rajaram
-
Sanjay Rajaram Raut: పరువు నష్టం కేసు.. ఎంపీ సంజయ్‌రౌత్‌కు బిగ్ షాక్
-
బడుగుల నేత 'అర్గుల్ రాజారాం'
సాక్షి, నిజామాబాద్: బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసి, ఆర్మూర్, బాల్కొండ, నియోజకవర్గాల ప్రజల మనస్సుల్లో నిలిచిపోయిన మహా మనీషి అర్గుల్ రాజారాం. ఆర్మూర్ నుంచి ఒకసారి, బాల్కొండ నుంచి వరసగా నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుపొంది ఉన్నత మంత్రి పదవులు నిర్వహించారు. బీసీ నేతగా ఎదిగి ఆదర్శప్రాయమైన రాజకీయాలతో తనదైన ముద్ర వేసుకున్నారు. ఆయన వద్ద రాజకీయ ఓనమాలు దిద్దిన ఆయన శిష్యులు పీసీసీ మాజీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్, మాజీ మంత్రి శనిగరం సంతోష్‌రెడ్డి తదితరులు రాష్ట్ర రాజకీయాల్లోనే క్రియాశీల పాత్ర పోశించారు. ఆయన చేసిన సేవలకు గుర్తుగా నిజాంసాగర్ చివరి ఆయకట్టు ప్రాంతమైన ఆర్మూర్ ప్రాంతంలోని 38 వేల 792 ఎకరాలకు సాగునీరందించే గుత్ప ఎత్తిపోతల పథకానికి అర్గుల్ రాజారాం పేరు పెట్టారు. ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో దివంగత నేత అర్గుల్ రాజారాం కుటుంబీకులు ఏర్పాటు చేసిన విగ్రహాన్ని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 2008 మార్చి 18న ఆవిష్కరించారు. ఆదర్శం ఆయన రాజకీయ జీవితం.. జక్రాన్‌పల్లి మండలం అర్గుల్ గ్రామంలోని మధ్య తరగతి, బలహీన వర్గానికి చెందిన అర్గుల్ రాజన్న, రాజవ్వ దంపతులకు జన్మించారు. ఉస్మానియా యూనివర్సిటీలో బికాం పట్టా పొందారు. విద్యార్థి దశనుంచే సోషలిస్టు భావాలతో ముందుకుసాగారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం 1969లో జరిగిన తొలి విడత ఉద్యమంలో మర్రి చెన్నారెడ్డితో కలిసి క్రియాశీలంగా పాల్గొన్నారు. ► సోషలిస్టు నాయకుడు జయప్రకాష్ నారాయణ శిష్యరికంతో 1952లో ఆర్మూర్ నియోజకవర్గం నుంచి సోషలిస్టు పార్టీ అభ్యర్థిగా పోటీలో నిలిచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ► 1957లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బాల్కొండ నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలుపొందారు. ► 1962లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఫత్తేపూర్ శ్రీధర్‌రెడ్డిపై బాల్కొండ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ► 1967లో బాల్కొండ ఎమ్మెల్యేగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ► పీవీ నర్సింహారావు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జౌళి, చేనేత, చక్కర పరిశ్రమల శాఖ మంత్రిగా పని చేశారు. ► 1969లో తెలంగాణ ఉద్యమంలో అగ్రనేతగా ముందున్నారు. మర్రి చెన్నారెడ్డితో పాటు రాజమండ్రిలో జైలు జీవితాన్ని గడిపారు. ► 1972లో ధర్మోరా రాజేశ్వర్‌రెడ్డిపై అర్గుల్ రాజారాం బాల్కొండ స్థానానికి పోటీ చేసి అత్యధిక మెజారిటీతో గెలుపొందారు. ► 1972లో విద్యుత్ శాఖ మంత్రి, పశు గణాంక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ► 1978లో ఇందిరా కాంగ్రెస్ అభ్యర్థిగా బాల్కొండ నుంచి పోటీ చేసి అత్యధిక మెజారిటీతో గెలుపొందారు. ► ఇదే సమయంలో అర్గుల్ రాజారాం అనుచరుడు శనిగరం సంతోష్‌రెడ్డిని ఆర్మూర్ ఎమ్మెల్యేగా నిలబెట్టి గెలిపించారు. ► శనిగరం సంతోష్‌రెడ్డి, ధర్మపురి శ్రీనివాస్‌లతో పాటు ఆర్మూర్ పంచాయతి సమితి మాజీ అధ్యక్షుడు కుంట గంగారాం, మగ్గిడి గంగాధర్, పడిగల హన్మాండ్లు, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ గంట సదానందం, కుద్వాన్పూర్ రామారావ్, మగ్గిడి గంగాధర్‌రావు ఆయన అనుచరగణంలోని వారే. -
ఆ గ్రామం.. కోట్ల ఏళ్లుగా సజీవం
సాక్షి, హైదరాబాద్: ఆ ప్రాంతంలో.. కోట్ల ఏళ్ల క్రితం డైనోసార్లు వేటాడాయి.. లక్షల ఏళ్ల నాడు రకరకాల జీవజాతులు విహరించాయి.. వేల ఏళ్ల నాడు ఆది మానవుల సమూహాలు మసిలాయి.. వందల ఏళ్ల కింద వివిధ సామ్రాజ్యాల పాలనలో కళాసృష్టి కొత్తపుంతలు తొక్కింది.. ఒకేచోట కోట్ల ఏళ్ల జీవ పరిణామక్రమం జాడలు పదిలంగా ఉండటం అద్భుతం. ఆ ప్రాంతమే.. మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలంలోని రాజారాం గ్రామం. చాళుక్యుల హయాంలో రూపొందిన భారీ శిల్పం ►హైదరాబాద్ ఆదర్శ్‌నగర్‌లోని బిర్లా సైన్స్ సెంటర్‌కు వెళ్తే.. ఓ భారీ రాక్షసబల్లి అస్థి పంజరం కనిపిస్తుంది. దాదాపు 16 కోట్ల ఏళ్లకిందటి ఆ డైనోసార్ శిలాజాన్ని రాజారాం గ్రామ శివార్లలోని అడవిలోనే గుర్తించారు. 1970–1988 ఏళ్ల మధ్య జియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ) శాస్త్రవేత్త యాదగిరి ఈ ప్రాంతంలో పరిశోధనలు చేశారు. ఆ సమయంలో ‘కోటసారస్’గా పిలిచే డైనోసార్ల శిలాజాలను గుర్తించారు. వాటన్నింటినీ ఒకచోటికి చేర్చి పూర్తిస్థాయి రాక్షస బల్లి అస్థిపంజరానికి రూపమిచ్చారు. ఆ తర్వాత దండకోసారస్ థెరోపాడ్ జాతి రాక్షసబల్లి శిలాజాలను కూడా ఈ అడవిలో గుర్తించారు. చేప శిలాజం ►డైనోసార్ల తదుపరి కాలానికి చెందిన కొన్నిరకాల చేపజాతుల శిలాజాలను కూడా రాజారాం అటవీ ప్రాంతంలో గుర్తించారు. ప్రస్తుతం అవి కరీంనగర్ పురావస్తు పరిశోధనశాలలో ఉన్నాయి. ఆరున్నర కోట్ల ఏళ్లనాటి వృక్షాల శిలాజాలు కూడా ఈ అడవిలో గుర్తించారు. ఆదిమానవుల పనిముట్టు ►తర్వాత మానవ పరిణామక్రమానికి సంబంధించిన జాడలు ఈ ఊరి చుట్టూ లభించాయి. వివిధ కాలాలకు చెందిన ఆదిమానవులు వినియోగించిన రాతి పనిముట్లు పెద్ద సంఖ్యలో దొరికాయి. శాతవాహనకాలం నాటి ఇటుకలు ►రాజారాం నుంచి వేమనపల్లి వెళ్లేదారిలో ప్రభుత్వ పాఠశాల పక్కన ఉన్న పొలాల్లో.. శాతవాహన కాలానికి చెందిన కాల్చిన రాతి ఇటుకలు, మట్టి పాత్రలు వెలుగుచూశాయి. అవి రెండో శతాబ్ధం నాటివిగా అంచనా వేశారు. ఇక గ్రామ శివార్లలో పోచమ్మ ఆలయంగా భావిస్తున్న మందిరం సమీపంలో పెద్దపెద్ద దేవతాశిల్పాలు పడి ఉన్నాయి. అవి చాళుక్యుల కాలానివిగా గుర్తించారు. ఇవే కాదు.. మరెన్నో పురాతన, చారిత్రక ఆనవాళ్లు ఈ గ్రామం చుట్టూ బయటపడ్డాయి. దీంతో చరిత్ర పరిశోధకులకు ఈ ప్రాంతం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పురాతన శిలాజాలకు నిలయం ‘ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పల్లెటూర్లు, వాటి చుట్టూ ఉన్న దట్టమైన అడవులు.. ఎన్నో చారిత్రక ప్రత్యేకతలకు నిలయాలు. అందులో వేమనపల్లి ప్రాంతం పురాతన శిలాజాలకు నిలయంగా ఉంది. రాక్షస బల్లులు ఈ ప్రాంతంలో సంచరించిన ఆనవాళ్లు ఎన్నో లభించాయి. వాటితోపాటు ఆదిమానవుల నుంచి శాతవాహనులు, చాళుక్యులు, ఇటీవలి రాజవంశాల దాకా ఎన్నో ఆనవాళ్లకు రాజారాం నిలయంగా మారింది’ – సముద్రాల సునీల్, ఔత్సాహిక పరిశోధకుడు -
తినలేని అందం
ఎవరు కట్టించినా తన బోటివాడు కాపుర ముండడానికేనని అనుకున్నాడు. పుట్టి భూమిపైన బ్రతుకు తున్నందుకు ఇలాంటి సుందర సీమకు దగ్గరగా ఉండగలిగితేనే మానవ జన్మకు సార్థక్యమనుకున్నాడు. సుందరానికి అలిపిరి గాలిగోపురం అందుకోవలసిన ఆదర్శంలా కనిపిస్తూ ఉండేది. అప్పట్లో అతడు హైస్కూల్లో చదువుకునే కొంటె విద్యార్థి. కొత్తగా కొండపైకి రహదారి వేసిన రోజులు. బస్సుల్లో వెళ్తే రావలసినంత పుణ్యం రాదేమోనని యాత్రికుల్లో ఎక్కువమంది మెట్ల వెంబడే వెళ్తుండేవాళ్ళు. ఎత్తయిన కొండపైన ఠీవిగా నిలబడి, అలిపిరి గాలిగోపురం సుందరాన్ని కవ్విస్తుండేది. ప్రతి సాయంకాలమూ అదొక హేలగా చెంగు చెంగున ఎగురుతూ కొండ మెట్లెక్కి పోయేవాడు. చెట్లతో, పొదరిళ్ళతో, సెలయేళ్ళతో, మాటిమాటికీ క్రిందికి జారివచ్చే మబ్బు తెరలతో అదొక కొండల రాజు మేడ. తన ఇష్టం వచ్చినంత సేపు తానా మేడలో విడిది చేయవచ్చు. ఆ అందానికి పాతికేళ్ళు దూరమై పోయాడు సుందరం. మురికి పేటల్లో నివసించాడు. పైకి చూస్తే ఆకాశం, ప్రక్కలికి చూస్తే జనం, కిటకిటలాడే ఇరుకైన ఇండ్లు, క్రిందికి చూస్తే సైడుకాలువలు. జీవితాశయం నుంచి వంచింపబడి కాలం వెళ్లదీసిన సుందరానికి ఓ కాగితం చేతికొచ్చింది. మరేం లేదు. ప్రమోషను. సుందరానికి ఆమందానందం కలిగినందుకు అదొక్కటే కారణం గాదు. ప్రమోషను మూలంగా వచ్చిన బదిలీ తిరుపతికే వచ్చింది. కోరిన కొండలో కురిసిన వాన! తిరుపతికి వచ్చి ఉద్యోగంలో జాయినైన సాయంకాలమే కొండవైపు వెళ్లాడు. ఈనాటి తిరుపతి చిట్టడవుల్ని కబళిస్తూ కొండవైపు బారలు చాస్తూ ఉండడం గమనించి నొచ్చుకున్నాడు. కానీ అలిపిరి కనిపించేసరికి అంతై, ఇంతై, ఇంతింతై తాను మళ్లీ ఒకసారి చిన్నవాడై, ఆ ఉత్సాహంలో అవలీలగా పదిమెట్లు ఎక్కేశాడు. పదకొండో మెట్టు దగ్గరికి వచ్చేసరికి కాస్తా మెల్లగా ఎక్కితేనే బాగుండుననిపించింది. అసురుసురై పోయిన సుందరం యాభయ్యో మెట్టు దగ్గర కూలబడిపోయాడు. ఇంకొక అంచెలో ఇంకొక యాభై మెట్లు. అలా ఎన్ని అంచెలు దాటితేనో అలిపిరి. యాభయ్యో మెట్టు దాటి పైకి వెళ్లనే లేదు. అందుకో కారణం ఉంది. కపిలతీర్థం దగ్గర మలుపు తిరిగి కొండకు సమాంతరంగా వస్తున్న రోడ్డుకు ప్రక్కగా, రూయా హాస్పిటలుకు గూడా రెండు ఫర్లాంగుల దూరంలో అతడి కొక మేడ కనిపించింది. ప్రశాంతతే రాజ్యమేలుతున్న నిర్జన ప్రదేశంలో చిన్న మేడ? చుట్టూ ప్రాకారం. ముందు వైపుగా వసారా. మిద్దెపైన ఒకటో రెండో గదులు. ఈ కొండ, ఈ కోన, ఈ సోపాన పంక్తీ, ఈ అలిపిరి గాలిగోపురం ఇవన్నీ కనిపించేటట్లుగా మిద్దెపైన గదులకు కిటికీలు గూడా ఉన్నాయి. ఎవరు కట్టించినా తన బోటివాడు కాపుర ముండడానికేనని అనుకున్నాడు. పుట్టి భూమిపైన బ్రతుకు తున్నందుకు ఇలాంటి సుందర సీమకు దగ్గరగా ఉండగలిగితేనే మానవ జన్మకు సార్థక్యమనుకున్నాడు. రేపో, మరునాడో లారీలో సామాన్లొచ్చేస్తాయి. పది పదిహేను రోజుల్లో పిల్లల్ని వెంట బెట్టుకుని రాజ్యం వస్తుంది. అమాంతంగా ఆమెను ఇంటికి తీసుకొచ్చి ఆశ్చర్యంతో ఉక్కిరిబిక్కిరి చేసెయ్యాలి. అన్నీ అతడనుకున్నట్టే జరుగుతూ వచ్చాయి. విదేశాల నుంచి వచ్చిన చిత్రకారుడెవరో ఏకాంతంగా ఉండడం కోసం ఆ ఇల్లు కట్టించుకున్నాడని తెలిసింది. వెళ్తూ వెళ్తూ దాన్నొక పెద్దమనిషికి అమ్మకం చేసిపోయాడు. మళ్లీ అంత డబ్బు పెట్టి కొనడానికిగానీ, కనీసం అద్దెకుండడానికి గానీ ఎవ్వరూ ముందుకు రాకుండా ఉన్న ఆ ఇంట్లో సుందరం తానుంటానని చెప్పేసరికి ఇంటి యజమాని విస్తుపోయాడు. ముందుగా జాబు వ్రాసి, బస్‌స్టాండులో దిగిన భార్యా బిడ్డల్ని టాక్సీలో తీసుకొస్తున్నాడు సుందరం. కపిలతీర్థం ఛాయలకు రాగానే అడిగింది రాజ్యం– ‘‘ఏమండీ? మనం కాపురముండడానికి కొండపైన కాటేజీ ఏదైనా చూచారా?’’. ‘‘లేదు లేదు. కొండ కిందనే మన కాపురం’’ అన్నాడు.కారియర్లో తెచ్చుకున్న భోజనంతో ఆ పూట గడిచిపోయింది.వర్షం కోసం ముఖం వాచిపోయి ఉన్న తిరుపతిలో నెల రోజుల నుంచీ వానజల్లులు పడుతున్నాయి. ఉదయం నుంచీ చిత్తడి వాన. చీకటి పడింది. కొండమెట్ల దీపాలు వెలిగాయి.‘‘చూచావా రాజ్యం!’’ అన్నాడు సుందరం. ‘‘రాత్రివేళ ఈ కొండవైపు చూస్తే పద్మావతీదేవి పడుకున్నట్టుంది. కొండమెట్ల దీపాల చాలు ఆమె వేసుకున్న పూలజడలా కనిపిస్తుంది. వేలకొలది దీపాలతో వెలిగిపోతున్న అలిపిరి గాలి గోపురమే జడబిళ్ల. క్రింది గోపురాన్ని జడకుచ్చులనుకోవచ్చు. అద్భుతమైన దృశ్యం కదూ!’’ రాజ్యం భయంగా కొండవైపు చూచింది. అంతలో వినీల జలదాలు కొన్ని కొండపైన విరుచుకు పడసాగాయి.‘‘ఏమండీ! పద్మావతీదేవి ఏమయ్యేటట్టు?’’ అంది రాజ్యం.‘‘మరేం భయపడొద్దులే. స్వామి నీలమేఘశ్యాముడు గదా! ఆయనిప్పుడు అమ్మవారి సరసకొస్తున్నాడని ఊహించుకో’’ అన్నాడు సుందరం.ఆలోగా మబ్బులు చరచరా క్రిందికి దిగి వచ్చేశాయి. ఇప్పుడు కొండలో సగానికి పైగా మబ్బుల చాటున మాటుపడి పోయింది.‘‘శరీరచ్ఛాయ మాత్రమే కాదులెండి! మనిషి గూడా మోటువాడల్లేనే ఉన్నాడు. లేకుంటే పూలజడపైకి దొర్లుకునే వాడేనా?’’ తోటి ఇల్లాలి పైన జాలిపడి పోతూ అంది రాజ్యం.అలిపిరి వెనుక మబ్బుల్లో మెరుపులు తళుక్కు తళుక్కుమని మెరిసిపోతున్నాయి.‘‘గిలిగింతలు పెడితే నవ్వినట్టుంది గదూ?’’ ‘‘పుణ్యాత్ముడు! రాత్రంతా నిద్ర పోనివ్వడేమో గదూ! ఐనా ఇన్ని గిలిగింతలు పెడితే ఆ ఒళ్లేమి కావాలని?’’ఉన్నట్టుండి ఆమె మాట కడ్డొచ్చాడు సుందరం. ‘‘ఆహా చూచావా? ఏదీ గోపురం? ఏదీ అలిపిరి? అదృశ్యమైపోయింది. ఆవరించి ఉన్న కారుమబ్బే నిజమనిపిస్తుంది. ‘‘మాయ’’ ఎంత పనిచేసిందో చూచావా, ఆత్మ పదార్థాన్నే కనిపించకుండా చేసింది గదూ!’’ ‘‘అబ్బ, ఊరుకుందురూ! కాసేపటికదే కనిపిస్తుంది గానీ’’ ఆవలిస్తూ అంది రాజ్యం.మరునాటి ఉదయం రాజ్యం లేవదీసిన రకరకాల సమస్యలతో తెల్లవారింది. పిల్లలెలా బడికి వెళ్తారు? మార్కెట్టు కెలా వెళ్లిరావాలి? ప్రొద్దు పోకపోతే ఎవరితో మాట్లాడాలి?‘‘ఏముంది? కిటికీ తెరిచి పెట్టుకుని మెట్లదారి వైపు చూస్తుంటే తెల్లవారిపోదా రాజ్యం?’’ ఎంచినట్టుగా పదిహేను రోజులు గడిచిపోయాయి. మేడపైకి వెళ్లి కిటికీ తలుపులు తెరిస్తే అంతులేని అందం. దిగివచ్చిన అలికిడి వినిపిస్తే రాజ్యం తెచ్చిపెట్టే సరిక్రొత్త సమస్య. ఆ రెండింటి మధ్య సుందరానికి ఒక రోజు గడిచినట్టుగా ఇంకొక రోజు గడవడం లేదు. ఆ నెలలో రెండో శనివారం వచ్చింది. సుందరం తలంటి పోసుకున్నాడు. భోజనం చేసి నాలుగింటి దాకా నిద్రపోయాడు. టౌనులోకి బయల్దేరుతుండగా రాజ్యం పిలిచింది. ‘‘ఏమండీ! ఈ రోజు మీరు ఒక ప్రొద్దని మరిచిపోకండి. మిగిలి ఉన్న అన్నం పిల్లలకి సరిపోతుంది. అగ్గిపెట్టె తీసుకొస్తేనే మనకు టిఫిను’’ అంటూ హెచ్చరించింది.ఆరుగంటలకల్లా తిరిగి వచ్చేయాలన్న సదుద్దేశంతోనే సుందరం టౌనుకు బయల్దేరాడు. సహోద్యోగి ఒకతను కనిపించి బలవంతం చేయడంతో సినిమాకు వెళ్లక తప్పింది కాదు. సినిమా పసందుగా ఉంది. తాత్కాలికంగా బాహ్య ప్రపంచం మరపు కొచ్చింది. సినిమా తలపుల్లోనే మునిగి తేలుతూ పది గంటల తర్వాత ఇల్లు చేరుకున్నాడు. ‘‘కిటికీ తెరిచి పెట్టాను. హాయిగా ఈ మంచినీళ్లు తాగి పడుకోండి’’ అంటూ టంబ్లరు నిండుకూ నీళ్లు తీసుకొచ్చింది రాజ్యం.‘‘అదేమిటి! టిఫిను చేయలేదా?’’ అన్నాడు సుందరం.‘‘ఆటవికులమల్లే అడవుల్లో బ్రతుకుతున్నాం సరే! కానీ చెకుముకి రాయితో నిప్పు చేయడం నాకు తెలిసి ఏడ్చిందా, ఏమన్నానా?’’ ముసుగు బిగదన్ని పడుకుంటూ అంది రాజ్యం.సుందరానికి కోపం వచ్చింది. ఆకలితో పేగులు గీ పెడుతున్న కొద్దీ కుర్చీని ముక్కలు చేసి, టేబిలును బద్దలు గొట్టి ఏదైనా అఘాయిత్యం చేసెయ్యాలని అనిపిస్తూ ఉంది. టేబుల్ పైన తలవాల్చుకుని అరగంట సేపలాగే కుర్చీలో కూరాకు కాడలా సోలి ఉండిపోయాడు. చలిగాలికి నరాలు జివ్వు జివ్వు మనడంతో ఎక్కడలేని చిరాకొచ్చింది. చెయ్యి సాచి ఫెడీల్ ఫెడీల్మని కిటికీ తలుపులు వేసేశాడు. వెక్కిరిస్తున్నట్లుగా వేసిన తలుపులు మళ్లీ తెరుచుకున్నాయి. ఎట్ట యెదట గాజుల చెయ్యి, ఆ చేతిలో ప్లేటు, అందులో అందుకు తగిన అనుపానంతో బాటుగా ఆరు పూరీలు...తల పైకెత్తి చూచాడు సుందరం. ముసి ముసి నవ్వులతో కనిపించింది రాజ్యం. నీతో నాకేం పని లెమ్మన్నట్టు గబ గబ ఒక పూరీ తిని, గ్రుక్క పట్టి ఒక లోటా నీళ్లు తాగేశాడు. ‘‘ఏమండీ! అలిపిరి కిప్పుడు ఒకటీ బై ఆరోవంతు అందం వచ్చేసింది గదండీ’’ అంది రాజ్యం. టిఫిను పూర్తయ్యేదాకా భార్యా భర్తల మధ్య మౌనమే తాండవించింది. చేయి కడుక్కున్నాక టవలు తీసుకొచ్చి ఇస్తూ ‘‘ఏమైనా ఆత్మ పదార్థం కన్నా ఆహార పదార్థమే ముఖ్యమేమోనండి? అగ్గిపెట్టె సులభంగా దొరికే చోటికి వెళ్లిపోదామండీ’’ అంది గోముగా రాజ్యం.‘‘సర్లే, సర్లే’’ అంటూ తన స్థానాన్ని కుర్చీ పై నుంచి పడక పైకి మార్చుకున్నాడు సుందరం. మధురాంతకం రాజారాం (1930–99) ‘నేలా– నింగీ’ కథకు సంక్షిప్త రూపం ఇది. ఈ కథ 1973లో యువ మాసపత్రికలో ప్రచురించబడింది. సౌజన్యం: మధురాంతకం నరేంద్ర. తెలుగులో గొప్ప కథకుల్లో ఒకరైన రాజారాం సుమారు నాలుగు వందల కథలు రాశారు. మధురాంతకం రాజారాం -
రాష్ట్ర బధిర క్రికెట్ జట్టు కెప్టెన్‌గా రాజారాం
సాక్షి, హైదరాబాద్: జాతీయ టి20 క్రికెట్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే రాష్ట్ర బధిర జట్టును ప్రకటించారు. ఈ జట్టు కు జి.రాజారాం కెప్టెన్‌గా, మోజెస్ పీటర్ వైస్ కెప్టెన్లుగా వ్యవహరించనున్నారు. పీర్జాదిగూడలోని బాబురావు సాగర్ గ్రౌండ్స్‌లో ఈనెల 21 నుంచి 25 వరకు ఈ టోర్నీ జరుగుతుంది. జట్టు వివరాలు: జి. రాజారాం, టి. అనిల్, మజర్ అలీ బేగ్, టి. సీతారాం, పి. శ్రీనివాస్, జీవీఎస్ ప్రసాద్ , పరిమళ్ కాంత్, టి.యాదగిరి, చిరంజీవి, రాజేశ్ రెడ్డి, మోజెస్ పీటర్, శివ, కె.మురళీ కృష్ణ, వీసీ రంగస్వామి, వీబీఎస్ మూర్తి, కె. నర్సింగ్, సిబిన్, వీరాచారి. -
యువకుడి అనుమానాస్పద మృతి
తాడిపత్రి రూరల్ : తాడిపత్రి రెవెన్యూ కార్యాలయ సమీపంలో టీ హోటల్లో రాజస్థాన్‌కు చెందిన రాజారాం(24) అనుమానస్పదస్థితిలో శనివారం మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఇక్కడి టీ హోటల్లో రాజారాం గుమాస్తాగా పని చేస్తున్నాడు. హోటల్ యజమాని రాజస్థాన్‌కు వెళ్లాడు. అయితే రాజారాం హోటల్లో ఉరేసుకుని మృతి చెందడం కలకలం రేపుతోంది. హోటల్లో నుంచి దుర్వాస రావడంతో గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రెండ్రోజుల కిందట మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. రాజారాం ఆత్మహత్య చేసుకున్నాడా, లేక వేరే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సమాచారం తెలుసుకున్న పట్టణ పోలీసులు హోటల్ షట్టర్ పగులగొట్టి చూసేసరికి రాజారాం ఉరికి వేలాడుతూ కనిపించాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రి మార్చురీకి తరలించారు. మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. -
