్థానికంగా నెలకొన్న ఆందోళనలతో వీటి ఏర్పాటుకు తాత్కాలికంగా బ్రేకు పడింది. తాజాగా లీజుదారులు అనుమతులను అమలు చేయాలంటూ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. ఉపముఖ్యమంత్రితో పాటు ఓ కేబినెట్ మంత్రికి సన్నిహితులుగా చెప్పుకొంటున్న కొందరు లీజుదారులు ఏకంగా మంత్రుల పేషీనుంచి ఆర్డీఓ, తహసీల్దార్లకు వరుసగా ఫోన్లు చేయిస్తున్నట్లు సమాచారం. తమకు లీజు కేటాయించిన భూములను వెంటనే అప్పగించాలని ఒత్తిడి చేస్తున్నారు. ఈ క్రమంలో వారంరోజులుగా తహసీల్దార్ కార్యాలయం చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. ఒకరిద్దరు లీజుదారులు బుధవారం మండల రెవెన్యూ అధికారులను వెంటబెట్టుకుని లీజుభూములను పరిశీలించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ ఒత్తిళ్లు ఫలించి భూములు అప్పగిస్తే స్థానికంగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగే అవకాశం ఉంది.
మళ్లీ ఆందోళన తప్పదు
యాచారంలో మైనింగ్‌జోన్ ఏర్పాటును స్థానికృులు కొన్నేళ్లుగా వ్యతిరేకిస్తున్నారు. యాచారం గ్రామం, మండల పరిషత్ కార్యాలయంలోనూ తీర్మానాలు కూడా చేశారు. మళ్లీ వ్యాపారులు అధికారులపై ఒత్తిడి చేయడం న్యాయం కాదు. స్టోన్ క్రషర్లు, క్వారీలు ఏర్పాటైతే పలు గ్రామాల్లో తీవ్ర నష్టం జరుగుతుంది. ప్రభుత్వం తక్షణమే మైనింగ్‌జోన్‌ను రద్దు చేయాలి. కాలుష్య రహిత పరిశ్రమలు ఏర్పాటు చేసి స్థానికులకు ఉపాధి కల్పించాలి. లేదంటే ఆందోళన తప్పదు.
- రమావత్ జ్యోతి నాయక్, ఎంపీపీ, యాచారం
గ‘లీజు’ ఒత్తిళ్లు!
Published Sat, Oct 4 2014 11:49 PM | Last Updated on Sat, Sep 2 2017 2:20 PM
Advertisement