Sakshi VIP Reporter
-
వారధిగా నిలుస్తా..
ఆయన జిల్లా పోలీసు బాస్.. శాంతిభద్రతల పరిరక్షణలో నిత్యం బిజీగా ఉండే అధికారి.. కానీ ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు నడుంబిగించారు. వాటిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి ప్రజలకు.. అధికారులకు మధ్య వారధిగా నిలిచేందుకు సమాయత్తమయ్యారు. వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని రాజీవ్ గృహకల్ప కాలనీలో ఎస్పీ శ్రీనివాస్ ‘సాక్షి’ వీఐపీ రిపోర్టర్‌గా పర్యటించారు. సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న కాలనీలో కలియతిరిగారు. ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. సీసీ రోడ్లు, మురుగు కాల్వలు, శ్మశాన వాటిక లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నట్లు స్థానికులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. కాలనీలోని సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని ఎస్పీ శ్రీనివాస్ హామీ ఇచ్చారు. పోలీసు శాఖ ఆధ్వర్యంలో కాలనీలో ప్రత్యేకంగా మెడికల్ క్యాంపు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ⇒ రాజీవ్ గృహకల్ప సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్తా ⇒ వాటి పరిష్కారానికి కృషి చేస్తా ⇒ కాలనీవాసుల అభివృద్ధికి తోడ్పడతా.. ఎస్పీ శ్రీనివాస్ హామీలు.. ⇒ రాజీవ్‌గృహకల్ప కాలనీలో మొక్కలు నాటించి నందనవనంగా మారుస్తా.. ⇒ కాలనీలో త్వరలో మెడికల్ క్యాంపు ఏర్పాటు ⇒ జిల్లాలో నేరాల అదుపునకు కృషి ⇒ శాంతి భద్రతలను కాపాడేందుకు పాటుపడతా ⇒ రాత్రి పూట గస్తీ పెంచుతా ఎస్పీ: మీ కాలనీలో ఉన్న సవుస్యలేమిటి? ఆర్జీకే కాలనీ వాసులు: సార్.. ఇక్కడ ప్రధానంగా మంచి నీటి సమస్య ఉంది, డ్రైనేజీ సిస్టమ్ సక్రమంగా లేదు. దుర్వాసన భరించలేక పోతున్నాం. ఎస్పీ: రోడ్లు బాగానే ఉన్నాయి కదా? ఆర్జీకే కాలనీ వాసులు: ఈ మధ్యనే సీసీ రోడ్లు వేశారు. రాత్రి వేళ వీధి దీపాలు వెలగడం లేదు. బయటికి రావాలంటే భయంగా ఉంది. ఎస్పీ: చెత్తాచెదారం ఇళ్ల ముందు వేస్తే ఎలా..రోగాలు రావా? ఆర్జీకే కాలనీ వాసులు: చెత్త కుండీలు ఏర్పాటు చేయించండి సార్.. చెత్తను కుండీల్లోనే వేస్తాం. ఎస్పీ: సబ్ కలెక్టర్ వర్షిణితో మాట్లాడి వెంటనే ఏర్పాటు చేరుుస్తా. దేవేందర్ : సార్.. వూ కాలనీలో శ్మశానవాటికను ఏర్పాటు చేయించండి. ఎస్పీ: సబ్ కలెక్టర్‌తో మాట్లాడి స్థలం చూపిస్తా. లక్ష్మయ్య: రాత్రి వేళ పెట్రోలింగ్ పెంచండి సార్. ఎస్పీ: రోజు నుంచే ఆ పని చేయిస్తా.. ఏమైనా సమస్యలుంటే మా దృష్టికి తెండి. రాజు: మెయిన్ రోడ్డుపై ప్రమాదాలు జరుగుతున్నాయి.. స్పీడు బ్రేకర్లు ఏర్పాటు చేస్తే బాగుంటుంది. ఎస్పీ: ఆర్అండ్బీ అధికారులతో మాట్లాడి ఇప్పుడే చర్యలు తీసుకుంటా. దేవేందర్: ఓవర్‌లోడ్ లారీలను బైపాస్ రోడ్డు నుంచి పంపించండి. ఇక్కడి నుంచి వెళ్తే ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎస్పీ: డీఎస్పీతో మాట్లాడి ఇప్పటికిప్పుడే బారికేడ్లు పెట్టించి.. ఓవర్‌లోడ్ లారీలను బైపాస్ రోడ్డు నుంచి పంపిస్తాం. ఎస్పీ: మీరంతా ఓ సొసైటీగా ఏర్పడి స్వచ్ఛభారత్‌లో పాలుపంచుకోండి. మొక్కలు నాటండి. నేను ఇప్పిస్తా. ఆర్జీకే కాలనీ వాసులు: తప్పకుండా మొక్కలు నాటుతాం. ఎస్పీ: అమ్మాయిలు, మహిళలను ఎవరైనా వేధిస్తున్నారా? అలాంటివారెవరైనా ఉంటే చెప్పండి? ఆర్జీకే కాలనీ వాసులు: సార్.. వేధింపులు ఏమీ లేవు. కానీ రాత్రివేళ గుర్తు తెలియని వ్యక్తులు ఎవరెవరో కాలనీలోకి వస్తుంటారు. ఎస్పీ: రాత్రివేళ బందోబస్తు ఏర్పాటు చేస్తాం. ఇక్కడ పోలీసులకు బీట్లు కూడా వేస్తాం నరేష్: సార్.. ఆర్జీకేను మున్సిపాలిటీకి అప్పగించేలా చూడండి. ఎక్కడ చూసినా మురుగు వాసన భరించలేక పోతున్నాం. ఎస్పీ: సంబంధిత అధికారులతో ఇప్పుడే మాట్లాడతా. హర్షా బేగం: సార్.. ఇక్కడ దుర్వాసనకు రోగాలు వస్తున్నాయి. వైద్యం చేసే వారు లేరు. ఎస్పీ: వైద్యశిబిరం ఏర్పాటు చేయిస్తా. ఓ ఆరోగ్య కార్యకర్తను ఇక్కడే నియమించి కాలనీవాసులకు అందుబాటులో ఉండేలా చూస్తా. లక్ష్మమ్మ: బకాయిల కోసం బ్యాంకర్లు వే ధిస్తున్నారు. ఎస్పీ: మరి బాకీ డబ్బులు కట్టాలి కదా. విడతల వారిగా చెల్లించే వెసులుబాటు చేస్తా. లక్ష్మమ్మ: మురుగంతా ఇళ్లముందే పారుతోంది. ఎస్పీ: మున్సిపల్ అధికారులతో మాట్లాడి పారిశుద్ధ్య పనులు చేయిస్తా. అభినందనీయం సామాజిక బాధ్యతలో ‘సాక్షి’ ముందు వరుసలో నిలవడం అభినందనీయుం. ఇలాంటి మంచి కార్యక్రవుం చేపట్టినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ‘సాక్షి’ చొరవతో ఈరోజు రాజీవ్‌గృహకల్ప కాలనీలో నెలకొన్న సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకున్నాను. అన్ని శాఖల అధికారులతో వూట్లాడి సమస్యలు పరిష్కారమయ్యేలా నావంతు ప్రయత్నం చేస్తా. శాంతిభద్రతల పరిరక్షణకు చర్యలు తీసుకుంటా. - ఎస్పీ శ్రీనివాస్ -
ఉపాధికి ఊతమిస్తా..
⇒యువతను, మహిళలను ఆదుకుంటా ⇒నారెగూడ పురోభివృద్ధికి పాటుపడతా ⇒ప్రధాన సమస్యల పరిష్కారానికి కృషి కష్టాల కడలికి ఎదురీదుతూ.. అభివృద్ధికి ఆమడదూరంలో ఉంది ఆ గ్రామం. తాగునీటి ఎద్దడితో తల్లడిల్లుతోంది. అంతర్గత రహదారులు, మురుగునీటి కాల్వలు సక్రమంగా లేకపోవడంతో స్థాని కులు సతమతమవుతున్నారు. నవాబుపేట మండలం పూల పల్లి గ్రామపంచాయతీ పరిధిలోని నారెగూడ సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతోంది. గ్రామంలో బీఎస్ఎన్ఎల్ లీజ్‌లైన్ అందుబాటులో లే కపోవడంతో స్థానిక కెనరా బ్యాంక్ సేవలను సమీప గ్రామాల ప్రజలు, రైతులు, డ్వాక్రా సంఘాల మహిళలు సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో ‘సాక్షి’ వీఐపీ రిపోర్టర్‌గా ఎమ్మెల్సీ కొంపల్లి యాదవరెడ్డి నారెగూడలో పర్యటించారు. స్థానికుల కష్టాలను తెలుసుకున్నారు. సమస్యలను పరిష్కరించి గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని, స్థానిక యువతకు, మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్సీ హామీలు ⇒స్థానిక యువతకు, మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తా ⇒త్వరితగతిన బీఎస్ఎన్ఎల్ లీజ్‌లైన్ ఏర్పాటుZ ⇒ గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, కమ్యూనిటీ హాల్ ⇒సీసీరోడ్లు, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ.. తాగునీటి పైపులైన్ ⇒ఏర్పాటుకు నిధులు కేటాయిస్తా ఎమ్మెల్సీ: అమ్మా.. నమస్కారం మీ సవుస్య చెప్పండి? లక్ష్మమ్మ: సార్ నా భర్త చనిపోయాడు. నాకు ముగ్గురు కొడుకులు. పెద్ద కొడుకుకు ఎక్సైజ్ కానిస్టేబుల్ ఉద్యోగముందని నాకు రేషన్ కార్డు ఇవ్వడం లేదు. ఎమ్మెల్సీ: పెద్ద కొడుకును మినహాయించి మీ ముగ్గురికి రేషన్ కార్డు వచ్చేలా చూస్తాం. ఎమ్మెల్సీ: ఏం పెద్దమనిషి.. పింఛన్ వస్తోందా? పాపయ్య: పింఛన్ వస్తోంది సార్.. కానీ గ్రావుంలో మురుగు కాలువలు లేక మురుగు నీరు రోడ్డుపై పారుతోంది. మురుగు కాలువ నిర్మించి, సీసీ రోడ్డు వేయాలి. ఎమ్మెల్సీ: మురుగు కాలువ నిర్మించి, సీసీ రోడ్డు వేయిస్తాం. ఎమ్మెల్సీ:ఏం తమ్ముడు ఏం పని చేస్తున్నావ్.. ఆటో ఇంటి వద్ద ఉందేమిటి? బందయ్య: ఆటో నడిపితే వచ్చే ఆదాయుంతో కుటుంబాన్ని పోషించలేకపోతున్నా. అందుకే ఆటో ఇంటి వద్దే ఉంచి కల్లు దుకాణం పెట్టుకొని బతుకుతున్నాం. ఎమ్మెల్సీ: పెద్దమ్మా.. నీకు పింఛన్ వస్తోందా ? లక్ష్మమ్మ: వస్తోంది సార్ .. ఎమ్మెల్సీ: మీ గ్రావుంలో ఇంకేం సవుస్యలున్నాయ్? కిష్టయ్య: సార్.. ఇళ్ల మధ్య మంచి నీటి చేదబావి ఉంది. దాని చుట్టూ బండలు లేక అధ్వానంగా మారింది. ఎమ్మెల్సీ: చేదబావిని బాగు చేయించి, వినియోగంలోకి వచ్చేలా చూస్తాం. కావాల్సిన నిధులు మంజూరయ్యేలా చూస్తా. ఎమ్మెల్సీ: ఏమమ్మా.. నీ భర్తకు ఏమైంది? చంద్రమ్మ: రెండు రోజుల కింద కల్లు తాగి ఇంటికి వచ్చాడు. అప్పటి నుంచి ఉలుకూపలుకూ లేదు. ఎమ్మెల్సీ: ఎక్సైజ్ అధికారులకు చెప్పి కల్తీ కల్లు విక్రయాన్ని బందు చేయిస్తా. మహిపాల్‌రెడ్డి: గ్రామం నుంచి మూసీ నది (వాగు) వరకు ఫార్మేషన్ రోడ్డు వేయించండి. ఎమ్మెల్సీ: అక్కడ పొలాలున్న రైతులంతా మాట్లాడుకొని చెబితే తప్పక ఫార్మేషన్ రోడ్డు మంజూరు చేయిస్తా. కిష్టయ్య: అంతర్గత మురుగు కాలువ నిండి దుర్వాసన వస్తోంది. ఎమ్మెల్సీ: సర్పంచ్‌కు చెప్పి చేయిస్తా. ఎమ్మెల్సీ: ఏం బాబు.. నీకు వికలాంగుల పింఛన్ వస్తోందా? రమేష్: రూ.1,500 పింఛన్ వస్తోంది సార్. మాణెమ్మ: సార్ ఇంత వరకూ మాకు ప్రభుత్వ ఇల్లు రాలేదు. నా భర్తకు వస్తున్న పింఛన్ కూడా రద్దు చేశారు. ఎమ్మెల్సీ: ఇల్లు వచ్చేలా చూస్తాం. నీ భర్తకు పింఛన్ మాత్రం 65 ఏళ్లు నిండాకే వస్తుంది. పర్మయ్య: సార్.. రేషన్ కార్డులో నా వయస్సు 65 ఏళ్లు ఉంది. ఆధార్ కార్డులో తక్కువగా ఉండడంతో పింఛన్ ఇవ్వడం లేదు. ఎమ్మెల్సీ: తహసీల్దార్‌తో మాట్లాడి ఆధార్ కార్డులో వయస్సు సరిచేసుకుంటే పింఛన్ వస్తుంది. ఎమ్మెల్సీ: పెద్దమ్మా.. నీ సమస్యలేంటి? మల్లమ్మ: నా కొడుకు, మనవడు చనిపోయారు. కోడలు, మనవరాలు ఉంది. మాకు ఇంత వరకు ఇల్లు రాలేదు. ఎమ్మెల్సీ: బాధపడకండి.. ఇల్లు వుంజూరయ్యేలా చూస్తా. అనంతమ్మ: సార్.. మా ఇంటి ముందు మురుగు నీరు వచ్చి చేరుతోంది. కనీసం వీధి లైట్లు కూడా వే యడం లేదు. ఎమ్మెల్సీ: మురుగు కాలువ నిర్మించేందుకు కృషి చేస్తా. శివ్వమ్మ: సార్.. నా భర్త చనిపోయి పదేళ్లు కావస్తోంది. వితంతు పింఛన్ రావడం లేదు. ఎమ్మెల్సీ: ఆందోళన వద్దు. నీకు వంద శాతం పింఛన్ వస్తుంది. సంజీవులు: నాకు ముగ్గురు కూతుళ్లు. ఇద్దరు డైట్‌సెట్ పూర్తి చేశారు. బీఈడీ చేరుుంచే స్థోవుత లేదు. ఎమ్మెల్సీ: అవకాశం ఉంటే ప్రైవేటులో కాస్త ఫీజు తగ్గించి సీటు ఇప్పిస్తా. యాదయ్య: వాటర్ ట్యాంకు నిండి నీళ్లు కిందికి అపరిశుభ్రంగా మారుతోంది. మహిళలు అక్కడే బట్టలు ఉతుకుతున్నారు. ఎమ్మెల్సీ: మన గ్రామాన్ని మనమే పరిశుభ్రంగా ఉంచుకోవాలి. బట్టలు దూరంగా ఉతకాలి. ట్యాంకు నిండాక మోటారు ఆపుచేస్తే సమస్య రాదు. అనంతమ్మ (వార్డు మెంబర్): బీసీ కాలనీలో సీసీ రోడ్డు, మురుగు కాలువలు నిర్మించాలి. ఎమ్మెల్సీ: త్వరలో నిధులు వుంజూరు చేసి రోడ్లు, మురుగు కాలువల నిర్మాణానికి కృషి చేస్తా. తిరుపతిరెడ్డి: రోడ్డు ప్రమాదంలో వెన్నుపూస విరిగి నాలుగేళ్లుగా మంచంపైనే ఉంటున్నా. ఎమ్మెల్సీ: సీఎం రిలీఫ్ ఫండ్ కింద సహాయం అందేలా చూస్తా. ఎమ్మెల్సీ: ఏం తమ్ముడు.. పత్తి గిట్టుబాటు ఎలా ఉంది? జాంగీర్: ఎనిమిదెకరాల్లో పత్తి పంటను సాగు చేస్తే 27 క్వింటాళ్లు మాత్రమే దిగుబడి వచ్చింది. ధర గిట్టుబాటు కావడం లేదు. క్వింటాలుకు రూ. 3900 మాత్రమే పలుకుతోంది. కనీసం పెట్టుబడి కూడా రావడం లేదు. ఎమ్మెల్సీ: సీసీఐలో విక్రయిస్తే ప్రభుత్వ మద్దతు ధర రూ.4050 వస్తుంది. వ్యాపారులకు అమ్ముకొని నష్టపోవద్దు. తిరుపతిరెడ్డి (సర్పంచ్): గ్రామంలో మంచినీటి పైపులైన్లను మార్చాలి. ఆరోగ్య ఉప కేంద్రం, బీఎస్ఎన్ఎల్ టెలిఫోన్ లీజులైన్ ఏర్పాటు చేయాలి. వికారాబాద్ నుంచి హైదరాబాద్ (వయా చిలుకూరు మీదగా) ఆర్టీసీ బస్సులు వేయాలి. అంగన్వాడీ భవనం మధ్యలో ఆపారు. నారెగూడ నుంచి అక్నాపూర్ వరకు బీటీ రోడ్డు వేయాలి. ఎమ్మెల్సీ: ఎమ్మెల్యే యాదయ్యతో మాట్లాడి మా ఇద్దరి కోటాల నుంచి నిధులు వుంజూరు చేసి అభివృద్ధికి కృషి చేస్తా. దశలవారీగా అభివృద్ధి చేస్తా... ‘సాక్షి’ చొరవతో నారెగూడ గ్రావుంలోని సవుస్యలను పూర్తిగా తెలుసుకున్నాను. చాలా సం తోషంగా ఉంది. ‘సాక్షి’కి ప్రత్యేక కృతజ్ఞతలు. దశలవారీగా గ్రావూభివృద్ధికి కృషి చేస్తా. గ్రావూనికి పూర్తిస్థాయిలో నిధులు కేటాయించి అన్ని విధాలా ఆదుకుంటా. -ఎమ్మెల్సీ కొంపల్లి యాదవరెడ్డి -
సమస్యలన్నీ తీరుస్తా..
