family story
-
ఆటతో నిరూపించింది
ఒకప్పుడు అబ్బాయిలకే గుత్తాధిపత్యంగా ఉన్న ఫుట్‌బాల్‌ను ఆమె తన చేతిలోకి తీసుకుంది. చదువుతో ΄పాటు క్రీడలనూ సాధన చేయడానికి సిద్ధమైంది. చుట్టుపక్కల వాళ్లు ‘ఆడపిల్లవి, ఇంట్లో గిన్నెలు కడుగుతూ, వంటవండుతూ కూర్చోక మగపిల్లల్లా ఆ ఆటలేంటి?’ అనేవారు. ఎగతాళి మాటలను, వ్యతిరేకతను లెక్కచేయలేదు. ఫుట్‌బాల్‌తో గ్లోబ్‌ను టచ్ చేయడానికి సిద్ధమైంది. ఫలితంగా కేరళ ఫుట్‌బాల్ జట్టుకు కెప్టెన్‌గా, భారత జట్టుకు వైస్‌కెప్టెన్‌గా ఎదిగింది. ‘ఈ ఆటలు నీకెందుకు’ అని గేలిచే సినవారే ఇప్పుడు తమ పిల్లలకు కె.సున లాగా ఎదగాలని మరీ మరీ చెబుతున్నారు. పిల్లల ΄పాఠ్యపుస్తకంలో సునా కథ పాఠమై పిల్లలను ఉత్తేజపరుస్తోంది.కేరళలోని ఐదవ తరగతి ΄పాఠ్య పుస్తకంలో..ప్రతిభను చూపిన స్ఫూర్తిమంతమైన సునా కథ ఇలా మొదలవుతుంది.. ‘అంతర్జాతీయఫుట్బాల్లో పాల్గొనడానికి వెళుతున్న అబ్బాయిలలో టీమ్ కెప్టెన్ ఒకరు ‘‘ఎప్పుడైనా మాలాగా నువ్వు విదేశాలలో ఆడగలవా?’’ అని సునాని ఆటపట్టిస్తారు. అతని తల్లి అసాధ్యాన్ని సాధ్యం చేసి చూపిన సున పట్టుదలను చూపి కొడుకు ప్రవర్తనను సరిదిద్దుతుంది. టీచర్ చెబుతుంటే పిల్లలు సున కథను ఆసక్తిగా వింటుంటారు. ఆ కథకు ‘గర్ల్ అబౌట్ టు ప్లె బాల్ ఇన్ ది ఫిఫ్త్ కైండ్’ అనే టైటిల్‌ను పెట్టారు. ఐదవ తరగతి పాఠ్యపుస్తకంలోని ఈ కంటెంట్ కె.సున ది. కున్నూర్‌లో పుట్టి పెరిగింది సున. పాఠ్యపుస్తకంలోని సున కథా రచయిత కలవూరు రవికుమార్. సునా, రవి కుమార్ చిన్ననాటి స్నేహితులు కూడా. ‘మొదట్లో స్కూల్, కాలేజీ స్థాయిల్లో సునను ఎగతాళి చేసినవారు. ఆ తర్వాత ఫుట్‌బాల్‌పై ఆమెకున్న అభిరుచిని, ప్రతిభను అర్థం చేసుకొని జట్టులోకి తీసుకునేందుకు ΄పోటీ పడ్డార’ని రవికుమార్ చెబుతాడు. ఈ చిన్ననాటి జ్ఞాపకాలు కథగా రావడం, అది అందరినీ ఆకట్టుకోవడంతో రవికుమార్ ఈ రచన కూడా అందుకుంది. మాజీ ఫుట్‌బాల్ స్టార్ ఎమ్ఆర్సి కృష్ణన్ వద్ద శిక్షణ ΄పోందిన సున 2022లో యాక్టివ్ ఫుట్‌బాల్ నుండి రిటైరైంది. తర్వాత, ఆమె ఓ ప్రభుత్వ సంస్థలో అసిస్టెంట్ ఫోర్‌మెన్‌గా వర్క్ చేసి రిటైరైంది. అక్కడా అవార్డులు గెలుచుకుంది. వర్క్ ప్లేస్ నుంచి కూడా జాతీయ స్థాయిలో ΄ాల్గొన్న ఒక టోర్నమెంట్లో 21 గోల్స్ చేసింది. ఐదో తరగతిలో పిల్లలు తమ ΄ాఠ్యపుస్తకంలోని పాఠాన్ని ఇలా చదువుతున్నారు.. ‘స్కూల్లో అబ్బాయిల మధ్య ఫుట్‌బాల్ మ్యాచ్ జరిగినప్పుడు వాళ్ల మధ్యకు వెళ్లి సున బాల్ కొట్టేది. దీంతో అబ్బాయిలు వెళ్లి ఈ విషయాన్ని టీచర్లకు కంప్లైంట్ చేసేవారు..’ఎగతాళి రోజులను తట్టుకొని, పట్టుదలతో శ్రమించి, సాధించిన ఘనతను రేపటి తరం పిల్లల్లో స్ఫూర్తిని కలిగిస్తూ తనదైన ముద్రవేసేంతగా ఎదగడం ఎంతటి గొప్ప మార్పు. ‘హ్యాట్సాఫ్ సున’ అంటున్నారంతా. -
మిస్టీరియస్ డ్రామా
అభిలాష్, రమ్య,ప్రాచీ ఠాకూర్, శివకోన, ప్రభాకర్, నేహా దేశ్΄పాండే ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘రాజుగారి కోడిపులావ్’. కుటుంబ కథా ‘వి’ చిత్రం అనేది ట్యాగ్‌లైన్ . శివ కోన దర్శకత్వంలో అనిల్ మోదుగ, శివకోన నిర్మించిన ఈ సినిమాను ఆగస్టు 4న విడుదల చేస్తున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో చిత్రయూనిట్ నిర్వహించిన విలేకర్ల సమావేశంలో అభిలాష్ మాట్లాడుతూ– ‘‘రాజుగారి కోడిపులావ్’ రోటీన్ సినిమా కాదు.. కొత్తగా మిస్టీరియస్‌గా ఉంటుంది’’ అన్నారు. ‘‘మా సినిమా ప్రేక్షకులకు నచ్చుతుంది’’ అన్నారు శివ. నటీనటులు కునాల్, నేహాదేశ్ పాండే, రమ్య,ప్రాచీ ఠాకూర్ మాట్లాడారు. -
లిప్‌స్టిక్ వేసుకుని పెదవుల్ని నొక్కుకున్నాకే!
‘నీలోని స్త్రీ కోణాన్ని దర్శించనిదే నువ్వు పరిపూర్ణమైన పురుషుడివి కాలేవు’.. బాబిల్ అన్నాడు ఇలాగని! బాబిల్ 20 ప్లస్ కుర్రాడు. దివంగత నటు ఇర్ఫాన్ ఖాన్ కుమారుడు. ఇంటి నుంచి బయటికి వెళ్లేటప్పుడు ఫేస్ ప్యాక్ వేసుకుంటాడు. దీప్ పతారే అని ఇంకో యంగ్ గై ఉన్నాడు. లిప్‌స్టిక్ అద్దుకుని, పెదవుల్ని పెదవులతో ఓ సారలా నొక్కుకుని అద్దంలో సరిచూసుకున్నాకే బయటికి రావడం! అంకుశ్ బహుగుణ అయితే స్కిన్ కేర్ ప్రాడక్ట్లంటే పడి చచ్చిపోతాడు. సిద్ధార్థ్ బాత్రా ఎప్పుడూ పూలు, స్త్రీలు ఉన్న చొక్కాల్లోనే కనిపిస్తాడు. శంతన్ ధోపే ఐ మస్కారా లోంచి అదోలా చూశాడంటే గర్ల్స్ ఆత్మరక్షణలో పడ్డారన్నమాటే. యశ్వంత్ సింగ్ ముఖానికి ఏదో రాసుకుంటాడు. ఆ సువాసన అతడెక్కిన మెట్రో ట్రైన్ ని స్టేషన్ వచ్చినప్పుడైనా తలుపుల్ని తెరవనివ్వదు! శక్తి సింగ్ యాదవ్ తన పాదాలకు వేసుకునే షూజ్ చిన్నప్పుడు మగపిల్లలకు మురిపెంగా తల్లి తొడిగే గౌనులా ఉంటాయి. జేసన్ ఆర్లాండ్ అని ఇంకో ఇండియన్ ఉన్నాడు. తన పద్దెనిమిదో యేట నుంచీ అమ్మాయిలకు బ్యూటీ టిప్స్ నేర్పుతున్నాడు. వీళ్లంతా మేల్ ఇన్ఫ్లుయెన్సర్లు. అలంకరణకు ఆడామగా ఏమిటి అంటున్నవారు. ఈ పరిపూర్ణ పురుషుల పరిచయ కార్యక్రమం ‘అందమే ఆనందం’ అన్నంతగా ఉంటుంది. అంకుశ్ బహుగుణ మీరు కనుక ఇన్‌స్టాగ్రామ్‌లో చురుగ్గా ఉంటున్నట్లయితే అంకుశ్ మీకు తెలిసే ఉంటాడు. 6 లక్షలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు ఇతడికి! మేకప్ టిప్స్ ఇస్తూ ఉంటాడు. మన స్కిన్ కేర్ కోసం మనం కొంచెం టైమ్ కేటాయించుకోవాలని చెబుతాడు. మనం అంటే మగవాళ్లు, ఆడవాళ్లు కూడా. ఆడవాళ్లలో తనని కలుపుకోడానికి ఏమాత్రం బిడియపడడు. స్త్రీ పురుషులిద్దరికీ స్కిన్ ఉన్నప్పుడు స్కిన్ కేర్ ఇద్దరికీ ఉండాలి కదా అని నవ్వేస్తాడు. కుర్రాడు క్యూట్‌గా ఉంటాడు. ‘వింగ్ ఇట్ విత్ అంకుశ్’ అని ఈ మధ్యే తన రెండో ఇన్స్టాగ్రామ్ అకౌంట్‌ను ఓపెన్ చేశాడు. శంతన్ ధోపే ధోపేనా, ధోపానా అని అడుగుతుంటారు శాంతన్ని. శాంతనా, శంతనా అని కూడా. ‘ఏదో ఒకటి అనుకోండి’ అని నవ్వుతాడు. ఎలా పిలిచినా పలికేందుకు తను సిద్ధం అని. అతడే కాదు, అతడి కనురెప్పలూ పలుకుతాయి. డ్యాజిలింగ్ ఐ మేకప్ తో సౌందర్య సామ్రాజ్య యువ చక్రవర్తిలా అనిపిస్తాడు. ఆ లుక్స్ ఇన్స్పైరింగ్గా ఉంటాయి. ఆ కళ్ల మస్కారా ఎంచేతనో ఎబ్బెట్టుగా అనిపించదు. మేకప్‌లో ఇతడికి ఉన్న నైపుణ్యం అది. పురుష జన్మకు ఎక్కడా లోటు జరగదు తన ముస్తాబులో. సిద్ధార్థ్ బాత్రా సుకుమారంగా, లవ్లీగా ఉంటాడు. ఇతడి ఫాలోవర్లు 143 వేలు. ఫ్యాషన్ స్టెయిలిస్ట్. మగవాళ్ల బ్యూటీని రీ డిఫైన్ చేస్తున్నాడు. పూలు, స్త్రీల చిత్రాలు ఉన్న రంగు రంగుల చొక్కాలు ధరిస్తాడు. పూల మొక్కల మధ్య నిలబడి ఫొటోలు తీయించుకుని వాటిని పోస్ట్ చేస్తుంటాడు. ఆ పోస్ట్‌లకు టప టపమని ఎన్ని లైకులు పడిపోతాయో చెప్పలేం. కొన్ని ఫొటోల్లోనైతే ఇతడి పోలికలను గుర్తుపట్టడం కష్టం. అంతగా ‘ట్రాన్స్ఫార్మేషన్’ చెంది కనిపిస్తాడు. అతడొక కోమలమైన స్టెయిల్ స్టేట్మెంట్ అంటే నమ్మండి. బరువెలా తగ్గడమో చెప్పడు, తగ్గి చూపిస్తాడు. ఆ వీడియోలు అప్డేట్ చేస్తుంటాడు. దీప్ పతారే శాంతను ధోపేకి 25 కె ఉంటే, దీప్‌కి 19 కె ఉన్నారు ఫాలోవర్లు. అతడి మీద కొంచెం క్వీర్ (ఎల్.జి.బి.