
మందుల్లేవ్!
♦ ప్రభుత్వ ఆస్పత్రుల్లో మందుల కొరత
♦ రోగులకు సక్రమంగా అందని వైద్యం
♦ ఆందోళన చెందుతున్న ప్రజలు
రాజాం/రాజాం రూరల్: జిల్లాలోని పలు ప్రభుత్వ ఆస్పత్రుల్లో మందులు నిండుకున్నాయి. దీంతో వైద్యం కోసం వచ్చేవారు ఇబ్బంది పడుతున్నారు. రాజాం సామాజిక ఆస్పత్రిలో నాలుగు నెలలుగా కొన్ని రకాల మందులు లేకుండా పోయాయి. ఇక్కడ రోజూ 300 మందికి పైగా ఓపీ రోగులతో పాటు సుమారు 60 మందికి పైగా ఐపీ రోగులు వస్తుంటారు. వీరిలో సుమారు వంది మంది వరకూ మందుల కొరత ఉన్నట్టు చెబుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి.
– ప్రధానంగా సర్జికల్ వస్తువులైన దూది, బ్యాండేజీ, యాంటీ సెప్టిక్ ఆయిల్స్, యాంటీబయాటిక్ ఇంజక్షన్లు, మాత్రలతో పాటు ఇతరత్రా మందులు, ఇంజక్షన్లు, సిరంజీల కొరత వేధిస్తోంది. శస్త్ర చికిత్సలు జరిగినప్పుడు, గాయాలపాలైన బాధితులకు కట్టు కట్టడానికి అవసరమయ్యే దూది, బ్యాండేజ్, సూదులు, సిరంజీలు, ఐవీ సెట్‌లు ఇతరత్రా వస్తువులు పూర్తిగా అయిపోవడంతో రోగులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఆయాసం తగ్గించే డెరీఫ్లిన్, గ్యాస్ట్రిక్ తగ్గించడానికి రాంటాక్, పాంటాప్ ఇంజక్షన్లు లేవు. కుక్కకాటుకి సంబంధించిన ఏఆర్‌వీ ఇంజక్షన్లు కూడా అరకొరగానే ఉన్నాయి. అలాగే ప్రతి సామాజిక, ఏరియా ఆస్పత్రుల్లో ప్రతి నెలా వందకు తక్కువ లేకుండా ప్రసవాలు, 30 వరకూ ఎన్‌టీఆర్ ఆరోగ్యవైద్యసేవ శస్త్ర చికిత్సలు జరుపుతున్నారు. వీరికి నిత్యం అవసరమయ్యే దూది, బ్యాండేజ్, సూదులు, సిరంజీలు, ఐవీ సెట్లు లేకపోవడంతో బాధితులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బయట కొనుక్కుందామంటే తడిపిమోపెడు అవుతోందని వాపోతున్నారు. మందులు లేకపోవడం, రోగుల నుంచి వ్యతిరేకత వస్తుండడంతో వైద్య సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
మూడు నెలల క్రితం కూడా..
మూడు నెలల క్రితం కూడా జిల్లాలోని చాలా ఆస్పత్రుల్లో సిరంజీలు, సూదుల కొరత ఏర్పడింది. దీంతో సిబ్బంది సూచనల మేరకు రోగులు బయట దుకాణాల్లో కొనుగోలు చేసుకోవడం అలవాటుగా మార్చుకున్నారు. యాంటీబయోటిక్ ఇంజక్షన్లు సెఫోటాక్సిమ్‌సోడియం–1జీ, ఎమికాసిన్–500 ఎంజీ, యాంప్సిలిన్, సెఫట్రయోక్సిన్, ఓండమ్ తదితర ఇంజక్షన్ల కొరత కూడా తీవ్రంగా ఉండేది. అయితే కొద్ది రోజుల తరువాత సమస్య తీరింది. ఇంతలోనే మళ్లీ అదే పరిస్థితి.
సొమ్ము చేసుకుంటున్న ఫార్మసిస్ట్‌లు!
అత్యవసర మందులను ప్రభుత్వం సరఫరా చేయకపోవడంతో ఆస్పత్రి అభివృద్ధి నిధులను వినియోగించుకోవచ్చునని ఉన్నతాధికారులు ఆదేశాలు ఇచ్చారు. అవసరమైన మందులను కొనుగోలు చేయాలని వైద్యులు ఫార్మసిస్ట్‌లకు సూచించారు. దీంతో తమ ఇష్టానుసారంగా మందులు కొనుగోలు చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రైవేటు మందుల దుకాణదారులతో ఒప్పందం కుదుర్చుకొని అరకొర మందులు కొనుగోలు చేసి భారీగా బిల్లులు పెడుతున్నట్టు విమర్శలు వస్తున్నాయి.
తాత్కాలింగా సమకూరుస్తున్నాం
ప్రతీ రోజూ అవసరానికి సరిపడా సర్జికల్ వస్తువులతో పాటు మందులను తాత్కాలికంగా సమకూరుస్తున్నాం. ఇంకా చాలకపోవడంతోనే ఈ సమస్య నెలకొంటుంది. అయినా మందులు కోసం ఇండెంట్ పంపించాం. వారం రోజుల్లో సమస్య పరిష్కరిస్తాం.
– గార రవిప్రసాద్, సూపరింటెండెంట్, సీహెచ్‌సీ, రాజాం