yacharam mandal
-
చెరువులో ఈతకు వెళ్లి నలుగురు చిన్నారులు మృతి
-
ఫినాయిల్ తాగి నవ వధువు మృతి
సాక్షి, యాచారం: ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఓ మహిళ మృతిచెందింది. యాచారం మండలంలోని తక్కళ్లపల్లి గ్రామానికి చెందిన బాలమణి (23) కుటుంబ సమస్యలతో తీవ్ర మనస్తాపానికి గురైంది. తీవ్ర ఆవేదనతో ఇటీవల ఇంట్లో ఫినాయిల్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వెంటనే గమనించిన కుటుంబసభ్యులు ఆమెను స్థానిక ఆస్పత్రి సూచన మేరకు హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత ఆమెను ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. ఆమె చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతిచెందింది. బాలమణికి నాలుగు నెలల కిందే తక్కళ్లపల్లి గ్రామానికి చెందిన నాగరాజుతో పెళ్లి జరిగింది. వేధింపులతోనే బాలమణి మృతి చెందిందని బాధిత కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెంకటయ్య తెలిపారు. -
వెంటాడుతున్న చిరుత భయం
సాక్షి, యాచారం: కొత్తపల్లి గ్రామస్తులను చిరుతపులి కంటికి కునుకు లేకుండా చేస్తుంది. గత మూడు రోజులుగా వరుసగా రాత్రుళ్లు మందలపై దాడులు చేసి మేకలు, గొర్రెలను చంపి తినేస్తుండడంతో అటవీ ప్రాంతంలో ఉండాలంటేనే కాపరులు భయాందోళన చెందుతున్నారు. చిరుతపులి భయం వల్ల కొత్తపల్లి గ్రామస్తులు ఆందోళన చెందుతున్నా అటవీ శాఖ అధికారులు సరిగ్గా స్పందించకపోవడంతో ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. మంగళవారం రాత్రి చిరుత పులి కాస జంగయ్య మందపై దాడి చేసి మేకను చంపి ఎత్తుకెళ్లడం, రెండు మేకలను తీవ్రంగా గాయపర్చడం, బుధవారం రాత్రి చిక్కుడు వెంకటేష్‌కు చెందిన మందపై దాడి చేసి మేకను చంపడం, శుక్రవారం రాత్రి బైకని అశోక్ మందపై దాడి చేసి మేకను చంపి తినేయడం, రెండు మేకలను తీవ్రంగా గాయపర్చడంతో కాపరులు జంకుతున్నారు. మాడ్గుల – యాచారం మండలాల సరిహద్దులోని తాడిపర్తి నుంచి మాల్ వరకు 10 కిలోమీటర్ల మేరా గుట్టలు, పెద్ద పెద్ద రాళ్లతో కూడిన దట్టమైన అటవీ ప్రాంతం ఉంది. రాత్రి పూల గుట్టల సమీపంలో ఉన్న మందలపై దాడులు చేస్తున్న చిరుతపులి తెల్లవారే సరికి గుట్టల్లోకి చేరుకుంటొంది. చిరుతపులి ఎక్కడ దాడి చేసి చంపేస్తుందోనని కాపలాదారులు చెట్లపైన తలదాచుకోవాల్సిన దుస్థితి నెలకొంది. రాత్రి పూటే పగలు కూడా అటవీ ప్రాంతం, వ్యవసాయ పొలాలకు వెళ్లాలంటేనే కాపరులు, రైతులు, వ్యవసాయ కూలీలు జంకుతున్నారు. సంచరిస్తుంది చిరుతపులే.... గత మూడు, నాలుగు రోజుల రాత్రుళ్లు కొత్తపల్లి అటవీ ప్రాంతంలో సంచరిస్తుంది చిరుతపులేనని అటవీ శాఖ అధికారులు నిర్ధారించారు. శుక్రవారం రాత్రి బైకని అశోక్ మందపై దాడి చేసి మేకను చంపి తినేయడం తెలుసుకున్న అటవీ శాఖ రేంజ్ అధికారి సత్యనారాయణతో పాటు విజయభాస్కర్‌రెడ్డి, నర్సింహరెడ్డి, నర్సింహ, ఇంద్రసేనారెడ్డి తదితర అధికారులు బృందం శనివారం కొత్తపల్లి అటవీ ప్రాంతాన్ని సందర్శించారు. దాడులు చేసిన మందల సమీపంలో పాదముద్రలను గుర్తించి కొత్తపల్లిలో సంచరిస్తుంది చిరుతపులేనని నిర్ధారించారు. గ్రామంలో దండోరా వేయించి రాత్రి పూట అటవీ ప్రాంతంలోకి ఎవరూ వెళ్లవద్దని హెచ్చరికలు పంపించారు. అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన మందల్లో గొర్రెలు గాని, మేకలు గాని ఉంచరాదని కాపరులకు సూచించారు. ఒకటా..? లేదా రెండు చిరుతపులులు తిరుగుతున్నాయా..? అనే విషయం తెలుసుకోవడానికి మందల సమీపాల్లో సీసీ కెమెరాలను బిగిస్తున్నారు. అదే విధంగా అటవీ ప్రాంతంలో జూ అధికారులు బోన్లు ఏర్పాటు చేసే విధంగా స్థలాలను ఎంపిక చేసినట్లు రేంజ్ అధికారి సత్యనారాయణ తెలిపారు. కొత్తపల్లిలో చిరుతపులి దాడిలో మృతి చెందిన మేకను చూపిస్తున్న కాపరి -
కలకలం: మళ్లొస్తోంది.. మైనింగ్ జోన్ !
సాక్షి, యాచారం(ఇబ్రహీంపట్నం): రంగారెడ్డి జిల్లా యాచారంలో మైనింగ్ జోన్ మళ్లీ తెరపైకి వచ్చింది. దీంతో స్థానిక రైతుల్లో భయాందోళన మొదలైంది. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో యాచారం రెవెన్యూ పరిధిలోని సర్వే నంబరు 105, 121, 126, 132, 200లోని 662.16 ఎకరాల్లో మైనింగ్ జోన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. స్టోన్ క్రషర్లు, క్వారీలు నెలకొల్పేం దుకు అప్పట్లో వివిధ కంపెనీలకు చెందిన 47 మంది ప్రతినిధులు దరఖాస్తు చేసుకున్నారు. అయితే, పచ్చటి పొలాల మధ్య మైనింగ్ జోన్ ఏర్పాటు చేస్తే వ్యవసాయ రంగం దెబ్బతింటుందని, స్టోరీ క్రషర్లు, క్వారీల వల్ల యాచారం గ్రామంతో పాటు మొండిగౌరెల్లి, చింతపట్ల, గడ్డమల్లయ్యగూడ, గునుగల్, నక్కగుట్టతండా, మొగుళ్లవంపు, చౌదర్పల్లి, గాండ్లగూడెం గ్రామాలకు ముప్పు ఏర్పడుతుందని రైతులు, స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. మైనింగ్ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన హద్దురాళ్లను, గుర్తులను తొలగించారు. అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లో ఉన్నా స్థానికుడైన కాంగ్రెస్ నాయకుడు, మాజీ ఎ మ్మెల్యే ముదిరెడ్డి కోదండరెడ్డి రైతులకు మద్దతుగా ఆం దోళనలో పాల్గొన్నారు. అప్పట్లో టీడీపీలో ఉన్న స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి కూడా మైనింగ్ జోన్ రద్దు పోరాటాల్లో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన కొత్తలో మైనింగ్ జోన్ ఏర్పాటు తెరపైకి రావడంతో రై తుల్లో మళ్లీ ఆందోళనలు చేశారు. ప్రజల ఒత్తిడికి దిగివచ్చిన తెలంగాణ ప్రభుత్వం కూడా రెండేళ్ల కింద మైనింగ్ జోన్‌ను విరమించుకుంటున్నట్లు ప్రకటించింది. దీం తో మైనింగ్ జోన్ రద్దయినట్లేనని రైతులు భావించారు. అభ్యంతరాల కోసం గ్రామ పంచాయతీ వద్ద నోటీసు అప్పట్లో మైనింగ్ జోన్ కింద ఎంపిక చేసిన యాచారం రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 200లోని భూమిలో స్టోన్ క్రషర్లు, క్వారీలకు అనుమతులు ఇవ్వాలని మైనింగ్ శాఖ అధికారులు కొన్ని రోజుల క్రితం యాచారం తహసీల్దార్ పద్మనాభరావుకు లేఖ ఇచ్చారు. స్థానికంగా మైనింగ్ జోన్ వ్యవహారంపై ప్రజలు మర్చిపోయారని భావించిన అధికారులు గుట్టుచప్పుడు కాకుండా నెల రోజుల క్రితం 105, 121, 126, 132, 200 సర్వే నంబర్లల్లోని 662.16 ఎకరాల భూమిని పరిశీలించారు. 