ఆందోళన వద్దు | don't concern on pensions | Sakshi
Sakshi News home page

ఆందోళన వద్దు

Published Mon, Nov 24 2014 2:42 AM | Last Updated on Sat, Sep 2 2017 4:59 PM

ఆందోళన వద్దు

ఆందోళన వద్దు

‘‘పింఛన్ల కోసం గందరగోళం వద్దు. అర్హులందరికీ పింఛన్ల పంపిణీ జరుగుతుంది.అధికారులు జాబితాలు సిద్ధం చేస్తున్నారు. ఎవ్వరికీ అన్యాయం జరుగదు’’ జిల్లా పరిషత్ సీఈఓ రాజారాం లబ్ధిదారులకు ఇచ్చిన భరోసా ఇది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా ప్రవేశపెట్టిన ఆసరా పథకం వృద్ధులను, వితంతువులను, వికలాంగులను అయోమయానికి గురి చేస్తోంది.

పల్లె, పట్టణం, నగరం అనే తేడా లేకుండా లబ్ధిదారులు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఇప్పటికే అధికారులు ఒక జాబితా విడు దల చేశారు. అందులో పేరు లేని వారు ధర్నాలు, ఆదోళనలకు దిగుతున్నారు. ఈ నేపథ్యంలో జడ్‌పీ సీఈఓ రాజారాం ‘సాక్షి’ వీఐపీ రిపోర్టర్‌గా మాక్లూర్ మండల పరిషత్ కార్యాలయం వద్ద పింఛన్‌దారులను పలకరించారు. వారితో మాట్లాడి కష్టసుఖాలను ఆరా తీశారు. వారికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు.
 