జన్నారం : మా ఊరికి రావాలంటే చాలా ఇబ్బందైతంది. వర్షాకాలంలో ఈ రోడ్డుపై నడవాలంటేనే కష్టమైతుంది. రోడ్డంతా బురదగా ఉంటది. ఊర్లో బోరింగులు చెడిపోయినయి. పిల్లలు బడికి రావడానికి కూడా గోసైతుంది. పింఛన్లు చాలామందికి అస్తలేవు.. అంటూ జన్నారం మండలం దేవునిగూడ గ్రామ పంచాయతీ పరిధి కొత్తూరుపల్లి వాసులు సమస్యలు ఏకరువు పెట్టారు. గ్రామీణుల సమస్యలు తెలుసుకోవడానికి ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీరా రేఖాశ్యాంనాయక్ 'సాక్షి' వీఐపీ రిపోర్టర్‌గా మారారు. గ్రామంలో పర్యటిస్తూ ప్రజలతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. కొన్ని సమస్యల పరిష్కారానికి అక్కడికక్కడే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గ్రామంలో నెలకొన్న సమస్యలన్నీ తీరుస్తానని స్పష్టం చేశారు. రేఖానాయక్ : అందరికీ నమస్కారాలమ్మ.. బాగున్నారా.. గ్రామస్తులు : బాగున్నామమ్మా.. మీరు బాగున్నారా.. రేఖానాయక్ : బాగున్నాను.. ఏమమ్మ మీ పేరు ఎంటీ? మెంగని బుచ్చవ్వ : నా పేరు బుచ్చవ్వ రేఖానాయక్ : అమ్మా పింఛన్ అస్తుందా.. బుచ్చవ్వ : లేదమ్మ పింఛన్ అత్తలేదు. రెండు మూడు సార్లు మా సర్పంచుకు జీరాక్సులు ఇచ్చినా.. జర పింఛన్ ఇప్పించడమ్మా.. రేఖానాయక్ : తప్పకుండా పింఛన్ ఇప్పిస్తా. దిగులు పడకు. రేఖానాయక్ : అమ్మా నీ పేరేంటమ్మ బుచ్చవ్వ : ఆమెకు మాటలు రావమ్మ. కాగితాలు ఉన్న ఆమెకు కూడా పింఛన్ అస్తలేదు. రేఖానాయక్ : ఎంపీడీవోతో ఫోన్లో మాట్లాడి ఇప్పుడు రాపిస్తాను(అని ఫోన్ చేసి చెప్పారు) రేఖానాయక్ : ఏం పెద్దమనిషి బాగున్నావా.. ఏమన్న సమస్యలున్నాయా..? గడ్డం పెద్దరాజం : ఏమి చెప్పుమంటవు అమ్మా.. నాకు పింఛన్ అత్త లేదు. మా ఊరికి రావాలంటే చానా ఇబ్బంది అవుతుంది. రోడ్డు సరిగ్గా లేదు. రేఖానాయక్ : రోడ్డు విషయం నాకు తెలిసింది. తప్పకుండా రోడ్డు ఏపిస్తాను. అదే విధంగా పింఛన్ కూడా వచ్చేటట్టు చేస్తాను. రేఖానాయక్ : ఏమమ్మ బాగున్నావా.. మీ పేరేమిటి సీదర్ల శాంతవ్వ : నా పేరు శాంతవ్వ.. గిట్ల ముసలి తనానికి వచ్చిన. రేఖానాయక్ : పింఛన్ వస్తుందా..? శాంతవ్వ : అత్తలేదమ్మ.. ఇన్ని రోజులు వచ్చింది.. ఇప్పుడేమో బందయింది. దయ ఉంచి పింఛన్ ఇప్పించండి. రేఖానాయక్ : కాగితాలు చూసి.. అమ్మా నీకెందుకు పింఛన్ ఇస్తలేరు. అన్ని వెంటనే వీఆర్వోకు చెప్పి పింఛన్ అచ్చేలా చూస్తాను. గడ్డం లక్ష్మి : అమ్మా.. మా గూడెం నుంచి ఈ గ్రామానికి రావడానికి రోడ్డు లేదు. పది మంది పిల్లలు మా గూడెం నుంచి పొలాల గట్ల నుంచి బడికి వస్తరు. దయుంచి రోడ్డు ఏపియ్యండమ్మ. రేఖానాయక్ : ఏమయ్య సతీశ్ ఈ సమస్య రాసుకో.. తప్పకుండా మీ గూడేనికి రోడ్డు ఏపిస్తాను. మోటపల్కుల నర్సవ్వ : అమ్మా.. మా ఊరి చివరన ఉన్న పోచమ్మ తల్లి దేవుని గుడి దగ్గర ఒక బోరింగు వేయించండమ్మ. అక్కడ నీళ్లు లేక గోసయితుంది. రేఖానాయక్ : ఈ నెల లోపు బోరింగు వేయిస్తాను. సరేనా..? రేఖానాయక్ : అమ్మా నీ పేరేంటి? సరిత : నా పేరు గడ్డం సరిత.. మాది గడ్డంగూడెం రేఖానాయక్ : ఏమైన సమస్యలున్నాయా..? సరిత : అమ్మా మా గూడేనికి రెండే బోరింగులు ఉన్నయి. ఎండకాలంలో ఒక్కటి ఎండిపోతది. మా గూడెంలో ఒక నీళ్ల ట్యాంకు కట్టించండి. రేఖానాయక్ : (సర్పంచ్‌తో) నిధులు రాగానే ఆ గూడేనికి నీళ్ల ట్యాంకు కట్టించండి. ఏదైనా ఇబ్బంది ఉంటే నాకు చెప్పండి. రేఖానాయక్ : ఏం తాత బాగున్నవా? ఆరే దేవయ్య : బాగున్నమ్మ రేఖానాయక్ : పింఛన్ వస్తుందా..? దేవయ్య : వస్తుందమ్మ రేఖానాయక్ : ఇంకేమైన ఇబ్బంది ఉందా.. దేవయ్య : ఇంకా బియ్యం ఇస్తలేరు.. ఇప్పించండి రేఖానాయక్ : ఇప్పుడే మొదలైంది. రేపు పోయి తెచ్చుకో.. సుధాకర్ : మేడం మా ఊరు నడవలేని విధంగా ఉంది. వానకాలంలో బురద అయి చాలా ఇబ్బంది అవుతుంది. రోడ్డు విషయంలో కొంచెం శ్రద్ధ తీసుకోండి రేఖానాయక్ : వ చ్చే నిధుల్లో మీ గ్రామానికి రోడ్డు మంజూరు చేపిస్తా శంకర్ : మేడమ్.. ఈ ఊరు నుంచి గోండుగూడకు వెళ్లేటప్పుడు మధ్యలో వాగు వస్తుంది. వాన కాలం వాగొస్తే ఆ ఊరికి వెళ్లడం కష్టమౌతుంది. మధ్యలో వంతెన కట్టించండి. రేఖానాయక్ : ఇప్పుడే చెప్పలేను.. కానీ కనీసం సంవత్సరం లోపు తప్పకుండా కట్టిస్తాను. రేఖానాయక్ : మీ ఊరిలో సీసీ రోడ్లు ఉన్నాయి కదా.. మరి ఇంకేమైన కావాలా? సత్తన్న : అవునమ్మ.. మరో రెండు వాడల్లో సీసీ రోడ్డు లేదు. రోడ్డు వేసేలా చూడండి. రేఖానాయక్ : సరేనమ్మా నేను వెళ్తాను. ఏదైన సమస్య ఉంటే నన్ను కలువండి. ఒక్కరే పోతే మాట్లాడుతారో లేదో అనుకోవద్దు. మీకు ఏ సమస్య ఉన్న నాకు చెప్పండి. -
జనం కోసం పోరుబాట
కదిలిస్తే...ప్రతీ మదీ ఆవేదనల నదే... పింఛన్లు తీసేశారు...కొత్త పింఛన్లు ఇవ్వడం లేదు...రేషన్ కార్డులదీ అదే పరిస్థితి. నగరంలో ఏ సందు వెతికినా..తాండవిస్తోన్న అపరిశుభ్రత..చివరకు తాగేందుకు కూడా గుక్కెడు నీళ్లు రాని పరిస్థితి...ఇలా ఒకటి కాదు...రెండు కాదు.. సమస్యల చట్రంలో చిక్కుకుని ‘అనంత’వాసులు అల్లాడిపోతున్నారు. ఎన్నిసార్లు విన్నవించినా పట్టనట్లున్న అధికారులు, ప్రజాప్రతినిధుల వైఖరిపై జనం మండిపడుతున్నారు. ఈ క్రమంలో నగర వాసుల సమస్యలు తెలుసుకునేందుకు అనంతపురం మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి ‘రిపోర్టర్’గా మారారు. పాతూరులో ‘సాక్షి వీఐపీ’ రిపోర్ట్‌ర్‌గా ప్రజా సమస్యలు తెలుసుకున్నారు. వాటి పరిష్కారం కోసం పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. మొదటగా పాతూరు మహాత్మాగాంధీ విగ్రహం ఎదుట దిగిన గురునాథ్‌రెడ్డి అక్కడ తోపుడు బండ్ల వ్యాపారితో.. గురునాథ్‌రెడ్డి: బాబూ నీ పేరేమిటి? వ్యాపారం ఎలా ఉంది? తోపుబండ్ల వ్యాపారి: సార్ నా పేరు వెంకటేష్. వ్యాపారం బాగా తగ్గింది. గురునాథ్‌రెడ్డి: సమస్యలు ఏమైనా ఉన్నాయా? వెంకటేష్ : ట్రాఫిక్ వాళ్ల నుంచి ఇబ్బంది. బండి అక్కడపెట్టు..ఇక్కడ పెట్టు అంటూ ఇబ్బంది పెడుతున్నారు. గురునాథ్‌రెడ్డి: ప్రభుత్వం నుంచి ఏదైనా సహాయం అందిందా? వెంకటేష్ : ఇప్పటి వరకు ఎలాంటి సాయమూ లేదు. గురునాథ్‌రెడ్డి: అన్నా..వ్యాపారాలు ఎలా ఉన్నాయి? రామూర్తి ప్రసాద్ : వ్యాపారం తక్కువ. బాడుగలు ఎక్కువగా ఉన్నాయన్నా...!. గురునాథ్‌రెడ్డి: బాడుగ ఎంత కడుతున్నారు? రామూర్తి ప్రసాద్ : 13 వేల చిల్లర కడుతున్నాము. దీనికి తోడు సేవా పన్ను కట్టాలంటున్నారు. వ్యాపారాలు లేని పరిస్థితుల్లో బాడుగలు ఎలా కట్టాలో అర్థం కావడం లేదు. గురునాథ్‌రెడ్డి: ఏం నాగభూషణం బాగున్నావా? ఇక్కడ సమస్యలు ఏంటి? నాగభూషణం: సార్.. పాతూరులో వ్యాపారం చేసుకునే మహిళలకు, సరుకులు, కూరగాయలు కొనేందుకు వచ్చే మహిళలకు టాయ్‌లెట్ సమస్య అధికంగా ఉంది. గురునాథ్‌రెడ్డి: దగ్గరలో సులబ్ కాంప్లెక్స్ ఉంది కదా! నాగభూషణం: ఉంది సార్.. అది చాలా అధ్వానంగా ఉంటుంది. అక్కడికి పోతే రోగాలొస్తాయి. శుభ్రం చేయండని చెబితే... చేస్తాం... చూస్తామంటున్నారు. గురునాథ్‌రెడ్డి: సరే నేను అధికారులతో మాట్లాడి టాయ్లెట్లు ఏర్పాటు జరిగేలా చూస్తాను. గురునాథ్‌రెడ్డి: బాబూ నీ పేరేమిటి. ఆటో జీవితం ఎలా ఉంది. ఆటోవాలా: సార్ నా పేరు ఓబుళపతి. బాడుగలు వర్కవుట్ కావడం లేదు. గురునాథ్‌రెడ్డి: సమస్యలు ఏమైనా ఉన్నాయా? ఓబుళపతి : ట్రాఫిక్ వాళ్లతో ఇబ్బంది. ఆటోలు పెట్టుకుంటే తీసేమంటారు. ఫైన్ రూ.150 నుంచి రూ.200 వరకు వేస్తారు. అసలే బాడుగలు అంతంత మాత్రం. ఫైన్లు వేసిన రోజున ఉత్తి చేతులతో ఇంటి పోవాల్సి వస్తోంది. గురునాథ్‌రెడ్డి: ట్రాఫిక్ వాళ్లతో మాట్లాడి మీ ఆటోవాళ్ల సమస్యను పరిష్కరిస్తాను. తాడిపత్రి రోడ్డు నుంచి రాజమ్మకాలనీకి వెళ్లిన గురునాథరెడ్డి అక్కడి పేదల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గురునాథ్‌రెడ్డి: ఏం పెద్దమ్మ బాగున్నావా..? పింఛను వస్తోందా..? నూరి: అయ్యా పింఛను వస్తోంది. అయితే మూడు నెలల పింఛన్ రూ.3 వేలు ఇవ్వకుండా రూ.2 వేలు మాత్రమే ఇచ్చారు. గురునాథ్‌రెడ్డి: ఎందుకు ఇవ్వలేదో అడగలేదా..? నూరి : అడిగితే మళ్లీ ఇస్తామంటూ పంపించేశారు. గురునాథ్‌రెడ్డి: అమ్మా పింఛను ఇస్తున్నారా..? ఉసేన్‌బీ: లేదయ్యా..? పింఛను కోసం ఎన్ని సార్లు అర్జీ ఇచ్చినా ఎవరూ ఇయ్యలేదు. గురునాథ్‌రెడ్డి: మీ వాళ్లు ఎవరూ లేరా..? ఉసేన్‌బీ : మా ఇంటాయన చనిపోయాడు. ఉన్న ఒక్క కొడుకూ చనిపోయాడు. నా కూతురు దోసెలు వేస్తుంది. ఆమె దగ్గరే ఉంటున్నారు. పింఛను వచ్చేలా చూడయ్యా. గురునాథ్‌రెడ్డి: అధికారులతో మాట్లాడి పింఛను వచ్చేలా చూస్తానమ్మ. గురునాథ్‌రెడ్డి: ఏమ్మా.. మీ కాలనీలో సమస్యలు ఏమైనా ఉన్నాయా..? రసూలా : సార్ చెప్పుకుంటూ పోతే చాలా సమస్యలు ఉన్నాయి. కాలువలు తీసేవాళ్లు రారు. నీళ్లు సరిగ్గారావు. గురునాథ్‌రెడ్డి: రేషన్ బాగా ఇస్తున్నారా..? రసూనా : ఎక్కడిస్తున్నారు సార్. మా నాన్న కార్డులో నా పేరు ఉండేది. నాకు పెళ్లయ్యిందని ఆ కార్డులో పేరు తీసేసి రేషన్ ఇవ్వడం లేదు. మా ఆయన కార్డులో నా పేరు చేర్చాలని ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకున్నా పని జరగలేదు. గురునాథ్‌రెడ్డి: ఏం పెద్దమ్మ నీరసంగా ఉన్నావు? ఖాజాబీ : అయ్యా ఆరోగ్యం సరిగ్గా లేదు. గుండె జబ్బుతో ఇబ్బంది పడుతున్నాను. గురునాథ్‌రెడ్డి: ఆరోగ్య శ్రీ ద్వారా వైద్యం చేయించుకోలేదా..? ఖాజాబీ: లేదయ్యా చేయించుకోలేదు. గురునాథ్‌రెడ్డి: నీకు పింఛను ఇస్తున్నారా..? ఖాజాబీ: పింఛను రావడం లేదు. అర్జీలు ఇచ్చి తిరుగుతున్నాను. అదిగో ఇదిగో అంటూ తిప్పుతున్నారు. తిరిగితిరిగి ఆయసం వస్తోంది తప్పా పింఛను రాలేదు. గురునాథ్‌రెడ్డి: ఏం తల్లి బాగున్నావా..? నీ పేరేమిటి..? ముసలమ్మ: అయ్యా నాపేరు నారమ్మ. నాకు ఆరు మంది పిల్లలు. అందరూ వేరుపోయారు. నా భర్త చనిపోయాడు. నేను ఒక్కదాన్నే ఉంటున్నాను. గురునాథ్‌రెడ్డి: పింఛను, రేషన్ వస్తోందా..? నారమ్మ : మూడు నెలల నుంచి పింఛను ఇవ్వడం లేదు. వేలి ముద్రలు పడలేదంటూ పంపించేశారు. రేషన్‌కూడా తక్కువ ఇస్తున్నారు. గురునాథ్‌రెడ్డి: అమ్మా నీ పేరేమి..? ప్రభుత్వం సాయం అందుతోందా..? మహిళ : సార్ నా పేరు హుసేన్‌బీ. నా భర్త చనిపోయాడు. పింఛన్ రూ.200 ఇచ్చేప్పుడు తీసుకున్నాను. ఇప్పుడు ఇవ్వడం లేదు. ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావడం లేదు. గురునాథ్‌రెడ్డి: ఎందుకు ఇవ్వడం లేదు..? హుసేన్‌బీ: అదేమి చెప్పడం లేదు. రూ.200 ఇచ్చినప్పుడే బాగుండేది. చానా ఇబ్బంది పడుతున్నాము. గురునాథ్‌రెడ్డి:అమ్మా నీ పేరు ఏమిటి..? మహిళ : కైరున్‌బీ సార్. గురునాథ్‌రెడ్డి: కుటుంబం బాగా జరుగుతోందా..? కైరున్‌బీ : ఏమి జరుగుతుందిలే సారు. చెప్పుకుంటే అన్ని కష్టాలే. వైఎస్ఆర్ ఉన్నప్పుడే బాగుండేది. గురునాథ్‌రెడ్డి: ఇప్పుడేం సమస్యలున్నాయి..? కైరున్‌బీ: కరెంటు బిల్లు ఎక్కువ. రేషన్ తక్కువ ఇస్తారు. 16 కేజీలు బియ్యానికి 12 కేజీలే ఇస్తారు. సంసారం ఎలా చేసుకోవాలో అర్థం కావడం లేదు. గురునాథ్‌రెడ్డి : అక్కా బాగున్నావా? నీ పేరేమిటి? మహిళ: అయ్యా నాపేరు పెద్దక్క. ఏం బాగులే సారు. అన్ని సమస్యలే. గురునాథ్‌రెడ్డి: ఏమ్మా ఏమి ఇబ్బందులున్నాయి..? పెద్దక్క: అయ్యా నా మొగుడు పోయి చాన్నాళ్లయ్యింది. వితంతు పింఛను ఇయ్యండని తిరుగుతున్నా. ఎవరూ పట్టించుకోలేదు. గురునాథ్‌రెడ్డి: అధికారులతో మాట్లాడి వచ్చేలా చూస్తాను. రాజమ్మ కాలనీ నుంచి రాణీనగర్‌కు చేరుకున్న గురునాథ్‌రెడ్డి వద్దకు అక్కడి ప్రజలు వచ్చి తమ సమస్యలను ఎకరవు పెట్టారు. గురునాథ్‌రెడ్డి: ఏమ్మా మీ కాలనీలో సమస్యలన్నాయా? పింఛను అందరికి వస్తోందా..? స్థానికులు : కాలువలు సరిగ్గా తీయడం లేదు.స్టోరు మూడు రోజులే ఇస్తారు. పింఛను ఇవ్వడం లేదు. గురునాథ్‌రెడ్డి: ఏం పెద్దాయనా..దిగాలుగా ఉన్నావ్? వృద్ధుడు : కదల్లేని ముసలాడినయ్యా.. (వీరప్ప) అయినా నాకు పింఛను ఇవ్వడం లేదు. గురునాథ్‌రెడ్డి: ఏమన్నా బాగున్నావా..? నీ పేరేమిటి..? ఏంచేస్తుంటావు. కాలనీ వాసి : సార్ నా పేరు సంజీవయ్య. నాకు పొలం కూడా ఉంది. వ్యవసాయం చేసుకుంటాను గురునాథ్‌రెడ్డి: చంద్రబాబు ప్రభుత్వం చేసిన రుణమాఫీ వల్ల న్యాయం జరిగిందా...? సంజీవయ్య : ఎక్కడి రుణమాఫీ సార్. ఆయన చెప్పిన దానికి.. చేసిన దానికి పొంతనే లేదు. రుణమాఫీ అంతా కాగితాలు, కంప్యూటర్లకే పరిమితమైంది. బ్యాంకుకు వెళితే స్పందన లేదు. గురునాథ్‌రెడ్డి: రుణమాఫీ చేస్తానని చంద్రబాబు స్పష్టమైన హామీ ఇచ్చాడు కదా..? సంజీవయ్య: చంద్రబాబు చెప్పిందేదీ చేయడు. ఇంతకు ముందు చూసాము. ఆయన పాలనలో వానలు రావు. కరువుతో అల్లాడాల్సిందే. ఇప్పుడే అదే కనిపిస్తోంది. ఎనిమిది నెలలైనా రుణ మాఫీ చేయలేదు. ఉత్త పేపర్లు ఇస్తూ ఇబ్బందులు పెడుతున్నాడు. గురునాథ్‌రెడ్డి: అన్నా నీ పేరేమిటి. నువ్వూ వ్యవసాయం చేస్తావా..? కాలనీ వాసి: సార్ నా పేరు శివమూర్తి. మంగళషాపు నడుపుకుంటున్నా. పొలం ఉంది. వ్యవసాయం చేసుకుంటాను. గురునాథ్‌రెడ్డి: రుణం ఎంత తీసుకున్నావు. మాఫీ అయ్యిందా..? శివమూర్తి : రుణం రూ.40 వేలు తీసుకున్నాను. మాఫీ చేశామంటున్నారు. చేతికిచ్చింది లేదు. బ్యాంక్‌కు వెళితే మాకు ఏమీ రాలేదని చెప్పి పంపుతున్నారు. అయితుందో కాదో తెలియదు. ఆ తర్వాత రాణీనగర్ నుంచి వచ్చిన గురునాథ్‌రెడ్డి.. పాతూరు కూరగాయల మార్కెట్ వద్ద ఉన్న హామాలీలను పలకరించారు గురునాథ్‌రెడ్డి: ఏమన్నా హమాలీల పరిస్థితి ఎలా ఉంది..? వెంకటేశ్: సార్ బతుకు భారమయ్యింది. మా గురించి పట్టించుకునేవారులేరు. ఇల్లు లేదు. మాకు గుర్తింపులేదు. ఏ ప్రభుత్వం సాయం చేయలేదు. పిల్లల్ని చదించుకోవడం కష్టంగా ఉంది. గురునాథ్‌రెడ్డి: పిల్లలు ఏమి చదువుతున్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ వస్తుంది కదా..? వెంకటేశ్: మా అబ్బాయి ఎంబీఏ చేస్తున్నాడు. వైఎస్ఆర్ ఉన్నప్పుడు ఒక సారి తీసుకున్నాను. ఇప్పుడు రావడం లేదు. గురునాథ్‌రెడ్డి: హమాలీలకు గుర్తింపు కార్డులు ఇచ్చేలా అధికారులతో మాట్లాడతాను. పిల్లల్ని బాగా చదివించుకోండి. వైఎస్ఆర్ ఆశయం కూడా అదే. పేదలకు మంచి చదువులు అందించాలనే ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చాడు. గురునాథ్‌రెడ్డి: బాబు నీపేరేమిటి. ఏం చేస్తున్నావు? వ్యాపారి : సార్ నా పేరు గౌస్‌మోహిద్ధీన్. నేను కోడిగుడ్ల వ్యాపారం చేస్తున్నాను. గురునాథ్‌రెడ్డి: ఎలా ఉంది వ్యాపారం. సమస్యలు ఏమైనా ఉన్నాయా..? గౌస్‌మోహిద్దీన్: ఏం వ్యాపారంలే సార్. చదువుకున్న వారు రోడ్ల మీదపడ్డారు. చంద్రబాబు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి ఇవ్వలేదు. రుణమాఫీ అంటూ రైతులకు చేయలేదు. పింఛను వెయ్యి ఇస్తానంటూ సగం మందికి లేకుండా చేశాడు. -
కష్టాలు తీరుస్తా...
ఆశ్రమంలోని వృద్ధులతో కలెక్టర్ ఎం.రఘునందన్‌రావు పింఛన్లు ఇక్కడే ఇప్పించేందుకు చర్యలు తీసుకుంటానని హామీ సాక్షి వీఐపీ రిపోర్టర్‌గా వృద్ధులు, వికలాంగులతో మమేకమైన కలెక్టర్ అది మచిలీపట్నం ఈడేపల్లిలోని జెట్టి నరసింహం ప్రభుత్వ వృద్ధులు, వికలాంగుల శరణాలయం. అందులో కన్నబిడ్డలు లేనివారు కొందరైతే.. అయినవాళ్లు ఉండీ అనాథలుగా మిగిలినవారు మరికొందరు. రక్త సంబంధీకులు దూరంగా పెడితే అనాథలుగా మారి శరణాలయంలో ఆశ్రయం పొందుతున్న వీరిని శనివారం జిల్లా కలెక్టర్ ఎం.రఘునందన్‌రావు ‘సాక్షి వీఐపీ రిపోర్టర్’గా మారి పేరుపేరునా ఆప్యాయంగా పలకరించారు. ప్రతి ఒక్కరి వద్దకు వెళ్లి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఎక్కడి నుంచి వచ్చారు, ఎంతకాలంగా ఉంటున్నారు.. ఇక్కడ సౌకర్యాలు సరిగా ఉన్నాయా.. లేదా.. భోజనం సక్రమంగా పెడుతున్నారా.. లేదా.. అంటూ అడిగి తెలుసుకున్నారు. కొంతమంది వృద్ధులు తాము పింఛను కోసం దూరప్రాంతాలకు వెళ్తున్నామని, శరణాలయంలోనే పింఛను ఇప్పించేలా చూడాలని కోరగా.. అందుకనుగుణంగా చర్యలు తీసుకుంటానని కలెక్టర్ హామీ ఇచ్చారు. అనాథ వృద్ధులు, వికలాంగులను కలవడం, వారితో మాట్లాడటం, వారి సమస్యలను పరిష్కరించేందుకు అవకాశం రావడం తాను గౌరవంగా భావిస్తున్నానని కలెక్టర్ ఈ సందర్భంగా చెప్పారు. శరణాలయంలో ఉన్న సమస్యలన్నింటినీ పరిష్కరిస్తానని, వృద్ధులకు అన్ని సౌకర్యాలూ కల్పిస్తానని హామీ ఇచ్చారు. -
ఉద్యోగం ఊడితే తిరుగుబాటే !
వారంతా పంచాయతీ కార్మికులు. రోడ్లను ఊడ్చడం, మురికి కాల్వలను శుభ్రం చేయడం, మలమూత్రాలను చేత్తో ఎత్తేయడం వీరి విధి నిర్వహణలో భాగం. అయినా ఏళ్ల తరబడి అరకొర వేతనాలే. ప్రభుత్వం ఎప్పటికైనా పర్మినెంట్ చేయకపోతుందా అనే చిన్న ఆశతో అన్ని కష్టాలనూ భరించారు. అయితే కార్మికులందరినీ విధుల నుంచి తొలగించేందుకు కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్ ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి సొంత జిల్లాలో వేలాది మంది పంచాయతీ కార్మికులను ఇంటికి పంపనున్నారు. దీంతో కార్మికులు జిల్లాలోని పంచాయతీ కార్యాలయాల వద్ద 14 రోజులుగా రిలే దీక్షలు చేస్తున్నారు. కార్మికుల సమస్యలు, వారి డిమాండ్లు తెలుసుకునేందుకు చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ‘సాక్షి’ తరపున వీఐపీ రిపోర్టర్‌గా మారారు. నియోజకవర్గంలోని చంద్రగిరి, తిరుచానూరు, శెట్టిపల్లి పంచాయతీల్లో జరుగుతున్న దీక్షా శిబిరాలను సందర్శించారు. తమ తరఫున అసెంబ్లీలో గళమెత్తి, స్వయంగా దీక్షా శిబిరాలకు వచ్చిన చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి వారు కృతజ్ఞతలు తెలిపారు. ఐదేళ్ల నుంచి పనిచేస్తున్న కార్మికులందరినీ పర్మినెంట్ చేయకపోతే చంద్రబాబును తరిమికొడతామని కార్మికులు హెచ్చరించారు. కార్మికుల సమస్యలు పరిష్కారమయ్యేవరకు వైఎస్ఆర్సీపీ అండగా నిలుస్తుందని చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి హామీ ఇచ్చారు. సాక్షి విఐపి రిపోర్టర్: డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి: నమస్తే అన్నా..నా పేరు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి. చంద్రగిరి ఎమ్మెల్యేని. మీ సమస్య ఏంటి. ఎందుకు దీక్ష (శెట్టిపల్లెలో) చేస్తున్నారు? నరసింహులు: రాష్ట్ర ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తోంది. పంచాయతీలో దశాబ్దాలుగా పనిచేస్తున్న కార్మికులను తొలగించాలని కలెక్టర్ చట్టవిరుద్ధంగా కార్మికులను రోడ్డున పడేశారు. కలెక్టర్ పంచాయతీల ప్రయివేటీకరణకు తెర తీస్తున్నారు. ప్రయివేటు ఏజెన్సీలకు కార్మికుల శ్రమను దోచిపెట్టే పనిలో కలెక్టర్ నిమగ్నమయ్యారు. కలెక్టర్ నిరంకుశ ధోరణికి వ్యతిరేకంగా కార్మికులందరూ రోడ్డు ఎక్కాం. దీక్ష చేస్తున్నాం. చెవిరెడ్డి: కార్మికుల దీక్షలకు స్థానిక ప్రజాప్రతినిధులు మద్దతు పలుకుతున్నారా? నరసింహులు: న్యాయం చేయాలని జిల్లా ఇన్చార్జి మంత్రిగా బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కా ళ్లావేళ్లాపడ్డాం. ఆయన కనీసం స్పందించలేదు. పైగా మీరే కాంట్రాక్టు తీసుకోండి అంటూ ఉచి త సలహాలు పడేశారు. స్థానిక శాసనసభ్యుడిగా చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఎంపీపీ మునికృష్ణయ్య మద్దతు పలికారు. కార్మికులకు మేమున్నామంటూ ధైర్యం చెప్పారు. చెవిరెడ్డి: చంద్రబాబుకు తెలిసే అధికారులు కార్మికులను వే ధిస్తున్నారా? మాధవయ్య: సీఎంకు తెలి యకుండా కలెక్టర్ వేలాది మంది ఉద్యోగులను రోడ్డున పడేయరుకదా. గతంలో కన్నా దారుణంగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారు. కార్మికుల సంక్షేమం కోసం గతం లో వైఎస్ రాజశేఖరరెడ్డి చాలా చేశారు. మారిన మనిషినంటూ చంద్రబాబు మాటలకు మోసపోయాం. జీవితకాలం ఇక ఆయన్ను నమ్మం. చెవిరెడ్డి: గ్రామంలోనే పుట్టి పంచాయతీ కార్మికుల సమస్యలను దగ్గరగా చూశా. ఉద్యో గం పోయే పరిస్థితే వస్తే ఏం చేస్తారు? మాధవయ్య: పేదల కడుపు కొట్టేందుకే చంద్రబాబు ప్రయివేటీకరణ మోజులో పోతున్నాడు. పంచాయతీలను నాశనం చేసే కుట్ర జరుగుతోంది. కార్మికుల కడుపు కొడుతున్నా డు. 30 ఏళ్లుగా అరకొర వేతనాలతో పనిచేస్తున్నాం. అర్హులందరినీ పర్మినెంట్ చేస్తామంటూ ఉన్న ఉద్యోగాలనుంచి తొలగించే పనికి శ్రీకారం చుడుతున్నారు. చెవిరెడ్డి: మీ స్థానాల్లో కొత్త ఉద్యోగులను తీసుకోవాలంటే అంగీకరిస్తారా ? రమణ: బాబూ ! మీ సింగపూర్ మాకొద్దు, ఉన్న వనరులను సద్వినియోగం చేసుకుంటే రాష్ట్రంలోనే భవిష్యత్ తరాలు హాయిగా ఉండవచ్చు. ఎటువంటి పరిస్థితుల్లో కొత్త ఉద్యోగులు పంచాయతీలోకి వస్తామంటే ఊరుకోం. ప్రాణాలను అడ్డువేసైనా హక్కుల కోసం నిలబడతాం. చెవిరెడ్డి: కార్మికులు కుటుంబాల తో సహా వీధినపడ్డారు. 14 రోజులుగా కుటుంబాలను ఎలా పోషిస్తున్నారు? నాగరత్నమ్మ: మా కడుపులు కొట్టి చంద్రబాబు, కలెక్టర్ సిద్ధార్థ్ జైన్ ఎలా బాగుపడుతారో చూస్తాం, కుక్క చచ్చినా మేమే వచ్చి ఎత్తేయాలి. కానీ కంపు కొడుతున్న ప్రభుత్వ పెద్దల ఆలోచన తీరువల్ల అల్లాడుతున్నాం. చంద్రబాబు వచ్చి ఏదో చేస్తాడునుకుంటే ఉన్న ఉద్యోగాలను పెరికి రోడ్డున పడేస్తున్నాడు. మేం ఊరుకోం ...రోడ్లు ఊడ్చుతున్న చేతులతోనే ప్రభుత్వం దిగివచ్చే వరకు పరుగెత్తిస్తాం. చెవిరెడ్డి: చంద్రబాబు ప్రయివేటీకరణ మోజు నుంచి మారాడని భావిస్తున్నారా? నాగమ్మ: బాబు మారితే మేం రోడ్డెక్కే పరిస్థితి ఉండేది కాదు. ఆయన మారడు. మారని చంద్రబాబును క్షమించం. తిరుచానూరులో.. తిరుచానూరులో దీక్ష శిబిరాన్ని ఎమ్మెల్యే సందర్శించారు. భిక్షాటన చేసి సంపాదించిన బియ్యం, పప్పులతో వారు దీక్షా శిబిరం వద్ద చేస్తున్న వంటా వార్పు కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్మికులతో మాట్లాడారు. చెవిరెడ్డి: భిక్షాటన చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? కేశవులు: కలెక్టర్ నిరంకుశ ధోరణి, చేతకా ని చంద్రబాబు పాలన వల్లే పంచాయతీ కార్మికులు భిక్షాటన చేయాల్సి వచ్చింది. కార్మికులను భిక్షగాళ్లుగా మార్చిన చంద్రబాబుకు పుట్టగతులు ఉండవు. చెవిరెడ్డి: డి గ్రీలు చదివిన మీరు పంచాయ తీ కార్మికులుగానే ఎందుకు మిగులుతున్నారు? ప్రసన్న కుమార్: తండ్రి నుంచి వస్తున్న వారసత్వంగా పంచాయతీ కార్మికులుగానే మిగి లిపోయా. బీఎస్సీ చదివినా ఎప్పటికైనా ప్రభుత్వం పర్మినెంట్ చేస్తుందనే ఆశతోనే ఎనిమిదేళ్లుగా విధులు నిర్వహిస్తున్నా. ఇప్పుడు ప్రభుత్వం కడుపుకొట్టాలని చూస్తోంది. చెవిరెడ్డి: బాబు వస్తే జాబ్ వస్తుందని చం ద్రబాబు ప్రచారం చేశారు కదా! మరి మీకెం దుకు ఈ పరిస్థితి ? చంద్రమ్మ: చంద్రబాబు ఉడాల్ మాటల కు, చేతలకు సంబంధం ఉండదు. ఉద్యోగం ఇవ్వడం దేవుడు ఎరుగు మా ఉద్యోగాలనే లాక్కొని వీధిన పడేశాడు. చంద్రగిరిలో.. చంద్రగిరిలో కార్మికుల దీక్ష శిబిరాన్ని ఎమ్మెల్యే సందర్శించారు. చిన్నబిడ్డలతో కార్మికులు చేస్తున్న దీక్షలను చూసి ఆయన చలిం చిపోయారు. వారితో మాట్లాడారు. చెవిరెడ్డి: చంద్రబాబుకు రాజకీయంగా జ న్మనిచ్చిన చంద్రగిరిలో పంచాయతీ కార్మికులు రోడ్డెక్కాల్సిన దుస్థితి ఎందుకు ఏర్పడింది? రాణి: ఇక్కడే పుట్టి, ఇక్కడే చదివి, ఇక్కడే రాజకీయంగా ఎదిగిన చంద్రబాబు చంద్రగిరికి చేసింది శూన్యం. ఆయనే మంచోడైతే కార్మికు లు రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి ఉండేదికాదు. ప్రస్తుత కలెక్టర్‌ను తెలంగాణకు తరమాలి. ఆయనా ప్రయివేటు మోజులో పడి కార్మికుల ను నాశనం చేయాలని చూస్తున్నాడు. చెవిరెడ్డి: కార్మికులకు న్యాయం చేయాలనే ఆలోచన చంద్రబాబుకు వస్తుందనే ఆశిస్తున్నారా ? సుధ: 14 రోజులుగా చంటిబిడ్డలతో రోడ్డు ఎక్కినా అధికార పార్టీ నాయకులు ఎవరూ పట్టించుకోవడం లేదు. మొదట్లో చంద్రబాబు న్యాయం చేస్తాడనే నమ్మకం ఉండేది. ఇప్పుడు లేదు. పోరాటాలకు దిగాల్సిందే. గతంలో చంటిబిడ్డతో యుద్ధం చేసిన ఝాన్సీ రాణి స్ఫూర్తితో ప్రభుత్వంపై తిరగబడతాం. చెవిరెడ్డి: ముఖ్యమంత్రి స్పందించకుంటే భవిష్యత్ కార్యాచరణ ఏమిటి ? వెంకటరమణ: ఇది ప్రజాస్వామ్యం. నిరంకుశంగా పాలించే నాయకులకు స్థానముండ దు. ముఖ్యమంత్రి కార్మికుల సమస్యల పరిష్కారానికి చొరవ చూపకుంటే ఉద్యమాన్ని ఉద్ధృ తం చేస్తాం. 14 రోజులుగా చెత్త ఎత్తకపోవడంతో గ్రామాలన్నీ గబ్బు పట్టిపోతున్నాయి. ప్రజలు తిరగబడే రోజు త్వరలోనే వస్తుంది. ఇప్పటికే మేం ఎందుకు విధులు బహిష్కరించాల్సి వచ్చింది, దీక్షలో ఎందుకు కూర్చోవాల్సి వచ్చిందో ప్రజలకు వివరించాం. చెవిరెడ్డి: మీ డిమాండ్లతో పాటు ప్రజల ఆరోగ్యం ముఖ్యం కాదా ? ప్రకాష్: వాస్తవమే ప్రజల ఆరోగ్యం ముఖ్యమే. కానీ మా బతుకులను బుగ్గిపాలు చే యాలని కలెక్టర్ ప్రయత్నిస్తుంటే చూస్తూ ఊరుకోలేం కదా. పదిరోజులకే ప్రజల ఆరోగ్యాలు పాడవుతుంటే ఏళ్ల తరబడి అదే గబ్బులో, అదే మురికి కూపంలో పనిచేస్తున్నామే మా గురించీ ప్రజలు కొంచెం ఆలోచించాలి. ఇదంతా ప్రభుత్వ నిరంకుశ ధోరణివల్లేనని గుర్తించాలి. కార్మికులకు న్యాయం చేయాలని అధికారుల కాలర్ పట్టుకోవాలి. చెవిరెడ్డి: అంటే అధికారులను నిలదీయాలని పిలుపునిస్తున్నారా? జయకుమార్: ఔను అధికారులను నిలదీయాలనే పిలుపునిస్తున్నాం. దీక్షలు చేస్తున్న కార్మికులు అధికారులకు కనిపించడంలేదా. వారికి న్యాయం చేయాలని వారికి అనిపించడం లేదా. అలాంటి అధికారులను నిలదీస్తే తప్పేంటి. చెవిరెడ్డి హామీ పంచాయతీ కార్మికుల సమస్యలు, వారి డిమాండ్లు విన్న ఎమ్మెల్యే చెవిరెడ్డి చలించిపోయారు. వారి న్యాయమైన కోర్కెలను తీర్చాల్సిన అవసరముందన్నారు. ఇప్పటికే వైఎస్ఆర్సీపీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి, చంద్రగిరి ఎమ్మెల్యేగా తాను అసెంబ్లీలో పంచాయతీ కార్మికులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని నిలదీశామని గుర్తు చేశారు. కార్మికులందరినీ విధుల్లోకి తీసుకుని అర్హులైనవారిని పర్మినెంట్ చేసే వరకు కార్మిక ఉద్యమాలకు వెన్నంటి ఉంటామని హామీ ఇచ్చారు. -
బేఫికర్
వారంతా ఒకప్పుడు రెక్కలు ముక్కలు చేసుకొని బొగ్గుబావుల్లో పనిచేసినవారు. ఇప్పుడు పదవీ విరమణ చేసి వృద్ధాప్యంలో ఉన్నారు. 70 ఏళ్ల క్రితం వీరి కోసం ఇల్లెందు 21 పిట్ ఏరియాలో కట్టించిన క్వార్టర్లు కూడా వీరితో పాటే వృద్ధాప్యానికి చేరాయి. ఒకప్పుడు ఇక్కడున్న బొగ్గు బావులను మూసివేశారు. ఇక్కడ పనిచేస్తున్న కార్మికులు వేరే ప్రాంతానికి బదిలీ అయ్యారు. పదవీ విరమణ చేసిన కార్మికులు మాత్రం ఈ క్వార్టర్లనే పట్టుకొని ఉంటున్నారు. 325 క్వార్టర్లలో కేవలం పదింటిలోనే ప్రస్తుత కార్మికులుంటుండగా మిగిలిన వాటిలో మాజీ కార్మికులు నివసిస్తున్నారు. ఈ కాలనీ బాగోగులు చూడాల్సిన సింగరేణి యాజమాన్యం పట్టించుకోవడం మానేసింది. ఇక్కడి ప్రజలు నీరు, విద్యుత్, పారిశుధ్యం, రోడ్లు తదితర సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నా ఎవరూ కన్నెత్తై చూడటం లేదు. ‘సాక్షి’ వీఐపీ రిపోర్టర్‌గా ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య ఈ ప్రాంతాన్ని ఆదివారం సందర్శించారు. కాలనీ ప్రజలకు అండగా ఉంటానని..క్వార్టర్లు ఖాళీ చేయాల్సిన పనిలేదని భరోసా ఇచ్చారు. కోరం కనకయ్య : బాగున్నరామ్మా..మన కాలనీ ఇబ్బందులు తెలుసుకుందామని వచ్చినా..చెప్పండి? మర్రి లక్ష్మి : సారూ కాలనీ నిండా సమస్యలే ఉన్నయి. జమానలో మా ఆయన బొగ్గు గనుల్లో పని చేసిండ్రు. పదవీ విరమణ పొందిన తర్వాత ఇక్కడే ఉంటున్నం. సింగరేణి అధికారులు కొన్నేళ్లుగా మా కాలనీ బాగోగులు పట్టించుకోవట్లేదు. క్వార్టర్లు కూల్చి ఇక్కడి నుంచి మమ్మల్ని సాగనంపాలని చూస్తుండ్రు. మేము ఎక్కడికి పోయి బతకాలి సారు?. కోరం కనకయ్య : నీ పరిస్థితి ఏంటమ్మా? ఆగమ్మ : మా ఆయన కూడా బొగ్గుబాయిల పనిచేసి దిగిండ్రు. నాడు సింగరేణి ఇచ్చిన డబ్బులు కుటుంబ జీవనానికి సరిపోవట్లేదు. పింఛన్ కోసం ఎన్నో సార్లు దరఖాస్తు చేసుకున్నం. దయచేసి పింఛన్ ఇప్పించడయ్యా. కోరం కనకయ్య : ఏం తాతా ఇదేనా మీ ఇల్లు? బాలమల్లు : అవునయ్యా.. నాకు ఇల్లులేకనే గిట్ట రేకుల షెడ్డు వేసుకున్న. పెద్ద మనసు చేసుకొని నేను, మా ముసలిది ఉండేందుకు పక్కా ఇల్లు ఇప్పించడయ్యా. వర్షాకాలంలో ఈ షెడ్లె ఉండలేకపోతున్నం. ఇల్లు కోసం దరఖాస్తు పెట్టుకున్నం జర ఇప్పించడయ్యా. కోరం కనకయ్య : నీ సమస్య ఏంటమ్మా? లక్ష్మి : నా బిడ్డ అంగవైకల్యం, బుద్ది మాంధ్యంతో 35 ఏళ్లగా బాధపడుతుందయ్యా. పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్నం. జర ఇప్పించడయ్యా. కోరం కనకయ్య : అక్కా.. కాలనీ ఇబ్బందులేంటి? తులస్య : కాలనీలో పందులు, కోతులు బాగున్నయయ్యా..కోతుల దాడిలో పిల్లకాయలు గాయపడ్డరు. పందులు విపరీతంగా ఉండటంతో రోగాలు వస్తున్నాయి. వీటిని అరికట్టండయ్యా. కోరం కనకయ్య : చిన్నా ఏం చదువుతున్నారు? మీకేమైన బాధలున్నాయా? కుమార్, జావిద్, నరేందర్ : సార్..మేము బీటెక్ చదువుతున్నాం. ఫీజు రీయింబర్స్మెంట్ రాలేదు. కాలేజీ యాజమాన్యం ఒత్తిడి చేస్తోంది. రీయింబర్స్ వచ్చేలా చూడండి సార్. కోరం కనకయ్య : కుటుంబరావు బాగున్నావా? మీ వాడ సమస్యలేంటి? బిందె కుటుంబరావు : మా కాలనీకి ట్రాన్స్‌కో ద్వారా విద్యుత్ సౌకర్యం కల్పించండి. సింగరేణి ఏర్పాటు చేసిన విద్యుత్ స్తంభాలున్నాయి. కొత్త స్తంభాలు వేయాలంటే కంపెనీ నగదు చెల్లించాలంటున్నారు. మీరే మార్గం చూపించండి సార్. కోరం కనకయ్య : నీ ప్రాబ్లమ్ ఏంటి చిన్నా..? మొహినుద్దీన్ : సర్.. నేను ఐటీఐ సెకండియర్ చదువుతున్నా. కాలనీలో వీధిలైట్లు, రోడ్లు వేయించండి సార్. శానిటేషన్ సమస్యను కూడా పరిష్కరించండి సార్. కోరం కనకయ్య : ఏం తమ్మి ఎలా ఉన్నవ్? నీ సమస్య ఏంటి? మంద కుమార్ : మూడెకరాల పోడు భూమి ఉంది. ఎన్నో ఏళ్లుగా ఆ భూమిపై ఆధారపడి బతుకుతున్నాం. ఈ మధ్య ఫారెస్ట్ అధికారులు పోడు భూములు చేయొద్దంటున్నారు. హద్దులు ఏర్పాటు చేస్తున్నారు. ఉన్న భూమి గుంజుకుంటే బతికేదెట్టా. కోరం కనకయ్య : ఏంటి చెల్లి..పింఛన్ వస్తుందా? అరుణ : సార్ మా ఆయన ఈ మధ్యే చనిపోయారు. నాకు ఇద్దరు అమ్మాయిలు. పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్నా. ఇవ్వలేదు సార్..మీరైనా ఇప్పించండి. కోరం కనకయ్య : సాహెబ్‌గారూ బాగున్నారా? కాలనీలో సమస్యలున్నాయా? మహబూబ్ అలీ : సింగరేణిని నమ్ముకొని జీవిస్తున్నమయ్యా. దిగిపోయిన కార్మికులను సంస్థ చిన్నచూపు చూస్తోందయ్యా. క్వార్టర్లు ఖాళీ చేయాలంటున్నారు..మేము ఎక్కడికి వెళ్లాలయ్యా. కోరం కనకయ్య : ఏం తాతా..ఆరోగ్యం బాగుందా? ఏమైనా బాధలున్నాయా? కనకయ్య : 20 ఏళ్ల క్రితం బాయి పని దిగిన. పింఛన్ సరిపోవట్లేదు. ప్రభుత్వ పింఛన్ ఇప్పించడయ్యా. కోరం కనకయ్య : ఓ అవ్వ ..ఎలా ఉన్నావ్? పింఛన్ వస్తుందా? చంద్రమ్మ : అప్పట్లో వచ్చింది. గీ మధ్య సర్వే అధికారులు తొలగించిండ్రు. పింఛన్ ఇప్పించి పుణ్యం కట్టుకోండి సారూ. కోరం కనకయ్య : ఏమ్మా నీ సమస్య చెప్పు? ప్రమీల : గతంలో రేషన్‌కార్డు ఇచ్చిండ్రు. ఇప్పుడు ఆహారభద్రత కూపన్ల కోసం దరఖాస్తు చేసుకుంటే నా పేరు తొలగించిండ్రు. మీరైనా ఇప్పించండి. కోరం కనకయ్య : ఓ సర్పంచ్ అక్క.. మనూరు ఎట్టుంది? సమస్యలేంటో చెప్పు? పార్వతి (సర్పంచ్) : 21 పిట్ కాలనీలో తాగునీరు, వీధిలైట్లు, రోడ్లు, డ్రెయినేజీలు ఏవీ సరిగా లేవు. కాలనీ వాసులు ఇ బ్బందులు పడుతున్నరు. సింగరేణి యాజమాన్యంతో చ ర్చించి కాలనీని పంచాయతీకి అప్పజెప్పండి సారు. పంచాయతీ నిధులతో కాలనీలో మౌలిక వసతులు కల్పిస్తాం. -
సమస్యలన్నీ తీరుస్తా..
చెన్నూర్ : ‘మూడేళ్లుగా అరకొర వసతుల మధ్య అద్దె భవనంలో ఉంటూ విద్యాభ్యాసం చేస్తున్నం. మా పాఠశాలలో చాలా సమస్యలు రాజ్యమేలుతున్నాయి. వర్షాకాలంలో వర్షానికి గదులు నీటిమయం అవుతున్నాయి. కిటికీలు సక్రమంగా లేవు. చలికాలం కావడంతో తీవ్ర చలికి వణికిపోతున్నం. మరుగుదొడ్లు సక్రమంగా లేవు. స్నానాలు చేసేందుకు ఒకే బోరుపంపు ఉంది. ఒక్కొక్కరు స్నానం చేయాలంటే సమయం వృథా అవుతోంది. క్రీడా స్థలం లేదు. ఆడుకునేందుకు సామగ్రి లేదు. పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు పుస్తకాలు అందుబాటులో లేవు. మూడేళ్లుగా రగ్గులు సరఫరా కాలేదు. కాస్మోటిక్స్ చార్జీలు రాక మూడు నెలలైతంది. ఇళ్ల నుంచి నెలకు రూ.100 తెచ్చుకుంటే సరిపోవడం లేదు. రగ్గులు ఇప్పించి, కాస్మోటిక్స్ చార్జీలు వచ్చేలా చూడండి సారూ..’ అంటూ విద్యార్థినులు తమ గోడు వినిపించారు. విద్యార్థినుల సమస్యలు తెలుసుకునేందుకు జిల్లా పరిషత్ చైర్మన్ మూల రాజిరెడ్డి ‘సాక్షి’ వీఐపీ రిపోర్టర్‌గా మారారు. చెన్నూర్‌లోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం(కేజీబీవీ)ను సందర్శించి విద్యార్థినులతో మాట్లాడారు. వారి ఇబ్బందులు తెలుసుకున్నారు. అన్ని తరగతి గదుల్లోకి వెళ్లి పరిశీలించారు. వారి కష్టాలు విని చలించిన ఆయన దశలవారీగా సమస్యలన్నీ పరిష్కరిస్తానని హామీనిచ్చారు. జిల్లాలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతానని స్పష్టం చేశారు. విద్యార్థినులతో సంభాషణ ఇలా సాగింది.. మూల రాజిరెడ్డి : అందరికీ నమస్కారములు.. అమ్మాయిలు బాగున్నారా.. విద్యార్థినులు : కూర్చున్న విద్యార్థినులు లేచి నిలబడి.. బాగున్నాం సార్.. రాజిరెడ్డి : నా పేరు రాజిరెడ్డి, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్‌ను.. ‘సాక్షి’ వీఐపీ రిపోర్టర్‌గా మీ సమస్యలు తెలుసుకునేందుకు వచ్చాను. నిర్భయంగా మీ సమస్యలు చెప్పండి. విద్యార్థినులు : ఒకే సార్.. మీరు మాకు తెలుసు.. రాజిరెడ్డి : అమ్మాయి నీపేరేంటి.. విద్యార్థిని : నాపేరు అగ్గు లక్ష్మీ, మూడేళ్ల నుంచి మాకు బెడ్ షీట్లు రాలేదు. రాజిరెడ్డి : బెడ్ షీట్ల కోసం అధికారులతో మాట్లాడుతాను. చలి తీవ్రంగా ఉంది కాబట్టి మూడు రోజుల్లో స్వంత ఖర్చులతో మీ అందరికీ రగ్గులు కొని ఇస్తా. అగ్గు స్వాతి : కాస్మోటిక్స్ చార్జీలు రావడం లేదు సార్. ఇబ్బందవుతుంది. రాజిరెడ్డి : కలెక్టర్‌తో మాట్లాడి కాస్మోటిక్స్ చార్జీలు వెంటనే విడుదల చేయిస్తా చింత మానస : అద్దె భవనం శిధిలావస్థకు చేరింది. భయం వేస్తుంది. రాజిరెడ్డి : భవనం పనులు ప్రారంభమయ్యాయి. త్వరితగతిన పనులు పూర్తి చేయించి వచ్చే విద్యా సంవత్సరం కొత్త భవనంలోనే మీరు చదువుకునేందుకు కృషి చేస్తా. ఎడ్ల శీర్షిష : ఆటలంటే ఇష్టం ఉంది. పరికరాలు లేవు. రాజిరెడ్డి : పీవోతో మాట్లాడి క్రీడా పరికరాలు మంజూరు చేయిస్తా. జనవరి 26 రోజున కొన్ని క్రీడా పరికరాలు నా స్వంత ఖర్చులతో అందజేస్తా. పి.శ్రీమతి : గత నెల రోజుల నుంచి పామాయిల్ సరఫరా చేస్తున్నారు. ఈ ఆయిల్‌ను వాడడంతో అరోగ్యాలు బాగుంటలేవు. రాజిరెడ్డి : నిత్యావసర సరుకులు సరఫరా చేసే కాంట్రాక్టర్‌తో చెప్పి నాణ్యమైన నూనె సరఫరా చేసేలా చర్యలు తీసుకుంటా. కందుగల అంజలి : నిరుపేదలం సార్.. సబ్బుల బిల్లులు రావడంలేదు. ఇబ్బంది అవుతుంది. రాజిరెడ్డి : ఇప్పటికిప్పుడు బిల్లులు మంజూరు కావడం సాధ్యం కాదు. రెండు రోజుల్లో దాతల సహకారంతో నెలకు సరిపడా సబ్బులు అందజేస్తా. పాకాల రాజేశ్వరి : ట్రంక్ పెట్టెలు రాలేదు. బట్టలు, పుస్తకాలు పెట్టుకునేందుకు ఇబ్బందైతంది. రాజిరెడ్డి : కలెక్టర్‌తో మాట్లాడి పెట్టెలు మంజూరు చేయిస్తా. ప్రవళిక : ప్లేట్లు, గ్లాసులు లేక ఇబ్బంది అవుతుంది. రాజిరెడ్డి : గ్లాస్లు, ప్లేట్లు దాతల సహకారంతో త్వరలోనే అందజేస్తా. ఎ.చామంతి : క్విజ్ పోటీలు, పోటీ పరీక్షలకు వెళాలంటే పుస్తకాలు అందుబాటులో లేవు. రాజిరెడ్డి : ప్రస్తుతానికి గ్రంథాలయం నుంచి పుస్తకాలు అందించేలా చూస్తాను. రానున్న రోజుల్లో పాఠశాలలోనే గ్రంథాలయం ఏర్పాటుకు కృషి చేస్తా. నల్లకుంట లావణ్య : 8వ తరగతి నుంచి ప్రాజెక్ట్ వర్క్ చేయాలి. పరికరాలు అందుబాటులో లేవు. రాజిరెడ్డి : ఈ విద్యా సంవత్సరం దగ్గర పడుతుంది. వచ్చే ఏడాది. కొత్త భవనంలో ల్యాబ్ సౌకర్యం కల్పిస్తాం. నల్లకుంట సౌందర్య : ఫ్యాన్లులేవు.. రాత్రి వేళల్లో దోమలు కుడుతున్నాయి. రాజిరెడ్డి : అన్ని రూముల్లో ఫ్యాన్లు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తాను. సత్యవతి : ఇరుకు గదుల్లో ఇబ్బంది అయితాంది.. రాజిరెడ్డి : అన్ని సమస్యలు తీరాలంటే కొత్త భవన నిర్మాణం ఒక్కటే. బెజ్జాల రాణి : స్కూల్ల్లో చేతిపంపు ఉంది. స్నానాలు చేసేందుకు క్యూ కట్టాల్సి వస్తుంది. ప్రార్థన సమయానికి అందలేకపోతున్నం. రాజిరెడ్డి : చేతిపంపునకు మోటారు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తాను. -
అభివృద్ధికి మాత్రం అంతులేని దూరంలో..
గాజులగూడ.. శంకర్పల్లి మండలంలోని ఓ కుగ్రామం.. హైదరాబాద్ మహానగరానికి కేవలం 50 కి.మీ. దూరంలో ఉన్నా అభివృద్ధికి మాత్రం అంతులేని దూరంలో కొట్టుమిట్టాడుతోంది. 18 ఏళ్ల క్రితమే గ్రామపంచాయతీగా ఏర్పడిన గాజులగూడకు రెవెన్యూ పరిధిని నిర్ధారించకపోవడంతో రెవెన్యూ ఆదాయమంతా పాత గ్రామపంచాయతీ అయిన మహాలింగపురంనకే వెళుతోంది. దీంతో గ్రామాన్ని నిధుల కొరత వేధిస్తోంది. తాగునీటి సమస్యతో జనం అల్లాడుతున్నారు. డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ క్రమంలో ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలు, ఇబ్బందులను తెలుసుకునేందుకు చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య ‘సాక్షి’ వీఐపీ రిపోర్టర్‌గా గాజులగూడలో పర్యటించారు. స్థానికులను ఆత్మీయంగా పలకరించారు. వారి సమస్యలను తెలుసుకున్నారు. అన్ని విధాలుగా ఆదుకుంటానని హామీ ఇచ్చారు. గ్రామానికి భవిష్యత్తులో మంచిరోజులు రానున్నాయన్నారు. గ్రామాన్ని అన్ని విధాలుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని ప్రజలకు భరోసా కల్పించారు. ఎమ్మెల్యే: అమ్మా నమస్కారం. బాగున్నావా..? నీకు పింఛన్ వస్తోందా? సంగమ్మ: గతంలో పింఛన్ వచ్చేది. ఇప్పుడు వస్తలేదు. నా భర్త నన్ను వదిలేశాడు. నాకు పింఛన్ లేకపోతే ఎట్ల బతకాలె. ఎమ్మెల్యే: భర్త వదిలేసిన వారికి ఇప్పుడు పింఛన్ మంజూరు కాలేదు. మీలాంటి వారి గురించి ప్రభుత్వం ఆలోచిస్తున్నది. త్వరలోనే మీకు కూడా పింఛన్లు వచ్చే అవకాశం ఉంది. నీ వయసు 65 సంవత్సరాలు ఉంటే వద్ధాప్య పింఛన్ ఇప్పించే ఏర్పాటు చేస్తా. ఎమ్మెల్యే: ఏమమ్మ నీ పేరేంది. నీకు పింఛన్ వస్తోందా? వద్ధురాలు: నాపేరు శాంతమ్మ. నాకు పింఛన్ ఇస్తలేరు సారు. ఎమ్మెల్యే: గతంలో పింఛన్ ఇచ్చారా? శాంతమ్మ: గతంలో ఇచ్చారు. కానీ రెండు నెలల నుంచి రావడంలేదు. కార్యాలయాల చుట్టూ తిరిగినా అధికారులు పట్టించుకోవడంలేదు. ఎమ్మెల్యే: నీ సమస్య ఏమిటమ్మా? సాబేరాబీ: నా భర్త వదిలేసిండు. పింఛను ఇస్తలేరు. ఇల్లు లేదు. ముగ్గురు పిల్లలు చిన్నగున్నరు. నేనెట్ల బతకాలి. ఎమ్మెల్యే: పింఛన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నాక వస్తుంది. ఇళ్లు ఇప్పించే ఏర్పాటు చేస్తా. పిల్లలను హాస్టల్లో చదివస్తావా? సాబెరాబీ: ఊళ్లోనే చదివిస్తాను సార్. ఎమ్మెల్యే: సరేనమ్మ...బాగా చదివించు. నీ పేరేంటయ్య? సత్యనారాయణ: నా పేరు సత్యనారాయణ. ఎమ్మెల్యే: నీకు రేషన్ కార్డు ఉందా? సత్యనారాయణ: గులాబి కార్డు ఉంది. దాన్ని మార్చి తెల్లరేషన్ కార్డు ఇవ్వాలి. ఎమ్మెల్యే: తెల్లకార్డు ఎందుకు? సత్యానారాయణ: నేను ప్రైవేటు ఉద్యోగం చేస్తా. భూమిలేదు. అధికారులకు ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకున్నా తెల్లరేషన్ కార్డు ఇవ్వడంలేదు. ఎమ్మెల్యే: తహసీల్దార్‌కు చెప్పి నీకు తెల్లరేషన్ కార్డు ఇప్పించే ఏర్పాటు చేస్తా. ఎమ్మెల్యే: నువ్వు చెప్పన్నా ఇంకా ఊళ్లో ఏమి సమస్యలున్నాయి? మల్లారెడ్డి: నీటి సమస్య చాలా తీవ్రంగా ఉంది. చేతిపంపులే ఉన్నాయి. వాటిలో నీళ్లు ఎర్రగా వస్తున్నాయి. ఎమ్మెల్యే: నల్లాల ద్వారా నీరు సరఫరా చేస్తలేరా? మల్లారెడ్డి: బోర్లలో నీళ్లు ఎక్కువగా లేవు. బోర్లు వేసినా ధరి నిలబడక కూలిపోతున్నాయి. తాగునీటికైతే చాలా ఇబ్బంది పడుతున్నాం. ఎమ్మెల్యే: కొత్తగా బోర్లు వేయించి నీటి సమస్య తీరుస్తా. ఎమ్మెల్యే: నీవు చెప్పమ్మ సమస్యలేమున్నాయ్? మల్లమ్మ: మురుగు కాల్వలు సరిగా లేవు. ఉన్న మురుగు కాల్వల్లో చెత్తాచెదారం నిండిపోయింది. దోమలు, దుర్వాసనతో ఇబ్బంది పడుతున్నాం. ఎమ్మెల్యే: నీ సమస్య చెప్పమ్మా? శరీఫాబీ: రేషన్ సరుకులు సరిగా రావడంలేదు. 4 కిలోల బియ్యం ఇస్తే ఏం సరిపోతాయ్. ఎమ్మెల్యే: ఇప్పటి వరకు ఒక్కరికి నెలకు 4 కిలోల బియ్యం వచ్చేవి. జనవరి నుంచి ప్రభుత్వం ఒక్కరికి 6 కిలోల చొప్పున కుటుంబంలో ఎంత మంది ఉంటే అంత మందికి ఇస్తుంది. ఎమ్మెల్యే: అమ్మా.. నీకు ఇల్లు వచ్చిందా? అంజమ్మ: ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది. కట్టుకున్నాం. ఇప్పటి వరకు బిల్లు ఇవ్వలేదు. ఎమ్మెల్యే: బేస్మెంట్ బిల్లుకూడా ఇవ్వలేదా? అంజమ్మ: ఒక్క బిల్లుకూడా ఇవ్వలేదు. అప్పు చేసి ఇల్లు కట్టుకొని ఇబ్బంది పడుతున్నాం. ఎమ్మెల్యే: బిల్లులు తప్పకుండా వస్తాయమ్మా. నెల రోజుల్లో ఇళ్ల బిల్లులు వచ్చే అవకాశం ఉంది. ఎమ్మెల్యే: తమ్మీ ఏం సమస్యలున్నాయో చెప్పుతమ్మీ? గోవర్ధన్‌రెడ్డి: ఊళ్లో పశువైద్యశాల లేదు. పశువుల డాక్టర్ లేడు. పశువులకు ఏ రోగం వచ్చినా పక్కూరికి వెళుతున్నాం. ఎమ్మెల్యే: ఇప్పుడు నట్టల నివారణ కార్యక్రమం నడుస్తుంది. పశువైద్యులు వచ్చి గొర్రెలు, మేకలకు మందులు ఇస్తారు. అవన్నీ ఇప్పించండి. గ్రామంలో పశువైద్య ఉపకేంద్రం ఏర్పాటు చేసి డాక్టర్గాని, కాంపౌండర్గాని అందుబాటులో ఉంచేలా చూస్తాను. ఎమ్మెల్యే: గ్రామానికి బస్సు వస్తుందా? విఠల్: ఉదయం ఒక్కసారి బస్సు వస్తుంది. ఎమ్మెల్యే: ఒక్క ట్రిప్పే వస్తుందా? మరి సరిపోతుందా? విఠల్: ఒక్క ట్రిప్పు వస్తే ఊళ్లో నుంచి వెళ్లడానికి ఉంటుంది. మళ్లీ రావాలంటే ఎలా?. అందుకు ఇంకా మూడు ట్రిప్పులు బస్సు వస్తే బాగుంటుంది. ఎమ్మెల్యే: మరిన్ని ట్రిప్పులు బస్సు వచ్చేలా చూస్తాను. ఎమ్మెల్యే: అమ్మా.. నీ సమస్యేంది చెప్పు? నవీన: మా బాబు ప్రదీప్‌కు పుట్టినప్పటి నుంచే మాటలు రావడంలేదు. ఆరోగ్యశ్రీ పథకం కింద ఆపరేషన్ చేయించా. ఇప్పుడు ప్రభుత్వం ఆరోగ్యశ్రీలో ఇలాంటి ఆపరేషన్లు తీసేయాలని చూస్తుందంటున్నారు. వాటిని అలాగే కొనసాగిస్తే పిల్లలకు సహాయం అందుతుంది. ఎమ్మెల్యే: మీ బాబుకిప్పుడు మాటలు వస్తున్నాయా? నవీన: మాటలు రావడంలేదు. అందుకే పింఛన్ ఇవ్వాలని కోరుతున్నా. ఎమ్మెల్యే: సరేనమ్మ పింఛన్ ఇప్పించేలా చూస్తా. ఎమ్మెల్యే: ఇంకా ఏం సమస్యలున్నాయ్? రమేష్: 18 ఏళ్ల కింద మహాలింగపురం పంచాయతీ నుంచి విడిపోయి గాజులగూడ పంచాయతీ ఏర్పడింది. కానీ గ్రామ రెవెన్యూ మాత్రం వేరు చేయలేదు. దీంతో పంచాయతీకి ఆదాయం రావడంలేదు. ఎమ్మెల్యే: రెవెన్యూ భూములు గ్రామానికి కేటాయించే విధంగా చూస్తాను. ఎమ్మెల్యే: అన్నా నీ సమస్య ఏంది చెప్పు? కిష్టయ్య: నాకు ఎవరూ లేరు. ఒక్కన్నే ఉన్నాను. పింఛన్ రావడంలేదు. రేషన్ బియ్యం ఇస్తలేరు. ఎమ్మెల్యే: నీ ఆధార్ కార్డులో వయసు ఎంతుంది చూద్దాం. కిష్టయ్య: ఇదిగో చూడండి. ఎమ్మెల్యే: ఆధార్ కార్డులో నీ వయసు తక్కువగా ఉంది. అందుకే పింఛన్ రావడంలేదు. రేషన్ బియ్యం ఇప్పించే ఏర్పాటు చేస్తా. -
వీఐపీ రిపోర్టర్ : మల్కాజ్‌గిరీ ఎంపీ మల్లారెడ్డి
-
నీటి కష్టాలు తీరుస్తా..
బెల్లంపల్లి : వర్షాధార పంటలు సాగు చేస్తున్న రైతులు ఏటేటా ఎన్నో ఆటుపోట్లకు గురవుతున్నారు. ఒక సీజన్లో వర్షాలు సంమృద్ధిగా కురిస్తే మరో సీజన్లో చినుకు జాడ లేని పరిస్థితి ఎదురవుతోంది. చెరువుల్లో జల సిరి బోసిపోతోంది. నీరందక పంట పొలాలు బీళ్లుగా మారుతున్నాయి. నేల తల్లిని నమ్ముకున్న రైతుల పరిస్థితి ఏటేటా దయనీయంగా మారుతోంది. రైతుల సాగు నీటి కష్టాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేసింది ‘సాక్షి’. బెల్లంపల్లి మధ్య తరహా నీటిపారుదల శాఖ సూపరింటెండెంట్ ఇంజినీరు(ఎస్ఈ) సిరివోరు సునీల్ వీఐపీ రిపోర్టర్‌గా మారి.. బెల్లంపల్లి మండలం కన్నాల గ్రామాన్ని సందర్శించారు. అన్నదాతలతో నేరుగా మాట్లాడి వారి కష్టాసుఖాలు తెలుసుకున్నారు. రైతులతో ఎస్ఈ సంభాషణ ఇలా సాగింది.. ఎస్ఈ సునీల్ : అందరికీ నమస్కారం. రైతులు : నమస్కారం సార్... ఎస్ఈ : బాగున్నారా? రైతులు : ఏం బాగున్నం సారూ..! వానలు లేక, పంటలు పండకపాయే. పని లేకుండా ఖాళీగా ఉంటున్నం. ఎస్ఈ : ఓ.. పెద్దాయన ఏం పేరు నీది? రైతు : నా పేరు బామండ్లపల్లి రాజయ్య సారూ.. ఎస్ఈ: మీ ఊరిలో ఇరిగేషన్ చెరువు ఉందా? రాజయ్య : మా ఊళ్లున్న రాళ్లవాగు చెరువు ఇరిగేషన్ శాఖదే సారూ. ఎస్ఈ : ఓకే.. చెరువు కింద నీకు పొలం ఉందా? రాజయ్య : ఉన్నది సారూ. ఎస్ఈ : ఎన్ని ఎకరాల పొలం ఉంది? పంటలేమైనా సాగు చేస్తున్నావా? రాజయ్య : ఐదెకరాల పొలం ఉన్నది సారూ. నీళ్లు లేక ఈయేడు బీడు పోయింది. ఎస్ఈ : ఏటేటా ఏం పంట సాగు చేస్తున్నావు? రాజయ్య : చెరువు కింద అందరం వరి పంట ఏత్తం సారూ. ఎస్ఈ : నీ పేరేంది పెద్ద మనిషి? రైతు : అయ్యా.. నా పేరు ముక్క భీమయ్య సారూ.. ఎస్ఈ : నీకెంత పొలం ఉంది ? భీమయ్య : రెండెకరాలున్నది. నా పొలం సుత బీడుపోయింది సారూ. ఎస్ఈ : రైతుల కోసం ప్రభుత్వం చెరువులను పునరుద్ధస్తున్నది. ఈ సంగతి మీకు తెలుసా? భీమయ్య : మాకు తెల్వది. ఎవలు సుత చెప్పలేదు సార్. ఎస్ఈ : చెరువుల పునరుద్ధరణకుప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. పునరుద్ధరణ జరిగాక రైతులకు నీటి సమస్య ఉండదు. (భీమయ్యతో మాట్లాడుతుండగానే పక్కనున్న అక్కలకృష్ణ స్వామి అనే రైతు జోక్యం చేసుకుని మాట్లాడారు.) అక్కలకృష్ణ స్వామి : చెరువుల పునరుద్ధరణ అంటే ఏం చేత్తరు సారూ? ఎస్ఈ : మంచి ప్రశ్న వేశావు? ఏం పేరు నీది? అక్కలకృష్ణ స్వామి : నా పేరు అక్కల స్వామి. ఎస్ఈ : చెరువు కట్ట, అలుగును పునరుద్ధరిస్తారు. పంట పొలాలకు నీరు సరఫరా అయ్యే విధంగా కాలువల నిర్మాణం చేపడతారు. చెరువులో వరద నీరు వచ్చి చేరడానికి ఫీడర్ చానల్స్‌ల పనులు చేపడతారు. చెరువు భూగర్భంలో నిండుకొని ఉన్న పూడికను పూర్తిగా తొలగించి నీటి నిలువ సామర్థ్యాన్ని పెంచుతారు. ( మరో రైతు కల్పించుకుని మాట్లాడారు.) గడిగొప్పుల బానేశ్ : పూడిక మట్టిని ఎక్కడ పారబోస్తరు, పంట పొలాలల్ల పోసుకోవడానికి రైతులకు ఇత్తరా సార్. ఎస్ఈ : రైతుల భాగస్వామ్యంతోనే చెరువులను పునరుద్ధరిస్తారు. పూడిక తీసిన మట్టిని పంట పొలాల్లో పోసుకోవడానికి రైతులకే అవకాశం ఇస్తారు. పూడిక మట్టి వల్ల అనేక ప్రయోజనాలు కూడా ఉన్నాయి. రాజయ్య : ఆ మట్టితోని ఏం ఫాయిదా ఉంటది సారూ? ఎస్ఈ: చెరువులోని మట్టిని పంట పొలాల్లో పోసుకోవడం వల్ల భూసారం వృద్ధి చెందుతుంది. భూమిలో తేమ శాతం పెరుగుతుంది. అధిక దిగుబడి సాధించడంతో పాటు ఎరువుల వినియోగం తగ్గుతుంది. తద్వారా రైతుకు ఖర్చు కూడా తగ్గుతుంది. అక్కలకృష్ణ స్వామి : మా ఊరి చెరువు కట్ట గజం ఎత్తు, మత్తడి ఫీట్న్నర ఎత్తు పెంచి పూడిక తీయించాలే సారూ. ఎస్ఈ: మీరు కోరుకున్నట్టుగానే చెరువు పునరుద్ధరణ జరుగుతుంది. భీమయ్య : అది సరే సారూ. మత్తడి నుంచి ఒర్రె దాక నీళ్లు పోకుండా కట్ట ఏమైన కడ్తరా సారూ? ఎస్ఈ : తప్పకుండా, చుక్క నీరు కూడా వృథా పోకుండా చర్యలు తీసుకుంటారు. అక్కల కృష్ణ స్వామి : చెరువు శిఖం భూమి కబ్జా అయింది. ఆ భూమి మళ్ల చెరువుల కలుపుతరా సారూ? ఎస్ఈ : శిఖం భూమి ఎంత కబ్జాకు గురైంది? అక్కలకృష్ణ స్వామి : దాదాపు 50 ఎకరాల దాక కబ్జా చేసుకున్నరు. ఎస్ఈ: కబ్జా అయిన శిఖం భూమి సర్వే చేసి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది. అక్కలకృష్ణ స్వామి : గట్లైతే మంచిదే సారూ. ఎస్ఈ: మొత్తం చెరువు ఆయకట్టు ఎంత, ఇప్పుడు ఎన్ని ఎకరాల భూమి సాగవుతున్నది? (అప్పటికే అక్కడ చేరుకున్న గోళ్ల బాలమల్లు అనే రైతు మాట్లాడుతూ) బాలమల్లు : చెరువు కింద 360 ఎకరాల ఆయకట్టు మా తాతలప్పుడు సాగయ్యేది. ఇప్పుడది 60 ఎకరాల దాక నీరందిస్తంది సారూ. ఎస్ఈ : అలాగా? మరి నీటి తీరువా(భూమి శిస్తు) కడుతున్నారా? రాజయ్య : కడుతున్నం సార్. ఎస్ఈ : ఎన్ని ఎకరాలకు శిస్తు కడుతున్నారు? రాజయ్య : నేను నీటి సంఘం మాజీ చైర్మన్‌ను కూడా సారూ. ఇప్పుడు ఎంత భూమి సాగవుతందో గంతకే శిస్తు కడుతున్నం. గడిగొప్పుల బానేశ్ : బెస్తోళ్లు చెరువుల చేపలేసి పంట పొలాలకు నీళ్లు రాకుండా జేత్తండ్లు సారూ. ఎస్ఈ : అలా చేయకూడదు కదా. మీరేం అడగలేదా? గడిగొప్పుల బానేశ్ : అడిగినం సార్. చేపలు పెంచుకోవడానికి సర్కారుకు పన్ను చెల్లించిండ్లట. గందుకని బెస్తోళ్లు ఆగుతలేరు సారూ. ఎస్ఈ : చెరువుల్లో నీటి నిలువ సామర్థ్యం ఉంటే మత్స్యకారులు చేపలు పెంచుకోవడానికి వీలుంది. కాని పంట పొలాలకు నీటి సరఫరా జరగకుండా అడ్డుకునే హక్కు వారికి లేదు. ఓకే మరి... వెళ్లొస్తా. రైతులు : మంచిది సారూ... -
బూర నర్సయ్య హామీలు..
ఇంద్రానగర్.. యాచారం మండలంలోని గునుగల్ గ్రామానికి అనుబంధ నివాస ప్రాంతం. అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్న ఈ పల్లె అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. జిల్లాలోని ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని యాచారం మండలం భువనగిరి లోక్‌సభ స్థానం పరిధిలోకి వస్తుంది. స్థానిక ఎంపీ బూర నర్సయ్య గౌడ్ ‘సాక్షి వీఐపీ రిపోర్టర్’గా గ్రామానికి వచ్చి స్థానికుల సమస్యలను తెలుసుకున్నారు. పెద్దాయనా.. పెద్దమ్మా.. చెల్లీ.. అంటూ ప్రతి ఒక్కరినీ పలకరిస్తూ గ్రామమంతా కలియతిరిగారు. అడుగడుగునా ఆయనకు సమస్యలే ఎదురయ్యాయి. పింఛన్లు, ఆహార భద్రతా కార్డుల గురించి అనేకమంది మొరపెట్టుకున్నారు. అందరి సమస్యలనూ సావధానంగా విన్న ఆయన ఇంద్రానగర్‌లోని ప్రతి సమస్యనూ తెలుసుకున్నానని, వీలైనంత త్వరగా వాటికి పరిష్కారం చూపుతానని మాటిచ్చారు. బూర నర్సయ్య హామీలు.. మహానగరానికి యాచారం మండలం దగ్గర్లోనే ఉంది. కానీ ఎక్కడా అభివృద్ధి జాడ కన్పించడం లేదు. ఇక్కడి కాలనీలో పాఠశాల ఏర్పాటు చేయిస్తా. సీసీ రోడ్డు, డ్రైనేజీ కాల్వల నిర్మాణానికి నిధులు కేటాయిస్తా. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఆహారభద్రతా కార్డులు అందిస్తాం. రేషన్ కార్డుల్లో వయసు తక్కువగా రావడం వల్ల కొందరికి పింఛన్లు రావడం లేదని తెలిసింది. వారందరికీ పింఛన్లు అందేలా చూస్తా. ప్రజలు ఆందోళన చెందాల్సిన పనిలేదు. అందరికీ సంక్షేమ పథకాలు అందుతాయి. ఎంపీ: పెద్దాయనా నీ పేరేంటి..పింఛన్ మంజూరైందా? వికలాంగుడు: నా పేరు రాంచంద్రయ్య. ప్రమాదంలో కాళ్లు దెబ్బతిన్నాయి. నాకు పింఛన్ రాదంటున్నారు. ఎంపీ: నీవు నడవలేకున్నావు గదా .. ఎందుకు పింఛన్ రాదంటున్నారు. కచ్చితంగా వచ్చేలా చూస్తా.. ముందు అర్జీ పెట్టుకో. ఎంపీ: నీ సమస్య ఏమిటో చెప్పు? శంకరయ్య: సర్ .. నేను గడ్డమల్లయ్యగూడలో స్థలం కొనుగోలు చేశాను. అక్కడి పంచాయతీ వారు ఇంటి అనుమతులు ఇవ్వడం లేదు. ఎంపీ: అలా ఇబ్బంది పెట్టే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచిస్తా. ఎంపీ: తమ్ముడూ ఏంపని చేస్తున్నావ్? రాజు: కూలీ పనులు చేసుకొని జీవనోపాధి పొందుతున్నాం. మా కాలనీలో కరెంట్ తీగలు భయాందోళన కలిగిస్తున్నాయి. ఎంపీ: సర్పంచ్ మల్లికార్జున్‌ను పిలిచి .. విద్యుత్ అధికారులకు నేను చెప్పినట్లు చెప్పి వెంటనే తీయించు. ఎంపీ: ఏం పెద్దమ్మ బాగున్నావా? లక్ష్మమ్మ: ఏం బాగున్నాం సార్.. పింఛన్ పెంచినట్లు చెప్పిన్రు గానీ ఇంత వరకూ ఇయ్యలే. ఎంపీ: వస్తది పెద్దమ్మ ఆందోళన వద్దు. రూ. 1000 వస్తుంది. ఇబ్బంది ఉండదు. ఎంపీ: ఏమ్మా ఏం పేర్లు మీవి, ఏం చదువుతున్నారు? విద్యార్థినులు: సార్ మా పేర్లు జ్యోతి, అరుంధతి. డిగ్రీ, ఇంటర్ చదువుతున్నాం. ఎంపీ: ఉన్నత చదువులు చదవండి. చదువుకుంటేనే భవిష్యత్తు ఉంటుంది. రిజర్వేషన్లు ఉపయోగించుకొని ఉద్యోగాలు పొందండి. విద్యార్థినులు: సరే సార్. ఎంపీ: చెల్లి నీ కష్టమేంటి? మైసమ్మ: నా భర్త కొన్ని నెలల క్రితం ప్రమాదంలో మరణించాడు. ఇంత వరకు పరిహారం రాలేదు. పిల్లల పోషణ కష్టంగా మారింది. ఎంపీ: సర్పంచ్‌ను పిలిచి .. పేరు నమోదు చేసుకొని, వివరాలు తెలుసుకో .. న్యాయం జరిగేలా చూద్దాం. ఎంపీ: ఏం తమ్ముడు ఏం పేరు? మల్లేష్ : నా పేరు మల్లేష్. ఈ కాలనీలో 30 మంది చిన్నారులు ఉన్నారు. పాఠశాల లేకపోవడంతో రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న గునుగల్‌కు వెళ్లి చదువుకుంటున్నారు. ఎంపీ: అదేంటి పాఠశాల లేదా..! వెంటనే నిర్మాణానికి ఉన్నతాధికారులతో మాట్లాడతా. ఎంపీ: వికలాంగ పింఛన్ వస్తుందా? వికలాంగుడు: సార్ నా పేరు అంజయ్య. నాకు పింఛన్ మంజూరైంది. నాలాంటి వాళ్లు మండలంలో వందలాది మంది ఉన్నారు. వికలత్వ పరీక్షల కోసం నగరానికి వెళ్లాల్సి వస్తోంది. దగ్గరలోనే శిబిరం ఏర్పాటయ్యేలా చూడండి. ఎంపీ: వైద్యాధికారులతో మాట్లాడి, ఇబ్రహీంపట్నంలో శిబిరం ఏర్పాటయ్యేలా చూస్తా. ఎంపీ: ఏం పెద్దమ్మ నీ సమస్య ఏమిటి? పెంటమ్మ: నాకు 80 ఏళ్లకు పైనే ఉన్నాయి. నా కొడుకు కళ్లులేని వాడు. ఇద్దరికీ పింఛన్ మంజూరు కాలేదు. కష్టంగా ఉంది.. ఒక్కోసారి చచ్చిపోవాలి అనిపిస్తోంది. ఎంపీ: అలా వద్దు.. కచ్చితంగా ఇద్దరికీ పింఛన్ వచ్చేలా చేస్తా. ఎంపీ: ఏమ్మా మీ బాధలేంటి? శాంత : ఇక్కడ పాఠశాల లేదు. కానీ ఇంద్రానగర్ పాఠశాల పేరు మీద టీచర్ ఉంది. మా చిన్నారుల ఇబ్బందులను పట్టించుకోండి. ఎంపీ: పిల్లల ద్వారా కూడా తెలుసుకున్నా. కచ్చితంగా చర్యలు తీసుకుంటా. ఎంపీ: తాగునీరు వస్తోందా? చైతన్య: మూడురోజులకోసారి వస్తున్నాయి సార్. కాలనీలో డ్రైనేజీ సమస్య, దోమలతో ఇబ్బందులు పడుతున్నాం. ఎంపీ: స్వయంగా చూశా.. సమస్యలు పరిష్కరిస్తా. ఎంపీ: ఏమ్మా నీకొచ్చిన కష్టం? ప్రేమలత: నాపేరు ప్రేమలత. అంగన్వాడీ ఉద్యోగిని. మాకు జీతాలు సరిపోవడం లేదు సార్. ఎంపీ: ప్రభుత్వం కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందించేలా కృషి చేస్తోంది. అప్పుడు మీలాంటి ఉద్యోగులకు ప్రాధాన్యం పెరుగుతుంది. ఎంపీ: ఏం రైతన్న వ్యవసాయం ఎలా సాగుతోంది? రాజేందర్‌రెడ్డి: ఏం వ్యవసాయం సార్. వర్షాల్లేక బోరుబావుల్లో భూగర్భ జలాలు లేవు. కొద్దిపాటి నీళ్లతో ఒకటి, రెండు మడులు పండిస్తున్నాం. ఎంపీ: ఆందోళన వద్దు రాబోయే రోజుల్లో ఇబ్రహీం పట్నంకు సాగునీరు వచ్చే అవకాశం ఉంది. ఎంపీ: మీకేం సమస్యలున్నాయి? రవీందర్: 15 ఏళ్ల క్రితం గ్రామంలో ఉన్న కృష్ణాజలాల రిజర్వాయర్‌కు మా భూములిచ్చాం. అప్పట్లో అందులో పని కల్పిస్తామన్నారు. కొంతమంది పనిచేస్తున్న కార్మికుల ఉద్యోగాలకు కూడా భరోసా లేకుండా పోయింది. ఎంపీ: నష్టపరిహారం ఇచ్చారు గదా.. వాటర్‌వర్క్స్ అధికారులతో మాట్లాడి న్యాయం జరిగేలా చూస్తా. ఎంపీ: తమ్ముడూ నీది ఇదే ఊరా? నర్సింహ: అవును సార్.. ఎస్సీ ప్రణాళిక కింద దళితవాడలు అన్ని విధాలా అభివృద్ధి చెందుతాయన్నారు. పైసా నిధులు మంజూరు కావడం లేదు. ఎంపీ: దళితవాడల్లో అన్ని విధాలా అభివృద్ధి జరిగేలా ప్రభుత్వం కృషి చేస్తోంంది. బడ్జెట్లో రూ.50 వేల కోట్లకు పైగా నిధులు కేటాయించాం. నర్సింహ: సార్.. మా గ్రామంలో నాటుసారా విక్రయాలు జరుపుతున్నారు. తాగి రోగాల బారిన పడుతున్నారు? ఎంపీ: మీరే చైతన్యం కావాలి. నష్టపోతున్న కుటుంబాల ఇబ్బందులు తెలుసుకొని, నివారణ చర్యలు తీసుకోవాలి. కృష్ణ:సార్.. వచ్చే రేషన్ బియ్యం సరిపోవడం లేదు? ఎంపీ: బియ్యం పెంపుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రతి మనిషికి ఆరు కిలోల చొప్పున ఇచ్చే అవకాశం ఉంది. కుంటి మల్లేష్: విద్యార్థులు చాలా దూరం నడిచి వెళ్తున్నారు. సైకిళ్లు పంపిణీ చేస్తే బాగుంటుంది? ఎంపీ: సైకిళ్లు కాదు.. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అమలు కాగానే మినీ బస్సుల ఏర్పాటుకు ప్రభుత్వం కృషి చేస్తుంది. రామకృష్ణ యాదవ్: ఇక్కడి ఎంపీటీసీ సభ్యుడ్ని. గ్రామంలో డ్రైనేజీ కాల్వల కోసం నిధులు మంజూరయ్యేలా చూడండి. ఎంపీ: గ్రామం పరిస్థితులు చూస్తున్నా.. తప్పకుండా నిధులు మంజూరయ్యేలా కృషి చేస్తా. రాజు: మాది గునుగల్ ఎస్సీ కాలనీ. మాకు ఇంతవరకూ కృష్ణా జలాలు రావడం లేదు. గ్రామంలో రిజర్వాయర్ ఉన్నా దాహార్తి తీరడం లేదు. ఎంపీ: వెంటనే సర్పంచ్‌ను పిలిచి .. తాగునీటి సమస్య లేకుండా చూడు. పైపులైన్ అవసరమైతే ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో మాట్లాడుతా. ఎంపీ: సర్పంచ్ చూశారుగా.. దళిత కాలనీలో ఎన్ని సమస్యలున్నాయో. ఓ రోజు నా వద్దకు రండి.. ఆయా శాఖల అధికారులతో మాట్లాడి పరిష్కరించేలా కృషి చేస్తా. సర్పంచ్: సరే సార్.. మీరు మా గ్రామానికి వచ్చినందుకు కృతజ్ఞతలు. -
ఆందోళన వద్దు
‘‘పింఛన్ల కోసం గందరగోళం వద్దు. అర్హులందరికీ పింఛన్ల పంపిణీ జరుగుతుంది.అధికారులు జాబితాలు సిద్ధం చేస్తున్నారు. ఎవ్వరికీ అన్యాయం జరుగదు’’ జిల్లా పరిషత్ సీఈఓ రాజారాం లబ్ధిదారులకు ఇచ్చిన భరోసా ఇది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా ప్రవేశపెట్టిన ఆసరా పథకం వృద్ధులను, వితంతువులను, వికలాంగులను అయోమయానికి గురి చేస్తోంది. పల్లె, పట్టణం, నగరం అనే తేడా లేకుండా లబ్ధిదారులు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఇప్పటికే అధికారులు ఒక జాబితా విడు దల చేశారు. అందులో పేరు లేని వారు ధర్నాలు, ఆదోళనలకు దిగుతున్నారు. ఈ నేపథ్యంలో జడ్పీ సీఈఓ రాజారాం ‘సాక్షి’ వీఐపీ రిపోర్టర్‌గా మాక్లూర్ మండల పరిషత్ కార్యాలయం వద్ద పింఛన్‌దారులను పలకరించారు. వారితో మాట్లాడి కష్టసుఖాలను ఆరా తీశారు. వారికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. సీఈఓ : ఏమమ్మా బాగున్నావా...ఎక్కడి నుంచి వచ్చినవు? జకినీబాయి : బాగున్నాను సారూ...నేను మానిక్‌భండార్ నుంచి వచ్చిన. సీఈఓ : ఇక్కడికి ఎందుకు వచ్చినవు, నీ సమస్య ఏమిటి? జకినీబాయి : పింఛన్ రావడం లేదు సారూ. ఇంతకు ముందు ఇచ్చిండ్రు. ఇప్పుడు ఇస్తలేరు. దరఖాస్తు చేసుకునేందుకు ఇక్కడికి వచ్చిన. పింఛన్ వస్తదా మరి. సీఈఓ : ఏ పింఛన్ కోసం వచ్చినవు? జకినీబాయి : నాకు భర్త లేడు. వితంతు పింఛన్ కావాలె. సీఈఓ : ఎంపీడీఓ గారూ ఈమె దరఖాస్తు తీసుకున్నారా? ఎంపీడీఓ : తీసుకున్నం సార్. సోను : సారూ... పింఛన్ల జాబితాలో నా పేరు లేదు. పింఛన్ ఆగిపోయింది. ఎట్ల సారూ! సీఈఓ : జాబితాలో పేరు లేదా. ఎంపీడీఓగారు పరిశీలిస్తారు. పింఛన్ వచ్చేలా చూస్తరు. సారుని కలువు. బాల్యనాయక్ : సారూ...ఎన్నిసార్లు తిరిగినా నాకు పింఛన్ రావడం లేదు. సార్లు ఏమోమో చెపుతాండ్రు. నేనెట్ల బతుకాలే? సీఈఓ : చూడు పెద్దాయనా, నీ వయసు ఎంత, నీకు ఏ పింఛన్ వస్తాంది. కాగితాలు చూపించు? బాల్యనాయక్ : ఇదిగో సారూ...ఆధార్‌కార్డు, ఓటర్‌కార్డు ఉంది. అన్ని ఉన్నాయి. కాని పింఛన్ రావడం లేదు. ఎంపీడీఓ : గుర్తింపు కార్డులో ఈయన వయస్సు తక్కువగా పడింది సార్. దీంతో పరిశీలనలో దరఖాస్తును తిరస్కరించారు. సీఈఓ : గుర్తింపు కార్డులో నీ వయస్సును సరిచేసుకో. అప్పుడు నీకు పింఛన్ వచ్చే అవకాశం ఉంటుంది. గంగారాం (వికలాంగుడు) : సారూ...నాకు నడవడం చేతకాదు. పని చేయలేను. పింఛన్ ఇస్తే ఆసరాగా ఉంటుంది. సీఈఓ : (గంగారాంను పరిశీలిస్తూ) నీకు కాలు పుట్టుకతో ఇలాగే ఉందా? లేకపోతే ఏమైన ప్రమాదం జరిగిందా? గంగారాం : ప్రమాదం జరిగింది సారూ. సీఈఓ : ప్రమాదం జరిగితే పింఛన్ రాదు కదా....సరే పరిశీలిస్తాం. దేవిలీ : మా ఇంటికి సార్లు వచ్చిండ్రు..పేర్లు రాసుకొని పోయిండ్రు. జాబితాలో మాత్రం మా పేర్లు లేవు. సీఈఓ : ఇంతకూ నీకు రావాల్సిన పింఛన్ ఏంది? దేవిలీ : ముసలోల్లకు వచ్చే పింఛన్ కావాలె సారూ! ఎంపీడీఓ : (దేవిలీ దరఖాస్తును, గుర్తింపు కార్డు ను పరిశీలిస్తూ) వయస్సు తక్కువగా ఉంది సార్. అందుకే ఈమెకు పింఛన్ రావడం లేదు. సీఈఓ : నీకు భర్త లేడన్నవు కదా... వితంతు పింఛన్ కోసం దరఖాస్తు చేసుకో పింఛన్ వస్తుంది. భూదేవి : నాకు వితంతు పింఛన్ రావడం లేదు. ఎంపీడీఓ : ఈమె గుర్తింపు కార్డులో మహిళ బదులు. పురుషుడని నమోదైంది అందుకే వితంతు పింఛన్ నిలిపివేశారు. సీఈఓ : నీ గుర్తింపు కార్డులో మార్పులు చేసుకొని తీసుకవస్తే పింఛన్ వస్తది. ముత్తన్న : నాకు వచ్చే పింఛన్ రావడం లేదు. సీఈఓ : నీ వద్ద ఉన్న కాగితాలు చూపించు. ముత్తన్న : (కాగితాలు చూపెడుతూ) ఇదిగో సారూ...రేషన్ కార్డు, ఆధార్ కార్డు ఉన్నయి సీఈఓ : నీకు వయస్సు తక్కువగా ఉంది కదా. నీకు ఎంత మంది పిల్లలు, వారేం చేస్తరు? ముత్తన్న : 12వ తరగతి చదివిండ్రు. పనులు చేసుకుంటాండ్రు. సీఈఓ : నీకు ఏ సంవత్సరంలో పెళ్లి అయిందో గుర్తుందా? ముత్తన్న : నాకు ఇద్దరు పెళ్లాలు సారూ. మొదటామెను ఎప్పుడో వదిలేసిన. ఇప్పుడు రెండో ఆమెతో ఉంటున్న. ఒక కొడుకు, ఒక కూతురు ఉన్నరు. సీఈఓ : సరే నీ గుర్తింపు కార్డు పరిశీలించి చూస్తాం. సురేష్ (వికలాంగుడు) : నాకు సదరం సర్టిఫికెట్ ఉంది. ఆరు నెలలు పింఛన్ వచ్చింది. అప్పటినుంచి మల్ల రాలే. 80 శాతం వికలాంగత్వం ఉంది. సీఈఓ : సదరం సర్టిఫికెట్ చూపించు. సురేష్ : ఇప్పుడు తీసుకరాలేదు సార్. ఇంటి వద్దనే ఉంది. సీఈఓ : సర్టిఫికెట్లు అన్ని తీసుకవచ్చి ఎంపీడీఓ సార్‌ను కలువు. విజయ : నా భర్త చనిపోయి పదకొండు సంవత్సరాలైతాంది. వితంతు పింఛన్ ఇవ్వడం లేదు ఎంపీడీఓ : ఈమె దరఖాస్తు లైఫ్‌స్టైల్ పరిశీలనలో తిరస్కరణకు గురైంది. సీఈఓ : మీకు భూములు ఉన్నాయి కదా! మరీ పింఛన్ అడిగితే ఎట్లా? విజయ : మాకు ఎవరూ లేరు సార్. మేము ఎట్ల బతకాలే! నాగమణి : రేషన్ షాపులో బియ్యం తక్కువగా ఇస్తున్నారు సర్. ఎన్నిసార్లు చెప్పిన వినడం లేదు. సీఈఓ : నీవు ఎక్కడి నుంచి వచ్చినవు? నీకు రేషన్‌కార్డు ఉందా? దానికి ఆధార్ కార్డు ఇచ్చినవా? నాగమణి : మాది మాదాపూర్ సార్. ఆధార్ కార్డులు అధికారులకు ఇచ్చిన. సీఈఓ : సరేనమ్మా...ఒకసారి రెవెన్యూ అధికారులతో మాట్లాడు. రమేశ్ : సర్ మా ఊరిలో మురికికాలువలు శుభ్రం చేయడం లేదు సర్. సీఈఓ : మీ ఊరి పేరు ఏమిటి? రమేశ్ : మానిక్‌భండార్ సార్. సీఈఓ : ఎంపీడీఓ గారూ ఒకసారి సంబంధిత అధికారితో మాట్లాడండి. -
పింఛన్ వస్తుందా?
‘హైదరాబాద్ నగరానికి సురంగల్ సమీపంలో ఉన్నప్పటికీ ఆశించినంతగా అభివృద్ధి చెందలేదనేది వాస్తవం. ఉపాధ్యాయుడి నియామకం, రైతుల పొలాల వద్దకు ఫార్మేషన్ రోడ్లు, జిల్లా పరిషత్ నిధుల నుంచి గ్రామాలను కలిపే అప్రోచ్ రోడ్లు, అంగన్వాడీ భవనం, విద్యార్థుల సమయానికి అనుగుణంగా అదనంగా బస్సులను వేయించడం, రోడ్ల రీ బీటీకి నిధులు కేటాయిస్తా. అర్హులందరికీ పింఛన్లు, రేషన్‌కార్డులు ఇప్పించడానికి ప్రయత్నిస్తా. ఇళ్లులేని వారికి కొత్త ఇళ్లను మంజూరు చేయిస్తా. త్వరలోనే అంగన్వాడీ భవనాన్ని మంజూరు చేయిస్తా. నా దృష్టికి తీసుకువచ్చిన ప్రతి సమస్యనూ అధికారులతో మాట్లాడి పరిష్కరించడానికి కృషిచేస్తా.’ అవ్వా.. బాగున్నావా.. తాతా పింఛన్ వస్తోందా.. అంటూ పలకరింపులు. పిల్లలూ.. మధ్యాహ్నం భోజనం సరిగా పెడుతున్నారా.. అంటూ వాకబు. గ్రామమంతా కలియతిరుగుతూ సమస్యలన్నీ నోట్ చేసుకుంటూ జెడ్పీ చైర్పర్సన్ సునీతామహేందర్‌రెడ్డి మొయినాబాద్ మండలం సురంగల్ గ్రామవాసులతో మమేకమయ్యారు. ‘సాక్షి వీఐపీ రిపోర్టర్’గా గ్రామంలో అడుగుపెట్టిన ఆమెకు అడుగడుగునా సమస్యలే స్వాగతం పలికాయి. ప్రజల నుంచి ఆమె పలు వినతులు స్వీకరించారు. గ్రామంలోని పాఠశాల నుంచి మొదలుకుని వృద్ధుల పింఛన్ల వరకు.. అన్ని సమస్యలనూ సావధానంగా విన్న ఆమె.. వాటన్నింటి పరిష్కారానికి కృషి చేస్తానని మాటిచ్చారు. చైర్పర్సన్: అవ్వా నీ పేరేంది.. పింఛన్ వస్తుందా? వృద్ధురాలు: నా పేరు పోచమ్మ. ఇంతకుముందు పింఛన్ వచ్చేది. మధ్యలో ఆగిపోయింది. చైర్పర్సన్: ఎందుకు ఆగిపోయింది.. అధికారులను అడిగావా? పోచమ్మ: చాలాసార్లు అడిగానమ్మా.. ఎందుకు ఇస్తలేరో వాళ్లేం చెప్తలేరు. నువ్వయినా చెప్పి పింఛన్ ఇప్పించమా.. చైర్పర్సన్: అమ్మా బాగున్నవా.. ఏం సమస్యలున్నాయి? విజయలక్ష్మి: బాగున్న మేడమ్. గ్రామానికి కొంత దూరంలో ఉన్న కాలనీలో నీటి సమస్య ఉంది. పైపులైన్లు సరిగాలేవు. వాటర్‌ట్యాంకు లేదు. కాలనీలో రోడ్డు కూడా సరిగా లేదే. చైర్పర్సన్: నువ్వు చెప్పమ్మా. రేషన్ సరిగా ఇస్తున్నారా? రాములమ్మ: నాకు రెండు కాళ్లు నడవడానికి రావు. అంబాడుతూ నడుస్తా. మూడు నెలల నుంచి రేషన్ బియ్యం ఇస్తలేరు. ఆధార్ కార్డు లింకు కాలేదంటున్నరు. ఆధార్ కార్డు జిరాక్స్ ఇచ్చిన. అయినా రేషన్ బియ్యం ఇస్తలేరు. చైర్పర్సన్: అధికారులకు చెప్పి రేషన్ బియ్యం ఇప్పించే ఏర్పాటు చేస్తా. మరి నీకు పింఛన్ వస్తుందా? రాములమ్మ:ఐదు వందలు వస్తుందమ్మా. ఇప్పుడింకా రాలేదు. చైర్పర్సన్: ఇప్పటినుంచి ఎక్కువొస్తుంది. అధైర్యపడకు. ఆ.. పెద్దాయనా.. నీపేరేంది? పెద్దాయన: వెంకట్‌రెడ్డి చైర్పర్సన్: వ్యవసాయానికి కరెంటు ఎలా వస్తోంది? వెంకట్‌రెడ్డి: అమ్మా రోజుకు ఆరు గంటలు ఇస్తున్నామంటున్నరు. కాని అది రాత్రి సగం, పగలు సగం ఇవ్వడంతో పంటలకు నీళ్లు పారపెట్టలేకపోతున్నం. చైర్పర్సన్: పంటలు ఎండుతున్నాయా? వెంకట్‌రెడ్డి: వర్షాలు సరిగా పల్లేదు. ఇప్పుడు కరెంటు సరిగా లేక పంటలు ఎండుతున్నయి. చైర్పర్సన్: మరి కరెంటు బిల్లులు సరిగా కడుతున్నారా? వెంకట్‌రెడ్డి: వ్యవసాయ బోర్ల సర్వీస్ చార్జీలను ఇంటి బిల్లులతో కలిపే వేస్తున్నారు. ఆ బిల్లులు చెల్లిస్తున్నాం. కానీ ఇచ్చే ఆరు గంటల కరెంటు ఒకే సమయంలో నిరంతరాయంగా ఇస్తే మంచిది. చైర్పర్సన్: అన్నా.. నువ్వుజెప్పు ఏం సమస్యలున్నయ్? నర్సింహ: గ్రామంలో చాలా సమస్యలున్నాయమ్మా. అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ సరిగాలేదు. మొయినాబాద్- సురంగల్ రోడ్డు పూర్తిగా గుంతలు పడింది. రోడ్డుపై వాహనాలు నడపలేని పరిస్థితి ఉంది. చైర్పర్సన్: చెప్పండి ఇంకా ఏమి సమస్యలున్నాయి? జైపాల్‌రెడ్డి: మా ప్రాంతంలో రైతులకు ప్రధాన సమస్య 111 జీఓ. ఈ జీఓ వల్ల మా భూములకు విలువ లేకుండా పోయింది. పక్కనే ఉన్న రాజేంద్రనగర్ మండలంలో భూములు కోట్ల విలువ చేస్తుంటే. ఇక్కడ మాత్రం కనీసం 5 లక్షలు కూడా ధరలేదు. చైర్పర్సన్: ఈ సమస్యను చాలా రోజులుగా ఎదుర్కొంటున్నట్టున్నారు? జైపాల్‌రెడ్డి: ఇంచుమించు ఇరవై ఏళ్లుగా ఈ జీఓ సమస్య ఉంది. చైర్పర్సన్: ఏం పాపా నీ కళ్లు కనిపించవా? సువర్ణ: మేడమ్ నా కళ్లు కనిపించవు. నాకు పింఛన్ సరిగా ఇస్తలేరు. ఒక నెల ఇస్తే రెండు మూడు నెలలు ఆపేస్తున్నారు. చైర్పర్సన్: కళ్లు ఎప్పుడు, ఎలా పోయాయి.. చదువుకున్నావా? సువర్ణ: 9వ తరగతి వరకు చదివాను. 9వ తరగతిలోనే బెంచీ తగిలి కన్నుపోయింది. ఆపరేషన్ చేశారు. అయినా చూపురాలేదు. చైర్పర్సన్: ఆస్పత్రిలో ఇచ్చిన రిపోర్టులున్నాయా.. పింఛన్‌కోసం మళ్లీ దరఖాస్తు చేసుకున్నావా? సువర్ణ: ఆస్పత్రిలో రిపోర్టులు ఏమీ ఇవ్వలేదు. పింఛన్‌కోసం దరఖాస్తు చేసుకున్నా. ఇప్పుడైనా వస్తుందా? చైర్పర్సన్: తప్పకుండా నీకు పింఛన్ వచ్చే విధంగా చూస్తానమ్మా. బాబు నీవు చెప్పు సమస్యలేమున్నయ్? ఎండీ.షఫీ: ఆఫీసుల్లో లీడర్లు చెబితేనే పనులవుతున్నాయి. ప్రజలు స్వయంగా వెళ్లి అడిగితే అధికారులు పనులు చేయడంలేదు. మొన్ననే బాలల దినోత్సవం జరుపుకొన్నాం. పాఠశాలల్లో చదివే పిల్లలకే బాలల దినోత్సవమా? హోటళ్లు, కిరాణ షాపులు, మెకానిక్ షాపులు, రోడ్లపై చెత్త కాగితాలేరుకునే పిల్లలకు బాలల దినోత్సవం లేదా? ఈ పిల్లలందర్నీ అధికారులు పట్టించుకోకపోవడంతో వాళ్లు బాల కార్మికులుగానే మిగులుతున్నారు. చైర్పర్సన్: అలాంటి వారిని హాస్టళ్లలో చేర్పించి చదివిం చేలా అధికారులకు చెప్తాను. ఇంకా ఏం సమస్య ఉంది? ఎండీ.షఫీ: మైనార్టీలకు శ్మశానవాటిక లేదు. చైర్పర్సన్: మైనార్టీ వె ల్ఫేర్ నుంచి ఏర్పాటు చేయిస్తాం. నువ్వు చెప్పమ్మ.. అందరూ మరుగుదొడ్లు నిర్మించుకున్నారా? మరుగుదొడ్లు నిర్మించుకుంటే ప్రభుత్వం రూ.9 వేలు ఇస్తుంది. సునీత: కొంతమంది కట్టుకున్నారు. రెండు గుంతలు తీసి మరుగుదొడ్డి కడితేనే పైసలు వస్తయంటున్నారు. జాగలు లేక శానమంది ఒక గుంతనే తీస్తున్నారు. చైర్పర్సన్: తమ్ముడూ ఇంక ఏమి సమస్యలున్నాయో నువ్వు చెప్పు? రాజు: ఎస్సీ శ్మశానవాటిక వద్ద బోరు, ట్యాంకు లేదు. సు రం గల్- అమ్డాపూర్, సురంగల్- నజీబ్‌నగర్ గ్రామాలకు లింకురోడ్డు వేస్తే రైతులకు అందరికీ ఉపయోగంగా ఉంటుంది. చైర్పర్సన్: జిల్లా పరిషత్ నిధుల నుంచి రెండు లింకురోడ్డులకు ఐదు లక్షల చొప్పున ఇస్తాం. అదే విధంగా శ్మశానవాటిక వద్ద బోరు, వాటర్‌ట్యాంక్ ఏర్పాటు చేయిస్తాం.చెప్పమ్మా నీవేం చేస్తున్నావ్? శోభ: 9నెలల క్రితం నా భర్త చనిపోయాడు మేడమ్. చిన్న పిల్లలున్నారు. నాకు ఏదైనా పని ఇప్పించండి మేడమ్. చైర్పర్సన్: ఏం పనిచేస్తావ్? శోభ: ఏ పనైనా చేస్తాను మేడమ్. చైర్పర్సన్: హౌస్‌కీపింగ్ పని చేస్తావా? శోభ: చేస్తాను మేడమ్. చైర్పర్సన్: పాప నువ్వుచెప్పు మీ స్కూల్లో ఏం సమస్యలున్నాయి? లావణ్య: ఒక్క సారే ఉన్నడు. ఇంక ఇద్దరు టీచర్లు కావాలి. స్కూల్లో తాగడానికి నీళ్లులేవు. బాత్రూంలు లేవు. ప్రహరీ కూలిపోయింది. చైర్పర్సన్: పాఠశాల ప్రహరీ నిర్మాణానికి రూ.2 లక్షలు ఇస్తాం. టీచర్లను ఏర్పాటు చేస్తాం. నువ్వు ఏం చదువుతున్నావు పాపా? అఖిల: ఐదో తరగతి చదువుతున్నా మేడమ్. చైర్పర్సన్: మధ్యాహ్న భోజనం బాగుందా? ఏమేం వడ్డిస్తున్నారు? అఖిల: అన్నం, పప్పు, ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, గుడ్లు మేడమ్. చైర్పర్సన్: అందరు ఇక్కడే తింటున్నారా.. కొంత మంది ఇంటికెళ్లి తింటున్నారా? అఖిల: అందరం ఇక్కడే తింటున్నాం మేడమ్. చైర్పర్సన్: మీరు అంగన్వాడీ టీచరా.. పిల్లలకు ఏమేం పౌష్టికాహారం ఇస్తున్నారు? అంగన్వాడీ టీచర్: పప్పు, రవ్వ, గుడ్లు ఇస్తున్నాం మేడమ్. అన్నం వండి పెడుతున్నాం. చైర్పర్సన్: ఇక్కడే వండుతున్నారా.. పొయ్యిని రోజూ క్లీన్ చేసుకోరా? అంగన్వాడీ టీచర్: రోజు క్లీన్ చేస్తున్నాం మేడమ్. అన్నం, పప్పు పొంగినప్పుడు పొయ్యిపైన పడుతుంది. చైర్పర్సన్: సురంగల్ గ్రామం హైదరాబాద్‌కు చాలా దగ్గరున్నా సమస్యలు చాలా ఉన్నాయి. ఈ రోజు చాలా సమస్యలు తెలుసుకున్నాను. ఈ సమస్యలన్నీ తీర్చేందుకు కృషి చేస్తాను. ప్రజల సమస్యలు పూర్తిగా తెలిశాయి.. ప్రజా సమస్యలను ఎవరి ద్వారానో తెలుసుకుంటే పూర్తి సమాచారం లభించదు. సాక్షి విలేకరిగా వచ్చి గ్రామస్తులతో నేరుగా మాట్లాడడంతో సమస్యలు పూర్తిగా తెలిశాయి. రిపోర్టర్‌గా నిజాలను నిర్భయంగా రాసి ప్రజా సమస్యల పరిష్కారానికి పత్రికలు ప్రభుత్వానికి వారధిలా పనిచేస్తాయి. విలేకరులపై సామాజిక బాధ్యత కూడా ఎంతో ఉంది. మాకంటే ఎక్కువగా ఫీల్డ్‌లో తిరిగే విలేకరులకే ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల విషయాల్లోని మంచీ చెడులు తెలుస్తాయి. సురంగల్ గ్రామంలో సాక్షి విలేకరిగా సమస్యలను తెలుసుకోవడం గొప్ప అనుభూతినిచ్చింది. - సునీతారెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ -
టాయ్‌లెట్స్ ప్లీజ్
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకోవాలని భావించిన జెడ్పీ చైర్పర్సన్ ఉమ ‘సాక్షి’ తరఫున ‘వీఐపీ రిపోర్టర్’గా మారారు. నిత్యం అధికారిక కార్యక్రమాల్లో బిజీగా ఉంటున్నప్పటికీ కాసేపు ప్రజాప్రతినిధి హోదాను పక్కనపెట్టి విద్యార్థుల సమస్యలు స్వయంగా తెలుసుకున్నారు. జిల్లా కేంద్రానికి దాదాపు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న బెజ్జంకి మండలం జంగపల్లి పాఠశాలకు వెళ్లి అక్కడి విద్యార్థులు పడుతున్న వెతలను వెలుగులోకి తెచ్చారు. అందులో భాగంగా ఒక్కో విద్యార్థి వద్దకు వెళ్లి వాళ్లకు ఎదురవుతున్న సమస్యలను తెలుసుకున్నారు. పాఠశాల ఆవరణ మొత్తం కలియతిరగడంతోపాటు తరగతి గదులన్నింటినీ స్వయంగా పరిశీలించి అక్కడి ఇబ్బందులను ‘సాక్షి’ ద్వారా ప్రజల కళ్లకు కట్టినట్లు చూపించే యత్నం చేశారు. * మూత్రం వస్తదని మంచినీళ్లు కూడా తాగడం లేదు * రాత్రయితే మందుతాగి క్లాస్‌రూముల్లో బాటిళ్లు పడేస్తున్నరు * ఆట స్థలమున్నా ఆడే అవకాశమే లేదు * ప్రహరీ లేక పాములు, పశువులు వస్తున్నయ్.. * ఊడ్చేటోళ్లు లేరు... అన్ని పనులు మేమే చేసుకుంటున్నం * ‘సాక్షి’ వీఐపీ రిపోర్టర్ తుల ఉమ ఎదుటజంగపల్లి పాఠశాల విద్యార్థుల గోడు ‘‘మేడం... స్కూళ్లో ఉన్నవేమో రెండు టాయ్‌లెట్స్. నాలుగు వందల మంది స్టూడెంట్స్‌కు ఏం సరిపోతయ్. పైగా నీళ్లు కూడా ఉండవ్. టాయ్‌లెట్ పోవాల్సి వస్తుందని మేం నీళ్లు కూడా తాగడం లేదు. స్కూల్‌కు ప్రహరీ గోడ లేదు. పాములు స్కూల్లోకే కాదు... క్లాస్‌రూమ్‌లకు కూడా వస్తున్నాయ్. పశువులు వచ్చి మొక్కలు లేకుండా చేస్తున్నయ్. రాత్రయితే మందు తాగి కొంతమంది బాటిళ్లను స్కూల్లోనే వేస్తున్నరు. ఆటలాడుదామంటేగ్రౌండ్లో అన్ని బండలే. ఆడితే దెబ్బలు తాకుతున్నయ్’’ జిల్లా పరిషత్ చైర్పర్సన్ తుల ఉమ ఎదుట బెజ్జంకి మండలం జంగపల్లి జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థుల ఆవేదన ఇది. తుల ఉమ : గుడ్‌మార్నింగ్ పిల్లలూ... ఎలా ఉన్నారు? విద్యార్థులు : బాగానే ఉన్నాం మేడం. తుల ఉమ : స్కూళ్లో ఎంతమంది ఉన్నారు? విద్యార్థులు : 421 మంది ఉన్నం. తుల ఉమ : పాఠశాలలో టాయ్‌లెట్స్ ఉన్నాయా? గొడుగు అపర్ణ : స్కూళ్లో ఉన్నవేమో రెండు టాయ్‌లెట్స్. నాలుగు వందల మంది స్టూడెంట్స్‌కు ఏం సరిపోతయ్. మాకు టాయ్‌లెట్స్‌కు వెళ్లడానికి కూడా ఇబ్బందవుతోంది. టాయ్‌లెట్ పోవాల్సి వస్తుందని మేం నీళ్లు కూడా తాగడం లేదు. తుల ఉమ : ఏ ఊళ్ల నుంచి వస్తున్నారు... ఇబ్బంది లేదా? ప్రణతి : మా ఊరు మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడినుంచి రోజూ వస్తుంటాం. చాలా ఇబ్బందిగా ఉంది. సాయంత్రం క్లాస్ లేట్ అయితే రాత్రి అవుతోంది. భయంగా ఉంది. సైకిల్ ఇప్పించండి. తుల ఉమ : ఎలా వస్తున్నారు... బస్సు సౌకర్యం ఉందా ? స్వప్న : టైంకు బస్సు లేదు. కొంతమందిమి కలిసి నడుచుకుంటూ వస్తున్నాం. మరికొంతమందిమి ఆటోల్లో రోజుకు పది రూపాయలు ఖర్చుపెట్టుకొని వస్తున్నం. తుల ఉమ : మూడు కిలోమీటర్లు దాటితే ఆర్వీఎం వాళ్లు రవాణా చార్జీలు ఇవ్వాలి కదా.. ఇస్తున్నారా? ప్రణతి : ఇవ్వడం లేదు. తుల ఉమ : అన్ని సబ్జెక్ట్‌లలో టీచర్లున్నారా.. బాగా బోధిస్తున్నారా? ప్రత్యూష : తెలుగు సబ్జెక్ట్‌లో టీచర్లేడు. కంప్యూటర్లున్నా, ఇన్స్ట్రక్టర్ లేడు. తుల ఉమ : టీచర్లు మీతో ఎలా ఉంటున్నారు.. బోధన సక్రమంగా చేస్తున్నారా? రమ్య : బాగానే ఉంటున్నరు. టీచింగ్ బాగానే చేస్తున్నరు. తెలుగు, కంప్యూటర్ టీచర్లు లే కపోవడంతో ఆ సబ్జెక్ట్‌లలో వెనుకబడిపోతున్నం. తుల ఉమ : సైన్స్ ల్యాబ్‌లో అన్ని సౌకర్యాలు ఉన్నాయా? రమేష్ : సైన్స్ అంటే నాకు చాలా ఇష్టం. సైన్స్‌ఫెయిర్‌లో జాతీయ స్థాయికి ఎంపికయ్యాను. సైన్స్‌ల్యాబ్‌లో మరిన్ని వసతులు కల్పించి, టెస్ట్ ట్యూబ్స్, కెమికల్స్ పెంచాలి. తుల ఉమ : స్కూల్‌కు ప్లే గ్రౌండ్ ఉందా? సాయితేజ్ : స్కూల్‌కు స్థలం ఉన్నా, అన్ని బండలు, లొందలున్నాయి. ఆటలాడితే దెబ్బలు తగులుతున్నయ్. మైదానంగా మార్చాలి. తుల ఉమ : స్కూల్‌కు ప్రహరీ గోడ లేదు కదా..? కవిత : పాఠశాలకు ప్రహరీగోడ లేదు. తరగతి గదుల్లోకి పాములొస్తున్నయ్. పశువులు తిరుగుతున్నయ్. ప్రహరీగోడ నిర్మించాలి. తుల ఉమ : ప్రహరీ గోడ లేక ఇబ్బందులు పడుతున్నారా? సుష్మ : ప్రహరీగోడ లేకపోవడంతో బడిలోకి వచ్చి మందు తాగుతున్నరు. తాగిన బాటిళ్లు ఎక్కడపడితే అక్కడ వేస్తున్నరు. తుల ఉమ : స్కూల్ డ్రెస్ ఇస్తున్నారా ? విద్యార్థులు : డ్రెస్ ఇవ్వడం లేదు. 9,10 తరగతి విద్యార్థులకు కూడా ఇవ్వాలి. తుల ఉమ : అటెండర్ ఉన్నడా? ప్రణతి : అటెండర్ లేడు. మేమే వంతుల వారీగా గదులు ఊడ్చుకుంటున్నాం. బెల్ కొడుతున్నం. అటెండర్ పనులు కూడా మేమే చేయాల్సి వస్తోంది. తుల ఉమ : మధ్యాహ్న భోజనం సరిగా పెడుతున్నారా.. బాగుంటుందా? సింధూజ : అన్నం లేట్‌గా పెడుతున్నరు. చెడిపోయిన కూరగాయలు పెట్టకుండా చూడాలి. తుల ఉమ : రోజు ఎంతమందికి అన్నం పెడుతన్నరు? రాధ, కుక్ : రోజుకు 350 మందికి అన్నం పెడుతున్నం. కిచెన్ షెడ్ లేకపోవడంతో గాలికి అన్నం సరిగా ఉడకడం లేదు. షెడ్ నిర్మించాలి. వర్షం వస్తే కట్టెలతో కష్టమవుతోంది. సిలిండర్ ఇస్తే అన్నం వండడానికి ఇబ్బంది ఉండదు. తుల ఉమ : నీటి సౌకర్యం ఎలా ఉంది? అపర్ణ : నీటికి ఇబ్బందవుతోంది. మొన్నీమధ్యే బోర్వెల్ వేశారు కానీ పనిచేయడం లేదు. నీళ్లు ఇండ్లలో నుంచి తెచ్చుకుంటున్నం. తుల ఉమ : విద్యార్థినులకు ఇంకా ఏయే సమస్యలున్నాయ్? ప్రత్యూష : చాలా మందిమి ఉన్నాం. రెస్ట్‌రూంలు లేకపోవడంతో ఇబ్బందులున్నాయి. రెస్ట్‌రూంలు ఏర్పాటు చేయాలి. తుల ఉమ : భవిష్యత్‌లో ఏం కావాలునుకుంటున్నారు.. ఎవరైనా రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారా? ఆర్.రజని : నాకు రాజకీయాలంటే ఇష్టం. నేను భవిష్యత్‌లో జెడ్పీటీసీ అయి ప్రజలకు సేవల చేయాలనుకుంటున్నా. తుల ఉమ : టీచర్లు పాఠాలు బాగా చెబుతున్నారా.. రెగ్యులర్‌గా వస్తున్నారా.. భయపడకుండా చెప్పండి? సౌజన్య : మా టీచర్లు పాఠాలైతే బాగా చెబుతున్నారు మేడం. ఇక్కడ చాలా మందిమి ఐఐటీకి కూడా ప్రిపేర్ అవుతున్నాం. మార్కులు కూడా బాగా వస్తున్నాయ్. తుల ఉమ : ప్రభుత్వ పాఠశాలలో ఐఐటీ ప్రిపరేషనా.. వెరీగుడ్! బాగా చదువుకోండి. జెడ్పీ పరిధిలోని సమస్యలన్నీ పరిష్కరిస్తా ‘సాక్షి వీఐపీ రిపోర్టర్’ కార్యక్రమం అనంతరం జెడ్పీ చైర్పర్సన్ పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులను ఉద్ధేశించి మాట్లాడారు. ‘విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలన్నింటినీ తప్పకుండా పరిష్కరించేందుకు కృషి చేస్తా. ముఖ్యంగా జిల్లా పరిషత్ పరిధిలోని సమస్యలన్నీ వెంటనే పరిష్కరిస్తా’ అని హామీ ఇచ్చారు. ‘నేను పోషించిన కొత్త పాత్రతో విద్యార్థుల సమస్యలు నేరుగా తెలుసుకోగలిగాను. ప్రైవేట్‌కు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలపై విశ్వాసంతో 421 మంది విద్యార్థులున్న ఈ పాఠశాల సమస్యలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తా’నని అన్నారు. ‘రూ.55 లక్షల అంచనా వ్యయంతో నాలుగు అదనపు తరగతి గదులు, ప్రహరీగోడ నిర్మాణానికి నాబార్డ్‌కు రాశాం. నిధులు రాగానే త్వరలో నిర్మాణం చేపడుతాం. ఏడు మరుగుదొడ్లు నిర్మించేందుకు ఇప్పటికే స్థానిక ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, జెడ్పీటీసీ సభ్యుడు తన్నీరు శరత్‌రావు ప్రతిపాదనలు పంపించారు. ఆర్వీఎం అధికారులతో మాట్లాడి త్వరగా నిర్మించేట్లు చూస్తా. పాఠశాల సమయ వేళలకు అనుగుణంగా రెండు, మూడు రోజుల్లో బస్సు సర్వీసులు నడుస్తాయ్. మూడు కిలోమీటర్ల కన్నా ఎక్కువ దూరం నుంచి వస్తున్న విద్యార్థులకు ఆర్వీఎం నుంచి రావాల్సిన చార్జీలను ఇప్పిస్తా. తెలుగు పండిత్ పోస్టును వారం రోజుల్లో భర్తీ చేస్తాం. అటెండర్ లేకపోవడం రాష్ట్ర స్థాయిలో సమస్యగా మారింది. ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తా. కిచెన్ షెడ్ నిర్మాణానికి ప్రభుత్వం నుంచి నిధులు వచ్చి ఉన్నాయి. డిజైన్ మార్చే క్రమంలో జాప్యం జరుగుతోంది. మైదానాన్ని చదును చేసేందుకు నిధులు కేటాయిస్తా’ అని పేర్కొన్నారు.