200 సర్వే నంబర్లోని 90.17 ఎకరాల్లో మొదటగా కార్వీలు, స్టోన్ క్రషర్లు ఏర్పాటు చేయడానికి నిర్ణయించి శాఖపరమైన అనుమతుల (ఎన్ఓసీ) కోసం తహసీల్దార్‌ను సంప్రదించారు. దీంతో స్టోన్ క్రషర్లు, క్వారీల ఏర్పాటుకు అభ్యంతరాల కోసం సోమవారం యాచారం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద తహసిల్దార్ నోటీసు అంటించారు. కొద్ది రోజులుగా యాచారం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద భూరికార్డుల ప్రక్షాళన జరుగుతుండడం వల్ల వందలాది మంది రైతులు పంచాయతీ కార్యాలయానికి వస్తున్నారు. సోమవారం గ్రామ పంచాయతీ నోటిస్ బోర్డుపై మైనింగ్ జోన్ కోసం అభ్యంతరాల నోటిసు అందించిన విషయం తెలుసుకుని రైతుల్లో మళ్లీ భయాందోళన మొదలైంది. దీనికి వ్యతిరేకంగా మరోసారి ఉద్యమించడానికి రైతులు సన్నద్ధమవుతున్నారు. మైనింగ్ జోన్ రద్దు చేసినట్లు ప్రకటించాక... యాచారంలోని పలు సర్వే నంబర్లల్లో ఏర్పాటు చేయడానికి నిర్ణయించిన మైనింగ్ జోన్‌ను రద్దు చేసినట్లు అధికారులే ప్రకటించారు. ప్రస్తుతం ఉన్న జిల్లా కలెక్టర్ రఘునందన్‌రావు కూడ హామీ ఇచ్చారు. అయినా మళ్లీ మైనింగ్ జోన్ వ్యవహరం తెరపైకి రావడం జీర్ణించుకోలేకపోతున్నాం. ప్రభుత్వం పునరాలోచన చేయకపోతే మళ్లీ ఉద్యమాలకు సిద్ధం కావాల్సి వస్తది. ఆందోళనలు తప్పవు.స్టోన్ క్రఫర్లు, క్వారీలు ఏర్పాటు చేస్తే భూగర్భజలాలు అడుగంటిపోతాయి. జోగు యాదయ్య, రైతు యాచారం నోటీసు అందించింది వాస్తవమే యాచారం రెవెన్యూ పరిధిలోని సర్వే నంబరు 200ల్లో 90.17 ఎకరాల్లో క్వారీలు ఏర్పాటు చేయడానికి ప్రజల అభ్యంతరాల కోసం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద నోటిసు అతికించింది వాస్తావమే. మైనింగ్ శాఖ అధికారులు వ్యపారులకు స్థలాలు అప్పగించాలని కోరారు. మైనింగ్ శాఖ అధికారుల సూచన మేరకు ఎన్ఓసీ జారీ చేయడానికి ముందు ప్రజల అభ్యంతరాలు తెలుసుకుంటాం. ప్రజల నిర్ణయం మేరకు మైనింగ్ శాఖ అధికారులకు నివేదిక పంపుతాం. నోటిసు అందించిన వెంటనే మైనింగ్ జోన్‌కు వ్యతిరేకంగా ప్రజలు ఫిర్యాదులు చేస్తున్నారు. పద్మనాభరావు, తహసీల్దార్ యాచారం -
విష జ్వరాలతో విలవిల
⇒ యాచారం మండలంలో విజృంభించిన సీజనల్ వ్యాధులు ⇒ వందల సంఖ్యలో ఆస్పత్రుల్లో చేరుతున్న రోగులు ⇒ జాగ్రత్తలు పాటించాలని వైద్యుల సూచన యాచారం: మండల పరిధిలోని పలు గ్రామాలు విష జ్వరాలతో మంచం పట్టాయి. ఏ గ్రామంలో చూసినా ఇదే దుస్థితి కనిపిస్తోంది. విష జ్వరాలు, వాంతులు, విరేచనాలు, కాళ్లు, కీళ్ల నొప్పులతో అవస్థలు పడుతున్నారు. పారిశుద్ధ్య లోపమో.. కలుషిత నీటి ప్రభావమో.. వాతావరణ మార్పులో.. కారణమేదైనా.. బాధితులు మాత్రం కంటిమీద కునుకు లేకుండా ఉన్నారు. వారం రోజులుగా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న ప్రజలు యాచారం, మాల్ కేంద్రాల్లోని ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారు. పేదలు మాత్రం యాచారంలోని ప్రభుత్వాస్పత్రికి క్యూ కడుతున్నారు. దీంతో స్థానిక పీహెచ్సీ గురువారం రోగులతో కిటకిటలాడింది. ఎప్పుడూ లేని విధంగా 200 మందికి పైగా వైద్యం కోసం ఆస్పత్రికి వచ్చారు. వీరిలో 70 శాతానికి పైగా జ్వరాలు, వాంతులు, విరేచనాలతో బాధపడుతున్న వారే ఉన్నారు. నందివనపర్తి, యాచారం, నక్కర్తమేడిపల్లి, నస్దిక్‌సింగారం, కుర్మిద్ద, చౌదర్పల్లి, మంతన్‌గౌరెల్లి, కొత్తపల్లి, తక్కళ్లపల్లి తదితర గ్రామాల నుంచి పదుల సంఖ్యలో వచ్చారు. దీంతో దవాఖానాలోని బెడ్లు పూర్తిగా నిండిపోయాయి. వైద్యాధికారి ఊపేందర్రెడ్డి దగ్గరుండి రోగులకు వైద్య సేవలుందించారు. పారిశుద్ధ్య లోపమేనా...? వారం రోజులుగా అప్పుడప్పుడు మండలంలోని పలు గ్రామాల్లో మోస్తరు వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో డ్రైనేజీ వ్యవస్థ దారుణంగా మారింది. వర్షాల వల్ల డ్రైనేజీ కాల్వలు నిండిపోవడం, పైపు లైన్లలో లీకేజీలు ఏర్పడటం వల్ల తాగునీరు కలుషితమవుతోంది. ప్రజలు వ్యాధుల బారిన పడటానికి ఇదే కారణం కావచ్చని వైద్యులు చెబుతున్నారు. వర్షాలు కురుస్తున్న దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని స్వయంగా జిల్లా కలెక్టర్ రఘునందన్‌రావు ఆదేశాలిచ్చినా.. అధికారులు, ప్రజాప్రతినిధుల్లో స్పందన లేకుండా పోయింది. ఏ గ్రామంలో చూసినా నీటి ట్యాంకులు శుభ్రం చేయడం, బ్లీచింగ్ పౌడర్ చల్లిన దాఖాలాలు లేవు. ముసుర్ల వల్ల గ్రామాల్లో ఇళ్ల మధ్యనే బురద నీళ్లు చేరి దుర్వాసన వస్తోంది. ఇవి దోమలకు ఆవాసంగా మారాయి. మంతన్‌గౌరెల్లి, దీని అనుబంధ గిరిజన తండాల్లో శానిటేషన్ వ్యవస్థ దారుణంగా ఉంది. తమ్మలోనిగూడ, తక్కళ్లపల్లి, యాచారం, నందివనపర్తి, మాల్ ,చింతపట్ల తదితర గ్రామాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ట్యాంకులు శుభ్రం చేయకపోవడం, పైకప్పులు లేకపోవడంతో నీళ్లలో పురుగులు పడుతున్నాయి. కొన్ని గ్రామాల్లో ఎయిర్వాల్వ్లపై కప్పులు లేకపోవడం వల్ల చెత్తాచెదారం పడి నీళ్లు కలుషితం అవుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి తగిన చర్యలు చేపట్టాలని మండల ప్రజలు కోరుతున్నారు. ఈ విషయమై వైద్యాధికారి ఊపేందర్రెడ్డిని సంప్రదించగా ప్రజలు కచ్చితంగా కాచి, చలార్చిన నీటినే తాగాలన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. -
బూర నర్సయ్య హామీలు..
ఇంద్రానగర్.. యాచారం మండలంలోని గునుగల్ గ్రామానికి అనుబంధ నివాస ప్రాంతం. అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్న ఈ పల్లె అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. జిల్లాలోని ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని యాచారం మండలం భువనగిరి లోక్‌సభ స్థానం పరిధిలోకి వస్తుంది. స్థానిక ఎంపీ బూర నర్సయ్య గౌడ్ ‘సాక్షి వీఐపీ రిపోర్టర్’గా గ్రామానికి వచ్చి స్థానికుల సమస్యలను తెలుసుకున్నారు. పెద్దాయనా.. పెద్దమ్మా.. చెల్లీ.. అంటూ ప్రతి ఒక్కరినీ పలకరిస్తూ గ్రామమంతా కలియతిరిగారు. అడుగడుగునా ఆయనకు సమస్యలే ఎదురయ్యాయి. పింఛన్లు, ఆహార భద్రతా కార్డుల గురించి అనేకమంది మొరపెట్టుకున్నారు. అందరి సమస్యలనూ సావధానంగా విన్న ఆయన ఇంద్రానగర్‌లోని ప్రతి సమస్యనూ తెలుసుకున్నానని, వీలైనంత త్వరగా వాటికి పరిష్కారం చూపుతానని మాటిచ్చారు. బూర నర్సయ్య హామీలు.. మహానగరానికి యాచారం మండలం దగ్గర్లోనే ఉంది. కానీ ఎక్కడా అభివృద్ధి జాడ కన్పించడం లేదు. ఇక్కడి కాలనీలో పాఠశాల ఏర్పాటు చేయిస్తా. సీసీ రోడ్డు, డ్రైనేజీ కాల్వల నిర్మాణానికి నిధులు కేటాయిస్తా. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఆహారభద్రతా కార్డులు అందిస్తాం. రేషన్ కార్డుల్లో వయసు తక్కువగా రావడం వల్ల కొందరికి పింఛన్లు రావడం లేదని తెలిసింది. వారందరికీ పింఛన్లు అందేలా చూస్తా. ప్రజలు ఆందోళన చెందాల్సిన పనిలేదు. అందరికీ సంక్షేమ పథకాలు అందుతాయి. ఎంపీ: పెద్దాయనా నీ పేరేంటి..పింఛన్ మంజూరైందా? వికలాంగుడు: నా పేరు రాంచంద్రయ్య. ప్రమాదంలో కాళ్లు దెబ్బతిన్నాయి. నాకు పింఛన్ రాదంటున్నారు. ఎంపీ: నీవు నడవలేకున్నావు గదా .. ఎందుకు పింఛన్ రాదంటున్నారు. కచ్చితంగా వచ్చేలా చూస్తా.. ముందు అర్జీ పెట్టుకో. ఎంపీ: నీ సమస్య ఏమిటో చెప్పు? శంకరయ్య: సర్ .. నేను గడ్డమల్లయ్యగూడలో స్థలం కొనుగోలు చేశాను. అక్కడి పంచాయతీ వారు ఇంటి అనుమతులు ఇవ్వడం లేదు. ఎంపీ: అలా ఇబ్బంది పెట్టే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచిస్తా. ఎంపీ: తమ్ముడూ ఏంపని చేస్తున్నావ్? రాజు: కూలీ పనులు చేసుకొని జీవనోపాధి పొందుతున్నాం. మా కాలనీలో కరెంట్ తీగలు భయాందోళన కలిగిస్తున్నాయి. ఎంపీ: సర్పంచ్ మల్లికార్జున్‌ను పిలిచి .. విద్యుత్ అధికారులకు నేను చెప్పినట్లు చెప్పి వెంటనే తీయించు. ఎంపీ: ఏం పెద్దమ్మ బాగున్నావా? లక్ష్మమ్మ: ఏం బాగున్నాం సార్.. పింఛన్ పెంచినట్లు చెప్పిన్రు గానీ ఇంత వరకూ ఇయ్యలే. ఎంపీ: వస్తది పెద్దమ్మ ఆందోళన వద్దు. రూ. 1000 వస్తుంది. ఇబ్బంది ఉండదు. ఎంపీ: ఏమ్మా ఏం పేర్లు మీవి, ఏం చదువుతున్నారు? విద్యార్థినులు: సార్ మా పేర్లు జ్యోతి, అరుంధతి. డిగ్రీ, ఇంటర్ చదువుతున్నాం. ఎంపీ: ఉన్నత చదువులు చదవండి. చదువుకుంటేనే భవిష్యత్తు ఉంటుంది. రిజర్వేషన్లు ఉపయోగించుకొని ఉద్యోగాలు పొందండి. విద్యార్థినులు: సరే సార్. ఎంపీ: చెల్లి నీ కష్టమేంటి? మైసమ్మ: నా భర్త కొన్ని నెలల క్రితం ప్రమాదంలో మరణించాడు. ఇంత వరకు పరిహారం రాలేదు. పిల్లల పోషణ కష్టంగా మారింది. ఎంపీ: సర్పంచ్‌ను పిలిచి .. పేరు నమోదు చేసుకొని, వివరాలు తెలుసుకో .. న్యాయం జరిగేలా చూద్దాం. ఎంపీ: ఏం తమ్ముడు ఏం పేరు? మల్లేష్ : నా పేరు మల్లేష్. ఈ కాలనీలో 30 మంది చిన్నారులు ఉన్నారు. పాఠశాల లేకపోవడంతో రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న గునుగల్‌కు వెళ్లి చదువుకుంటున్నారు. ఎంపీ: అదేంటి పాఠశాల లేదా..! వెంటనే నిర్మాణానికి ఉన్నతాధికారులతో మాట్లాడతా. ఎంపీ: వికలాంగ పింఛన్ వస్తుందా? వికలాంగుడు: సార్ నా పేరు అంజయ్య. నాకు పింఛన్ మంజూరైంది. నాలాంటి వాళ్లు మండలంలో వందలాది మంది ఉన్నారు. వికలత్వ పరీక్షల కోసం నగరానికి వెళ్లాల్సి వస్తోంది. దగ్గరలోనే శిబిరం ఏర్పాటయ్యేలా చూడండి. ఎంపీ: వైద్యాధికారులతో మాట్లాడి, ఇబ్రహీంపట్నంలో శిబిరం ఏర్పాటయ్యేలా చూస్తా. ఎంపీ: ఏం పెద్దమ్మ నీ సమస్య ఏమిటి? పెంటమ్మ: నాకు 80 ఏళ్లకు పైనే ఉన్నాయి. నా కొడుకు కళ్లులేని వాడు. ఇద్దరికీ పింఛన్ మంజూరు కాలేదు. కష్టంగా ఉంది.. ఒక్కోసారి చచ్చిపోవాలి అనిపిస్తోంది. ఎంపీ: అలా వద్దు.. కచ్చితంగా ఇద్దరికీ పింఛన్ వచ్చేలా చేస్తా. ఎంపీ: ఏమ్మా మీ బాధలేంటి? శాంత : ఇక్కడ పాఠశాల లేదు. కానీ ఇంద్రానగర్ పాఠశాల పేరు మీద టీచర్ ఉంది. మా చిన్నారుల ఇబ్బందులను పట్టించుకోండి. ఎంపీ: పిల్లల ద్వారా కూడా తెలుసుకున్నా. కచ్చితంగా చర్యలు తీసుకుంటా. ఎంపీ: తాగునీరు వస్తోందా? చైతన్య: మూడురోజులకోసారి వస్తున్నాయి సార్. కాలనీలో డ్రైనేజీ సమస్య, దోమలతో ఇబ్బందులు పడుతున్నాం. ఎంపీ: స్వయంగా చూశా.. సమస్యలు పరిష్కరిస్తా. ఎంపీ: ఏమ్మా నీకొచ్చిన కష్టం? ప్రేమలత: నాపేరు ప్రేమలత. అంగన్వాడీ ఉద్యోగిని. మాకు జీతాలు సరిపోవడం లేదు సార్. ఎంపీ: ప్రభుత్వం కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందించేలా కృషి చేస్తోంది. అప్పుడు మీలాంటి ఉద్యోగులకు ప్రాధాన్యం పెరుగుతుంది. ఎంపీ: ఏం రైతన్న వ్యవసాయం ఎలా సాగుతోంది? రాజేందర్‌రెడ్డి: ఏం వ్యవసాయం సార్. వర్షాల్లేక బోరుబావుల్లో భూగర్భ జలాలు లేవు. కొద్దిపాటి నీళ్లతో ఒకటి, రెండు మడులు పండిస్తున్నాం. ఎంపీ: ఆందోళన వద్దు రాబోయే రోజుల్లో ఇబ్రహీం పట్నంకు సాగునీరు వచ్చే అవకాశం ఉంది. ఎంపీ: మీకేం సమస్యలున్నాయి? రవీందర్: 15 ఏళ్ల క్రితం గ్రామంలో ఉన్న కృష్ణాజలాల రిజర్వాయర్‌కు మా భూములిచ్చాం. అప్పట్లో అందులో పని కల్పిస్తామన్నారు. కొంతమంది పనిచేస్తున్న కార్మికుల ఉద్యోగాలకు కూడా భరోసా లేకుండా పోయింది. ఎంపీ: నష్టపరిహారం ఇచ్చారు గదా.. వాటర్‌వర్క్స్ అధికారులతో మాట్లాడి న్యాయం జరిగేలా చూస్తా. ఎంపీ: తమ్ముడూ నీది ఇదే ఊరా? నర్సింహ: అవును సార్.. ఎస్సీ ప్రణాళిక కింద దళితవాడలు అన్ని విధాలా అభివృద్ధి చెందుతాయన్నారు. పైసా నిధులు మంజూరు కావడం లేదు. ఎంపీ: దళితవాడల్లో అన్ని విధాలా అభివృద్ధి జరిగేలా ప్రభుత్వం కృషి చేస్తోంంది. బడ్జెట్లో రూ.50 వేల కోట్లకు పైగా నిధులు కేటాయించాం. నర్సింహ: సార్.. మా గ్రామంలో నాటుసారా విక్రయాలు జరుపుతున్నారు. తాగి రోగాల బారిన పడుతున్నారు? ఎంపీ: మీరే చైతన్యం కావాలి. నష్టపోతున్న కుటుంబాల ఇబ్బందులు తెలుసుకొని, నివారణ చర్యలు తీసుకోవాలి. కృష్ణ:సార్.. వచ్చే రేషన్ బియ్యం సరిపోవడం లేదు? ఎంపీ: బియ్యం పెంపుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రతి మనిషికి ఆరు కిలోల చొప్పున ఇచ్చే అవకాశం ఉంది. కుంటి మల్లేష్: విద్యార్థులు చాలా దూరం నడిచి వెళ్తున్నారు. సైకిళ్లు పంపిణీ చేస్తే బాగుంటుంది? ఎంపీ: సైకిళ్లు కాదు.. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అమలు కాగానే మినీ బస్సుల ఏర్పాటుకు ప్రభుత్వం కృషి చేస్తుంది. రామకృష్ణ యాదవ్: ఇక్కడి ఎంపీటీసీ సభ్యుడ్ని. గ్రామంలో డ్రైనేజీ కాల్వల కోసం నిధులు మంజూరయ్యేలా చూడండి. ఎంపీ: గ్రామం పరిస్థితులు చూస్తున్నా.. తప్పకుండా నిధులు మంజూరయ్యేలా కృషి చేస్తా. రాజు: మాది గునుగల్ ఎస్సీ కాలనీ. మాకు ఇంతవరకూ కృష్ణా జలాలు రావడం లేదు. గ్రామంలో రిజర్వాయర్ ఉన్నా దాహార్తి తీరడం లేదు. ఎంపీ: వెంటనే సర్పంచ్‌ను పిలిచి .. తాగునీటి సమస్య లేకుండా చూడు. పైపులైన్ అవసరమైతే ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో మాట్లాడుతా. ఎంపీ: సర్పంచ్ చూశారుగా.. దళిత కాలనీలో ఎన్ని సమస్యలున్నాయో. ఓ రోజు నా వద్దకు రండి.. ఆయా శాఖల అధికారులతో మాట్లాడి పరిష్కరించేలా కృషి చేస్తా. సర్పంచ్: సరే సార్.. మీరు మా గ్రామానికి వచ్చినందుకు కృతజ్ఞతలు. -
యాచారం పై ఏపీఐఐసీ పంజా
యాచారం, న్యూస్‌లైన్: యాచారం మండలంలో మైనింగ్ జోన్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ రైతులు, ప్రజల ఆందోళనలు కొనసాగుతుండగానే.. ఉరుము ఉరమకుండానే వారిపై మరోసారి భూసేకరణ పిడుగు పడనుంది. పారిశ్రామికవాడ కోసం భూములు తీసుకోవడానికి ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పనా సంస్థ (ఏపీఐఐసీ) సిద్ధమైంది. మొదటి విడత కుర్మిద్ద గ్రామంలో వెయ్యి ఎకరాలను తీసేసుకోవడానికి నిర్ణయించిన ఏపీఐఐసీ, రెండో విడతలో యాచారం, చౌదర్పల్లి, చింతుల్ల గ్రామాల్లో మరో 2,160 ఎకరాలను లాక్కోవడానికి గోప్యంగా రంగం పూర్తి చేసింది. యాచారం మండలంలోని ఈ భూములే కాకుండా మంచాల మండలం ఖానాపూర్, కాఘజ్గట్, ఇబ్రహీంపట్నం మండలం పెద్దతుల్ల, ఎలిమినేడు తదితర గ్రామాల్లో కూడా భూములను తీసుకోవడానికి సిద్ధమైనట్లు తెలిసింది. అవుటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న పరిశ్రమలను బయటకు తరలించేందుకు అవసరమైన భూ సేకరణ కోసం గత మార్చిలో ప్రభుత్వం జీఓ నంబర్ 20 జారీచేసిన నేపథ్యంలో ఏపీఐఐసీ రంగంలోకి దిగింది. స్థానిక రైతులకు కనీసం సమాచారం ఇవ్వకుండానే మూడు గ్రామాల్లోని భూములను లాక్కోవడానికి సిద్ధమైంది. వీటికి సంబంధించిన సర్వే నంబర్లు, ఎకరాల విస్తీర్ణాన్ని ఇంటర్నెట్లో పొందుపర్చింది. జీవనోపాధి కోల్పోనున్న 500మందికి పైగా రైతులు పారిశ్రామికవాడ ఏర్పాటు కోసం మూడు గ్రామాల్లో ఏపీఐఐసీ తీసుకోదల్చిన 2,160 ఎకరాల్లో 70శాతానికి పైగా సాగులో ఉన్న భూములే ఉన్నాయి. 500కి పైగా కుటుంబాల రైతులు పంటలు, పండ్లు, కూరగాయలు, పూలతోటలు సాగు చేసుకుంటున్నారు. వీరితో పాటు మూడువేల మందికి పైగా కౌలు రైతులు కాస్తులో ఉన్నారు. పంటల సాగు కోసం రైతులు రూ.కోట్లు ఖర్చు చేసుకొని బోరుబావులు తవ్వించుకున్నారు. పంట పొలాలను ఏపీఐఐసీ సేకరిస్తే రైతులంతా జీవనోపాధి కోల్పోయే ప్రమాదం ఉంది. చట్టాన్ని తుంగలో తొక్కి... ప్రభుత్వం భూములను తీసేసుకోవడానికి నిర్ణయించినప్పుడు ముందు కచ్చితంగా ప్రజాభిప్రాయం సేకరించాలి. గ్రామసభల్లో ప్రజల అభ్యంతరాలను తెలుసుకొని పరిష్కరించడంతోపాటు పంచాయతీల్లో తీర్మానం చేయించాల్సి ఉంటుంది. ఇవేమీ పట్టించుకోని అధికారులు స్థానికులకు, రైతులకు సమాచారం ఇవ్వకుండానే తీసుకోదల్చిన భూములను ఖరారు చేసుకున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం తెచ్చిన భూసేకరణ చట్టాన్ని పూర్తిగా తుంగలో తొక్కారు. కొత్త చట్టం ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో భూములు సేకరించాలంటే మార్కెట్ ధరకు నాలుగు రెట్ల పరిహారం చెల్లించాలి. కానీ పరిహారం చెల్లించే విషయం ఊసెత్తకుండానే ఏపీఐఐసీ అధికారులు గోప్యంగా భూముల సేకరణ ప్రక్రియ ముగించుకున్నారు. ఇదిలా ఉంటే ఏపీఐఐసీ తీసుకుంటున్న భూములు నగరానికి సమీపంలో, నాగార్జునసాగర్ రహదారిపై ఉండటంతో ధరలు విపరీతంగా ఉన్నాయి. ప్రస్తుతం ఈ భూములను ప్రభుత్వం తీసుకోనున్నట్టు తెలియడంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. ఇదే విషయమై ఆర్డీఓ సూర్యారావును ‘న్యూస్‌లైన్’ సంప్రదించగా... పూర్తి సమాచారం తనకు తెలియదని, పాత జీఓ ప్రకారం ఏపీఐఐసీకి భూములు తీసుకోవడానికి నిర్ణయించి ఉండొచ్చని అన్నారు. మూడు గ్రామాల్లో ఏపీఐఐసీతీసుకోనున్న భూములు గ్రామం సర్వే నంబర్లు ఎకరాలు యాచారం 164 -255 834 చింతుల్ల 129- 183 767 చౌదర్పల్లి 148- 260 559 జీవనోపాధి కోల్పోతాం మొదటినుంచి వ్యవసాయం మీదనే ఆధారపడి కుటుంబాన్ని పోషించుకుంటున్నాం. ప్రభుత్వం మా భూములు లాక్కుంటుందని తెలిసి గుండెలో రాయిపడ్డట్టైంది. భూమిని ప్రభుత్వం లాక్కుంటే జీవనోపాధి కోల్పోతాం. - ఎం.జనార్దన్, రైతు, యాచారం ఇది అన్యాయం... ప్రజలకు తెలియకుండానే భూముల సర్వే నంబర్లు గుర్తించడం, ఇన్ని ఎకరాలు తీసుకుంటున్నామని ఇంటర్నెట్లో పెట్టడం అన్యాయం. మా గ్రామంలో ఏపీఐఐసీ తీసేసుకోవడానికి నిర్ణయించిన భూముల రైతులు వలసపోవాల్సిందేనా? - గౌర నర్సింహ, సర్పంచ్, చౌదర్పల్లి ఇది అన్యాయం... ప్రజలకు తెలియకుండానే భూముల సర్వే నంబర్లు గుర్తించడం, ఇన్ని ఎకరాలు తీసుకుంటున్నామని ఇంటర్నెట్లో పెట్టడం అన్యాయం. మా గ్రామంలో ఏపీఐఐసీ తీసేసుకోవడానికి నిర్ణయించిన భూముల రైతులు వలసపోవాల్సిందేనా? - గౌర నర్సింహ, సర్పంచ్, చౌదర్పల్లి ఆ భూముల్లో పరిశ్రమలు పెట్టండి ప్రభుత్వం పారిశ్రామికవాడలు నెలకొల్పడానికి జిల్లాలో వేలాది ఎకరాల భూములను తీసేసుకుంది. అవన్నీ నిరుపయోగంగా ఉన్నాయి. వాటిల్లో పరిశ్రమలు ఏర్పాటైన తర్వాతే కొత్త పారిశ్రామికవాడల కోసం భూసేకరణ చేయాలి. - నాయిని సుదర్శన్ రెడ్డి, వైఎస్సార్ సీపీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు