యాచారం, న్యూస్‌లైన్:
యాచారం మండలంలో మైనింగ్ జోన్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ రైతులు, ప్రజల ఆందోళనలు కొనసాగుతుండగానే.. ఉరుము ఉరమకుండానే వారిపై మరోసారి భూసేకరణ పిడుగు పడనుంది. పారిశ్రామికవాడ కోసం భూములు తీసుకోవడానికి ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పనా సంస్థ (ఏపీఐఐసీ) సిద్ధమైంది. మొదటి విడత కుర్మిద్ద గ్రామంలో వెయ్యి ఎకరాలను తీసేసుకోవడానికి నిర్ణయించిన ఏపీఐఐసీ, రెండో విడతలో యాచారం, చౌదర్‌పల్లి, చింతుల్ల గ్రామాల్లో మరో 2,160 ఎకరాలను లాక్కోవడానికి గోప్యంగా రంగం పూర్తి చేసింది. యాచారం మండలంలోని ఈ భూములే కాకుండా మంచాల మండలం ఖానాపూర్, కాఘజ్‌గట్, ఇబ్రహీంపట్నం మండలం పెద్దతుల్ల, ఎలిమినేడు తదితర గ్రామాల్లో కూడా భూములను తీసుకోవడానికి సిద్ధమైనట్లు తెలిసింది. అవుటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న పరిశ్రమలను బయటకు తరలించేందుకు అవసరమైన భూ సేకరణ కోసం గత మార్చిలో ప్రభుత్వం జీఓ నంబర్ 20 జారీచేసిన నేపథ్యంలో ఏపీఐఐసీ రంగంలోకి దిగింది. స్థానిక రైతులకు కనీసం సమాచారం ఇవ్వకుండానే మూడు గ్రామాల్లోని భూములను లాక్కోవడానికి సిద్ధమైంది. వీటికి సంబంధించిన సర్వే నంబర్లు, ఎకరాల విస్తీర్ణాన్ని ఇంటర్నెట్‌లో పొందుపర్చింది.
జీవనోపాధి కోల్పోనున్న 500మందికి పైగా రైతులు
పారిశ్రామికవాడ ఏర్పాటు కోసం మూడు గ్రామాల్లో ఏపీఐఐసీ తీసుకోదల్చిన 2,160 ఎకరాల్లో 70శాతానికి పైగా సాగులో ఉన్న భూములే ఉన్నాయి. 500కి పైగా కుటుంబాల రైతులు పంటలు, పండ్లు, కూరగాయలు, పూలతోటలు సాగు చేసుకుంటున్నారు. వీరితో పాటు మూడువేల మందికి పైగా కౌలు రైతులు కాస్తులో ఉన్నారు. పంటల సాగు కోసం రైతులు రూ.కోట్లు ఖర్చు చేసుకొని బోరుబావులు తవ్వించుకున్నారు. పంట పొలాలను ఏపీఐఐసీ సేకరిస్తే రైతులంతా జీవనోపాధి కోల్పోయే ప్రమాదం ఉంది.
చట్టాన్ని తుంగలో తొక్కి...
ప్రభుత్వం భూములను తీసేసుకోవడానికి నిర్ణయించినప్పుడు ముందు కచ్చితంగా ప్రజాభిప్రాయం సేకరించాలి. గ్రామసభల్లో ప్రజల అభ్యంతరాలను తెలుసుకొని పరిష్కరించడంతోపాటు పంచాయతీల్లో తీర్మానం చేయించాల్సి ఉంటుంది. ఇవేమీ పట్టించుకోని అధికారులు స్థానికులకు, రైతులకు సమాచారం ఇవ్వకుండానే తీసుకోదల్చిన భూములను ఖరారు చేసుకున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం తెచ్చిన భూసేకరణ చట్టాన్ని పూర్తిగా తుంగలో తొక్కారు. కొత్త చట్టం ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో భూములు సేకరించాలంటే మార్కెట్ ధరకు నాలుగు రెట్ల పరిహారం చెల్లించాలి. కానీ పరిహారం చెల్లించే విషయం ఊసెత్తకుండానే ఏపీఐఐసీ అధికారులు గోప్యంగా భూముల సేకరణ ప్రక్రియ ముగించుకున్నారు. ఇదిలా ఉంటే ఏపీఐఐసీ తీసుకుంటున్న భూములు నగరానికి సమీపంలో, నాగార్జునసాగర్ రహదారిపై ఉండటంతో ధరలు విపరీతంగా ఉన్నాయి. ప్రస్తుతం ఈ భూములను ప్రభుత్వం తీసుకోనున్నట్టు తెలియడంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. ఇదే విషయమై ఆర్డీఓ సూర్యారావును ‘న్యూస్‌లైన్’ సంప్రదించగా... పూర్తి సమాచారం తనకు తెలియదని, పాత జీఓ ప్రకారం ఏపీఐఐసీకి భూములు తీసుకోవడానికి నిర్ణయించి ఉండొచ్చని అన్నారు.
మూడు గ్రామాల్లో ఏపీఐఐసీతీసుకోనున్న భూములు
గ్రామం సర్వే నంబర్లు ఎకరాలు
యాచారం 164 -255 834
చింతుల్ల 129- 183 767
చౌదర్‌పల్లి 148- 260 559
జీవనోపాధి కోల్పోతాం
మొదటినుంచి వ్యవసాయం మీదనే ఆధారపడి కుటుంబాన్ని పోషించుకుంటున్నాం. ప్రభుత్వం మా భూములు లాక్కుంటుందని తెలిసి గుండెలో రాయిపడ్డట్టైంది. భూమిని ప్రభుత్వం లాక్కుంటే జీవనోపాధి కోల్పోతాం.
- ఎం.జనార్దన్, రైతు, యాచారం
ఇది అన్యాయం...
ప్రజలకు తెలియకుండానే భూముల సర్వే నంబర్లు గుర్తించడం, ఇన్ని ఎకరాలు తీసుకుంటున్నామని ఇంటర్నెట్‌లో పెట్టడం అన్యాయం. మా గ్రామంలో ఏపీఐఐసీ తీసేసుకోవడానికి నిర్ణయించిన భూముల రైతులు వలసపోవాల్సిందేనా?
- గౌర నర్సింహ, సర్పంచ్, చౌదర్‌పల్లి
ఇది అన్యాయం...
ప్రజలకు తెలియకుండానే భూముల సర్వే నంబర్లు గుర్తించడం, ఇన్ని ఎకరాలు తీసుకుంటున్నామని ఇంటర్నెట్‌లో పెట్టడం అన్యాయం. మా గ్రామంలో ఏపీఐఐసీ తీసేసుకోవడానికి నిర్ణయించిన భూముల రైతులు వలసపోవాల్సిందేనా?
- గౌర నర్సింహ, సర్పంచ్, చౌదర్‌పల్లి
ఆ భూముల్లో పరిశ్రమలు పెట్టండి
ప్రభుత్వం పారిశ్రామికవాడలు నెలకొల్పడానికి జిల్లాలో వేలాది ఎకరాల భూములను తీసేసుకుంది. అవన్నీ నిరుపయోగంగా ఉన్నాయి. వాటిల్లో పరిశ్రమలు ఏర్పాటైన తర్వాతే కొత్త పారిశ్రామికవాడల కోసం భూసేకరణ చేయాలి.
- నాయిని సుదర్శన్ రెడ్డి,
వైఎస్సార్ సీపీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు
యాచారంపైఏపీఐఐసీ పంజా
Published Sun, Sep 8 2013 11:38 PM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM
Advertisement
Advertisement