సీఈఓ : ఏమమ్మా బాగున్నావా...ఎక్కడి నుంచి వచ్చినవు?
జకినీబాయి : బాగున్నాను సారూ...నేను మానిక్‌భండార్ నుంచి వచ్చిన.
సీఈఓ : ఇక్కడికి ఎందుకు వచ్చినవు, నీ సమస్య ఏమిటి?
జకినీబాయి : పింఛన్ రావడం లేదు సారూ. ఇంతకు ముందు ఇచ్చిండ్రు. ఇప్పుడు ఇస్తలేరు. దరఖాస్తు చేసుకునేందుకు ఇక్కడికి వచ్చిన. పింఛన్ వస్తదా మరి.
సీఈఓ : ఏ పింఛన్ కోసం వచ్చినవు?
జకినీబాయి : నాకు భర్త లేడు. వితంతు పింఛన్ కావాలె.
సీఈఓ : ఎంపీడీఓ గారూ ఈమె దరఖాస్తు తీసుకున్నారా?
ఎంపీడీఓ : తీసుకున్నం సార్.
సోను : సారూ... పింఛన్ల జాబితాలో నా పేరు లేదు. పింఛన్ ఆగిపోయింది. ఎట్ల సారూ!
సీఈఓ : జాబితాలో పేరు లేదా. ఎంపీడీఓగారు పరిశీలిస్తారు. పింఛన్ వచ్చేలా చూస్తరు. సారుని కలువు.
బాల్యనాయక్ : సారూ...ఎన్నిసార్లు తిరిగినా నాకు పింఛన్ రావడం లేదు. సార్లు ఏమోమో చెపుతాండ్రు. నేనెట్ల బతుకాలే?
సీఈఓ : చూడు పెద్దాయనా, నీ వయసు ఎంత, నీకు ఏ పింఛన్ వస్తాంది. కాగితాలు చూపించు?
బాల్యనాయక్ : ఇదిగో సారూ...ఆధార్‌కార్డు, ఓటర్‌కార్డు ఉంది. అన్ని ఉన్నాయి. కాని పింఛన్ రావడం లేదు.
ఎంపీడీఓ : గుర్తింపు కార్డులో ఈయన వయస్సు తక్కువగా పడింది సార్. దీంతో పరిశీలనలో దరఖాస్తును తిరస్కరించారు.
సీఈఓ : గుర్తింపు కార్డులో నీ వయస్సును సరిచేసుకో. అప్పుడు నీకు పింఛన్ వచ్చే అవకాశం ఉంటుంది.
గంగారాం (వికలాంగుడు) : సారూ...నాకు నడవడం చేతకాదు. పని చేయలేను. పింఛన్ ఇస్తే ఆసరాగా ఉంటుంది.
సీఈఓ : (గంగారాంను పరిశీలిస్తూ)  నీకు కాలు పుట్టుకతో ఇలాగే ఉందా? లేకపోతే ఏమైన ప్రమాదం జరిగిందా?
గంగారాం : ప్రమాదం జరిగింది సారూ.
సీఈఓ : ప్రమాదం జరిగితే పింఛన్ రాదు కదా....సరే పరిశీలిస్తాం.
దేవిలీ : మా ఇంటికి సార్లు వచ్చిండ్రు..పేర్లు రాసుకొని పోయిండ్రు. జాబితాలో మాత్రం మా పేర్లు లేవు.
సీఈఓ : ఇంతకూ నీకు రావాల్సిన పింఛన్ ఏంది?
దేవిలీ : ముసలోల్లకు వచ్చే పింఛన్ కావాలె సారూ!
ఎంపీడీఓ : (దేవిలీ దరఖాస్తును, గుర్తింపు కార్డు ను పరిశీలిస్తూ) వయస్సు తక్కువగా ఉంది సార్. అందుకే ఈమెకు పింఛన్ రావడం లేదు.
సీఈఓ : నీకు భర్త లేడన్నవు కదా... వితంతు పింఛన్ కోసం దరఖాస్తు చేసుకో పింఛన్ వస్తుంది.
భూదేవి : నాకు వితంతు పింఛన్ రావడం లేదు.
ఎంపీడీఓ : ఈమె గుర్తింపు కార్డులో మహిళ బదులు. పురుషుడని నమోదైంది అందుకే వితంతు పింఛన్ నిలిపివేశారు.
సీఈఓ : నీ గుర్తింపు కార్డులో మార్పులు చేసుకొని తీసుకవస్తే పింఛన్ వస్తది.
ముత్తన్న : నాకు వచ్చే పింఛన్ రావడం లేదు.
సీఈఓ : నీ వద్ద ఉన్న కాగితాలు చూపించు.
ముత్తన్న : (కాగితాలు చూపెడుతూ) ఇదిగో సారూ...రేషన్ కార్డు, ఆధార్ కార్డు ఉన్నయి
సీఈఓ : నీకు వయస్సు తక్కువగా ఉంది కదా. నీకు ఎంత మంది పిల్లలు, వారేం చేస్తరు?
ముత్తన్న : 12వ తరగతి చదివిండ్రు. పనులు చేసుకుంటాండ్రు.
సీఈఓ : నీకు ఏ సంవత్సరంలో పెళ్లి అయిందో గుర్తుందా?
ముత్తన్న : నాకు ఇద్దరు పెళ్లాలు సారూ. మొదటామెను ఎప్పుడో వదిలేసిన. ఇప్పుడు రెండో ఆమెతో ఉంటున్న. ఒక కొడుకు, ఒక కూతురు ఉన్నరు.
సీఈఓ : సరే నీ గుర్తింపు కార్డు పరిశీలించి చూస్తాం.
సురేష్ (వికలాంగుడు) : నాకు సదరం సర్టిఫికెట్ ఉంది. ఆరు నెలలు పింఛన్ వచ్చింది. అప్పటినుంచి మల్ల రాలే. 80 శాతం వికలాంగత్వం ఉంది.
సీఈఓ : సదరం సర్టిఫికెట్ చూపించు.
సురేష్ : ఇప్పుడు తీసుకరాలేదు సార్. ఇంటి వద్దనే ఉంది.
సీఈఓ : సర్టిఫికెట్లు అన్ని తీసుకవచ్చి ఎంపీడీఓ సార్‌ను కలువు.
విజయ : నా భర్త చనిపోయి పదకొండు సంవత్సరాలైతాంది. వితంతు పింఛన్ ఇవ్వడం లేదు
ఎంపీడీఓ : ఈమె దరఖాస్తు లైఫ్‌స్టైల్ పరిశీలనలో తిరస్కరణకు గురైంది.
సీఈఓ : మీకు భూములు ఉన్నాయి కదా! మరీ పింఛన్ అడిగితే ఎట్లా?
విజయ : మాకు ఎవరూ లేరు సార్. మేము ఎట్ల బతకాలే!
నాగమణి : రేషన్ షాపులో బియ్యం తక్కువగా ఇస్తున్నారు సర్. ఎన్నిసార్లు  చెప్పిన  వినడం లేదు.
సీఈఓ : నీవు ఎక్కడి నుంచి వచ్చినవు? నీకు రేషన్‌కార్డు ఉందా? దానికి ఆధార్ కార్డు ఇచ్చినవా?
నాగమణి : మాది మాదాపూర్ సార్. ఆధార్ కార్డులు అధికారులకు ఇచ్చిన.
సీఈఓ : సరేనమ్మా...ఒకసారి రెవెన్యూ అధికారులతో మాట్లాడు.
రమేశ్ : సర్ మా ఊరిలో మురికికాలువలు శుభ్రం చేయడం లేదు సర్.
సీఈఓ : మీ ఊరి పేరు ఏమిటి?
రమేశ్ : మానిక్‌భండార్ సార్.
సీఈఓ : ఎంపీడీఓ గారూ ఒకసారి సంబంధిత అధికారితో మాట్లాడండి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement