తినలేని అందం | Literature Article News In Sakshi | Sakshi
Sakshi News home page

తినలేని అందం

Published Mon, Mar 18 2019 12:45 AM | Last Updated on Mon, Mar 18 2019 1:32 AM

Literature Article News In Sakshi

ఎవరు కట్టించినా తన బోటివాడు కాపుర ముండడానికేనని అనుకున్నాడు. పుట్టి భూమిపైన బ్రతుకు తున్నందుకు ఇలాంటి సుందర సీమకు దగ్గరగా ఉండగలిగితేనే మానవ జన్మకు  సార్థక్యమనుకున్నాడు. 

సుందరానికి అలిపిరి గాలిగోపురం అందుకోవలసిన ఆదర్శంలా కనిపిస్తూ ఉండేది. అప్పట్లో అతడు హైస్కూల్లో చదువుకునే కొంటె విద్యార్థి. కొత్తగా కొండపైకి రహదారి వేసిన రోజులు. బస్సుల్లో వెళ్తే రావలసినంత పుణ్యం రాదేమోనని యాత్రికుల్లో ఎక్కువమంది మెట్ల వెంబడే వెళ్తుండేవాళ్ళు. ఎత్తయిన కొండపైన ఠీవిగా నిలబడి, అలిపిరి గాలిగోపురం సుందరాన్ని కవ్విస్తుండేది. ప్రతి సాయంకాలమూ అదొక హేలగా చెంగు చెంగున ఎగురుతూ కొండ మెట్లెక్కి పోయేవాడు. చెట్లతో, పొదరిళ్ళతో, సెలయేళ్ళతో, మాటిమాటికీ క్రిందికి జారివచ్చే మబ్బు తెరలతో అదొక కొండల రాజు మేడ. తన ఇష్టం వచ్చినంత సేపు తానా మేడలో విడిది చేయవచ్చు.

ఆ అందానికి పాతికేళ్ళు దూరమై పోయాడు సుందరం. మురికి పేటల్లో నివసించాడు. పైకి చూస్తే ఆకాశం, ప్రక్కలికి చూస్తే జనం, కిటకిటలాడే ఇరుకైన ఇండ్లు, క్రిందికి చూస్తే సైడుకాలువలు. జీవితాశయం నుంచి వంచింపబడి కాలం వెళ్లదీసిన సుందరానికి ఓ కాగితం చేతికొచ్చింది. మరేం లేదు. ప్రమోషను. సుందరానికి ఆమందానందం కలిగినందుకు అదొక్కటే కారణం గాదు. ప్రమోషను మూలంగా వచ్చిన బదిలీ తిరుపతికే వచ్చింది. కోరిన కొండలో కురిసిన వాన!

తిరుపతికి వచ్చి ఉద్యోగంలో జాయినైన సాయంకాలమే కొండవైపు వెళ్లాడు. ఈనాటి తిరుపతి చిట్టడవుల్ని కబళిస్తూ కొండవైపు బారలు చాస్తూ ఉండడం గమనించి నొచ్చుకున్నాడు. కానీ అలిపిరి కనిపించేసరికి అంతై, ఇంతై, ఇంతింతై తాను మళ్లీ ఒకసారి చిన్నవాడై, ఆ ఉత్సాహంలో అవలీలగా పదిమెట్లు ఎక్కేశాడు. పదకొండో మెట్టు దగ్గరికి వచ్చేసరికి కాస్తా మెల్లగా ఎక్కితేనే బాగుండుననిపించింది. అసురుసురై పోయిన సుందరం యాభయ్యో మెట్టు దగ్గర కూలబడిపోయాడు. ఇంకొక అంచెలో ఇంకొక యాభై మెట్లు. అలా ఎన్ని అంచెలు దాటితేనో అలిపిరి.

యాభయ్యో మెట్టు దాటి పైకి వెళ్లనే లేదు. అందుకో కారణం ఉంది. కపిలతీర్థం దగ్గర మలుపు తిరిగి కొండకు సమాంతరంగా వస్తున్న రోడ్డుకు ప్రక్కగా, రూయా హాస్పిటలుకు గూడా రెండు ఫర్లాంగుల దూరంలో అతడి కొక మేడ కనిపించింది. ప్రశాంతతే రాజ్యమేలుతున్న నిర్జన ప్రదేశంలో చిన్న మేడ? చుట్టూ ప్రాకారం. ముందు వైపుగా వసారా. మిద్దెపైన ఒకటో రెండో గదులు. ఈ కొండ, ఈ కోన, ఈ సోపాన పంక్తీ, ఈ అలిపిరి గాలిగోపురం ఇవన్నీ కనిపించేటట్లుగా మిద్దెపైన గదులకు కిటికీలు గూడా ఉన్నాయి.

ఎవరు కట్టించినా తన బోటివాడు కాపుర ముండడానికేనని అనుకున్నాడు. పుట్టి భూమిపైన బ్రతుకు తున్నందుకు ఇలాంటి సుందర సీమకు దగ్గరగా ఉండగలిగితేనే మానవ జన్మకు సార్థక్యమనుకున్నాడు. రేపో, మరునాడో లారీలో సామాన్లొచ్చేస్తాయి. పది పదిహేను రోజుల్లో పిల్లల్ని వెంట బెట్టుకుని రాజ్యం వస్తుంది. అమాంతంగా ఆమెను ఇంటికి తీసుకొచ్చి ఆశ్చర్యంతో ఉక్కిరిబిక్కిరి చేసెయ్యాలి. అన్నీ అతడనుకున్నట్టే జరుగుతూ వచ్చాయి. విదేశాల నుంచి వచ్చిన చిత్రకారుడెవరో ఏకాంతంగా ఉండడం కోసం ఆ ఇల్లు కట్టించుకున్నాడని తెలిసింది. వెళ్తూ వెళ్తూ దాన్నొక పెద్దమనిషికి అమ్మకం చేసిపోయాడు. మళ్లీ అంత డబ్బు పెట్టి కొనడానికిగానీ, కనీసం అద్దెకుండడానికి గానీ ఎవ్వరూ ముందుకు రాకుండా ఉన్న ఆ ఇంట్లో సుందరం తానుంటానని చెప్పేసరికి ఇంటి యజమాని విస్తుపోయాడు. ముందుగా జాబు వ్రాసి, బస్‌స్టాండులో దిగిన భార్యా బిడ్డల్ని టాక్సీలో తీసుకొస్తున్నాడు సుందరం. కపిలతీర్థం ఛాయలకు రాగానే అడిగింది రాజ్యం– ‘‘ఏమండీ? మనం కాపురముండడానికి కొండపైన కాటేజీ ఏదైనా చూచారా?’’.

‘‘లేదు లేదు. కొండ కిందనే మన కాపురం’’ అన్నాడు.కారియర్‌లో తెచ్చుకున్న భోజనంతో ఆ పూట గడిచిపోయింది.వర్షం కోసం ముఖం వాచిపోయి ఉన్న తిరుపతిలో నెల రోజుల నుంచీ వానజల్లులు పడుతున్నాయి. ఉదయం నుంచీ చిత్తడి వాన. చీకటి పడింది. కొండమెట్ల దీపాలు వెలిగాయి.‘‘చూచావా రాజ్యం!’’ అన్నాడు సుందరం. ‘‘రాత్రివేళ ఈ కొండవైపు చూస్తే పద్మావతీదేవి పడుకున్నట్టుంది. కొండమెట్ల దీపాల చాలు ఆమె వేసుకున్న పూలజడలా కనిపిస్తుంది. వేలకొలది దీపాలతో వెలిగిపోతున్న అలిపిరి గాలి గోపురమే జడబిళ్ల. క్రింది గోపురాన్ని జడకుచ్చులనుకోవచ్చు. అద్భుతమైన దృశ్యం కదూ!’’
రాజ్యం భయంగా కొండవైపు చూచింది.

అంతలో వినీల జలదాలు కొన్ని కొండపైన విరుచుకు పడసాగాయి.‘‘ఏమండీ! పద్మావతీదేవి ఏమయ్యేటట్టు?’’ అంది రాజ్యం.‘‘మరేం భయపడొద్దులే. స్వామి నీలమేఘశ్యాముడు గదా! ఆయనిప్పుడు అమ్మవారి సరసకొస్తున్నాడని ఊహించుకో’’ అన్నాడు సుందరం.ఆలోగా మబ్బులు చరచరా క్రిందికి దిగి వచ్చేశాయి. ఇప్పుడు కొండలో సగానికి పైగా మబ్బుల చాటున మాటుపడి పోయింది.‘‘శరీరచ్ఛాయ మాత్రమే కాదులెండి! మనిషి గూడా మోటువాడల్లేనే ఉన్నాడు. లేకుంటే పూలజడపైకి దొర్లుకునే వాడేనా?’’ తోటి ఇల్లాలి పైన జాలిపడి పోతూ అంది రాజ్యం.అలిపిరి వెనుక మబ్బుల్లో మెరుపులు తళుక్కు తళుక్కుమని మెరిసిపోతున్నాయి.‘‘గిలిగింతలు పెడితే నవ్వినట్టుంది గదూ?’’ ‘‘పుణ్యాత్ముడు! రాత్రంతా నిద్ర పోనివ్వడేమో గదూ! ఐనా ఇన్ని గిలిగింతలు పెడితే ఆ ఒళ్లేమి కావాలని?’’ఉన్నట్టుండి ఆమె మాట కడ్డొచ్చాడు సుందరం. ‘‘ఆహా చూచావా? ఏదీ గోపురం? ఏదీ అలిపిరి? అదృశ్యమైపోయింది.

ఆవరించి ఉన్న కారుమబ్బే నిజమనిపిస్తుంది. ‘‘మాయ’’ ఎంత పనిచేసిందో చూచావా, ఆత్మ పదార్థాన్నే కనిపించకుండా చేసింది గదూ!’’ ‘‘అబ్బ, ఊరుకుందురూ! కాసేపటికదే కనిపిస్తుంది గానీ’’ ఆవలిస్తూ అంది రాజ్యం.మరునాటి ఉదయం రాజ్యం లేవదీసిన రకరకాల సమస్యలతో తెల్లవారింది. పిల్లలెలా బడికి వెళ్తారు? మార్కెట్టు కెలా వెళ్లిరావాలి? ప్రొద్దు పోకపోతే ఎవరితో మాట్లాడాలి?‘‘ఏముంది? కిటికీ తెరిచి పెట్టుకుని మెట్లదారి వైపు చూస్తుంటే తెల్లవారిపోదా రాజ్యం?’’
ఎంచినట్టుగా పదిహేను రోజులు గడిచిపోయాయి. మేడపైకి వెళ్లి కిటికీ తలుపులు తెరిస్తే అంతులేని అందం. దిగివచ్చిన అలికిడి వినిపిస్తే రాజ్యం తెచ్చిపెట్టే సరిక్రొత్త సమస్య. ఆ రెండింటి మధ్య సుందరానికి ఒక రోజు గడిచినట్టుగా ఇంకొక రోజు గడవడం లేదు.

ఆ నెలలో రెండో శనివారం వచ్చింది. సుందరం తలంటి పోసుకున్నాడు. భోజనం చేసి నాలుగింటి దాకా నిద్రపోయాడు. టౌనులోకి బయల్దేరుతుండగా రాజ్యం పిలిచింది. ‘‘ఏమండీ! ఈ రోజు మీరు ఒక ప్రొద్దని మరిచిపోకండి. మిగిలి ఉన్న అన్నం పిల్లలకి సరిపోతుంది. అగ్గిపెట్టె తీసుకొస్తేనే మనకు టిఫిను’’ అంటూ హెచ్చరించింది.ఆరుగంటలకల్లా తిరిగి వచ్చేయాలన్న సదుద్దేశంతోనే సుందరం టౌనుకు బయల్దేరాడు. సహోద్యోగి ఒకతను కనిపించి బలవంతం చేయడంతో సినిమాకు వెళ్లక తప్పింది కాదు. సినిమా పసందుగా ఉంది. తాత్కాలికంగా బాహ్య ప్రపంచం మరపు కొచ్చింది. సినిమా తలపుల్లోనే మునిగి తేలుతూ పది గంటల తర్వాత ఇల్లు చేరుకున్నాడు.

‘‘కిటికీ తెరిచి పెట్టాను. హాయిగా ఈ మంచినీళ్లు తాగి పడుకోండి’’ అంటూ టంబ్లరు నిండుకూ నీళ్లు తీసుకొచ్చింది రాజ్యం.‘‘అదేమిటి! టిఫిను చేయలేదా?’’ అన్నాడు సుందరం.‘‘ఆటవికులమల్లే అడవుల్లో బ్రతుకుతున్నాం సరే! కానీ చెకుముకి రాయితో నిప్పు చేయడం నాకు తెలిసి ఏడ్చిందా, ఏమన్నానా?’’ ముసుగు బిగదన్ని పడుకుంటూ అంది రాజ్యం.సుందరానికి కోపం వచ్చింది. ఆకలితో పేగులు గీ పెడుతున్న కొద్దీ కుర్చీని ముక్కలు చేసి, టేబిలును బద్దలు గొట్టి ఏదైనా అఘాయిత్యం చేసెయ్యాలని అనిపిస్తూ ఉంది. టేబుల్‌ పైన తలవాల్చుకుని అరగంట సేపలాగే కుర్చీలో కూరాకు కాడలా సోలి ఉండిపోయాడు. చలిగాలికి నరాలు జివ్వు జివ్వు మనడంతో ఎక్కడలేని చిరాకొచ్చింది. చెయ్యి సాచి ఫెడీల్‌ ఫెడీల్మని కిటికీ తలుపులు వేసేశాడు. వెక్కిరిస్తున్నట్లుగా వేసిన తలుపులు మళ్లీ తెరుచుకున్నాయి. ఎట్ట యెదట గాజుల చెయ్యి, ఆ చేతిలో ప్లేటు, అందులో అందుకు తగిన అనుపానంతో బాటుగా ఆరు పూరీలు...తల పైకెత్తి చూచాడు సుందరం. ముసి ముసి నవ్వులతో కనిపించింది రాజ్యం.

నీతో నాకేం పని లెమ్మన్నట్టు గబ గబ ఒక పూరీ తిని, గ్రుక్క పట్టి ఒక లోటా నీళ్లు తాగేశాడు. ‘‘ఏమండీ! అలిపిరి కిప్పుడు ఒకటీ బై ఆరోవంతు అందం వచ్చేసింది గదండీ’’ అంది రాజ్యం. టిఫిను పూర్తయ్యేదాకా భార్యా భర్తల మధ్య మౌనమే తాండవించింది. చేయి కడుక్కున్నాక టవలు తీసుకొచ్చి ఇస్తూ ‘‘ఏమైనా ఆత్మ పదార్థం కన్నా ఆహార పదార్థమే ముఖ్యమేమోనండి? అగ్గిపెట్టె సులభంగా దొరికే చోటికి వెళ్లిపోదామండీ’’ అంది గోముగా రాజ్యం.‘‘సర్లే, సర్లే’’ అంటూ తన స్థానాన్ని కుర్చీ పై నుంచి పడక పైకి మార్చుకున్నాడు సుందరం.

మధురాంతకం రాజారాం (1930–99) ‘నేలా– నింగీ’ కథకు సంక్షిప్త రూపం ఇది. ఈ కథ 1973లో యువ మాసపత్రికలో ప్రచురించబడింది. సౌజన్యం: మధురాంతకం నరేంద్ర. తెలుగులో గొప్ప కథకుల్లో ఒకరైన రాజారాం సుమారు నాలుగు వందల కథలు రాశారు.

మధురాంతకం రాజారాం 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement