ప్రభుత్వం వచ్చి నెల కాకుండానే జగన్ విమర్శలు
ఇసుక విధానంపై సూచనలు చేయండి
రాజకీయ ప్రతీకారాలకు పోవద్దు
ఎన్డీఏ పక్ష ఎమ్మెల్యేల సమావేశంలో సీఎం చంద్రబాబు
సీఎం నిర్ణయాలను సమర్థిస్తానన్న డిప్యూటీ సీఎం పవన్
సాక్షి, అమరావతి : పనులు చేయడానికి డబ్బుల్లేవని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ముందుగా రోడ్ల గుంతలు పూడుద్దామని చెప్పారు. సోమవారం అసెంబ్లీ కమిటీ హాలులో జరిగిన ఎన్డీఏ పక్ష ఎమ్మెల్యేల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం వచ్చి నెల కాకుండానే అప్పుడే జగన్ విమర్శలు మొదలు పెట్టేశారన్నారు. గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకోవడం సరికాదని చెప్పారు. తప్పులు చేయడం, వాటిని పక్క వారిపై నెట్టేయడం జగన్‌కు అలవాటని అన్నారు.
వివేకా హత్యను వేరే వాళ్ల మీదకు నెట్టే ప్రయత్నం చేశారని, వినుకొండలోనూ అదే జరుగుతోందని చెప్పారు. వ్యక్తిగత కక్షలతో జరిగిన హత్యపై జగన్ ఏకంగా రాష్ట్రపతి పాలన పెట్టాలంటున్నారని చెప్పారు. మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీసులో ఫైల్స్ తగలబడటాన్ని అగ్నిప్రమాదంగా చెబుతున్నా, అనేక అనుమానాలు ఉన్నాయని చెప్పారు. ఈ ఘటన చూశాక పరిపాలన ఎంత పతనమైందో బయటపడిందన్నారు.
శాంతిభద్రతల విషయంలో చాలా గట్టిగా ఉంటామని, ఏ పార్టీ వాళ్లనైనా సహించేది లేదని అన్నారు. తప్పు చేసిన వారిని చట్ట ప్రకారం శిక్షిద్దామని, రాజకీయ కక్ష సాధింపులు వద్దని చెప్పారు. ఇసుక విషయంలో చిన్న విమర్శ కూడా రాకూడదని చెప్పారు. క్వారీల్లో ఇసుక తవ్వకం, రవాణా ఖర్చులు, సీనరేజ్ మాత్రమే వసూలు చేస్తామన్నారు. ప్రతి నెలా పింఛన్ల పంపిణీలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు పాల్గొనాలని సూచించారు. పవన్‌కళ్యాణ్ కోరినట్లుగా డొక్కా సీతమ్మ క్యాంటీన్ ఏర్పాటు చేస్తామని చెప్పారు.
చంద్రబాబు నిర్ణయాలకు సహకరిస్తాం : పవన్
జగన్‌కు ఇంకా తత్వం బోధ పడలేదని ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ వ్యాఖ్యానించారు. గ్రూపు తగాదాకు రాజకీయ రంగు పులిమి అవాస్తవాలతో కుట్రలకు తెరలేపుతున్నారని విమర్శించారు. సభలోకి వచ్చే ముందు పోలీసులతో గొడవ, గవర్నర్ ప్రసంగానికి అడ్డు తగలాలని ఎమ్మెల్యేలను రెచ్చగొట్టడం ఆయన అహంకార ధోరణికి నిదర్శనమని అన్నారు. చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తాను, తన పార్టీ నూరు శాతం సహకరిస్తామని తెలిపారు.
ఏపీకి సహకరించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని, రాష్ట్రానికి వీలైనన్ని ఎక్కువ నిధులు తెచ్చుకుందామని బీజేపీ నేత, రాష్ట్ర మంత్రి సత్యకుమార్ యాదవ్ చెప్పారు. జగన్ ఇదే ధోరణి కొనసాగిస్తే భంగపాటు తప్పదన్నారు. కూటమిలోని మూడు పారీ్టల మధ్య సమన్వయం అవసరమని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment