బూర నర్సయ్య హామీలు.. | bura narsaiah goud meet peoples as a sakshi reporter | Sakshi
Sakshi News home page

బూర నర్సయ్య హామీలు..

Published Sun, Nov 30 2014 11:30 PM | Last Updated on Wed, Mar 28 2018 11:11 AM

బూర నర్సయ్య హామీలు.. - Sakshi

బూర నర్సయ్య హామీలు..

ఇంద్రానగర్.. యాచారం మండలంలోని గునుగల్ గ్రామానికి అనుబంధ నివాస ప్రాంతం. అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్న ఈ పల్లె అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. జిల్లాలోని ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని యాచారం మండలం భువనగిరి లోక్‌సభ స్థానం పరిధిలోకి వస్తుంది. స్థానిక ఎంపీ బూర నర్సయ్య గౌడ్ ‘సాక్షి వీఐపీ రిపోర్టర్’గా గ్రామానికి వచ్చి స్థానికుల సమస్యలను తెలుసుకున్నారు.

పెద్దాయనా.. పెద్దమ్మా.. చెల్లీ.. అంటూ ప్రతి ఒక్కరినీ పలకరిస్తూ గ్రామమంతా కలియతిరిగారు. అడుగడుగునా ఆయనకు సమస్యలే ఎదురయ్యాయి. పింఛన్లు, ఆహార భద్రతా కార్డుల గురించి అనేకమంది మొరపెట్టుకున్నారు. అందరి సమస్యలనూ సావధానంగా విన్న ఆయన ఇంద్రానగర్‌లోని ప్రతి సమస్యనూ తెలుసుకున్నానని, వీలైనంత త్వరగా వాటికి పరిష్కారం చూపుతానని మాటిచ్చారు.
 
బూర నర్సయ్య హామీలు..
మహానగరానికి యాచారం మండలం దగ్గర్లోనే ఉంది. కానీ ఎక్కడా అభివృద్ధి జాడ కన్పించడం లేదు. ఇక్కడి కాలనీలో పాఠశాల ఏర్పాటు చేయిస్తా. సీసీ రోడ్డు, డ్రైనేజీ కాల్వల నిర్మాణానికి నిధులు కేటాయిస్తా. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఆహారభద్రతా కార్డులు అందిస్తాం. రేషన్ కార్డుల్లో వయసు తక్కువగా రావడం వల్ల కొందరికి పింఛన్లు రావడం లేదని తెలిసింది. వారందరికీ పింఛన్లు అందేలా చూస్తా. ప్రజలు ఆందోళన చెందాల్సిన పనిలేదు. అందరికీ సంక్షేమ పథకాలు అందుతాయి.
 
ఎంపీ: పెద్దాయనా నీ పేరేంటి..పింఛన్ మంజూరైందా?
వికలాంగుడు: నా పేరు రాంచంద్రయ్య. ప్రమాదంలో కాళ్లు దెబ్బతిన్నాయి. నాకు పింఛన్ రాదంటున్నారు.
ఎంపీ: నీవు నడవలేకున్నావు గదా .. ఎందుకు పింఛన్ రాదంటున్నారు. కచ్చితంగా వచ్చేలా చూస్తా.. ముందు అర్జీ పెట్టుకో.
ఎంపీ: నీ సమస్య ఏమిటో చెప్పు?
శంకరయ్య: సర్ .. నేను గడ్డమల్లయ్యగూడలో స్థలం కొనుగోలు చేశాను. అక్కడి పంచాయతీ వారు ఇంటి అనుమతులు ఇవ్వడం లేదు.  
ఎంపీ: అలా ఇబ్బంది పెట్టే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచిస్తా.
ఎంపీ: తమ్ముడూ ఏంపని చేస్తున్నావ్?
రాజు: కూలీ పనులు చేసుకొని జీవనోపాధి పొందుతున్నాం. మా కాలనీలో కరెంట్ తీగలు భయాందోళన కలిగిస్తున్నాయి.
ఎంపీ: సర్పంచ్ మల్లికార్జున్‌ను పిలిచి .. విద్యుత్ అధికారులకు నేను చెప్పినట్లు చెప్పి వెంటనే తీయించు.
ఎంపీ: ఏం పెద్దమ్మ బాగున్నావా?
లక్ష్మమ్మ:  ఏం బాగున్నాం సార్.. పింఛన్ పెంచినట్లు చెప్పిన్రు గానీ ఇంత వరకూ ఇయ్యలే.
ఎంపీ: వస్తది పెద్దమ్మ ఆందోళన వద్దు. రూ. 1000 వస్తుంది. ఇబ్బంది ఉండదు.
ఎంపీ: ఏమ్మా ఏం పేర్లు మీవి, ఏం చదువుతున్నారు?
విద్యార్థినులు: సార్ మా పేర్లు జ్యోతి, అరుంధతి. డిగ్రీ, ఇంటర్ చదువుతున్నాం.
ఎంపీ: ఉన్నత చదువులు చదవండి. చదువుకుంటేనే భవిష్యత్తు ఉంటుంది. రిజర్వేషన్లు ఉపయోగించుకొని ఉద్యోగాలు పొందండి.
విద్యార్థినులు: సరే సార్.
ఎంపీ:  చెల్లి నీ కష్టమేంటి?
మైసమ్మ: నా భర్త కొన్ని నెలల క్రితం ప్రమాదంలో మరణించాడు. ఇంత వరకు పరిహారం రాలేదు. పిల్లల పోషణ కష్టంగా మారింది.
ఎంపీ: సర్పంచ్‌ను పిలిచి .. పేరు నమోదు చేసుకొని, వివరాలు తెలుసుకో .. న్యాయం జరిగేలా చూద్దాం.
ఎంపీ: ఏం తమ్ముడు ఏం పేరు?
మల్లేష్ : నా పేరు మల్లేష్. ఈ కాలనీలో 30 మంది చిన్నారులు ఉన్నారు. పాఠశాల లేకపోవడంతో రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న గునుగల్‌కు వెళ్లి చదువుకుంటున్నారు.  
ఎంపీ: అదేంటి పాఠశాల లేదా..! వెంటనే నిర్మాణానికి ఉన్నతాధికారులతో మాట్లాడతా.
ఎంపీ:  వికలాంగ పింఛన్ వస్తుందా?
వికలాంగుడు: సార్ నా పేరు అంజయ్య. నాకు పింఛన్ మంజూరైంది. నాలాంటి వాళ్లు మండలంలో వందలాది మంది ఉన్నారు. వికలత్వ పరీక్షల కోసం నగరానికి వెళ్లాల్సి వస్తోంది. దగ్గరలోనే శిబిరం ఏర్పాటయ్యేలా చూడండి.
ఎంపీ: వైద్యాధికారులతో మాట్లాడి, ఇబ్రహీంపట్నంలో శిబిరం ఏర్పాటయ్యేలా చూస్తా.
ఎంపీ: ఏం పెద్దమ్మ నీ సమస్య ఏమిటి?
పెంటమ్మ: నాకు 80 ఏళ్లకు పైనే ఉన్నాయి. నా కొడుకు కళ్లులేని వాడు. ఇద్దరికీ పింఛన్ మంజూరు కాలేదు. కష్టంగా ఉంది.. ఒక్కోసారి చచ్చిపోవాలి అనిపిస్తోంది.
ఎంపీ: అలా వద్దు.. కచ్చితంగా ఇద్దరికీ పింఛన్ వచ్చేలా చేస్తా.
ఎంపీ: ఏమ్మా మీ బాధలేంటి?
శాంత : ఇక్కడ పాఠశాల లేదు. కానీ ఇంద్రానగర్ పాఠశాల పేరు మీద టీచర్ ఉంది. మా చిన్నారుల ఇబ్బందులను పట్టించుకోండి.
ఎంపీ: పిల్లల ద్వారా కూడా తెలుసుకున్నా. కచ్చితంగా చర్యలు తీసుకుంటా.
ఎంపీ: తాగునీరు వస్తోందా?
చైతన్య: మూడురోజులకోసారి వస్తున్నాయి సార్. కాలనీలో డ్రైనేజీ సమస్య, దోమలతో ఇబ్బందులు పడుతున్నాం.
ఎంపీ: స్వయంగా చూశా.. సమస్యలు పరిష్కరిస్తా.
ఎంపీ:  ఏమ్మా నీకొచ్చిన కష్టం?
ప్రేమలత: నాపేరు ప్రేమలత. అంగన్‌వాడీ ఉద్యోగిని. మాకు జీతాలు సరిపోవడం లేదు సార్.
ఎంపీ: ప్రభుత్వం కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందించేలా కృషి చేస్తోంది. అప్పుడు మీలాంటి ఉద్యోగులకు ప్రాధాన్యం పెరుగుతుంది.
ఎంపీ: ఏం రైతన్న వ్యవసాయం ఎలా సాగుతోంది?  
రాజేందర్‌రెడ్డి: ఏం వ్యవసాయం సార్. వర్షాల్లేక బోరుబావుల్లో భూగర్భ జలాలు లేవు. కొద్దిపాటి నీళ్లతో ఒకటి, రెండు మడులు పండిస్తున్నాం.
ఎంపీ: ఆందోళన వద్దు రాబోయే రోజుల్లో ఇబ్రహీం పట్నంకు సాగునీరు వచ్చే అవకాశం ఉంది.
ఎంపీ: మీకేం సమస్యలున్నాయి?  
రవీందర్: 15 ఏళ్ల క్రితం గ్రామంలో ఉన్న కృష్ణాజలాల రిజర్వాయర్‌కు మా భూములిచ్చాం. అప్పట్లో అందులో పని కల్పిస్తామన్నారు. కొంతమంది పనిచేస్తున్న కార్మికుల ఉద్యోగాలకు కూడా భరోసా లేకుండా పోయింది.
ఎంపీ: నష్టపరిహారం ఇచ్చారు గదా.. వాటర్‌వర్క్స్ అధికారులతో మాట్లాడి న్యాయం జరిగేలా చూస్తా.
ఎంపీ: తమ్ముడూ నీది ఇదే ఊరా?  
నర్సింహ: అవును సార్.. ఎస్సీ ప్రణాళిక కింద దళితవాడలు అన్ని విధాలా అభివృద్ధి చెందుతాయన్నారు. పైసా నిధులు మంజూరు కావడం లేదు.
ఎంపీ: దళితవాడల్లో అన్ని విధాలా అభివృద్ధి జరిగేలా ప్రభుత్వం కృషి చేస్తోంంది. బడ్జెట్‌లో రూ.50 వేల కోట్లకు పైగా నిధులు కేటాయించాం.
నర్సింహ: సార్.. మా గ్రామంలో నాటుసారా విక్రయాలు జరుపుతున్నారు. తాగి రోగాల బారిన పడుతున్నారు?
ఎంపీ: మీరే చైతన్యం కావాలి. నష్టపోతున్న కుటుంబాల ఇబ్బందులు తెలుసుకొని, నివారణ చర్యలు తీసుకోవాలి.
కృష్ణ:సార్.. వచ్చే రేషన్ బియ్యం సరిపోవడం లేదు?
ఎంపీ:  బియ్యం పెంపుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రతి మనిషికి ఆరు కిలోల చొప్పున ఇచ్చే అవకాశం ఉంది.
కుంటి మల్లేష్: విద్యార్థులు చాలా దూరం నడిచి వెళ్తున్నారు. సైకిళ్లు పంపిణీ చేస్తే బాగుంటుంది?
ఎంపీ: సైకిళ్లు కాదు.. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అమలు కాగానే మినీ బస్సుల ఏర్పాటుకు ప్రభుత్వం కృషి చేస్తుంది.
రామకృష్ణ యాదవ్: ఇక్కడి ఎంపీటీసీ సభ్యుడ్ని. గ్రామంలో డ్రైనేజీ కాల్వల కోసం నిధులు మంజూరయ్యేలా చూడండి.
ఎంపీ: గ్రామం పరిస్థితులు చూస్తున్నా.. తప్పకుండా నిధులు మంజూరయ్యేలా కృషి చేస్తా.
రాజు: మాది గునుగల్ ఎస్సీ కాలనీ. మాకు ఇంతవరకూ కృష్ణా జలాలు రావడం లేదు. గ్రామంలో రిజర్వాయర్ ఉన్నా దాహార్తి తీరడం లేదు.
ఎంపీ: వెంటనే సర్పంచ్‌ను పిలిచి .. తాగునీటి సమస్య లేకుండా చూడు. పైపులైన్ అవసరమైతే ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులతో మాట్లాడుతా.
ఎంపీ: సర్పంచ్ చూశారుగా.. దళిత కాలనీలో ఎన్ని సమస్యలున్నాయో. ఓ రోజు నా వద్దకు రండి.. ఆయా శాఖల అధికారులతో మాట్లాడి పరిష్కరించేలా కృషి చేస్తా.
 సర్పంచ్: సరే సార్.. మీరు మా గ్రామానికి వచ్చినందుకు కృతజ్ఞతలు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement