రాష్ట్రవ్యాప్తంగా 30 వేల మందికి పైగా అందని పింఛన్
లాగిన్ గడువు రెండ్రోజులకు కుదింపు ఫలితం
గత ప్రభుత్వంలో ఇది ఐదు రోజులు
దూరప్రాంతాల నుంచి వచ్చేవారికీ వెసులుబాటు ఉండేది
రూ.40.67 కోట్లు ప్రభుత్వానికి జమచేసిన సచివాలయ సిబ్బంది
సాక్షి, భీమవరం : పింఛన్ల పంపిణీలో టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి ప్రభుత్వం తనదైన శైలిలో కొర్రీ పెట్టింది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఐదు రోజుల లాగిన్ గడువును ప్రస్తుత ప్రభుత్వం రెండ్రోజులకు కుదించేసింది. దీంతో తర్వాత వచ్చిన వారికి సాయం అందకుండా చేసింది. ఇలా రాష్ట్రవ్యాప్తంగా 30 వేల మందికి పైగా లబ్ధిదారులకు పింఛన్లు అందలేదని అంచనా.
జూలై నెలకుగాను రాష్ట్రంలోని వృద్ధాప్య, వితంతు, దివ్యాంగ తదితర 65,18,496 సామాజిక పింఛన్లకుగాను ఏప్రిల్ నుంచి పెంచిన సాయంతో కలిపి రాష్ట్ర ప్రభుత్వం రూ.ఏడు వేలు చొప్పున రూ.4,400.67 కోట్లు విడుదల చేసింది. రెండ్రోజుల్లో సచివాలయ ఉద్యోగుల ద్వారా 64,58,367 మంది లబ్ధిదారులకు రూ.4,360 కోట్ల సాయాన్ని పంపిణీ చేయించారు.
తర్వాత లాగిన్ నిలిపివేయడంతో ఆ తర్వాత వచ్చిన వారికి పింఛన్ అందలేదు. సాయం అందాల్సిన 60,129 మందిలో 30–40 శాతం వరకు మృతులు ఉండగా మిగిలిన వారిలో జీవనోపాధి నిమిత్తం ఇతర ప్రాంతాల్లో ఉంటున్న వారు, బంధువుల ఇళ్లకు వెళ్లిన వారు, అనారోగ్యంతో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారే అధిక శాతం మంది ఉన్నారు.
ఇతర ప్రాంతాల్లోని వారికి నిరాశ..
గత ప్రభుత్వంలో ఒకటో తేదీ నుంచి ఐదో తేదీ వరకు పింఛన్ల పంపిణీ చేసేందుకు సచివాలయ ఉద్యోగులకు లాగిన్ గడువు ఉండటంతో మూడు, నాలుగు తేదీల్లో దూర ప్రాంతాల్లో ఉంటున్నవారు వచ్చి పింఛన్ సాయం తీసుకుని వెళ్లేవారు. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ పింఛన్ తీసుకునేందుకు రాలేని వారి వద్దకు వలంటీర్లు వెళ్లి అందించి వచ్చేవారు. ఇతర జిల్లాలతో పాటు హైదరాబాద్ వరకు కూడా వెళ్లి ఆస్పత్రుల్లోని లబ్ధిదారులకు పింఛన్ సాయం అందించిన వలంటీర్లు ఎంతోమంది ఉన్నారు.
కానీ, ప్రస్తుతం సచివాలయ ఉద్యోగుల ద్వారా సాయం అందించినప్పటికీ రెండ్రోజులు మాత్రమే గడువివ్వడంతో చాలావరకు స్థానికంగా అందుబాటులో ఉన్నవారికి మాత్రమే వారు పింఛన్లు ఇచ్చారు. గత ప్రభుత్వంలో నిర్ణీత ఐదో తేదీ దాటిన తర్వాత మిగిలిన మొత్తాన్ని జమచేసేవారు. కానీ, ఈసారి మూడో తేదీనే రూ.40.67 కోట్ల మేర మిగిలిన సొమ్మును సచివాలయ సిబ్బంది ప్రభుత్వానికి జమచేసేశారు.
గతంలో మాదిరి ఐదో తేదీ వరకు గడువు ఉంటుందని రూ.7,000 పింఛన్ తీసుకునేందుకు దూరప్రాంతాల నుంచి ఎంతో ఆశగా వచ్చిన లబ్ధిదారులు నిరాశతో వెనుదిరగాల్సి వస్తోంది. వచ్చే నెలలో ఈ సాయాన్ని కలిపి అందిస్తారా లేదా? అన్నదానిపై తమకు స్పష్టతలేదని సచివాలయ ఉద్యోగులు అంటున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మూడువేల మందికి పైగా లబ్ధిదారులకు ఇలా పింఛన్ సాయం అందలేదు.
పింఛన్ల నిలిపివేతపై కోర్టుకు..
బత్తలపల్లి : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశారన్న కారణంతో పింఛన్లు ఇవ్వకపోవడంపై బాధితులు శనివారం శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం కోర్టును ఆశ్రయించారు. ధర్మవరం నియోజకవర్గం బత్తలపల్లి మండలం మాల్యవంతం పంచాయతీ పరిధిలోని 40 మందికి పైగా అర్హులకు పింఛన్లు ఇవ్వకుండా టీడీపీ నేతలు అడ్డుపడ్డారు. దీంతో లబ్ధిదారులు తమకు ఎందుకు పింఛన్లు ఇవ్వడంలేదంటూ ఈనెల మూడున బత్తలపల్లి ఎంపీడీఓ కార్యాలయానికి చేరుకుని నిరసన తెలిపారు.
ఇదే విషయంపై ఎంపీడీఓ శివనాగప్రసాద్, పంచాయతీ కార్యదర్శి గంగరత్న, వెల్ఫేర్ అసిస్టెంట్ ఫ్రాన్సిస్‌ను ప్రశ్నించారు. పింఛన్లు పంపిణీ చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నప్పటికీ అధికార పార్టీ నేతలు అడ్డుపడటమే కాకుండా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని, కావున తామేమీ చేయలేకపోతున్నామని నిస్సహాయత వ్యక్తంచేశారు. స్థానిక ఎమ్మెల్యే, మంత్రి సత్యకుమార్ దృష్టికి తీసుకువెళ్లినా ప్రయోజనం లేకుండాపోయిందని అధికారులు అనడంతో విధిలేని పరిస్థితుల్లో లబ్ధిదారులు కోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది.
వైఎస్సార్‌సీపీ జిల్లా అధికార ప్రతినిధి గుర్రం శ్రీనివాసరెడ్డి, మండల మాజీ కన్వీనర్ బగ్గిరి బయపరెడ్డి, నాయకులు ప్రతాప్‌రెడ్డి తదితరులతో కలిసి సుమారు 20 మంది లబ్ధిదారులు శనివారం ధర్మవరం కోర్టులో పిటిషన్ వేశారు. వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు పింఛన్ పంపిణీ చేయకపోవడం విచారకరమన్నారు. బాధితులకు న్యాయం జరిగేవరకు తాము పోరాటం ఆపేదిలేదని వైఎస్సార్‌సీపీ నాయకులు స్పష్టంచేశారు.
Comments
Please login to add a commentAdd a comment