పిల్లల చేతులు, కాళ్లు, నోటి మీద దద్దుర్లు, పొక్కులు, పుండ్లు
ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తున్న వైరస్
ప్రాణాంతకం కాదంటున్న వైద్యులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో చిన్నారులను సీజనల్ వ్యాధులైన జలుబు, జ్వరం, దగ్గు, డెంగీ, మలేరియా వంటివి అల్లాడిస్తున్నాయి. ఇప్పుడు వాటికి తోడు హ్యాండ్ ఫుట్ మౌత్ అనే వ్యాధి పిల్లలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. కాక్సీకీ అనే వైరస్ ద్వారా నెలల శిశువుల నుంచి ఆరేళ్ల వయసు గల చిన్నారుల వరకు ఎక్కువగా ఈ వ్యాధి వ్యాపిస్తోంది. చేతులు, కాళ్లు, నోటి మీద దద్దుర్లు, పొక్కులు, పుండ్లు వంటి వాటితో ఇబ్బంది పెడుతుంది.
గత ఏడాదితో పోలిస్తే ప్రస్తుతం ఈ వైరస్ ఔట్ బ్రేక్ ఎక్కువగా ఉందని వైద్యులు చెబుతున్నారు. విజయవాడ, గుంటూరు, విశాఖ నగరాలతోపాటు వివిధ ప్రాంతాల్లోని చిన్నపిల్లల ఆస్పత్రులకు రోజూ కనీసం నాలుగు కేసులు ఇలాంటివి వస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. అయితే, ఇది ప్రాణాంతక వ్యాధి కాదని, తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దని సూచిస్తున్నారు.
ఇవీ వ్యాధి లక్షణాలు..
» వ్యాధి సోకిన పిల్లల్లో చేతులు, కాళ్లు, ముఖం, నోటిలో ర్యాషస్, పుండ్లు, పొక్కులు రావడం వంటి లక్షణాలు ఉంటాయి. వీటితోపాటు కొందరిలో జ్వరం, జలుబు, గొంతు నొప్పి, నోటిలో మంట ఉంటుంది.
» ఒకటి, రెండు రోజులకు కురుపులు మోకాళ్లు, మోచేతులు, పిరుదులపై కూడా కనిపిస్తాయి.
» ర్యాషస్, పుండ్లు, పొక్కుల వల్ల దురద, మంటతోపాటు ఆహారం తీసుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడతారు.
» వైద్యులను సంప్రదించి మందులు వాడితే నాలుగు, ఐదు రోజుల్లో వ్యాధి అదుపులోకి వస్తుంది. కొన్ని సందర్భాల్లో వారం రోజులపాటు వ్యాధి లక్షణాలు ఉంటాయి.
» వ్యాధిగ్రస్తుల మలం, లాలాజలం, దగ్గు, తుమ్ముల వల్ల వచ్చే తుంపర్లలోని వైరస్ నోటి ద్వారా కడుపులోకి ప్రవేశించడం ద్వారా ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది. అయితే, కొందరు తల్లిదండ్రులు తమ పిల్లల్లో ఈ వ్యాధి లక్షణాలను గుర్తించలేక అలాగే పాఠశాలలకు పంపుతుండటంతో వేగంగా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తోంది.
లక్షణాలు ఉన్న పిల్లలను బయటకు పంపొద్దు
హ్యాండ్ ఫుట్ మౌత్ ప్రాణాంతకమైన వ్యాధి కాదు. అయినప్పటికీ తల్లిదండ్రులు కొంత జాగ్రత్తగా ఉండాలి. నోటి తుంపర్ల ద్వారా వ్యాధి ఇతరులకు సోకుతుంది. వ్యాధి లక్షణాలు ఉన్న పిల్లలను తల్లిదండ్రులు పాఠశాలలకు పంపకుండా, వైద్యులను సంప్రదించి మందులు వాడాలి.
జ్వరం, దగ్గు, జలుబు తగ్గడానికి పారాసెటమాల్ వంటి సాధారణ మందులు సరిపోతాయి. పొక్కులు, పుండ్లు మానడానికి ఆయింట్‌మెంట్స్ వాడాలి. చాలా అరుదుగా నిమోనియా పాంక్రియాటైటిస్, మెదడువాపు, జ్వరం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. అలా లక్షల్లో ఒకరికి వస్తుంది. – డాక్టర్ బి.రమేశ్‌కుమార్, అసోసియేట్ ప్రొఫెసర్, చిన్నపిల్లల విభాగం, గుంటూరు జీజీహెచ్
Comments
Please login to add a commentAdd a comment