వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు జగన్ మండిపాటు
2018–19 నాటికి మైనింగ్ శాఖ ఆదాయం రూ.2,210 కోట్లు.. 2023–24 నాటికి అది రూ.4 వేల కోట్లకు పైమాటే
ఏపీఎండీసీ ఆదాయం 2018–19 నాటికి రూ.400 కోట్లు మాత్రమే
2023–24 నాటికి ఏకంగా రూ.3 వేల కోట్లకుపైగా ఆదాయం
ఖజానాకు ఆదాయం పెరిగితే అవినీతి అవుతుందా?
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గనుల లీజుల గురించి ఇష్టానుసారం మాట్లాడుతున్నారని సీఎం చంద్రబాబునాయుడుపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. మాట్లాడితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై లేనిపోని అభాండాలు వేయడానికి విపరీతంగా ప్రయత్నిస్తున్నారని చెప్పారు. వాళ్ల కుటుంబాన్ని ఏదో విధంగా తొక్కేయాలి.. వాళ్లను నాశనం చేయాలి.. అన్నట్టుగా చంద్రబాబు తీరు ఉందని చెప్పారు. ఇసుక, గనుల పాలసీపై చంద్రబాబు విడుదల చేసిన వైట్ పేపర్‌పై వైఎస్ జగన్ ఫ్యాక్ట్ పేపర్ ద్వారా వాస్తవాలను శుక్రవారం మీడియాకు వివరించారు.
దశాబ్దాలుగా ఈ గనులను అడ్డం పెట్టుకొని సంపాదించింది ఎవరో అందరికి తెలుసన్నారు. మైనర్, మేజర్ ఖనిజాల ద్వారా 2018–19లో ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం రూ.2,210 కోట్లని తెలిపారు. ఈ రోజు (2023–24) వస్తోన్న ఆదాయం రూ.4 వేల కోట్లకు పైమాటే అని స్పష్టం చేశారు. 2018–19లో చంద్రబాబు దిగిపోయే నాటికి ఏపీఎండీసీ ఆదాయం రూ.400 కోట్లు అని, ఈ రోజు దాని ఆదాయం రూ.3 వేల కోట్లు పైమాటేనని తెలిపారు.
ఇలా ఆదాయం పెంచితే కరప్షన్ జరుగుతున్నట్టా? అని నిలదీశారు. చంద్రబాబు హయాంలో ఆదాయం ఎందుకు పెరగలేదని ప్రశ్నించారు. ఏదైనా ఆరోపణ చేసే ముందు లాజిక్, రీజన్ ఉండాలని హితవు పలికారు. ఇప్పుడు వైట్ పేపర్ అంటూ పచ్చి అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. ఇది ఎంత వరకు సమంజసమో మీరే ఆలోచించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment