జన్నారం : మా ఊరికి రావాలంటే చాలా ఇబ్బందైతంది. వర్షాకాలంలో ఈ రోడ్డుపై నడవాలంటేనే కష్టమైతుంది. రోడ్డంతా బురదగా ఉంటది. ఊర్లో బోరింగులు చెడిపోయినయి. పిల్లలు బడికి రావడానికి కూడా గోసైతుంది. పింఛన్లు చాలామందికి అస్తలేవు.. అంటూ జన్నారం మండలం దేవునిగూడ గ్రామ పంచాయతీ పరిధి కొత్తూరుపల్లి వాసులు సమస్యలు ఏకరువు పెట్టారు. గ్రామీణుల సమస్యలు తెలుసుకోవడానికి ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీరా రేఖాశ్యాంనాయక్ 'సాక్షి' వీఐపీ రిపోర్టర్‌గా మారారు. గ్రామంలో పర్యటిస్తూ ప్రజలతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. కొన్ని సమస్యల పరిష్కారానికి అక్కడికక్కడే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గ్రామంలో నెలకొన్న సమస్యలన్నీ తీరుస్తానని స్పష్టం చేశారు.
రేఖానాయక్ : అందరికీ నమస్కారాలమ్మ.. బాగున్నారా..
గ్రామస్తులు : బాగున్నామమ్మా.. మీరు బాగున్నారా..
రేఖానాయక్ : బాగున్నాను.. ఏమమ్మ మీ పేరు ఎంటీ?
మెంగని బుచ్చవ్వ : నా పేరు బుచ్చవ్వ
రేఖానాయక్ : అమ్మా పింఛన్ అస్తుందా..
బుచ్చవ్వ : లేదమ్మ పింఛన్ అత్తలేదు. రెండు మూడు సార్లు మా సర్పంచుకు జీరాక్సులు ఇచ్చినా.. జర పింఛన్ ఇప్పించడమ్మా..
రేఖానాయక్ : తప్పకుండా పింఛన్ ఇప్పిస్తా. దిగులు పడకు.
రేఖానాయక్ : అమ్మా నీ పేరేంటమ్మ
బుచ్చవ్వ : ఆమెకు మాటలు రావమ్మ. కాగితాలు ఉన్న ఆమెకు కూడా పింఛన్ అస్తలేదు.
రేఖానాయక్ : ఎంపీడీవోతో ఫోన్‌లో మాట్లాడి ఇప్పుడు రాపిస్తాను(అని ఫోన్ చేసి చెప్పారు)
రేఖానాయక్ : ఏం పెద్దమనిషి బాగున్నావా.. ఏమన్న సమస్యలున్నాయా..?
గడ్డం పెద్దరాజం : ఏమి చెప్పుమంటవు అమ్మా.. నాకు పింఛన్ అత్త లేదు. మా ఊరికి రావాలంటే చానా ఇబ్బంది అవుతుంది. రోడ్డు సరిగ్గా లేదు.
రేఖానాయక్ : రోడ్డు విషయం నాకు తెలిసింది. తప్పకుండా రోడ్డు ఏపిస్తాను. అదే విధంగా పింఛన్ కూడా వచ్చేటట్టు చేస్తాను.
రేఖానాయక్ : ఏమమ్మ బాగున్నావా.. మీ పేరేమిటి
సీదర్ల శాంతవ్వ : నా పేరు శాంతవ్వ.. గిట్ల ముసలి తనానికి వచ్చిన.
రేఖానాయక్ : పింఛన్ వస్తుందా..?
శాంతవ్వ : అత్తలేదమ్మ.. ఇన్ని రోజులు వచ్చింది.. ఇప్పుడేమో బందయింది. దయ ఉంచి పింఛన్ ఇప్పించండి.
రేఖానాయక్ : కాగితాలు చూసి.. అమ్మా నీకెందుకు పింఛన్ ఇస్తలేరు. అన్ని వెంటనే వీఆర్వోకు చెప్పి పింఛన్ అచ్చేలా చూస్తాను.
గడ్డం లక్ష్మి : అమ్మా.. మా గూడెం నుంచి ఈ గ్రామానికి రావడానికి రోడ్డు లేదు. పది మంది పిల్లలు మా గూడెం నుంచి పొలాల గట్ల నుంచి బడికి వస్తరు. దయుంచి రోడ్డు ఏపియ్యండమ్మ.
రేఖానాయక్ : ఏమయ్య సతీశ్ ఈ సమస్య రాసుకో.. తప్పకుండా మీ గూడేనికి రోడ్డు ఏపిస్తాను.
మోటపల్కుల నర్సవ్వ : అమ్మా.. మా ఊరి చివరన ఉన్న పోచమ్మ తల్లి దేవుని గుడి దగ్గర ఒక బోరింగు వేయించండమ్మ. అక్కడ నీళ్లు లేక గోసయితుంది.
రేఖానాయక్ : ఈ నెల లోపు బోరింగు వేయిస్తాను. సరేనా..?
రేఖానాయక్ : అమ్మా నీ పేరేంటి?
సరిత : నా పేరు గడ్డం సరిత.. మాది గడ్డంగూడెం
రేఖానాయక్ : ఏమైన సమస్యలున్నాయా..?
సరిత : అమ్మా మా గూడేనికి రెండే బోరింగులు ఉన్నయి. ఎండకాలంలో ఒక్కటి ఎండిపోతది. మా గూడెంలో ఒక నీళ్ల ట్యాంకు కట్టించండి.
రేఖానాయక్ : (సర్పంచ్‌తో) నిధులు రాగానే ఆ గూడేనికి నీళ్ల ట్యాంకు కట్టించండి. ఏదైనా ఇబ్బంది ఉంటే నాకు చెప్పండి.
రేఖానాయక్ : ఏం తాత బాగున్నవా?
ఆరే దేవయ్య : బాగున్నమ్మ
రేఖానాయక్ : పింఛన్ వస్తుందా..?
దేవయ్య : వస్తుందమ్మ
రేఖానాయక్ : ఇంకేమైన ఇబ్బంది ఉందా..
దేవయ్య : ఇంకా బియ్యం ఇస్తలేరు.. ఇప్పించండి
రేఖానాయక్ : ఇప్పుడే మొదలైంది. రేపు పోయి తెచ్చుకో..
సుధాకర్ : మేడం మా ఊరు నడవలేని విధంగా ఉంది. వానకాలంలో బురద అయి చాలా ఇబ్బంది అవుతుంది. రోడ్డు విషయంలో కొంచెం శ్రద్ధ తీసుకోండి
రేఖానాయక్ : వ చ్చే నిధుల్లో మీ గ్రామానికి రోడ్డు మంజూరు చేపిస్తా
శంకర్ : మేడమ్.. ఈ ఊరు నుంచి గోండుగూడకు వెళ్లేటప్పుడు మధ్యలో వాగు వస్తుంది. వాన కాలం వాగొస్తే ఆ ఊరికి వెళ్లడం కష్టమౌతుంది. మధ్యలో వంతెన కట్టించండి.
రేఖానాయక్ : ఇప్పుడే చెప్పలేను.. కానీ కనీసం సంవత్సరం లోపు తప్పకుండా కట్టిస్తాను.
రేఖానాయక్ : మీ ఊరిలో సీసీ రోడ్లు ఉన్నాయి కదా.. మరి ఇంకేమైన కావాలా?
సత్తన్న : అవునమ్మ.. మరో రెండు వాడల్లో సీసీ రోడ్డు లేదు. రోడ్డు వేసేలా చూడండి.
రేఖానాయక్ : సరేనమ్మా నేను వెళ్తాను. ఏదైన సమస్య ఉంటే నన్ను కలువండి. ఒక్కరే పోతే మాట్లాడుతారో లేదో అనుకోవద్దు. మీకు ఏ సమస్య ఉన్న నాకు చెప్పండి.
సమస్యలన్నీ తీరుస్తా..
Published Mon, Jan 12 2015 9:56 AM | Last Updated on Fri, Aug 17 2018 2:53 PM
Advertisement
Advertisement