విష జ్వరాలతో విలవిల
⇒ యాచారం మండలంలో విజృంభించిన సీజనల్ వ్యాధులు
⇒ వందల సంఖ్యలో ఆస్పత్రుల్లో చేరుతున్న రోగులు
⇒ జాగ్రత్తలు పాటించాలని వైద్యుల సూచన
యాచారం: మండల పరిధిలోని పలు గ్రామాలు విష జ్వరాలతో మంచం పట్టాయి. ఏ గ్రామంలో చూసినా ఇదే దుస్థితి కనిపిస్తోంది. విష జ్వరాలు, వాంతులు, విరేచనాలు, కాళ్లు, కీళ్ల నొప్పులతో అవస్థలు పడుతున్నారు. పారిశుద్ధ్య లోపమో.. కలుషిత నీటి ప్రభావమో.. వాతావరణ మార్పులో.. కారణమేదైనా.. బాధితులు మాత్రం కంటిమీద కునుకు లేకుండా ఉన్నారు. వారం రోజులుగా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న ప్రజలు యాచారం, మాల్ కేంద్రాల్లోని ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారు. పేదలు మాత్రం యాచారంలోని ప్రభుత్వాస్పత్రికి క్యూ కడుతున్నారు. దీంతో స్థానిక పీహెచ్‌సీ గురువారం రోగులతో కిటకిటలాడింది. ఎప్పుడూ లేని విధంగా 200 మందికి పైగా వైద్యం కోసం ఆస్పత్రికి వచ్చారు. వీరిలో 70 శాతానికి పైగా జ్వరాలు, వాంతులు, విరేచనాలతో బాధపడుతున్న వారే ఉన్నారు. నందివనపర్తి, యాచారం, నక్కర్తమేడిపల్లి, నస్దిక్‌సింగారం, కుర్మిద్ద, చౌదర్‌పల్లి, మంతన్‌గౌరెల్లి, కొత్తపల్లి, తక్కళ్లపల్లి తదితర గ్రామాల నుంచి పదుల సంఖ్యలో వచ్చారు. దీంతో దవాఖానాలోని బెడ్లు పూర్తిగా నిండిపోయాయి. వైద్యాధికారి ఊపేందర్‌రెడ్డి దగ్గరుండి రోగులకు వైద్య సేవలుందించారు.
పారిశుద్ధ్య లోపమేనా...?
వారం రోజులుగా అప్పుడప్పుడు మండలంలోని పలు గ్రామాల్లో మోస్తరు వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో డ్రైనేజీ వ్యవస్థ దారుణంగా మారింది. వర్షాల వల్ల డ్రైనేజీ కాల్వలు నిండిపోవడం, పైపు లైన్లలో లీకేజీలు ఏర్పడటం వల్ల తాగునీరు కలుషితమవుతోంది. ప్రజలు వ్యాధుల బారిన పడటానికి ఇదే కారణం కావచ్చని వైద్యులు చెబుతున్నారు. వర్షాలు కురుస్తున్న దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని స్వయంగా జిల్లా కలెక్టర్ రఘునందన్‌రావు ఆదేశాలిచ్చినా.. అధికారులు, ప్రజాప్రతినిధుల్లో స్పందన లేకుండా పోయింది. ఏ గ్రామంలో చూసినా నీటి ట్యాంకులు శుభ్రం చేయడం, బ్లీచింగ్ పౌడర్ చల్లిన దాఖాలాలు లేవు.
ముసుర్ల వల్ల గ్రామాల్లో ఇళ్ల మధ్యనే బురద నీళ్లు చేరి దుర్వాసన వస్తోంది. ఇవి దోమలకు ఆవాసంగా మారాయి. మంతన్‌గౌరెల్లి, దీని అనుబంధ గిరిజన తండాల్లో శానిటేషన్ వ్యవస్థ దారుణంగా ఉంది. తమ్మలోనిగూడ, తక్కళ్లపల్లి, యాచారం, నందివనపర్తి, మాల్ ,చింతపట్ల తదితర గ్రామాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ట్యాంకులు శుభ్రం చేయకపోవడం, పైకప్పులు లేకపోవడంతో నీళ్లలో పురుగులు పడుతున్నాయి. కొన్ని గ్రామాల్లో ఎయిర్‌వాల్వ్‌లపై కప్పులు లేకపోవడం వల్ల చెత్తాచెదారం పడి నీళ్లు కలుషితం అవుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి తగిన చర్యలు చేపట్టాలని మండల ప్రజలు కోరుతున్నారు. ఈ విషయమై వైద్యాధికారి ఊపేందర్‌రెడ్డిని సంప్రదించగా ప్రజలు కచ్చితంగా కాచి, చలార్చిన నీటినే తాగాలన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.