తెయూ పీఆర్వోగా
తెయూ (డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీ ప్రజా సంబంధాల అధికారి (పీఆర్వో)గా మాస్ కమ్యూనికేషన్ విభాగాధిపతి డాక్టర్ కె.రాజారాం మరోసారి నియమితులయ్యారు. ఈ మేరకు రిజిస్ట్రార్ జయప్రకాశ్‌రావు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఏడాది పాటు ఈ పదవిలో కొనసాగనున్న రాజారాం.. గతంలోనూ కాశీరాం, అక్బర్ అలీఖాన్ వీసీలుగా ఉన్నప్పుడు పీఆర్వోగా పని చేశారు. మరోసారి పీఆర్వో రాజారాంను అధ్యాపకులు, సిబ్బంది అభినందించారు. -
మందుల్లేవ్!
♦ ప్రభుత్వ ఆస్పత్రుల్లో మందుల కొరత ♦ రోగులకు సక్రమంగా అందని వైద్యం ♦ ఆందోళన చెందుతున్న ప్రజలు రాజాం/రాజాం రూరల్: జిల్లాలోని పలు ప్రభుత్వ ఆస్పత్రుల్లో మందులు నిండుకున్నాయి. దీంతో వైద్యం కోసం వచ్చేవారు ఇబ్బంది పడుతున్నారు. రాజాం సామాజిక ఆస్పత్రిలో నాలుగు నెలలుగా కొన్ని రకాల మందులు లేకుండా పోయాయి. ఇక్కడ రోజూ 300 మందికి పైగా ఓపీ రోగులతో పాటు సుమారు 60 మందికి పైగా ఐపీ రోగులు వస్తుంటారు. వీరిలో సుమారు వంది మంది వరకూ మందుల కొరత ఉన్నట్టు చెబుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి. – ప్రధానంగా సర్జికల్ వస్తువులైన దూది, బ్యాండేజీ, యాంటీ సెప్టిక్ ఆయిల్స్, యాంటీబయాటిక్ ఇంజక్షన్లు, మాత్రలతో పాటు ఇతరత్రా మందులు, ఇంజక్షన్లు, సిరంజీల కొరత వేధిస్తోంది. శస్త్ర చికిత్సలు జరిగినప్పుడు, గాయాలపాలైన బాధితులకు కట్టు కట్టడానికి అవసరమయ్యే దూది, బ్యాండేజ్, సూదులు, సిరంజీలు, ఐవీ సెట్లు ఇతరత్రా వస్తువులు పూర్తిగా అయిపోవడంతో రోగులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఆయాసం తగ్గించే డెరీఫ్లిన్, గ్యాస్ట్రిక్ తగ్గించడానికి రాంటాక్, పాంటాప్ ఇంజక్షన్లు లేవు. కుక్కకాటుకి సంబంధించిన ఏఆర్వీ ఇంజక్షన్లు కూడా అరకొరగానే ఉన్నాయి. అలాగే ప్రతి సామాజిక, ఏరియా ఆస్పత్రుల్లో ప్రతి నెలా వందకు తక్కువ లేకుండా ప్రసవాలు, 30 వరకూ ఎన్టీఆర్ ఆరోగ్యవైద్యసేవ శస్త్ర చికిత్సలు జరుపుతున్నారు. వీరికి నిత్యం అవసరమయ్యే దూది, బ్యాండేజ్, సూదులు, సిరంజీలు, ఐవీ సెట్లు లేకపోవడంతో బాధితులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బయట కొనుక్కుందామంటే తడిపిమోపెడు అవుతోందని వాపోతున్నారు. మందులు లేకపోవడం, రోగుల నుంచి వ్యతిరేకత వస్తుండడంతో వైద్య సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మూడు నెలల క్రితం కూడా.. మూడు నెలల క్రితం కూడా జిల్లాలోని చాలా ఆస్పత్రుల్లో సిరంజీలు, సూదుల కొరత ఏర్పడింది. దీంతో సిబ్బంది సూచనల మేరకు రోగులు బయట దుకాణాల్లో కొనుగోలు చేసుకోవడం అలవాటుగా మార్చుకున్నారు. యాంటీబయోటిక్ ఇంజక్షన్లు సెఫోటాక్సిమ్సోడియం–1జీ, ఎమికాసిన్–500 ఎంజీ, యాంప్సిలిన్, సెఫట్రయోక్సిన్, ఓండమ్ తదితర ఇంజక్షన్ల కొరత కూడా తీవ్రంగా ఉండేది. అయితే కొద్ది రోజుల తరువాత సమస్య తీరింది. ఇంతలోనే మళ్లీ అదే పరిస్థితి. సొమ్ము చేసుకుంటున్న ఫార్మసిస్ట్‌లు! అత్యవసర మందులను ప్రభుత్వం సరఫరా చేయకపోవడంతో ఆస్పత్రి అభివృద్ధి నిధులను వినియోగించుకోవచ్చునని ఉన్నతాధికారులు ఆదేశాలు ఇచ్చారు. అవసరమైన మందులను కొనుగోలు చేయాలని వైద్యులు ఫార్మసిస్ట్‌లకు సూచించారు. దీంతో తమ ఇష్టానుసారంగా మందులు కొనుగోలు చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రైవేటు మందుల దుకాణదారులతో ఒప్పందం కుదుర్చుకొని అరకొర మందులు కొనుగోలు చేసి భారీగా బిల్లులు పెడుతున్నట్టు విమర్శలు వస్తున్నాయి. తాత్కాలింగా సమకూరుస్తున్నాం ప్రతీ రోజూ అవసరానికి సరిపడా సర్జికల్ వస్తువులతో పాటు మందులను తాత్కాలికంగా సమకూరుస్తున్నాం. ఇంకా చాలకపోవడంతోనే ఈ సమస్య నెలకొంటుంది. అయినా మందులు కోసం ఇండెంట్ పంపించాం. వారం రోజుల్లో సమస్య పరిష్కరిస్తాం. – గార రవిప్రసాద్, సూపరింటెండెంట్, సీహెచ్‌సీ, రాజాం -
పాముకాటుతో విద్యార్థి మృతి
-
పాముకాటుతో విద్యార్థి మృతి
ఖమ్మం జిల్లా భద్రా చలం నియోజక వర్గం ఆశ్వాపురం మండం బొండుగూడెం ఐటీడీసీ ఆశ్రమ పాఠశాలలో పాము కాటుకుగురై ఓ విద్యార్ధి మృతి చెందాడు. పాఠశాల బయట అపస్మారక స్థితిలో పడిఉన్న ముగ్గురు విద్యార్థులను గుర్తించి.. భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించారు. అయితే... 5తరగతి చదువుతున్న అరవింద్ అనే విద్యార్థి మృతి చెందాడని వైద్యులు తెలిపారు. పరిస్థితి విషమంగా ఉన్న రాజారాం అనే విద్యార్ధిని మెరుగైన చికిత్స నిమిత్తం ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా.. మరో విద్యార్థి భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆడుకుంటూ ఉండగా.. విద్యార్థులకు పాము కాటు వేసి ఉండవచ్చని భావిస్తున్నారు. కాగా.. భద్రాచలం ఆస్పత్రిలో ఉన్న విద్యార్థిని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పరామర్శించారు. -
ఆందోళన వద్దు
‘‘పింఛన్ల కోసం గందరగోళం వద్దు. అర్హులందరికీ పింఛన్ల పంపిణీ జరుగుతుంది.అధికారులు జాబితాలు సిద్ధం చేస్తున్నారు. ఎవ్వరికీ అన్యాయం జరుగదు’’ జిల్లా పరిషత్ సీఈఓ రాజారాం లబ్ధిదారులకు ఇచ్చిన భరోసా ఇది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా ప్రవేశపెట్టిన ఆసరా పథకం వృద్ధులను, వితంతువులను, వికలాంగులను అయోమయానికి గురి చేస్తోంది. పల్లె, పట్టణం, నగరం అనే తేడా లేకుండా లబ్ధిదారులు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఇప్పటికే అధికారులు ఒక జాబితా విడు దల చేశారు. అందులో పేరు లేని వారు ధర్నాలు, ఆదోళనలకు దిగుతున్నారు. ఈ నేపథ్యంలో జడ్పీ సీఈఓ రాజారాం ‘సాక్షి’ వీఐపీ రిపోర్టర్‌గా మాక్లూర్ మండల పరిషత్ కార్యాలయం వద్ద పింఛన్‌దారులను పలకరించారు. వారితో మాట్లాడి కష్టసుఖాలను ఆరా తీశారు. వారికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. సీఈఓ : ఏమమ్మా బాగున్నావా...ఎక్కడి నుంచి వచ్చినవు? జకినీబాయి : బాగున్నాను సారూ...నేను మానిక్‌భండార్ నుంచి వచ్చిన. సీఈఓ : ఇక్కడికి ఎందుకు వచ్చినవు, నీ సమస్య ఏమిటి? జకినీబాయి : పింఛన్ రావడం లేదు సారూ. ఇంతకు ముందు ఇచ్చిండ్రు. ఇప్పుడు ఇస్తలేరు. దరఖాస్తు చేసుకునేందుకు ఇక్కడికి వచ్చిన. పింఛన్ వస్తదా మరి. సీఈఓ : ఏ పింఛన్ కోసం వచ్చినవు? జకినీబాయి : నాకు భర్త లేడు. వితంతు పింఛన్ కావాలె. సీఈఓ : ఎంపీడీఓ గారూ ఈమె దరఖాస్తు తీసుకున్నారా? ఎంపీడీఓ : తీసుకున్నం సార్. సోను : సారూ... పింఛన్ల జాబితాలో నా పేరు లేదు. పింఛన్ ఆగిపోయింది. ఎట్ల సారూ! సీఈఓ : జాబితాలో పేరు లేదా. ఎంపీడీఓగారు పరిశీలిస్తారు. పింఛన్ వచ్చేలా చూస్తరు. సారుని కలువు. బాల్యనాయక్ : సారూ...ఎన్నిసార్లు తిరిగినా నాకు పింఛన్ రావడం లేదు. సార్లు ఏమోమో చెపుతాండ్రు. నేనెట్ల బతుకాలే? సీఈఓ : చూడు పెద్దాయనా, నీ వయసు ఎంత, నీకు ఏ పింఛన్ వస్తాంది. కాగితాలు చూపించు? బాల్యనాయక్ : ఇదిగో సారూ...ఆధార్‌కార్డు, ఓటర్‌కార్డు ఉంది. అన్ని ఉన్నాయి. కాని పింఛన్ రావడం లేదు. ఎంపీడీఓ : గుర్తింపు కార్డులో ఈయన వయస్సు తక్కువగా పడింది సార్. దీంతో పరిశీలనలో దరఖాస్తును తిరస్కరించారు. సీఈఓ : గుర్తింపు కార్డులో నీ వయస్సును సరిచేసుకో. అప్పుడు నీకు పింఛన్ వచ్చే అవకాశం ఉంటుంది. గంగారాం (వికలాంగుడు) : సారూ...నాకు నడవడం చేతకాదు. పని చేయలేను. పింఛన్ ఇస్తే ఆసరాగా ఉంటుంది. సీఈఓ : (గంగారాంను పరిశీలిస్తూ) నీకు కాలు పుట్టుకతో ఇలాగే ఉందా? లేకపోతే ఏమైన ప్రమాదం జరిగిందా? గంగారాం : ప్రమాదం జరిగింది సారూ. సీఈఓ : ప్రమాదం జరిగితే పింఛన్ రాదు కదా....సరే పరిశీలిస్తాం. దేవిలీ : మా ఇంటికి సార్లు వచ్చిండ్రు..పేర్లు రాసుకొని పోయిండ్రు. జాబితాలో మాత్రం మా పేర్లు లేవు. సీఈఓ : ఇంతకూ నీకు రావాల్సిన పింఛన్ ఏంది? దేవిలీ : ముసలోల్లకు వచ్చే పింఛన్ కావాలె సారూ! ఎంపీడీఓ : (దేవిలీ దరఖాస్తును, గుర్తింపు కార్డు ను పరిశీలిస్తూ) వయస్సు తక్కువగా ఉంది సార్. అందుకే ఈమెకు పింఛన్ రావడం లేదు. సీఈఓ : నీకు భర్త లేడన్నవు కదా... వితంతు పింఛన్ కోసం దరఖాస్తు చేసుకో పింఛన్ వస్తుంది. భూదేవి : నాకు వితంతు పింఛన్ రావడం లేదు. ఎంపీడీఓ : ఈమె గుర్తింపు కార్డులో మహిళ బదులు. పురుషుడని నమోదైంది అందుకే వితంతు పింఛన్ నిలిపివేశారు. సీఈఓ : నీ గుర్తింపు కార్డులో మార్పులు చేసుకొని తీసుకవస్తే పింఛన్ వస్తది. ముత్తన్న : నాకు వచ్చే పింఛన్ రావడం లేదు. సీఈఓ : నీ వద్ద ఉన్న కాగితాలు చూపించు. ముత్తన్న : (కాగితాలు చూపెడుతూ) ఇదిగో సారూ...రేషన్ కార్డు, ఆధార్ కార్డు ఉన్నయి సీఈఓ : నీకు వయస్సు తక్కువగా ఉంది కదా. నీకు ఎంత మంది పిల్లలు, వారేం చేస్తరు? ముత్తన్న : 12వ తరగతి చదివిండ్రు. పనులు చేసుకుంటాండ్రు. సీఈఓ : నీకు ఏ సంవత్సరంలో పెళ్లి అయిందో గుర్తుందా? ముత్తన్న : నాకు ఇద్దరు పెళ్లాలు సారూ. మొదటామెను ఎప్పుడో వదిలేసిన. ఇప్పుడు రెండో ఆమెతో ఉంటున్న. ఒక కొడుకు, ఒక కూతురు ఉన్నరు. సీఈఓ : సరే నీ గుర్తింపు కార్డు పరిశీలించి చూస్తాం. సురేష్ (వికలాంగుడు) : నాకు సదరం సర్టిఫికెట్ ఉంది. ఆరు నెలలు పింఛన్ వచ్చింది. అప్పటినుంచి మల్ల రాలే. 80 శాతం వికలాంగత్వం ఉంది. సీఈఓ : సదరం సర్టిఫికెట్ చూపించు. సురేష్ : ఇప్పుడు తీసుకరాలేదు సార్. ఇంటి వద్దనే ఉంది. సీఈఓ : సర్టిఫికెట్లు అన్ని తీసుకవచ్చి ఎంపీడీఓ సార్‌ను కలువు. విజయ : నా భర్త చనిపోయి పదకొండు సంవత్సరాలైతాంది. వితంతు పింఛన్ ఇవ్వడం లేదు ఎంపీడీఓ : ఈమె దరఖాస్తు లైఫ్‌స్టైల్ పరిశీలనలో తిరస్కరణకు గురైంది. సీఈఓ : మీకు భూములు ఉన్నాయి కదా! మరీ పింఛన్ అడిగితే ఎట్లా? విజయ : మాకు ఎవరూ లేరు సార్. మేము ఎట్ల బతకాలే! నాగమణి : రేషన్ షాపులో బియ్యం తక్కువగా ఇస్తున్నారు సర్. ఎన్నిసార్లు చెప్పిన వినడం లేదు. సీఈఓ : నీవు ఎక్కడి నుంచి వచ్చినవు? నీకు రేషన్‌కార్డు ఉందా? దానికి ఆధార్ కార్డు ఇచ్చినవా? నాగమణి : మాది మాదాపూర్ సార్. ఆధార్ కార్డులు అధికారులకు ఇచ్చిన. సీఈఓ : సరేనమ్మా...ఒకసారి రెవెన్యూ అధికారులతో మాట్లాడు. రమేశ్ : సర్ మా ఊరిలో మురికికాలువలు శుభ్రం చేయడం లేదు సర్. సీఈఓ : మీ ఊరి పేరు ఏమిటి? రమేశ్ : మానిక్‌భండార్ సార్. సీఈఓ : ఎంపీడీఓ గారూ ఒకసారి సంబంధిత అధికారితో మాట్లాడండి. -
గోపీనాథ్ ముండేకు నివాళి
గుడిహత్నూర్, న్యూస్‌లైన్ : మహారాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గోపీనాథ్ ముండే అకాల మరణం మండల వాసులను దిగ్భాంత్రికి గురిచేసింది. ఆయనకు వేర్వేరు చోట్ల శ్రద్ధాంజలి ఘటించారు. మండలంలో ఆయన బంధువులు చాలా మంది ఉండడంతో వారంతా ఆయన మరణాన్ని తట్టుకోలేకపోయారు. గతంలో ఇదే సాన్నిహిత్యంతో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గుడిహత్నూర్‌ను ఆయన సందర్శించారు. దీంతో ఇక్కడి నాయకులకు సుపరిచితుడిగా ఉండిపోయారు. మంగళవారం ఆయన అకాల మృతి చెందడంతో మండలవాసులు తీవ్ర దిగ్భాంత్రికి లోనయ్యారు. స్థానిక బంధువులు, నాయకులు జాతీయ రహదారి 44లోని చౌరస్తాలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. మహారాష్ట్ర ప్రజల ప్రియనేత తమ సన్నిహితుడు గోపీనాథ్ ముండే లేని లోటును ఎవరూ తీర్చలేరని జెడ్పీటీసీ కేశవ్ గిత్తే, గణేశ్ ముండే అన్నారు. లియాఖత్ అలీఖాన్, రాజారాం, బీజేపీ జిల్లా నాయకుడు డా.లక్ష్మణ్ కేంద్రే, టీఆర్ఎస్ నాయకులు వామన్ గిత్తే, వైజునాథ్ కేంద్రే, గిత్తే మదన్ సేట్, ఎంపీటీసీ సత్యరాజ్, సర్పంచ్ ప్రతాప్, ఇద్రిస్‌ఖాన్, కాంగ్రెస్ నాయకులు బేర దేవన్న. రవూఫ్‌ఖాన్‌లతో పాటు డా.నారాయణ్ ఫడ్ తదితరులు పాల్గొన్నారు. గోపీనాథ్ స్వగ్రామానికి పయనం కేంద్ర మంత్రి గోపీనాథ్ ముండే అంత్యక్రియల్లో పాల్గొనడానికి మండలంలోని ఆయన బంధువులు ఆయన స్వగ్రామమైన మహారాష్ట్రలోని భీడ్ జిల్లా పరళీ తాలుకాలోని నాత్రా గ్రామానికి బయల్దేరారు. కడసారి చూపుకైనా నోచుకోవాలని మండల వంజరి కులస్తులు, నాయకులు మంగళవారం రాత్రి నాత్రాకు వెళ్లారు. మహానేతను కోల్పోయాం గోపీనాథ్ ముండే మృతికి నివాళిగా గుడిహత్నూర్‌లో రాత్రి 8 గంటల ప్రాంతంలో స్థానిక శివాలయం నుంచి, బస్టాండ్ వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. సంజీవ్ ముండే, రావణ్ ముండే, మాధవ్ కేంద్రే, నీలకంఠ్ అప్పా, గణేష్ ముండే, త్రియంబక్ ముండే, రవింద్రనాథ్ ముండే, రాహుల్ ముండే, దీపక్ ముండే, వెంకటీ ముండే, జ్ఞానేశ్వర్, దిలీప్ ముండే పాల్గొన్నారు. -
ప్రజావాణి ఉన్నా లేనట్టే..
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : ప్రజావాణిలో ముఖ్యమైన అధికారులు అందుబాటులో ఉండకపోవడంపై ఫిర్యాదుదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎలక్షన్ కోడ్ కారణంగా మార్చి మూడో తేదీనుంచి ప్రజావాణి నిలిచిపోయింది. సార్వత్రిక ఎన్నికలు ముగిశాక తిరిగి ప్రారంభమైంది. అయితే ప్రజావాణికి పలువురు అధికారులు డుమ్మా కొడుతుండడంతో ప్రజ లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఫిర్యాదులూ తక్కువగానే నమోదవుతున్నాయి. సోమవారం జడ్పీ సీఈ ఓ, ఇన్చార్జి ఏజేసీ రాజారాం ఫిర్యాదులు స్వీకరించారు. 64 ఫిర్యాదులే వచ్చాయి. ప్రైవేట్ ఆస్పత్రులను మూసి ఉంచడం వల్ల రోగులు ఇబ్బం దులు ఎదుర్కొంటున్నారని, ఈ సమస్య కు పరిష్కారం చూపాలని అఖిల భార త రైతు కూలీ సంఘం నాయకుడు వి.ప్రభాకర్ ఫిర్యా దు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో కొందరు డా క్టర్లు డబ్బే సర్వస్వంగా పనిచేస్తూ రోగులను పీడిస్తున్నారని ఆరోపించారు. కొందరు ఆర్ఎంపీ, పీఎంపీలు కమీషన్ల కోసం కక్కుర్తిపడి చిన్న చిన్న వ్యాధుల కోసం జిల్లా కేంద్రంలోని ఆస్పత్రులకు తీసుకువచ్చి స్కానింగ్, ఇతర పరీక్షల పేరుతో అమాయకులను దోచుకుంటున్నారన్నారు. రోగి చనిపోయారన్న బాధతో వారి కు టుంబ సభ్యులు ఆవేదనకు లోనై దాడి చేస్తే ఆ స్పత్రులను మూసి ఉంచి రోగులందరినీ ఇబ్బం దులకు గురి చేయడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. ప్రజలకు వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. మరోసారి ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా చూడాలన్నారు. -
వైద్యం వెరీ బ్యాడ్
బాల్కొండ, న్యూస్‌లైన్: బాల్కొండలో ప్రభుత్వ వైద్యం వెరీ బ్యాడ్‌గా ఉందని జెడ్పీ సీఈఓ రాజారాం అన్నారు. గురువారం మండల పరిషత్ సమావేశ హాలులో బాల్కొండ, ఆర్మూర్, మోర్తాడ్, వేల్పూర్ మండలాల ఐకేపీ, ఈజీఎస్, హౌసింగ్, హెల్త్, వెటర్నరీ, ఐసీడీఎ స్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రతి శాఖకు సంబంధించిన అధికారి నుంచి ప్రొగ్రెస్ వివరాలను సేకరించారు. బాల్కొండ ప్రభుత్వ ఆస్పత్రిలో అందుతున్న వైద్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వెరీ బ్యాడ్.. అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మండల స్థాయి అధికారులు విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచాలన్నారు. మార్పు కార్యక్రమాన్ని విజయవంతగా నిర్వహించాలన్నారు. బంగారు తల్లి పథకం పై దృష్టి సారించాలన్నారు. బంగారు తల్లి పథకానికి బ్యాంకుల్లో అకౌంట్ తీ యాలంటే తల్లులు తప్పని సరి రావాలని బ్యాంకు అధికారులు షరతులు పెడుతున్నారని అధికారులు సీఈఓ దృష్టికి తీసుకువచ్చారు. దీంతో ఆయన ఉన్నత అధికారులతో ఫోన్లో మాట్లాడారు. త్వరలో సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసుకున్న వారికి సకాలంలో బిల్లులు అందేలా చూడాలన్నారు. ఉపాధి హమీ పథకంలో కూలీలకు పనులు కల్పించాలన్నారు. సంబంధిత అధికారుల నుంచి సం బంధిత శాఖకు చెందిన రిపోర్టును తీసుకున్నారు. విధుల్లో నిర్లక్ష్యం వీడి ప్ర జలకు అందుబాటులో ఉండాలన్నారు. సమావేశంలో బాల్కొండ, వేల్పూ ర్, మోర్తాడ్, ఆర్మూర్ ఎంపీడీవోలు కిషన్, రాజ్వీర్, ప్రవీణ్, రాములు (ఇన్చార్జి), నాలుగు మండలాల అధికారులు తదితరులు పాల్గొన్నారు.