టి) ప్రభావం ఉన్నట్లు కనిపిస్తుంది. ఫిట్‌గా ఉంటాడు. ఆ బండ పెదవుల్ని ముందుకు చాపి ‘పౌట్’ చే యడం చూస్తుంటే బాగోనట్లు మాత్రం అనిపించదు. సాధారణంగా అమ్మాయిలే కదా ఫొటో దిగుతూ పౌంట్ లిప్స్ ఇస్తారు. కానీ ఇతడు ఇచ్చినా అదేమీ అసహజంగా ఉండదు. యూట్యూబ్‌లో ఇతడొక మేకప్ చానల్ నడుపుతున్నాడు. ‘ఒకరిపై ముద్ర వేయడం ఆపి, జీవించడం మొదలు పెట్టండి’ అంటాడు. ఇతడి మేకప్‌లో ఆర్టిస్టిక్ ఫ్లెయిర్ ఉంటుంది. మగవాళ్లు మేకప్ అవడాన్ని ‘నార్మలైజ్’ చెయ్యడమే దీప్ పతారే ధ్యేయం. ఆ మధ్య ఇతడినెవరో ‘గే’అన్నారు. సాటి ఇన్ఫ్లుయన్సర్ అంకుశ్ బహుగుణ వెంటనే ఇతడికి సపోర్ట్‌గా వచ్చాడు. ‘మేకప్ వేసుకుంటే మగాళ్లు గేలు అయిపోతారా.. మీ ఆలోచనల్ని మార్చుకోండి అని ఒక వీడియోలో దీప్‌ని వెనకేసుకు వచ్చాడు. యశ్వంత్ సింగ్ యశ్వంత్ యూజర్ నేమ్ యశ్ వాంట్ స్కిన్‌కేర్. బ్యూటీ బ్లాగర్ ఇతడు. ఫాలోవర్లు పన్నెండు వేలు. స్కిన్ కేర్ ఉపాయాలు చెబుతాడు. బ్యూటీ టిప్స్ అడిగితే ఇస్తాడు. ముఖాన్ని మెరిపించే క్రీముల్ని తనూ వాడుతుంటాడు. స్కిన్ కేర్‌లో తనేవైనా కొత్త విషయాలు చదివితే వాటిని షేర్ చేసుకుంటాడు. ఏక్నేకి తను వాడి చూసిన హోమ్మేడ్ దివ్యౌషధాలు, ఇంటర్నేషనల్ బ్రాండ్లపై డిమాన్స్ట్రేషన్స్ ఇస్తాడు. యష్ డాట్ కేర్ అని ఇతడికి ఇంకో అకౌంట్ ఉంది. అందులోంచి సేవా కార్యక్రమాల కోసం సౌందర్య ఉత్పత్తులను విక్రయిస్తుంటాడు. శక్తిసింగ్ యాదవ్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ అందగాడికి లక్షా ఇరవై వేల మంది ఫాలోవర్లు ఉన్నారు. కొంచెం మ్యాన్లీగా ఉంటాడు. కొంచెం సుకుమారంగా ఉంటాడు. సిద్ధార్థ్ బాత్రా లానే ఫ్యాషన్ స్టెయిలిస్ట్. మోడలింగ్ ఇస్తుంటాడు. ఆ ఫొటోలను అప్లోడ్ చేస్తుంటాడు. ‘ది ఫిబ్రవరి బాయ్’ అనే అకౌంట్లో కొత్త మోడళ్ల ఫుట్‌వేర్‌తో, యాక్సెసరీస్‌తో కనిపిస్తాడు. స్పూలీ (స్పూల్ బ్రష్)తో కనుబొమల అందాన్ని పెంచడం ఎలా అని ఆ మధ్య ఇతడు పోస్ట్ చేసిన టిక్‌టాక్ వీడియో ఇంటర్నెట్లో వైరల్ అయింది. ఆ తర్వాత భారతీయ పురుషుల కోసం ఇతడు అందించిన కొరియన్ బ్యూటీ టిప్స్ ఇతడిని ప్రముఖుడిని చేశాయి. జేసన్ ఆర్లాండ్ యాక్టర్, డాన్సర్, మోడల్. బ్యూటీ ఇన్ఫ్లుయన్సర్. చిక్ ఫొటోషూట్స్‌కు ప్రసిద్ధి. అంటే స్టెయిల్ వేర్ ఛాయాచిత్రగ్రహకుడు. యూట్యూబ్‌లో, ఇన్స్టాగ్రామ్ లో మేల్ ముస్తాబు వీడియోలు పోస్ట్ చేస్తుంటాడు. అమ్మాయిలకు ఫ్యాషన్ లుక్కుల పాఠాలు కూడా చెబుతుంటాడు. తనకి 14 ఏళ్ల వయసప్పుడే సొంతంగా మేకప్ టిప్స్ కనిపెట్టానని గర్వంగా చెబుతుంటాడు. తన డ్రెస్‌లను తనే డిజైన్ చేసుకుని, తనే స్టిచ్ చేసుకుంటాడు. ఆ వివరాలను నెట్లో పంచుకుంటాడు. లాక్మేకి కూడా మోడలింగ్ చేశాడు! ఇతడి గురించి మరొక మనోహరమైన సంగతి.. 2019 లాక్మే ఫ్యాషన్ వీక్‌లో ర్యాంప్‌పై నడవడం! టూమచ్చబ్బా అనిపిస్తుంది! బాయ్స్కేంటీ సింగారాలు? వాళ్లేమన్నా బంగారాలా? అదిగో మళ్లీ ‘మగ మాటలు’! అందం చందం అంతా అమ్మాయిల్దే అన్నట్లు. వాళ్లే పుత్తడి బొమ్మలైనట్లు. అందం కోసమే వాళ్లు పుట్టినట్లు! బోర్డ్ రూమ్ గాజు అద్దాల్ని పగలగొట్టి వాళ్లొచ్చి డైరెక్టర్ల సీట్లలో కూర్చోవడంలా? అలాగే వీళ్లూ! మహిళలకే మేకప్ అనే గ్లాసు అడ్డుకోడల్ని బ్రేక్ చేసి ఫేస్ప్యాకుల్తో, పెడిక్యూర్లతో, మస్కారాలతో.. బ్యూటిఫుల్ హీరోల్లా (హ్యాండ్సమ్ అనే మాట మాగవాళ్లదే అయితే కనుక) బయటికొచ్చేస్తున్నారు. ఫ్యూచర్లో.. హ్యాండ్‌బ్యాగ్స్ ఆడవాళ్లకే అనేముంది అంటూ.. బ్యాగ్ భుజానికి తగిలించుకుని కనిపిస్తారేమో కూడా! బాబిల్ ఖాన్నే చూడండి. ఫేస్ ప్యాక్ చేయించుకుని ఎప్పుడూ ఫ్రెష్‌గా ఉంటాడు. అతడు ఫేస్‌ప్యాక్‌తో ఉన్న ఫొటోని ఈ మధ్య ఒకరు నెట్లో చూసి.. ‘బాబిల్.. నువ్వేమైనా ఆడపిల్లవా?’ అని అడిగారు. బాబిల్ ఆశ్చర్యపోయాడు. ‘కొంచెమైనా స్త్రీ అంశ లేకుండా నేను పురుషుడిని ఎలా అవుతాను?’ అని ప్రశ్నించాడు. సింగిల్ లైన్లో ‘బ్రాడ్’ రిప్లయ్. ఆ సమాధానం చూసి బాబిల్కి అంతా హాట్సాఫ్ కొట్టారు. అదిగో.. అప్పుడు మొదలైంది ‘మేల్ ముస్తాబ్’ టాపిక్. మగవాళ్లెందుకు ముస్తాబు కాకూడదు? మగవాళ్లెందుకు స్కిన్ కేర్ ప్రాడక్ట్లు వాడకూడదు? మగవాళ్లెందుకు ఆడవాళ్లు ఇష్టపడే అన్ని రంగుల్ని, హంగుల్ని కోరుకోకూడదు.. అనే డిబేట్. ఇప్పుడైతే ఇది డిబేట్ అయినట్లు అనిపిస్తోంది కానీ, చప్పుడు చేయకుండా మేల్ ఇన్ఫ్లుయెన్సర్లు కొంతమంది చాలాకాలంగా తమని తమే ఫాలో అయిపోతున్నారు. అంటే.. వాళ్లకు ఇష్టమైన రీతిలో వాళ్లు ‘గర్లీ’గా తయారౌతున్నారు. వాళ్లనూ కొంతమంది ఫాలో అవుతున్నారు. ఇక్కడున్న కనిపిస్తున్నవాళ్లు మేల్ ఇన్ఫ్లుయెన్సర్లలో కొందరు. మగ యూత్‌ని బ్యూటీ వైపు దారి మళ్లిస్త్నువారు. చదవండి: యాసిడ్ ఓడింది జంట కలిసింది -
ఉద్యోగానికి కండబలం అక్కర్లేదు!
‘ఉద్యోగానికి కండబలం అక్కర్లేదు. చిత్తశుద్ధితో పాటు శ్రద్ధ, ఎప్పుడూ ‘ది బెస్ట్’ ఇవ్వాలనే సదాశయం ఉంటే చాలు. ఉద్యోగం ఓ క్రీడా మైదానం. ఎంత పోటీ పడితే అంత ముందంజలో ఉంటాం’ అంటున్నారు శ్యామ్లీ హల్దార్. భారతదేశ మొట్టమొదటి మహిళా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ జనరల్‌గా నియమితులైన శ్యామ్లీని ఆ స్థానానికి ఎదిగేలా చేసింది కేవలం ఆమె కృషి, నిబద్ధతలే. ఎంచుకున్న పనిని చిత్తశుద్ధితో, శ్రద్ధతో నిర్వర్తించగల సత్తా మహిళకే ఉందని మరోసారి చాటారు శ్యామ్లీ హల్దార్. భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ జనరల్‌గా ఈ మంగళవారం కోల్‌కతాలో నియమితులైన శ్యామ్లీ మొన్నటి వరకు ఎయిర్‌ట్రాఫిక్ కంట్రోలర్‌గా విమానం కదలికలను పర్యవేక్షించేవారు. ఇప్పుడు కోల్‌కతాలోని 300 ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ల బృందాన్ని పర్యవేక్షించే బాధ్యతను చేపట్టారు. మూడు దశాబ్దాల క్రితం అలహాబాద్‌లోని సివిల్ ఏవియేషన్ ట్రైనింగ్ కాలేజీ నుండి ట్రైనింగ్ పొందిన శ్యామ్లీ 1991లో కోల్‌కతాలో మొదటి పోస్టింగ్ తీసుకున్నారు. మానసిక బలం ‘‘నేను నా ఇంటి పనిని ఆఫీసుకు తీసుకు వెళ్లను. ఆఫీసు పనిని ఇంటికి తీసుకు వెళ్లిందీ లేదు. చేతిలో ఉన్న ఉద్యోగానికి నా ఉత్తమమైన పని ఇవ్వడానికే ఎప్పుడూ ప్రయత్నించాను. నా కూతురు, నా ఉద్యోగం నా జీవితానికి సమాంతర అంతఃశక్తులు. మన దేశంలో మహిళలు కుటుంబ విషయాల్లో ఎదుర్కొనే ఒత్తిళ్లతో పాటు రకరకాల సంఘర్షణలపై దృష్టి సారించడం సహజంగానే వస్తుంది. ఉద్యోగానికి కండ బలం అక్కర్లేదు. మహిళలు ఇదో క్రీడా మైదానంగా తన పోరాట పటిమను చూపించవచ్చు. నేను మానసికంగా బలవంతురాలిని. విధి నిర్వహణలో ఎప్పుడూ నా ఉత్తమమైన పనినే ఇచ్చాను. నేను చెప్పే మాట మీకు వింతగా అనిపించవచ్చు. కానీ, నేను ఏదో ఒక రోజు ఈ హోదాలో ఉండితీరుతాను అని ముందే ఊహించాను’’ అని బాధ్యతలు స్వీకరించిన సందర్భంలో సగర్వంగా తెలిపారు శామ్లీ హల్దార్. (చదవండి: పెళ్ళి ఛాందసమా, సదాచారమా!!) పనితో సమాధానం 1989లో మొదటి ఎయిర్ బ్యాచ్ కంట్రోలర్లలో శ్యామ్లీ హల్దార్ కూడా ఉన్నారు. అప్పుడు మగ్గురు మహిళలను ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లుగా ఎంపిక చేశారు. కోల్‌కతాలో అధికారిగా మాత్రం శామ్లీ ఒక్కరే నియమితులయ్యారు. అలహాబాద్‌లోని సివిల్ ఏవియేషన్ ట్రైనింగ్ కాలేజీలో శిక్షణ పొందిన శామ్లీ పురుషాధిపత్య వృత్తిలో విధి నిర్వహణ ద్వారా తన సామర్థ్యాన్ని నిరూపించుకున్నారు. ఒంటరి తల్లిగా జీవిస్తున్న శామ్లీ ఓ వైపు ఉద్యోగాన్ని, మరో వైపు వ్యక్తిగత జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఎదిగారు. -
చూపులు కలవని శుభవేళ
అమ్మాయి కాఫీ ఇచ్చింది. అబ్బాయి కాఫీ తాగాడు. కాఫీ ఇస్తున్నప్పుడు.. అమ్మాయి అబ్బాయిని చూళ్లేదు! కాఫీ తాగుతున్నప్పుడైనా.. అబ్బాయి అమ్మాయిని చూళ్లేదు! ఇంకేం కలుస్తాయి చూపులు! చూపులు కలవలేదు కానీ... కాఫీ కలుపుతున్నప్పుడు అమృత ఘడియలేవో ఉన్నట్లున్నాయి. నలభై ఏళ్లయింది చిరంజీవి, సురేఖల పెళ్లయి. కలవని ఆ కాఫీ చూపులే.. వీళ్ల పెళ్లికి శుభలేఖలు. ► మీ ‘శుభలేఖ రాసుకున్న ఎదలో..’ పాట సూపర్ హిట్. మరి.. రియల్ లైఫ్‌లో శుభలేఖ రాసుకున్న విశేషాల గురించి? చిరంజీవి: నాకు నేనుగా బలి పశువును అయిన రోజు గురించేగా (నవ్వుతూ). ఓ సాయంత్రం నేను చైౖన్నై కోడంబాకం బ్రిడ్జ్ మీద నా కారులో వెళుతుంటే, నా బి.కామ్ క్లాస్మేట్ సత్యనారాయణ కనిపించాడు. ఇక్కడ ఉన్నావేంటి? అని అడిగితే, మా పెదనాన్నగారింటికి వచ్చాను అన్నాడు. నా కారులో దింపేస్తాను రమ్మన్నాను. వాళ్ల పెదనాన్న ఎవరో కాదు... అల్లు రామలింగయ్యగారు. అప్పటికే నేను నటించిన ఓ మూడు సినిమాలు విడుదలయ్యాయి. ‘రామలింగయ్యగారు నీతో పాటు ‘మనవూరి పాండవులు’లో యాక్ట్ చేశారుగా.. ఇంట్లోకి రా’ అన్నాడు. అయితే రామలింగయ్యగారు లేరు. కాఫీ తాగి వెళుదువు గాని అన్నాడు. అదే నేను లాక్ అయిన మొదటి స్టెప్. ► ఎలా లాక్ అయ్యారు? చిరంజీవి: ఆ కాఫీ పెట్టింది సురేఖ. తను నన్ను చూళ్లేదు, నేను తనని చూళ్లేదు (భార్యని చూస్తూ.. ‘ఆ కాఫీలో ఏం వశీకరణ మంత్రం కలిపావు’). ఆ తర్వాత ఆ అబ్బాయి ఎవరు? అని తను అతన్ని అడిగితే ‘మా క్లాస్మేట్. ‘మనవూరి పాండవులు’ లో నటించాడు’ అని చెప్పాడు. ‘వాళ్లు ఏమిట్లట. మనిట్లేనట’ (ఇద్దరూ పెద్దగా నవ్వుతూ) అంది. తర్వాత అల్లు అరవింద్ గారు, ఇతర కుటుంబ సభ్యులు నా గురించి డిస్కషన్ మొదలుపెట్టారు. అల్లు రామలింగయ్యగారికేమో వాళ్లమ్మాయిని ఓ ఐ.ఏ.ఎస్ ఆఫీసర్‌కిచ్చి చెయ్యాలనుండేది. కానీ, ఎందుకు ప్రయత్నం చేయకూడదని అరవింద్‌గారు నా గురించి ఎంక్వయిరీ ప్రారంభించారు. ‘తను ఆంజనేయస్వామి భక్తుడు, బ్యాడ్ హ్యాబిట్స్ లేవు, బాగా చదువుకున్నాడు, చాలా కష్టపడతాడు. అతని చేతిలో మంచి సినిమాలు కూడా ఉన్నాయి’ అని నా గురించి గుడ్ సర్టిఫికెట్ ఇచ్చాడు నా ఫ్రెండ్. నాకు ఇప్పుడు పెళ్లేంటి? అన్నాను నేను. మేకప్‌మేన్ జయకృష్ణ ‘మన వూరి పాండవులు’ నిర్మాత. రామలింగయ్యగారి ఫ్యామిలీకి చాలా దగ్గరివారు. ఆయన రామలింగయ్యగారిని కన్విన్స్ చేశారు. ఓకే అనడానికి ముందు ఓ పదిమంది నిర్మాతలను నా గురించి అడిగి సలహా తీసుకున్నారట రామలింగయ్యగారు. అందరూ నా గురించి మంచి ఫీడ్‌బ్యాక్ ఇచ్చారు. దాంతో నన్ను లాగి బుట్టలో పడేశారు. నాది పెళ్లి వయసు కాదని కరాఖండీగా చెప్పాను. కానీ, జయకృష్ణగారు మా నాన్నగారితో ‘అబ్బాయి వేరే ఆకర్షణలకి లోనవుతాడేమో’ అని చెప్పారేమో నాన్న భయపడిపోయి ‘నేను అబ్బాయిని ఒప్పిస్తా’ అన్నారు. పెళ్లి చూపులకు రానన్నాను. బలవంతంగా తీసుకెళ్లారు. ► సురేఖగారూ.. మీ నాన్న చెప్పారని మీరు చిరంజీవిగారిని పెళ్లి చేసుకున్నారా? సురేఖ: ‘మన వూరి పాండవులు’ చూసి ‘ఈ కళ్లబ్బాయి ఎవరో బావున్నాడు’ అనుకున్నాను. కళ్లు పెద్దగా, గుండ్రంగా ఉంటాయి కదా. మా అమ్మ యాక్టర్‌ను చేసుకుంది. నేనూ యాక్టర్‌ను చేసుకుం టే బాగుంటుందనుకున్నా. అందుకే సరే అన్నాను. ► మీ ‘అందరివాడు’ సినిమాలో పెళ్లిచూపుల సీన్ చాలా బావుంటుంది. మీ పెళ్లి చూపుల సీన్? చిరంజీవి: మమ్మల్ని మాట్లాడుకోమని పెద్దవాళ్లందరూ బయటకు వెళ్లారు. తను బీఏ చదువుకుందని తెలిసినా ఏదో ఒకటి మాట్లాడాలి కదా అని ఏం చదువుకున్నారు? అని అడిగాను. ఆ తర్వాత ఏం మాట్లాడాలో తెలియలేదు. అంతకుముందు నాకు అమ్మాయిలతో పెద్దగా పరిచయాలు కూడా లేవు. సురేఖ పొందిక చూసి ‘ఈ అమ్మాయినే చేసుకోవాలి’ అనుకున్నాను. మా అమ్మకి కూడా తను నచ్చింది. నాన్నగారైతే ‘ఏం కళరా ఆ అమ్మాయిది. పెళ్లి చేసుకో’ అన్నారు. సురేఖ: మామయ్యగారు చనిపోయేంతవరకు నన్నెప్పుడూ పేరు పెట్టి పిలవలేదు. ‘అమ్మా’ అనేవారు. నన్ను ఒక్క మాట కూడా పడనిచ్చేవారు కాదు. అంత బాగా చూసేవారు. ► అవునూ... మీ పెళ్లి చూపులకు, పెళ్లికి ఎంత గ్యాప్ వచ్చింది? సురేఖ: మూడు నెలలు. ► ఆ మూడు నెలల్లో కలుసుకున్నారా? ఫోన్లు మాట్లాడుకోవడం? చిరంజీవి: పెళ్లి కాకముందు మాట్లాడటం, తిరగటం తప్పని మనసులో పడిపోయింది. తనదీ అలాంటి ఫీలింగే. అయితే ఒకసారి మాట్లాడాలనిపించింది. అప్పుడు ల్యాండ్ ఫోన్లే కదా. ఫోన్ చేస్తే తనే తీసింది. ‘హలో.. నేను చిరంజీవి’ అన్నాను. ‘నేను సురేఖనండీ. ఫోన్ ఎవరికివ్వమంటారు’ అంది. అంతే... నాతో కనీసం రెండు మాటలు కూడా మాట్లాడకుండా ఎవరికివ్వమంటారు అందని నా అహం దెబ్బతింది. ‘మీ అన్నయ్య ఉన్నాడా’ అన్నాను. ‘లేరండీ’ అంది. ‘వచ్చాక నేను ఫోన్ చేశానని చెప్పు’ అని పెట్టేశాను. సురేఖ: అప్పుడప్పుడూ అన్నయ్యతో పెళ్లి తేదీ గురించి మాట్లాడేవాళ్లు. అందుకని అన్నయ్యతో మాట్లాడటం కోసమే ఫోన్ చేశారనుకున్నాను. నా గురించి చేశారనుకోలేదు (నవ్వుతూ). ► సరే.. హనీమూన్ విశేషాలు? చిరంజీవి: హనీమూన్ పక్కన పెట్టండి. పెళ్లికే టైమ్ దొరకలేదు. పెళ్లికి ఫిబ్రవరిలో మంచి ముహూర్తాలున్నాయంటే సరే అనుకున్నాం. అప్పుడు ‘తాతయ్య ప్రేమ లీలలు’ అనే సినిమా చేస్తున్నాను. ఆ చిత్రానికి యం.ఎస్ రెడ్డిగారు నిర్మాత. అందులో నూతన్‌ప్రసాద్ కాంబినేషన్లో నా సీన్లు ఉన్నాయి. ‘ఆయన చాలా బిజీ ఆర్టిస్ట్, డేట్స్ దొరకవు.. మీరు మే నెలలో పెళ్లి చేసుకోండి’ అని రెడ్డిగారు అన్నారు. ‘మీరు ఓకే అంటే ఫిబ్రవరిలో, లేదంటే తర్వాత చేసుకుంటాను’ అన్నాను. అరవింద్ ఏమో ‘ఓ మూడు రోజులు ఇవ్వండి’ అని పట్టుబట్టాడు. నా సినిమా టైమ్‌లో మా హీరో పెళ్లి చేసుకున్నాడులే అనుకొని ఏ నిర్మాత అయినా ఆనందంగా ఒప్పుకుంటారు. కానీ, రెడ్డిగారు ఒప్పుకోలేదు. అప్పుడు అల్లు అరవింద్ ‘మీ డేట్లు మళ్లీ మీకు ఇప్పిస్తాను. కాంబినేషన్ గురించి మీకేం భయం లేదు. నేనూ ఇండస్ట్రీలోనే ఉన్నాను కదా. మేం చిరంజీవిని తీసుకెళ్లిపోతున్నాం’ అన్నారు. అలా అనుకున్న ముహూర్తానికే పెళ్లయింది. ► మరి పెళ్లి బట్టల షాపింగ్‌కి టైమ్ దొరికిందా? చిరంజీవి: పెళ్లి పీటల మీద కూర్చున్నప్పుడు చొక్కా చిరిగిపోయింది. సురేఖ మార్చుకోమంటే ‘ఏం.. బట్టలు చిరిగితే తాళి కట్టలేనా’ అని, అలాగే కట్టేశాను. అయితే అప్పటికే నాకు ఏడెనిమిది పెళ్లిళ్లు చేసుకున్న అనుభవం ఉంది (ఇద్దరూ పెద్దగా నవ్వుతూ). అంటే సినిమాల్లో.. ► పెళ్లయ్యే నాటికే మీకు వంట వచ్చా? సురేఖ: రాదండీ. ఒకరోజు ఉప్మా చేస్తే ఉండలు, ఉండలుగా వచ్చింది. అప్పుడు ఆయనే ఉప్మా చేయడం నేర్పించారు. ఆయన మేనత్త, అమ్మమ్మ మాతోనే ఉండేవారు. వాళ్లు వండేవారు. ► భర్త మేనత్త, అమ్మమ్మ, అమ్మానాన్న, తమ్ముళ్లు (నాగబాబు, పవన్ కల్యాణ్) ఇంతమందితో ఉండాలంటే ప్రైవసీ ఉండదేమో అనిపించిందా? సురేఖ: మా ఇంట్లో ఎప్పుడూ చుట్టాలుండేవారు. అదే సందడి ఈ ఇంట్లోనూ ఉండేది. లేకపోతే ఒంటరితనం అనిపించేది. ఈయన ఉండేవారు కాదు. అందరూ కలిసి ఉండటంతో నాకు సెక్యూరిటీ ఉండేది. వాళ్లే వంటలు చేసి, నాకు, ఆయనకి, అందరికీ పెట్టేవారు. పిల్లలందరూ ఉండటంతో బావుండేది. చిరంజీవి: సురేఖ తమ్ముడు ఉండేవారు. అతను చనిపోయారు. నా తమ్ముళ్లిద్దరిదీ వాళ్ల తమ్ముడి వయసు. వీళ్ల మీద సురేఖకు ఆ ఎఫెక్షన్ ఉండటానికి కారణం అదే. మనం ఎలా ఉంటే అవతలివాళ్లు మనతో అలా ఉంటారు. సురేఖ అందరితో బాగుంటుంది. సురేఖ: వాళ్లు కూడా చాలా బాగుంటారు. ఏ రిలేషనయినా రెండువైపులా ఉండాలి. ఈయన లేకపోయినా కల్యాణ్ (పవన్ కల్యాణ్) ఎప్పుడూ పిల్లలతో ఉండేవాడు. బాగా సరదాగా ఉండేవాడు. అందుకే కల్యాణ్ పిల్లలతోపాటు పెరిగాడు, పిల్లలు కల్యాణ్‌తో పాటు పెరిగారు అంటాం. కల్యాణ్‌తో పాటు, వీళ్ల చెల్లెలు మాతోపాటు ఉండి చదువుకుంది. ► త్రీ షిఫ్ట్స్ చేస్తూ షూటింగ్స్‌తో చిరంజీవిగారు బిజీగా ఉండేవారట. పెళ్లయిన కొత్తలో ఆ బిజీని ఎలా తీసుకున్నారు? సురేఖ: నాన్నగారిని చూస్తూ పెరిగాను కదా. నైట్ షూటింగ్‌లని ఆయన లేటుగా రావటం అన్నీ తెలుసు. మా పెళ్లయిన కొత్తల్లో ఈయన పొద్దున్నే షూటింగ్‌కి వెళ్లి సాయంత్రం 6 గంటలకు వచ్చేవారు. మళ్లీ ఫ్రెష్ అయి నైట్ షూటింగ్‌కి వెళ్లేవారు. ‘పున్నమినాగు’ షూటింగ్ జరుగుతోంది అప్పుడు. నా లైఫ్ అంతా ఇలానే ఉంటుందని ప్రిపేర్ అయిపోయాను కాబట్టి ఏమీ అనిపించలేదు. ► ప్యారిస్‌లో షూటింగ్ జరుగుతున్నప్పుడు మీ పేరు బదులు ‘జయ’ అని జయప్రదగారి పేరుతో మిమ్మల్ని పిలిచారట? సురేఖ: ఓ రోజు కాదు, రోజూ జరిగేది. నెల రోజులు జయప్రదతో షూటింగ్ చేస్తే ఆ నెల రోజులూ జయ, జయ అని పిలిచేవారు. మా పెళ్లయిన కొత్తల్లో అప్పటికి నన్ను సురేఖా అని పిలవడానికి అలవాటుపడలేదు. అందుకని ఒక్కోసారి జయ అని పిలిచేవారు. ‘ఏమండీ.. నేను రేఖ’ అనేదాన్ని. ‘ఓ.. సారీ, సారీ రేఖ’ అనేవారు. చిరంజీవి: సురేఖలో ఉండే ఆ స్పోర్టివ్‌నెస్ పరాకాష్ట అని చెప్పాలి. మరో గమ్మల్తైన విషయం చెబుతా. మా పెళ్లైన రెండు నెలలకి ప్యారిస్ వెళ్లాం. హోటల్లో రూమ్ తీసుకున్నాం. దానికోసం రిసెప్షన్లో ఫామ్స్ అన్నీ కంప్లీట్ చేసి ఇవ్వాలి కదా. అక్కడ అన్నీ ఫిల్ చేస్తూ భార్య అనే చోట ఆగిపోయాను. వెంటనే పేరు గుర్తు రాలేదు (నవ్వులు). ‘సురేఖ’ అని చెప్పి.. ‘అల్లు అని రాసేరు, కొణిదెల అని రాయండి’ అంది. ► మీరు ఎంతోమంది హీరోయిన్లతో నటించారు. వాళ్లతో సురేఖగారు ఎలా ఉంటారు? చిరంజీవి: సురేఖ వెరీ ఫ్రెండ్లీ. సుహాసిని, సుమలత, విజయశాంతి, రాధ, రాధిక.. అందరితో ఓ ఫ్యామిలీలా ఉంటుంది. మొన్న నవంబర్‌లో మా 80స్ క్లబ్ (1980లకు చెందిన నటీనటులు) రీయూనియన్ పార్టీ మా ఇంట్లోనే జరిగింది. అన్నీ తనే ఎరేంజ్ చేసింది. వాళ్లందరూ ‘ఇంత ఎరేంజ్ చేశారు, మీరూ పార్టీలో ఉండండి’ అంటే ‘మీరంతా ఫ్రెండ్స్. ఎంజాయ్ చేయండి’ అంది. సురేఖ: ఎరేంజ్ చేశాం కదా అని ఫ్రెండ్స్ మధ్యలో దూరిపోకూడదు (నవ్వుతూ). ► జనరల్‌గా చిరంజీవిగారి బర్త్‌డే అంటే ఫ్యాన్స్ మరచిపోనివ్వరు. మరి.. మ్యారేజ్ డే, మీ బర్త్‌డేని ఆయన గుర్తుపెట్టుకుంటారా? చిరంజీవి: గుర్తుండేది కాదు, గుర్తు లేకనే ఈ సంవత్సరం ఫైట్ సీక్వెన్స్ కోసం పోలవరం వెళ్లడానికి రెడీ అయ్యాను. ఈ 18న సురేఖ పుట్టినరోజు. 20న మా పెళ్లిరోజు. అది గుర్తు లేక 16 నుండి పోలవరంలో షూటింగ్ ప్లాన్ చేసుకున్నాం. మా అబ్బాయికి (రామ్‌చరణ్) గుర్తుకొచ్చింది. వాళ్లమ్మ దగ్గరికెళ్లి ‘18 నీ పుట్టినరోజు, 20 మీ పెళ్లిరోజు, డాడీ షూటింగ్‌కి ఎలా ఒప్పుకున్నారు?’ అంటే, ‘పోనీలే డాడీకి గుర్తులేదేమో’ అందట. ‘లేదమ్మా, అది మన షూటింగే కదా, వాళ్లతో మాట్లాడి మారుస్తాను’ అని మార్చేశాడు. సురేఖ: మా మ్యారేజ్ డే అయినా, నా బర్త్‌డే అయినా హడావిడి ఏమీ ఉండదు. ► గిఫ్ట్‌లు ఇస్తుంటారా? సురేఖ: రెండేళ్ల క్రితం నా బర్త్‌డేకి వాచ్ ఇచ్చారు. కరెక్ట్‌గా రాత్రి 12 గంటలకు నన్ను నిద్ర లేపి మరీ ఇచ్చారు. ఆ గిఫ్ట్ నాకివ్వటం కోసం ఎంత కష్టపడ్డారో తర్వాత తెలిసి ఆనందపడ్డాను. చిరంజీవి: ఆ బ్రాండ్ వాచ్ ఇక్కడ దొరకలేదు. బెంగళూర్‌లో ఉంది. ఆ కంపెనీవాళ్లను అడిగితే, ‘మీరు మా ప్రివిలేజ్డ్ కస్టమర్’ అని ఫ్లయిట్‌కి వచ్చి ఇచ్చి వెళ్లారు. ► కలిసి షాపింగ్స్‌కి వెళతారా? చిరంజీవి: షాపింగ్ అంటే ఇద్దరికీ ఇష్టం. ఇక్కడ కష్టం కాబట్టి విదేశాలు వెళ్లినప్పుడు బాగా తిరుగుతాం. లండన్ వెళితే ఓ అపార్ట్మెంట్ అద్దెకి తీసుకుని కొన్ని వారాల పాటు అక్కడే ఉంటాం. నాకు, తనకి కుకింగ్ అంటే సరదా. కుక్ చేసుకుని షాపింగ్‌కి వెళ్లిపోతాం. ► పండగలు బాగా చేస్తుంటారని విన్నాం. ప్లానింగ్ అంతా సురేఖ గారిదేనా? చిరంజీవి: నాగబాబు, పవన్‌కల్యాణ్, అల్లు అరవింద్ ఫ్యామిలీ... ఇలా అన్ని క్లోజ్ ఫ్యామిలీలు మొన్న దీపావళి పండగకి కలిశాం. దాదాపు మేమే ఓ వందమంది దాకా ఉంటాం. అందరికీ తనే మెసేజ్ పెడుతుంది. ఆ మెసేజ్‌కే చిన్న పిల్లల దగ్గరనుండి, పెద్దవాళ్లదాకా అందరూ తూచా తప్పకుండా హాజరవుతారు. సంక్రాంతి పండగను మూడు రోజులు చాలా ఘనంగా చేసింది. అప్పుడు పంక్తి భోజనాలు పెట్టి, పెద్ద భోగి మంట ఏర్పాటు చేయించింది. పండగ అనేది వంకే తప్ప, అందరూ కలవాలనుకుంటుంది. అందుకే అందరితోనూ తనకు మంచి బాండింగ్ ఉంటుంది. సురేఖ: ఈయన మొదట్నుంచి వాళ్ల పిల్లలు, వీళ్ల పిల్లలు అని కాదు.. అందరి పిల్లలతో బాగుంటారు. చిన్నప్పుడు అందరి పిల్లలు ఓ పదిహేనుమంది దాకా అయ్యేవారు. అందరినీ షూటింగ్‌లకు తీసుకెళ్లేవారు. మాల్దీవ్స్ వెళ్లినా, స్విస్ వెళ్లినా హాలిడే ఉందంటే చాలు.. అల్లు వెంకటేశ్, బన్నీ, శిరీష్ ఇలా అందరి పిల్లల్ని ఫారిన్ తీసుకెళ్లేవారు. చిరంజీవి: పిల్లలందరికీ వండర్ఫుల్ మెమొరీస్ నాతోనే ఉంటాయి. నేనెన్ని చేసినా దాన్ని ఆర్గనైజ్ చేసి, మేనేజ్ చేసేవాళ్లు కావాలి. అది సురేఖ చేస్తుంది. ► పండగలవీ శ్రద్ధగా చేస్తున్నారంటే పూజలు బాగా చేస్తారా? సురేఖ: మరీ అంత ఎక్కువ కాదు. రోజూ మామూలుగా చేస్తా. స్పెషల్ అకేషన్ అంటే కచ్చితంగా బాగా చేస్తాను. మనం చేస్తుంటేనే పిల్లలు కూడా ఫాలో అవుతారు. మన నెక్ట్స్ జనరేషన్‌కు తెలుస్తుంది. మనం వదిలేస్తే వాళ్లూ వదిలేస్తారు. మా సుస్మిత, శ్రీజ పెళ్లి చేసుకుని వెళ్లిపాయినా ఇక్కడ పూజలు చేసినట్లే అత్తగారింట్లో చేస్తారు. ► మనవళ్లు, మనవరాళ్ల గురించి ? సురేఖ: అదొక లవ్లీ లైఫ్. ఈయనకి అప్పట్లో తీరిక లేక మా పిల్లల ఎదుగుదలను చూడలేదు. ఇప్పుడు చిన్నపిల్లలతో టైమ్ స్పెండ్ చేస్తున్నారు. అందరికీ ఆయనంటే పిచ్చి ఇష్టం. వాళ్లతో ఆయన ఎన్ని ఆటలు ఆడతారో చెప్పలేం. ► మీ ఇద్దరి మధ్య గొడవలు జరుగుతుంటాయా? చిరంజీవి: ఎందుకు జరగవు? తిట్టుకుంటానే ఉంటాం సురేఖ: అలా జరగబట్టే ఇంత సక్సెస్‌ఫుల్‌గా ఉన్నాం. ఎప్పుడూ స్వీట్ స్వీట్‌గా ఉంటే బోర్. ► ఇద్దరిలో ఎవరు సీరియస్? ఎవరు కామెడీ? చిరంజీవి: నేను కామెడీగా ఉండను. అలాగని పెద్ద సీరియస్‌గా కూడా ఉండను. కామెడీ అంటే సురేఖనే ఎక్కువ. ఆమె పంచ్‌లను తట్టుకోవటం చాలా కష్టం. ఒక్కోసారి ఆ పంచ్‌లకు గుక్క తిప్పుకోలేం. ► ఫైనల్లీ.. మళ్లీ జన్మంటూ ఉంటే మీరే కపుల్‌గా ఉండాలనుకుంటున్నారా? చిరంజీవి: నేను ఆ మద్రాస్ కోడంబాకం బ్రిడ్జి మీదకి మాత్రం వెళ్లను (పెద్దగా నవ్వుతూ). ఐయామ్ జస్ట్ కిడింగ్. డెఫ్నెట్లీ మేమే ఉండాలనుకుంటున్నాం. సురేఖ: అంతే... ► మీరు కట్టుకునే చీరలు బాగుంటాయి. మీవారు కాంప్లిమెంట్స్ ఇస్తుంటారా? సురేఖ: థ్యాంక్యూ. నాకు అప్డేటెడ్గా ఉండటం ఇష్టం. దానికి కారణం చిరంజీవిగారే. ఆయనకు ఫ్యాషన్ గురించి, కలర్స్ గురించి చాలా అవగాహన ఉంది. ఇంకో విషయం ఏంటంటే.. ఆయన చీర చూడగానే రేటు చెప్పేస్తారు. అది ఏ చీర అయినా కానివ్వండి.. బట్టల గురించి అంత ఐడియా ఉంది. నేను కట్టే చీరలు బాగుంటాయని అందరూ అంటుంటే బాగానే ఉంటుంది. కానీ అదే విషయాన్ని ఆయన నోటి నుంచి వింటే ఆ ఆనందమే వేరు. అంతేకదా.. మనం శ్రద్ధగా డ్రెస్ చేసుకున్నప్పుడు భర్త నుంచి ఓ చిన్ని కాంప్లిమెంట్ వస్తే ఆ ఫీలింగే స్పెషల్. ఆ విషయంలో ఆయన హండ్రెడ్ పర్సంట్ బెస్ట్. అన్నీ పట్టించుకుంటారు. కాంప్లిమెంట్స్ ఇస్తారు. ► సో.. మీ కళ్లబ్బాయి పక్కా ఫ్యామిలీ మ్యాన్ అన్నమాట? సురేఖ: డౌట్ ఏముంది? హండ్రడ్ పర్సంట్ పక్కా ఫ్యామిలీ మ్యాన్. ► 30 ఏళ్లు నటించి ఓ పదేళ్లు పాలిటిక్స్‌కి దగ్గరగా ఉండటంవల్ల సినిమాలకు దూరమయ్యారు. ఆ గ్యాప్ గురించి? సురేఖ: అప్పుడు పీస్‌ఫుల్‌గా ఉండేవారు కాదు. మాకూ అలానే ఉండేది. ఆయనకి మేకప్ వేసుకోగానే హుషారు వస్తుంది. చిరంజీవి: పనులన్నీ ముగించుకుని ఇంటికొచ్చాక కూడా మరుసటి రోజు ఏం మాట్లాడాలి? అనేదాని చుట్టూనే ఆలోచనలు ఉండేవి. ‘సినిమాలు చేయడం మొదలుపెట్టాక మళ్లీ మిమ్మల్ని మా మనిషిలా చూస్తున్నాం’ అంటున్నారు. సురేఖ: ఇప్పుడు ఫుల్ హుషారు. ఉదయం 9కి వెళ్లాలంటే ముందే రెడీ అయి కూర్చుంటారు. షూటింగ్ ఉంటే.. హీ ఈజ్ ఫుల్ యాక్టివ్. చిరంజీవి: ‘సైరా’ సినిమాకి 4.30కి లేచి వర్కవుట్ చేసుకొని 5.30గంటలకల్లా రెడీ అయ్యి 6 గంటలకు లొకేషన్‌కి వెళ్లి 7 గంటలకల్లా మేకప్‌తో రెడీగా ఉండేవాణ్ణి. ఇప్పుడు కొరటాల శివతో చేస్తున్న సినిమా షూటింగ్ షార్ప్ 7కల్లా స్టార్ట్ చేస్తున్నాం. జనవరి 2న షూటింగ్ స్టార్ట్ చేశాం. అప్పుడే ఓ సాంగ్, మూడు ఫైట్స్ కంప్లీట్ అయ్యాయి. ► మీ పెళ్లప్పటికే చిరంజీవిగారు కెరీర్‌వైజ్‌గా మంచి ఫామ్‌లోకొచ్చారు.. ఆ బిజీని ఎలా తీసుకునేవారు? సురేఖ: ఆయన కనబడటమే అపురూపంగా ఉండేది. ఎప్పుడూ షూటింగ్‌లతో దూరం, దూరంగా ఉండటంతో కళ్లారా ఎప్పుడు చూస్తానా అనిపించేది. చిరంజీవి: నేను ఫిలిం ఇన్స్టిట్యూట్లో ఉన్నప్పుడే అవకాశాలు మొదలయ్యాయి. ఆల్బమ్ పట్టుకుని అవకాశాల కోసం ఆఫీసుల చుట్టూ తిరిగే పరిస్థితి రాలేదు. అందుకే పెళ్లినాటికే ఫామ్‌లో ఉన్నా. అప్పుడేమో నేను కనబడితే రేఖకి అపురూపం. మనవరాళ్లు వచ్చాక ఎఫెక్షన్ తగ్గింది. పలకరిస్తే ‘ఆ వస్తున్నా’ అంటుంది. వచ్చి చూడదు. అందుకేనేమో లేటు వయసులో చాలామంది సెకండ్ కోసం చూస్తుంటారు (కొంటెగా నవ్వుతూ). అయినా నేనా ధైర్యం చేయలేను. ► చిరంజీవిగారు, చరణ్ కలిసి ఫుల్ లెంగ్త్ సినిమా చేయాలని ఉందా? సురేఖ: ఇద్దరినీ ఓ సినిమాలో చూడాలని ఉంది. ‘ఖైదీ నంబర్–150’లో ‘అమ్మడూ లెట్స్ డూ కుమ్ముడు’ పాట మధ్యలో చరణ్ వచ్చి డ్యాన్స్ చేస్తాడు. వాళ్లిద్దరూ కలిసి డ్యాన్స్ చేస్తుంటే ఈయన్ని చూడాలా, చరణ్‌ని చూడాలా అనుకున్నాను. ఆ తర్వాత ఇంట్లో ఆ సినిమా చూస్తూ ఒకసారి ఈయన్ని, మళ్లీ ఆ పాట పెట్టుకుని ఒకసారి చరణ్‌ని చూశాను. ► నటుడిగా చిరంజీవిగారు రిస్కీ ఫైట్స్ చేస్తుంటారు. మీకెలా అనిపిస్తుంది? సురేఖ: లొకేషన్లో ఏం చేసేవారో తెలిసేది కాదు కానీ, చేసొచ్చిన తర్వాత చెబుతుంటే ‘బాబోయ్’ అనిపించేది. ఎప్పుడో పొద్దున వెళితే సాయంత్రానికి వచ్చేవారు. అలా కాకుండా ఏ పదకొండింటికో ఆయన ఇంటికి వచ్చేస్తున్నారు అని ఎవరైనా చెబితే మాత్రం, ఏదో దెబ్బతగిలే ఉంటుందనుకునేదాన్ని. అలాగే ఫైట్ సీన్స్ అంటే మధ్యలో లొకేషన్ నుంచి ఫోన్ రాకూడదని కోరుకుంటా. ఫోన్ వస్తే ఆయనకు ఏదైనా దెబ్బ తగలిందని చెబుతారేమోనని భయం. ఇప్పుడు ఫర్వాలేదు కానీ అప్పట్లో ఇంత కంఫర్టబుల్ షూస్ కానీ, సేఫ్టీ ప్రికాషన్స్ కానీ లేవు కదా. ఈయనేమో డూప్ కూడా వద్దంటారు. – డి.జి. భవాని -
‘సిరీక్ష’ నా ప్రాణం...!
తల్లిని మించిన దైవం లేదు. కనిపించని దేవతల కన్నా.. నిత్యం మనకు కన్పించే తల్లిదండ్రులే నా దృష్టిలో అసలైన దేవుళ్లు. వాళ్ల ఆశీర్వాదం ఉంటే ప్రపంచాన్నైనా జయించొచ్చన్నది నా అభిప్రాయం. వాళ్ల మనస్సును బాధపెట్టి ఏ ఒక్కడూ హాయిగా బతకలేడు. అందుకే నేను ఇంటి నుంచి ఎప్పుడు బయటికి వెళ్లినా ముందు మా అమ్మ కాళ్లు మొక్కుతా. కొన్ని సందర్భాల్లో నేను ఇతర ప్రాంతాల్లో ఉంటే ఫోన్లోనైనా కచ్చితంగా నా తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకుంటా. తల్లి నవ మాసాలు బిడ్డను తన కడుపులో మోస్తే.. తండ్రి ఆ నవమాసాలు తన ఆలోచనల్లో బిడ్డల గురించి ఆలోచిస్తూనే ఉంటాడు. సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: సాధారణ కుటుంబం నుంచి వచ్చిన అసాధారణమైన వ్యక్తి ఆయన. ఓ ఉద్యోగిగా సమాజానికి పరిచయమై.. తల్లిదండ్రులు, అన్ని వర్గాల ప్రజల ఆశీస్సులు.. తెలంగాణ ప్రజానీకం ఆశీర్వాదంతో రాష్ట్రానికే మంత్రిగా వ్యవహరిస్తోన్న జననేత. ఒంటిపై తెల్ల బట్టలు.. ఎప్పుడూ ముఖంలో చిరునవ్వు అందరినీ ఆప్యాయంగా పలకరించే తత్వం ఆయనకే సొంతం. ప్రజాసేవనే పరమావధిగా భావించే గొప్ప నేత ఆయన. పేదోడి గుండెలోనే దేవుడుంటాడని నమ్మి.. ప్రజా సంక్షేమం కోసం పరితపించే ప్రజా నాయకుడతను. సమాజమే తన కుటుంబంగా.. మతాలు.. కులాలు అన్నీ తనవే అని భావించే నాయకుడు. అందరూ బాగుండాలి.. అందు లో నేనుండాలి అనే సిద్ధాంతాన్ని నమ్మి ప్రజాసేవకే అంకితమైన మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే, రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తో ‘సాక్షి’ పర్సనల్ టచ్ ఆయన మాటల్లోనే.. మాది మహబూబ్‌నగర్ జిల్లా అడ్డాకుల మండలం రాచాల గ్రామం. నాన్న నారాయణగౌడ్ ప్రధానోపాధ్యాయుడిగా పని చేసి పదవీ విరమణ పొందారు. అమ్మ శాంతమ్మ గృహిణి. మేం ఇద్దరం అన్నదమ్ములం. ఓ చెల్లి. తమ్ముడు శ్రీకాంత్ గౌ డ్ మహబూబ్‌నగర్‌లోనే ఉంటాడు. చెల్లి శ్రీదేవికి పెళ్ల యింది. బావ చంద్రశేఖర్‌గౌడ్ ట్రాన్‌పోర్ట్ డిపార్ట్మెంట్లో పని చేస్తారు. 1991లో పొల్కంపల్లికి చెందిన శార దతో వివాహమైంది. మాది పెద్దలు కుదిర్చిన సంబంధం. మాకు ఇద్దరు కూతుళ్లు. శ్రీ హిత, శ్రీహర్షి ఇద్దరూ ఎంటెక్ చదివారు. శ్రీహిత పెళ్లయింది. అల్లుడు డాక్టర్ శరత్ చంద్ర సన్‌షైన్ హాస్పిటల్లో పని చేస్తారు. మతాలు.. కులాలన్నీ నాయే వేంకటేశ్వరస్వామి, షిరిడీ సాయి నా ఇష్ట దైవాలు. అలా అని నేడు గుడికి మాత్రమే వెళ్లను.. దర్గాకూ వెళ్తా.. చర్చికీ వెళ్తా.. గురుద్వారకూ వెళ్తా. అన్ని మతాల సారాంశం ఒక్కటే అని నమ్మే వాడిని నేను. ఒక్కో మతం ఒక్కో దారిని చూపించింది దారులన్నీ మోక్షానికి తీసుకెళ్తాయి. కుల, మతాల పట్టింపులు నాకు లేవు. అంతకు మించి చెప్పాలంటే పేదోడి గుండెలోనే దేవుడు కొలువై ఉంటాడనేది నా అభిప్రాయం. అవసరం ఉన్న వారిని ఆదుకుంటే జీవితానికి సార్థకత లభించినట్టే. ఉపవాసాలు.. దానధర్మాలు.. పూజలు పురస్కారాల కంటే పేదోడి సేవలోనే ఎక్కున పుణ్యం లభిస్తుందనేది నా విశ్వాసం. బెస్ట్ ఫాదర్ అండ్ మదర్: శ్రీహర్షి మా తల్లిదండ్రులే మాకు రోల్ మోడల్. బెస్ట్ ఫాదర్ అండ్ బెస్ట్ మదర్. నాన్న ప్రజాజీవితంలో బిజీగా ఉన్నప్పటికీ ఏనాడూ మమ్మల్ని విస్మరించలేదు. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఏనాడూ ఇద్దరు కనీసం చిన్న వాగ్వాదం కూడా చేసుకోలేదు. నాన్న మా భవిష్యత్‌పై ఎంత శ్రద్ధ తీసుకుంటున్నారో.. ప్రజల బాగోగుల గురించి అంతే డిస్కస్ చేస్తారు. నాన్న ఎంత బిజీలైఫ్గా ఉన్నా రాత్రయితే కచ్చితంగా ఇంటికొస్తారు. మాతో కనీసం పది నిమిషాలైన గడుపుతారు. చదువు, ఇతర అవసరాల గురించి చర్చిస్తారు. ఇలాంటి అమ్మానాన్నలు ఉండడం మా అదృష్టం. కొడుకులు లేరనే బాధ లేదు సహజంగా ప్రతి తల్లిదండ్రులకు కొడుకు ఉంటే బాగుంటుంది. వంశాన్ని ముందుకు తీసుకెళ్తాడనే అభిప్రాయం ఉంటుంది. కానీ నాకు ఇద్దరూ ఆడపిల్లలే. అయినా నేను, శారద మాకు కొడుకులు లేరని ఏనాడూ నిరాశ చెందలే. వాస్తవంగా కొడుకుల కంటే కూతుళ్లే తల్లిదండ్రుల బాగోగులు చేసుకుంటారనేది మా అభిప్రాయం. ఇది నా జీవితంలో మాత్రం నూటికి నూరు శాతం నిజమైంది. నా ఇద్దరు బిడ్డలకు నేనంటే ప్రాణం. నాకు ఏ సమస్య వచ్చినా తట్టుకోలేరు. నేనూ వాళ్లను విడిచిపెట్టి ఉండలేను. కోపం తగ్గించుకున్నారు: శారద ఉద్యోగం చేస్తున్నప్పుడు..ఉద్యమ సమయంలో మా ఆయనకు కోపం ఎక్కువగా ఉండేది. కొన్ని సందర్భాల్లో నేనే భయపడే దాన్ని. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. ప్రజాజీవితంలో అడుగుపెట్టిన తర్వాత ఆయనలో కోçపం పూర్తిగా తగ్గింది. ఎవరు ఏమ న్నా ఓర్పుతో వింటారు. ఇక కుటుంబ విషయానికి వస్తే ఆయన ఏనాడూ కుటుంబంలో ఎవరినీ విస్మరించలేదు. అత్తమామల కోసం, మా కోసం కచ్చితంగా సమయం కేటాయిస్తారు. బంధువుల ఇళ్లలో పెళ్లిళ్లు, శుభకార్యాలు ఏవైనా ఉంటే దాదాపు వస్తారు. మా ఆయన రాష్ట్రానికి మంత్రిగా వ్యవహరించడం, ప్రజల సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేస్తుంటే గర్వంగా ఉంది. ‘సిరీక్ష’ నా ప్రాణం...! నా మనవరాలు సిరీక్ష అంటే నాకు ప్రాణం. నా చిన్నారిని చూడకుండా ఒక్క రోజు కూడా ఉండలేను. నా ఇద్దరు కూతుళ్ల చిన్నతనంలో నేను ఉద్యోగం, ఇతర కార్యక్రమాల్లోనే ఎక్కువ సమయం గడిపా. ఇంటి నుంచి ఉదయం బయటికి వెళ్తే వచ్చే వరకు రాత్రయ్యేది. అప్పటికే శ్రీ హిత, శ్రీ హర్షి నిద్రపోయేవారు లేదా చదువులో నిమగ్నమంగా ఉండే వారు. ఆ సమయంలో వారి చదువు, నిద్రకు భంగం కలిగించకపోయే వాడిని. చూస్తూనే వాళ్లిద్దరూ ఎదిగారు. వాళ్ల బాల్యాన్ని చూసింది తక్కువే. తర్వాత చాలాసార్లు నాకు అనిపించేంది.. నా పిల్లలతో ఎక్కువ సమయం కేటాయించలేకపోయాయని. తరుచూ బాధపడేవాడిని. కానీ ఇప్పుడు మనవరాలు, శ్రీ హిత బిడ్డ సిరీక్షతో నాకు అటాచ్మెంట్ పెరిగింది. ఇప్పుడు ప్రజాసేవలో ఉన్నప్పటికీ సిరీక్షను వదిలిపెట్టి ఒక్కరోజు కూడా ఉండలేను. ఎక్కడికి వెళ్లినా రాత్రికి ఇంటికి తిరిగి వచ్చేస్తా. అప్పటి వరకు నా చిట్టి తల్లి ఈ తాతా కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. మంత్రినవుతానని ఊహించలేదు 30ఏళ్ల కిత్రం నేను మున్సిపాలిటీలో పబ్లిక్ హెల్త్ ఇన్స్పెక్టర్గా బాధ్యతలు చేపట్టిన. అప్పుడు ఆ ఉద్యోగం వచ్చినందుకు చాలా సంతోషపడ్డ. శాఖలోనే ప్రమోషన్లు వస్తాయి. ఏదో ఉన్నత పోస్టు నుంచి రిటైర్డ్ అవుతానని భావించిన. కానీ తెలంగాణ ఉద్యమం నాకు ఈ రోజు మంత్రి హోదా తెచ్చిపెట్టిందని భావిస్తున్న. ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించి ఉద్యోగులందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చిన నాకు కేసీఆర్ ఎమ్మెల్యే టికెట్ ఇస్తే జనం ఓటేసి ఆశీర్వదించారు. నేను రాష్ట్రానికి మంత్రినవుతానని ఏనాడూ అనుకోలేదు. కేసీఆర్ రోల్ మోడల్ సీఎం కేసీఆర్ నాకు రోల్ మోడల్. ప్రాణాలను లెక్క చేయకుండా ఉద్యమాన్ని తారాస్థాయికి తీసుకొచ్చి.. ఆమరణ దీక్ష చేపట్టి ఎట్టకేలకు ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్‌కే దక్కింది. 2001లో కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసినప్పటి నుంచి ఆయన వెంటే ఉన్న. 2004లో తెలంగాణ ఉద్యోగుల జేఏసీకి సెక్రటరీ జనరల్‌గా పనిచేశా. 2009లో పొలిటీకల్ జేఏసీ కో– చైర్మన్‌గా పని చేశా. పెళ్లి రోజు వేడుకైనా.. జన్మదినోత్సవ వేడుకలైనా అనాథ పిల్లల మధ్య జరుపుకోవడం అలవాటు. తర్వాత స్నేహితులు.. బంధుమిత్రులు వచ్చి శుభాకాంక్షలు తెలుపుతారు. వాళ్లతో, నా బిడ్డలతో కలిసి ఇంట్లో వండుకుని తింటాం. సహజంగా నాకు ఖాళీ సమయం అనేది దొర కదు. మంత్రిగా ఇప్పుడు మరింత బిజీగా ఉంటున్న. అయినా కొంత ఖాళీ సమయం దొరికితే. పెండింగ్‌లో ఉన్న ప్రజా సమస్యలను ఎలా పరిష్కరించాలి.? అనే దానిపై ఆలోచిస్తా. అలాగే ప్రజలకు నేను ఇచ్చిన హామీలు ఏ మేరకు నెరవేర్చాను? అని తెలుసుకునే ప్రయత్నం చేస్తా. మానవసేవే మాధవసేవ అనే సిద్ధాంతాన్ని నమ్ముతా. పేదలే నా బలం.. నా బలహీనత. వాళ్లు సంతోషంగా ఉంటే నేనూ సంతోషంగా ఉన్నట్టే. ఆపదలో ఉన్న వారిని చూసి తట్టుకోలేను. ఎవరికీ ఏ ఇబ్బంది వచ్చినా నా దగ్గరికి వస్తారు. అలాంటి వాళ్లను ఆదుకోవడంలో ఉన్న తృప్తి నాకు ఎందులోనూ దొరకదు. ఎవరైనా ఏ జబ్బుతోనైనా ఆస్పత్రిలో చేరిన విషయం నా దృష్టికి వస్తే కచ్చితంగా వారి పరామర్శకు వెళ్తా. దీన్ని నేను ఓ అలవాటుగా మార్చుకున్న. దేవుడు ఎక్కడో లేడు పేదోడి గుండెల్లోనే ఉన్నడు. అలాంటి వారికి సహాయం చేస్తే జీవితానికి సార్థకత. పోరు‘సత్వం’ పుచ్చుకున్న ఉద్యమపోరునే నేను వారసత్వంగా పుచ్చుకున్న. 1969లో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తునా సాగుతోన్న క్రమంలో మా నాన్న గారు ముసాపేట జిల్లా పరిషత్ హైస్కూల్లో ప్రధానోపాధ్యాకుడిగా పని చేస్తున్నారు. ఆ సమయంలో మా నాన్న పిల్లలతో కలిసి అక్కడ రోడ్డుపై రాస్తారోకో చేశారు. బస్సులు ఆపారు. అప్పుడు ఎవరూ గుర్తు తెలియని వ్యక్తులు మా నాన్నను పొడిచారు. చనిపోయాడనుకుని అక్కడి పోలీస్ స్టేషన్లో పడేసి వెళ్లిపోయారు. కానీ దేవుడి దయవల్ల నాన్న బతికారు. ఆ సంఘటన మరిచిపోలేకపోతున్న. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఎంత అవసరమో అని అప్పుడే నాకు తెలిసింది. 1988లో మున్సిపల్ కార్యాలయంలో హెల్త్ ఇన్స్పెక్టర్గా నా ఉద్యోగ ప్రస్తానం మొదలుపెట్టా. తర్వాత అంచెలంచెలుగా పదోన్నతులు సాధించి హైదరాబాద్, శేరిలింగంపల్లి, కాప్రా, అల్వాల, రాజేంద్రనగర్ మున్సిపాలిటీలకు కమిషనర్‌గా బాధ్యతలు నిర్వర్తించా. ఉద్యోగులకు కిరణం ఆంధ్రా వలసవాదుల పాలనలో నేను ప్రభుత్వ ఉద్యోగిగా పని చేస్తున్నప్పుడు తెలంగాణ ఉద్యోగులు ఎన్నో రకాల సమస్యలు.. ఇబ్బందులకు గురయ్యే వారు. వారి సమస్యల గురించి ఎవరూ పట్టించుకోలేదు. ఆ సమయంలో 2005లోనే నేను ఉద్యోగుల కిరణం అనే మాస పత్రికను స్థాపించాను. అందులో తెలంగాణలో ఉద్యోగులు పడుతోన్న బాధలు, శాఖల వారీగా అవసరమైన సమాచారాన్ని ప్రచురించడం ప్రారంభించా. తెలంగాణ ఉద్యమ వార్తలు ప్రచురించి ఉద్యోగుల్లో ఉద్యమ ఆకాంక్షను బలోపేతం చేశా. అప్పట్నుంచీ నేనే ఆ పత్రికకు ఎడిటర్‌గా ఉన్న. పద్నాలుగేళ్ల నుంచి ఈ పత్రికను నేనే నడుపుతున్నందుకు గర్వంగా ఉంది. -
తినలేని అందం
ఎవరు కట్టించినా తన బోటివాడు కాపుర ముండడానికేనని అనుకున్నాడు. పుట్టి భూమిపైన బ్రతుకు తున్నందుకు ఇలాంటి సుందర సీమకు దగ్గరగా ఉండగలిగితేనే మానవ జన్మకు సార్థక్యమనుకున్నాడు. సుందరానికి అలిపిరి గాలిగోపురం అందుకోవలసిన ఆదర్శంలా కనిపిస్తూ ఉండేది. అప్పట్లో అతడు హైస్కూల్లో చదువుకునే కొంటె విద్యార్థి. కొత్తగా కొండపైకి రహదారి వేసిన రోజులు. బస్సుల్లో వెళ్తే రావలసినంత పుణ్యం రాదేమోనని యాత్రికుల్లో ఎక్కువమంది మెట్ల వెంబడే వెళ్తుండేవాళ్ళు. ఎత్తయిన కొండపైన ఠీవిగా నిలబడి, అలిపిరి గాలిగోపురం సుందరాన్ని కవ్విస్తుండేది. ప్రతి సాయంకాలమూ అదొక హేలగా చెంగు చెంగున ఎగురుతూ కొండ మెట్లెక్కి పోయేవాడు. చెట్లతో, పొదరిళ్ళతో, సెలయేళ్ళతో, మాటిమాటికీ క్రిందికి జారివచ్చే మబ్బు తెరలతో అదొక కొండల రాజు మేడ. తన ఇష్టం వచ్చినంత సేపు తానా మేడలో విడిది చేయవచ్చు. ఆ అందానికి పాతికేళ్ళు దూరమై పోయాడు సుందరం. మురికి పేటల్లో నివసించాడు. పైకి చూస్తే ఆకాశం, ప్రక్కలికి చూస్తే జనం, కిటకిటలాడే ఇరుకైన ఇండ్లు, క్రిందికి చూస్తే సైడుకాలువలు. జీవితాశయం నుంచి వంచింపబడి కాలం వెళ్లదీసిన సుందరానికి ఓ కాగితం చేతికొచ్చింది. మరేం లేదు. ప్రమోషను. సుందరానికి ఆమందానందం కలిగినందుకు అదొక్కటే కారణం గాదు. ప్రమోషను మూలంగా వచ్చిన బదిలీ తిరుపతికే వచ్చింది. కోరిన కొండలో కురిసిన వాన! తిరుపతికి వచ్చి ఉద్యోగంలో జాయినైన సాయంకాలమే కొండవైపు వెళ్లాడు. ఈనాటి తిరుపతి చిట్టడవుల్ని కబళిస్తూ కొండవైపు బారలు చాస్తూ ఉండడం గమనించి నొచ్చుకున్నాడు. కానీ అలిపిరి కనిపించేసరికి అంతై, ఇంతై, ఇంతింతై తాను మళ్లీ ఒకసారి చిన్నవాడై, ఆ ఉత్సాహంలో అవలీలగా పదిమెట్లు ఎక్కేశాడు. పదకొండో మెట్టు దగ్గరికి వచ్చేసరికి కాస్తా మెల్లగా ఎక్కితేనే బాగుండుననిపించింది. అసురుసురై పోయిన సుందరం యాభయ్యో మెట్టు దగ్గర కూలబడిపోయాడు. ఇంకొక అంచెలో ఇంకొక యాభై మెట్లు. అలా ఎన్ని అంచెలు దాటితేనో అలిపిరి. యాభయ్యో మెట్టు దాటి పైకి వెళ్లనే లేదు. అందుకో కారణం ఉంది. కపిలతీర్థం దగ్గర మలుపు తిరిగి కొండకు సమాంతరంగా వస్తున్న రోడ్డుకు ప్రక్కగా, రూయా హాస్పిటలుకు గూడా రెండు ఫర్లాంగుల దూరంలో అతడి కొక మేడ కనిపించింది. ప్రశాంతతే రాజ్యమేలుతున్న నిర్జన ప్రదేశంలో చిన్న మేడ? చుట్టూ ప్రాకారం. ముందు వైపుగా వసారా. మిద్దెపైన ఒకటో రెండో గదులు. ఈ కొండ, ఈ కోన, ఈ సోపాన పంక్తీ, ఈ అలిపిరి గాలిగోపురం ఇవన్నీ కనిపించేటట్లుగా మిద్దెపైన గదులకు కిటికీలు గూడా ఉన్నాయి. ఎవరు కట్టించినా తన బోటివాడు కాపుర ముండడానికేనని అనుకున్నాడు. పుట్టి భూమిపైన బ్రతుకు తున్నందుకు ఇలాంటి సుందర సీమకు దగ్గరగా ఉండగలిగితేనే మానవ జన్మకు సార్థక్యమనుకున్నాడు. రేపో, మరునాడో లారీలో సామాన్లొచ్చేస్తాయి. పది పదిహేను రోజుల్లో పిల్లల్ని వెంట బెట్టుకుని రాజ్యం వస్తుంది. అమాంతంగా ఆమెను ఇంటికి తీసుకొచ్చి ఆశ్చర్యంతో ఉక్కిరిబిక్కిరి చేసెయ్యాలి. అన్నీ అతడనుకున్నట్టే జరుగుతూ వచ్చాయి. విదేశాల నుంచి వచ్చిన చిత్రకారుడెవరో ఏకాంతంగా ఉండడం కోసం ఆ ఇల్లు కట్టించుకున్నాడని తెలిసింది. వెళ్తూ వెళ్తూ దాన్నొక పెద్దమనిషికి అమ్మకం చేసిపోయాడు. మళ్లీ అంత డబ్బు పెట్టి కొనడానికిగానీ, కనీసం అద్దెకుండడానికి గానీ ఎవ్వరూ ముందుకు రాకుండా ఉన్న ఆ ఇంట్లో సుందరం తానుంటానని చెప్పేసరికి ఇంటి యజమాని విస్తుపోయాడు. ముందుగా జాబు వ్రాసి, బస్‌స్టాండులో దిగిన భార్యా బిడ్డల్ని టాక్సీలో తీసుకొస్తున్నాడు సుందరం. కపిలతీర్థం ఛాయలకు రాగానే అడిగింది రాజ్యం– ‘‘ఏమండీ? మనం కాపురముండడానికి కొండపైన కాటేజీ ఏదైనా చూచారా?’’. ‘‘లేదు లేదు. కొండ కిందనే మన కాపురం’’ అన్నాడు.కారియర్లో తెచ్చుకున్న భోజనంతో ఆ పూట గడిచిపోయింది.వర్షం కోసం ముఖం వాచిపోయి ఉన్న తిరుపతిలో నెల రోజుల నుంచీ వానజల్లులు పడుతున్నాయి. ఉదయం నుంచీ చిత్తడి వాన. చీకటి పడింది. కొండమెట్ల దీపాలు వెలిగాయి.‘‘చూచావా రాజ్యం!’’ అన్నాడు సుందరం. ‘‘రాత్రివేళ ఈ కొండవైపు చూస్తే పద్మావతీదేవి పడుకున్నట్టుంది. కొండమెట్ల దీపాల చాలు ఆమె వేసుకున్న పూలజడలా కనిపిస్తుంది. వేలకొలది దీపాలతో వెలిగిపోతున్న అలిపిరి గాలి గోపురమే జడబిళ్ల. క్రింది గోపురాన్ని జడకుచ్చులనుకోవచ్చు. అద్భుతమైన దృశ్యం కదూ!’’ రాజ్యం భయంగా కొండవైపు చూచింది. అంతలో వినీల జలదాలు కొన్ని కొండపైన విరుచుకు పడసాగాయి.‘‘ఏమండీ! పద్మావతీదేవి ఏమయ్యేటట్టు?’’ అంది రాజ్యం.‘‘మరేం భయపడొద్దులే. స్వామి నీలమేఘశ్యాముడు గదా! ఆయనిప్పుడు అమ్మవారి సరసకొస్తున్నాడని ఊహించుకో’’ అన్నాడు సుందరం.ఆలోగా మబ్బులు చరచరా క్రిందికి దిగి వచ్చేశాయి. ఇప్పుడు కొండలో సగానికి పైగా మబ్బుల చాటున మాటుపడి పోయింది.‘‘శరీరచ్ఛాయ మాత్రమే కాదులెండి! మనిషి గూడా మోటువాడల్లేనే ఉన్నాడు. లేకుంటే పూలజడపైకి దొర్లుకునే వాడేనా?’’ తోటి ఇల్లాలి పైన జాలిపడి పోతూ అంది రాజ్యం.అలిపిరి వెనుక మబ్బుల్లో మెరుపులు తళుక్కు తళుక్కుమని మెరిసిపోతున్నాయి.‘‘గిలిగింతలు పెడితే నవ్వినట్టుంది గదూ?’’ ‘‘పుణ్యాత్ముడు! రాత్రంతా నిద్ర పోనివ్వడేమో గదూ! ఐనా ఇన్ని గిలిగింతలు పెడితే ఆ ఒళ్లేమి కావాలని?’’ఉన్నట్టుండి ఆమె మాట కడ్డొచ్చాడు సుందరం. ‘‘ఆహా చూచావా? ఏదీ గోపురం? ఏదీ అలిపిరి? అదృశ్యమైపోయింది. ఆవరించి ఉన్న కారుమబ్బే నిజమనిపిస్తుంది. ‘‘మాయ’’ ఎంత పనిచేసిందో చూచావా, ఆత్మ పదార్థాన్నే కనిపించకుండా చేసింది గదూ!’’ ‘‘అబ్బ, ఊరుకుందురూ! కాసేపటికదే కనిపిస్తుంది గానీ’’ ఆవలిస్తూ అంది రాజ్యం.మరునాటి ఉదయం రాజ్యం లేవదీసిన రకరకాల సమస్యలతో తెల్లవారింది. పిల్లలెలా బడికి వెళ్తారు? మార్కెట్టు కెలా వెళ్లిరావాలి? ప్రొద్దు పోకపోతే ఎవరితో మాట్లాడాలి?‘‘ఏముంది? కిటికీ తెరిచి పెట్టుకుని మెట్లదారి వైపు చూస్తుంటే తెల్లవారిపోదా రాజ్యం?’’ ఎంచినట్టుగా పదిహేను రోజులు గడిచిపోయాయి. మేడపైకి వెళ్లి కిటికీ తలుపులు తెరిస్తే అంతులేని అందం. దిగివచ్చిన అలికిడి వినిపిస్తే రాజ్యం తెచ్చిపెట్టే సరిక్రొత్త సమస్య. ఆ రెండింటి మధ్య సుందరానికి ఒక రోజు గడిచినట్టుగా ఇంకొక రోజు గడవడం లేదు. ఆ నెలలో రెండో శనివారం వచ్చింది. సుందరం తలంటి పోసుకున్నాడు. భోజనం చేసి నాలుగింటి దాకా నిద్రపోయాడు. టౌనులోకి బయల్దేరుతుండగా రాజ్యం పిలిచింది. ‘‘ఏమండీ! ఈ రోజు మీరు ఒక ప్రొద్దని మరిచిపోకండి. మిగిలి ఉన్న అన్నం పిల్లలకి సరిపోతుంది. అగ్గిపెట్టె తీసుకొస్తేనే మనకు టిఫిను’’ అంటూ హెచ్చరించింది.ఆరుగంటలకల్లా తిరిగి వచ్చేయాలన్న సదుద్దేశంతోనే సుందరం టౌనుకు బయల్దేరాడు. సహోద్యోగి ఒకతను కనిపించి బలవంతం చేయడంతో సినిమాకు వెళ్లక తప్పింది కాదు. సినిమా పసందుగా ఉంది. తాత్కాలికంగా బాహ్య ప్రపంచం మరపు కొచ్చింది. సినిమా తలపుల్లోనే మునిగి తేలుతూ పది గంటల తర్వాత ఇల్లు చేరుకున్నాడు. ‘‘కిటికీ తెరిచి పెట్టాను. హాయిగా ఈ మంచినీళ్లు తాగి పడుకోండి’’ అంటూ టంబ్లరు నిండుకూ నీళ్లు తీసుకొచ్చింది రాజ్యం.‘‘అదేమిటి! టిఫిను చేయలేదా?’’ అన్నాడు సుందరం.‘‘ఆటవికులమల్లే అడవుల్లో బ్రతుకుతున్నాం సరే! కానీ చెకుముకి రాయితో నిప్పు చేయడం నాకు తెలిసి ఏడ్చిందా, ఏమన్నానా?’’ ముసుగు బిగదన్ని పడుకుంటూ అంది రాజ్యం.సుందరానికి కోపం వచ్చింది. ఆకలితో పేగులు గీ పెడుతున్న కొద్దీ కుర్చీని ముక్కలు చేసి, టేబిలును బద్దలు గొట్టి ఏదైనా అఘాయిత్యం చేసెయ్యాలని అనిపిస్తూ ఉంది. టేబుల్ పైన తలవాల్చుకుని అరగంట సేపలాగే కుర్చీలో కూరాకు కాడలా సోలి ఉండిపోయాడు. చలిగాలికి నరాలు జివ్వు జివ్వు మనడంతో ఎక్కడలేని చిరాకొచ్చింది. చెయ్యి సాచి ఫెడీల్ ఫెడీల్మని కిటికీ తలుపులు వేసేశాడు. వెక్కిరిస్తున్నట్లుగా వేసిన తలుపులు మళ్లీ తెరుచుకున్నాయి. ఎట్ట యెదట గాజుల చెయ్యి, ఆ చేతిలో ప్లేటు, అందులో అందుకు తగిన అనుపానంతో బాటుగా ఆరు పూరీలు...తల పైకెత్తి చూచాడు సుందరం. ముసి ముసి నవ్వులతో కనిపించింది రాజ్యం. నీతో నాకేం పని లెమ్మన్నట్టు గబ గబ ఒక పూరీ తిని, గ్రుక్క పట్టి ఒక లోటా నీళ్లు తాగేశాడు. ‘‘ఏమండీ! అలిపిరి కిప్పుడు ఒకటీ బై ఆరోవంతు అందం వచ్చేసింది గదండీ’’ అంది రాజ్యం. టిఫిను పూర్తయ్యేదాకా భార్యా భర్తల మధ్య మౌనమే తాండవించింది. చేయి కడుక్కున్నాక టవలు తీసుకొచ్చి ఇస్తూ ‘‘ఏమైనా ఆత్మ పదార్థం కన్నా ఆహార పదార్థమే ముఖ్యమేమోనండి? అగ్గిపెట్టె సులభంగా దొరికే చోటికి వెళ్లిపోదామండీ’’ అంది గోముగా రాజ్యం.‘‘సర్లే, సర్లే’’ అంటూ తన స్థానాన్ని కుర్చీ పై నుంచి పడక పైకి మార్చుకున్నాడు సుందరం. మధురాంతకం రాజారాం (1930–99) ‘నేలా– నింగీ’ కథకు సంక్షిప్త రూపం ఇది. ఈ కథ 1973లో యువ మాసపత్రికలో ప్రచురించబడింది. సౌజన్యం: మధురాంతకం నరేంద్ర. తెలుగులో గొప్ప కథకుల్లో ఒకరైన రాజారాం సుమారు నాలుగు వందల కథలు రాశారు. మధురాంతకం రాజారాం -
మోస్తున్న యుద్ధం
కథ ప్రారంభమయ్యే సమయానికి– ఫస్ట్ లెఫ్ట్‌నెంట్ జిమ్మీ క్రాస్ వెంట మార్తా అనే అమ్మాయి రాసిన రెండు ఉత్తరాలున్నాయి. ఆమె న్యూజెర్సీలోని మౌంట్ సెబాస్టియన్ కాలేజీలో తన జూనియర్. అవేమీ ప్రేమలేఖలు కాదు, కానీ అయితే బాగుండునని తలపోస్తాడు జిమ్మీ. అందుకే వాటిని జాగ్రత్తగా ప్లాస్టిక్ కవర్లో పెట్టి తన వీపుబ్యాగులో దాచాడు. మధ్యాహ్నం తరువాత, ఆ రోజుటి ప్రయాణం ముగిశాక, కందకం తవ్వుకుని, చేతులు కడుక్కుని, ప్లాస్టిక్ కవర్ తెరిచి, కొనవేళ్లతో ఫొటోలను పట్టుకుంటాడు జిమ్మీ. ఆమెతో వైట్ మౌంటెయిన్స్‌లో ప్రయాణాలు చేసినట్టుగా ఊహించుకుంటాడు. ఒక్కోసారి ఆ లిఫాఫా అంచులను రుచి చూస్తాడు, ఆమె నాలుక అక్కడ ఆడించివుంటుందన్న ఎరుకతో. ఆమెను తను ఎంత ప్రేమిస్తున్నాడో ఆమె కూడా అంతే ప్రేమించాలని కోరుకుంటాడు. కానీ ఆ ఉత్తరాల్లో ఆమె ప్రేమ ఎంతటిదో అంచనాకి చిక్కదు. వాళ్ల రూమ్మేట్స్ గురించీ, పరీక్షల గురించీ అందంగా రాస్తుంది; వర్జీనియా వూల్ఫ్ పట్ల ఆరాధనను ప్రదర్శిస్తుంది; కానీ ఈ యుద్ధం గురించి ప్రస్తావించదు. ‘నువ్వు జాగ్రత్త జిమ్మీ’ అని మాత్రం రాస్తుంది. ఆ ఉత్తరాలు పది ఔన్సుల బరువుంటాయి. వాటిని ‘ప్రేమతో, మార్తా’ అని సంతకం చేస్తుంది. కానీ ‘ప్రేమతో’ అనేది సంతకానికి ముందు మాటవరుసకు తగిలిస్తుందా? చీకటి పడటంతో అతడు ఉత్తరాల్ని బ్యాగులో యధాస్థానంలో ఉంచి, మిగతా సైనికులతో పని చూసుకుని, స్థావరం చుట్టూ పరిశీలించి, మళ్లీ కందకం దగ్గరికి వచ్చి, రాత్రంతా మార్తా గురించే ఆలోచిస్తూ ఉంటాడు. తర్వాత రచయిత సైనికులు తమవెంట మోసే ప్రతి వస్తువునూ, ప్రతి సూక్ష్మ వివరంతో, ముఖ్యంగా వాటి బరువుతో సహా వివరిస్తాడు.వాళ్లు మోసే వస్తువులు చాలావరకు అవసరం నిర్దేశించినవి. అవసరాలు లేదా అవసరాల్లాంటి వాటిల్లో ఉన్నవి పి–38 క్యాన్ ఓపెనర్లు, చిన్న చాకులు, చేతి గడియారాలు, దోమల మందులు, సిగరెట్లు, ఉప్పు టాబ్లెట్లు, చిరుతిళ్లు, లైటర్లు, అగ్గిపెట్టెలు, కుట్టుదారాలు, వేతన సర్టిఫికెట్లు, సి–రేషన్లు(క్యాన్లలోని తిండి) మరియు రెండు మూడు బాటిళ్ల నీళ్లు. ఇవన్నీ కలిపి ఏడెనిమిది కిలోల బరువుంటాయి, ఒక్కో మనిషి అలవాట్లనూ అరిగించుకునే శక్తినీ బట్టి మారుతూ. భారీ మనిషి హెన్రీ డాబిన్స్ అదనపు రేషన్లను మోస్తాడు, ప్రత్యేకించి పీచ్ పళ్ల డబ్బాలంటే అతడికి ఇష్టం. పరిశుభ్రత మీద పట్టింపున్న డేవ్ జెన్సన్ టూత్‌బ్రష్, చిన్న హోటళ్లలో ఇచ్చే పరిమాణపు సబ్బుబిళ్లలు మోస్తాడు. ఏప్రిల్ మధ్యలో థాన్ ఖే గ్రామ పొలిమేరలో కాల్పుల్లో చనిపోయేదాకా భయస్థుడైన టెడ్ లావెండర్ నిద్రగోళీలను మోసేవాడు. అవసరార్థమూ, విధివిధానాల్లో భాగంగానూ అందరూ రెండున్నర కిలోలుండే స్టీలు హెల్మెట్లు ధరిస్తారు. యూనిఫామ్ ఉండనేవుంది. కాళ్లకు 0.95 కిలోల ఎత్తుబూట్లు ఉంటాయి. డేవ్ జెన్సన్ దగ్గర మూడు జతల సాక్సులు, కాళ్లు చెడిపోకుండా ముందుజాగ్రత్తగా రాసుకునే పౌడరు ఉంటాయి. కాల్చబడేదాకా టెడ్ లావెండర్ దగ్గర, అతడికి అత్యవసరమైన ఓ 200 గ్రాముల మాదకద్రవ్యం ఉండేది. నార్మన్ బౌకర్ డైరీ మోస్తాడు. ర్యాట్ కైలీ దగ్గర కామిక్ పుస్తకాలుంటాయి. భక్తి శ్రద్ధలున్న కియోవా దగ్గర తండ్రి బహూకరించిన కొత్త నిబంధన పుస్తకం ఉంది. అంతటా మందుపాతరలు ఉన్నందున స్టీలు జాకెట్లు వేసుకొమ్మని అవసరం శాసించింది. దీని బరువు 3 కిలోలు, కానీ ఎండగా ఉన్నరోజున మరింత బరువుగా తోస్తుంది. చనిపోవడం ఇట్టే జరిగే వీలున్నందున, త్వరగా అందేలా అందరూ తమ హెల్మెట్లలో బ్యాండేజీ ఉంచుకుంటారు. రాత్రుళ్లు మరీ చల్లగా ఉంటాయి కాబట్టి అందరూ ఆకుపచ్చ ప్లాస్టిక్ షీట్ ఉంచుకుంటారు; రెయిన్కోట్లా, పరుచుకునే పక్కలా, తాత్కాలిక టెంటులా కూడా వాడుకోవడానికి. ఓ కిలో బరువుంటుంది గానీ ప్రతి అంగుళం ఉపయోగకరం. ఉదాహరణకు ఏప్రిల్‌లో టెడ్ లావెండర్ కాల్చబడ్డాక అతడి షీట్లోనే అతణ్ని చుట్టి, కొనిపోవడానికి వచ్చిన చాపర్ దగ్గరకు మోసుకెళ్లారు. సైనికులు మోసేవాటిల్లో కొన్ని వాళ్ల స్థాయితో ముడిపడినవి. చిన్న దళానికి నాయకుడిగా జిమ్మీ క్రాస్ కంపాస్, మ్యాపులు, కోడ్ బుక్స్, బైనాక్యులర్స్, 1.3 కిలోలుండే లోడ్ చేసిన .45 క్యాలిబర్ పిస్టల్ మోయవలసి ఉంటుంది. తన సైనికుల ప్రాణాల బాధ్యత కూడా అతడు మోస్తాడు. రేడియో టెలిఫోన్ ఆపరేటర్‌గా మిషెల్ శాండర్స్ బహుచక్కని పన్నెండు కిలోల పీఆర్సి–25 రేడియో మోస్తాడు. డాక్టరుగా ర్యాట్ కైలీ మార్ఫైన్, మలేరియా మాత్రలు, సర్జికల్ టేప్ లాంటి ఓ పదికిలోల అత్యవసర వస్తువులు మోస్తాడు. లోడ్ చేయకపోతే పది కిలోలుండే, కానీ ప్రతిసారీ లోడ్ చేసేవుంటుంది, ఎం–60 మిషన్ గన్ని భారీకాయుడు హెన్రీ డాబిన్స్ మోస్తాడు. అదనంగా ఐదారు కిలోల మందుగుండు అతడి ఛాతీకీ, భుజానికీ చుట్టివున్న బెల్టుల్లో ఉంటుంది. ఎక్కువమంది ఇరవై రౌండ్ల మ్యాగజీన్‌తో లోడ్ చేసిన 3.7 కిలోల ఎం–16 రైఫిళ్లు మోస్తారు. పరిస్థితిని బట్టి 12–20 మ్యాగజీన్లు వెంట ఉంచుకుంటారు. అదో 4–6 కిలోల బరువు. కొందరి దగ్గర లోడ్ చేయకపోతే రెండున్నర కిలోలుండే ఎం–79 గ్రెనేడ్ లాంచర్లు ఉంటాయి. తేలికైనదే, కానీ మందుగుండే బరువు. సాధారణ లోడ్ 25 రౌండ్లు. దాని బరువు 7 కిలోలు. టెడ్ లావెండర్ థాన్ ఖేలో చనిపోవడానికి ముందు 34 రౌండ్లు ఉంచుకున్నాడు. 9 కిలోల మందుగుండు, కవచం జాకెట్, హెల్మెట్, రేషన్లు, నీళ్ల సీసాలు, టాయ్‌లెట్ పేపర్, నిద్రగోళీలు, వీటన్నింటికి తోడు తెలియని భయం. ఇసుకబస్తా కూలినట్టు పడిపోయాడు. ఢాం. పడ్డాడు. లావెండర్ చనిపోవడానికి ముందు మార్తా దగ్గరి నుంచి జిమ్మీ క్రాస్ చిన్న గులకరాయి అందుకున్నాడు. నునుపైన తెల్లటి అండాకార రాయి. 25 గ్రాములుంటుంది. సముద్ర తీరంలో ఎల్తైన అల భూమిని తాకేచోట, రెండు కలుస్తూ విడిపోయే చోట, దొరికిందని రాసింది మార్తా. కలిసి విడిపోయే గుణం ఆమెను ఆకర్షించింది. కానీ దాని అర్థం ఏమిటి? తర్వాత– థాన్ ఖే ప్రాంతంలో ఉన్న అన్ని సొరంగాలను కూల్చేయమని పైనుంచి ఉత్తర్వులు అందుతాయి. అయితే, ముందు వాటిని వెతకమని ఆదేశాలు జారీ అవుతాయి. ఆ ఇరుకైన పొడవాటి సొరంగాల్లోకి మనిషి దూరి వెతకాలి. ఒక్కోసారి అందులోనే పేలిపోవచ్చు, చిక్కుబడిపోతే అరిచినా ఎవరికీ వినబడకపోవచ్చు. ఎవరు వెళ్లాలి? అప్పుడు వాళ్లను వాళ్లు అంకెలు లెక్క పెట్టుకుంటారు. 17 నంబర్ వచ్చిన లీ స్ట్రంక్ వెళ్లాడు. ఎంతకీ బయటికి రాడు. అప్పుడు జిమ్మీ క్రాస్ వంగి పాక్కుంటూ అతడిని వెతుక్కుంటూ వెళ్తాడు. ఇంకెంత దూరం? ఉన్నట్టుండి ఇది కుప్ప కూలితే? మార్తా గుర్తొస్తుంది. ఆమె ఊపిరితిత్తుల్లో నిద్రపోవాలని అనిపిస్తుంది. ఎట్టకేలకు జిమ్మీ క్రాస్, లీ స్ట్రంక్ క్షేమంగా బయటపడతారు. ఏ ఊళ్లు ఎందుకు తగలబెడుతున్నారో, కుక్కలనూ కోళ్లనూ కూడా ఎందుకు కాల్చేస్తూ పోతున్నారో తెలియనంతగా వాళ్లు యుద్ధాన్ని మోస్తూ నడుస్తుంటారు. చచ్చిపోయేవాళ్ల ఉద్వేగాలనూ, ఒంటరితనాలనూ, సిగ్గుపడే జ్ఞాపకాలనూ, పిరికితనాన్నీ వాళ్లు మోస్తూవుంటారు. గాయపడిన సహచరులనూ, రోగాలనూ, నొప్పులనూ, పేలనూ, గజ్జితామరలనూ, తమ జీవితాలనూ వాళ్లు మోస్తూ సాగుతుంటారు. వియత్నామీస్– ఇంగ్లిష్ నిఘంటువులనూ, అక్కడి నేలల ఎర్రటి మట్టినీ, ఆకాశాన్నీ, అక్కడి మనుషుల ముఖాలనూ వాళ్లు మోస్తూ పోతుంటారు. అది యుద్ధం కాదు, గ్రామం నుంచి గ్రామానికీ, లక్ష్యం లేకుండా, గెలుపోటములు తేలకుండా సాగిస్తున్న దండయాత్ర. టెడ్ లావెండర్ చనిపోయిన రోజునే, అతడిని తన షీట్లోనే చుట్టి విమానం ఎక్కించిన తర్వాత, తన కందకంలో కిందికి నక్కి, మార్తా ఉత్తరాలనూ, ఆ రెండు ఫొటోలనూ కాల్చేస్తాడు క్రాస్. ఆ రోజు వర్షం పడటం వల్ల ఆహారం వేడిచేసుకోవడానికి ఇచ్చే ఇంధనం క్యానును వాడి మంట వేస్తాడు. వేళ్ల చివర్లతో ఫొటోలు కాలేదాకా పట్టుకుంటాడు. ‘జిమ్మీ, నువ్వు జాగ్రత్త’. అందులో ప్రేమ లేదు, ఈ యుద్ధంలో ఆమె మునిగి లేదు. ప్రేమతో అని చేసిన సంతకం ప్రేమ కాదు. ఈ మోస్తున్న యుద్ధం, తను నడిపించాల్సిన మనుషులు మాత్రమే నిజం. ఎంతైనా అతడు సైనికుడు. జిమ్మీ క్రాస్ దగ్గరున్న రెండు ఫొటోల్లో ఒకదానిలో మార్తా ఇటుక గోడకు ఆనుకుని నిల్చుని ఉంది. రెండో ఫొటో కాలేజీ ఇయర్ బుక్‌లోంచి చించింది. వాలీబాల్ ఆడుతుండగా తీసిన ఆ ఫొటోలో ఆమె వైట్ జిమ్ షార్ట్స్ వేసుకుంది. కాళ్లు కనబడుతున్నాయి. ఇద్దరూ కలిసి సినిమాకు వెళ్లినరోజున ఎడమ కాలిని అతడు మృదువుగా తాకాడు, కానీ ఆమె చూసిన చూపు చేతిని వెనక్కి తీసుకునేలా చేసింది. కానీ ఆ స్పర్శ ఇంకా జ్ఞాపకం. జిమ్మీ క్రాస్ దగ్గరున్న రెండు ఫొటోల్లో ఒకదానిలో మార్తా ఇటుక గోడకు ఆనుకుని నిల్చుని ఉంది. రెండో ఫొటో కాలేజీ ఇయర్ బుక్‌లోంచి చించింది. వాలీబాల్ ఆడుతుండగా తీసిన ఆ ఫొటోలో ఆమె వైట్ జిమ్ షార్ట్స్ వేసుకుంది. టిమ్ ఓ’బ్రెయిన్ (జననం 1946) అమెరికన్ కథ ‘ద థింగ్స్ దే క్యారీడ్’ క్లుప్త సారాంశం ఇది. అమెరికా కథా సంకలనాల్లో ఎక్కువసార్లు చోటు చేసుకున్న కథగా దీనికి ప్రసిద్ధి. ఇదే పేరుతో రచయిత కథాసంకలనం 1990లో వచ్చింది. ఇవన్నీ వియత్నాం యుద్ధంలో పాల్గొన్న అమెరికా సైనికుడి అనుభవాల నేపథ్యంలో సాగుతాయి. ఆ యుద్ధంలో పనిచేసిన టిమ్ తన ఆత్మకథ ‘ఇఫ్ ఐ డై ఇన్ ఎ కంబాట్ జోన్’లో రాశారు; ‘యుద్ధ వ్యతిరేక’ నవల ‘గోయింగ్ ఆఫ్టర్ క్యాసియాతో’ వెలువరించారు. టిమ్ ఓ’బ్రెయిన్ -
అరగని ఆకలి
జీవితంలో ఫెయిల్యూర్ ఒక శూన్యాన్ని సృష్టిస్తుంది.ఆ శూన్యాన్ని ఎన్నో రకాలుగా నింపచ్చు. తల్లిదండ్రుల ప్రేమతో...స్నేహితుల ఆసరాతో... ఒక మంచి హాబీతో ...! కాని వైఫల్యం తెచ్చిన ఈ శూన్యాన్ని ఒక్కోసారి కొందరు అతిగా తినటం ద్వారా నింపడానికి ట్రై చేస్తుంటారు.ఇది ఒక తరగని శూన్యంలా, అరగని ఆకలిలా మిగిలిపోతుంది. ఆందోళన తగ్గించుకునే క్రమంలో రకరకాల వ్యాపకాల మీదకు దృష్టి మళ్లుతుంది. అవి వ్యసనాలకు దారి తీయవచ్చు. ప్రేమ నిండిన మనసులో భయానికి, అభద్రతకు చోటు ఉండదు. కుటుంబసభ్యుల మధ్య దగ్గరి తనం, ప్రేమ, అటెన్షన్ ఇలాంటి వారికి చాలా అవసరం. మనందరం లావు అవుతాం. అందుకు రుచి కారణం కానక్కర్లేదు. రుచి మొగ్గలూ కారణం కానక్కర్లేదు. థైరాయిడ్ ఒక్కటే కారణం కాకపోవచ్చు. వంశపారంపర్యం కూడా కాకపోవచ్చు. ఇలాంటివేవీ లేకుండానే లావు అవుతుంటే ఏం చేయాలి?! ఊబకాయాన్ని శాపంగా మోస్తున్న కోమలి సమస్య ఇది. ఆ సమస్య నుంచి ఆమె ఎలా బయటపడింది?! అడ్డుగోడగా నిలిచిన అలవాటు పెళ్లిచూపులకు వచ్చి కోమలిని చూసిన వారు వెళుతూ ‘ఏ విషయం ఇంటికి వెళ్లాక చెబుతాం’ అన్నారు. అది విని‘ఈ సంబంధం కూడా కుదరనట్టే’ సోఫాలో కూలబడుతూ నీరసంగా అన్నాడు కోమలి తండ్రి పురుషోత్తమ్. ఆ మాటలు విన్న తల్లి భార్గవి కూతురు వైపు కోపంగా చూసి, ఏమీ అనలేక మౌనంగా లోపలికి వెళ్లిపోయింది. వారి బాధ చూడలేకపోయింది కోమలి. తల్లి వెనకాలే వచ్చి ‘అమ్మా! పెళ్లి చేసుకోకపోతే ఏం, ఇలాగే ఉంటాను’ అంది. ఆ మాటలకు విరుచుకుపడింది భార్గవి. ‘ముప్పై ఏళ్లు దగ్గర పడుతున్నాయి. చుట్టుపక్కల వాళ్లు నీ కూతురు పెళ్లెప్పుడు అని అడుగుతుంటే.. తలకొట్టేసినట్టుగా ఉంది. నీ పెళ్లి చేయలేనేమో అనే బెంగతో ఇప్పటికే మీ నాన్నకు రెండుసార్లు గుండెపోటు వచ్చింది. ఇంకోసారి వస్తే ఆయన నాకు దక్కరు. దీనికంతటికీ నీ తిండి పిచ్చే కదా కారణం. కాస్తయినా కంట్రోల్ ఉంటుందా తిండి మీద. నిన్ను నువ్వు అద్దంలో చూసుకుంటున్నావా ఎలా ఉన్నావో. ఏది పడితే అది తింటూ ఎనభై కేజీలయ్యావు’ తల్లి కోపంగా అంటున్న మాటలకు ఏమీ సమాధానం చెప్పలేక మౌనంగా అక్కణ్ణుంచి వెళ్లిపోయింది కోమలి. మరణమే పరిష్కారమా! కోమలి పుట్టిన రోజు. కూతురికి ఇష్టమని భార్గవి పాయసం చేసి ఇచ్చింది. తృప్తిగా తింది కోమలి. తర్వాత తల్లి బుగ్గమీద ముద్దిస్తూ ‘ఇక నా వల్ల మీకు కష్టాలు ఉండవమ్మా’ అంటూనే కూలబడిపోయింది. అపస్మారకంలోకి వెళ్లిన కూతురు విషం మింగిందని అర్ధమై ఆసుపత్రిలో చేర్చారు. కొద్దిలో ప్రాణభయం తప్పిన కూతురిని చూస్తూ ఆలోచనలో పడిపోయింది భార్గవి. ‘పదేళ్ల వయసు నుంచే దీనికి తిండి పిచ్చి పట్టుకుంది. పెళ్లికో, పేరంటానికో.. చివరకు బంధువులింటికోతీసుకెళ్లాలన్నా భయపడేంత స్థితికి తెచ్చింది. ఎదురుగా తిండి పదార్థాలు కనపడితే చాలు.. ఎవరున్నారు, ఏమనుకుంటారు అనే ధ్యాస కూడా ఉండదు. నయానా భయానా చెప్పినా ఫలితం లేదు. ఏం చేసినా ఈ సమస్య మాత్రం తగ్గలేదు. అప్పుడంటే చిన్నతనం. బొద్దుగా ఉన్నా ఫర్వాలేదు అనుకున్నాను. కానీ, పెద్దయ్యాక ‘లావు’ అనే కారణం వల్ల ఎగతాళి చేస్తున్నారని కాలేజీ చదువు మానేసింది. అమ్మాయికి ఏదైనా ట్రీట్మెంట్ ఇప్పించకపోయారా అని పదే పదే బంధుమిత్రులు ఇచ్చే సలహాల వల్ల నలుగురిలోకి తీసుకెళ్లడమే కష్టంగా ఉంది. పెళ్లి చేసి బాధ్యత తీర్చుకుందామంటే ‘లావు’ అనే కారణంతో ఇప్పటికే పాతిక సంబంధాలు తప్పిపోయాయి. కొన్నాళ్లు పట్టుబట్టి జిమ్‌కి పంపినా ఫలితం లేదు. లైపోసక్షన్ చేయిద్దామంటే సైyŠ ఎఫెక్ట్స్ వస్తాయేమో అని భయం. ఏం చేయాలో తెలియడం లేదు’ అనుకుంటూ భర్త పిలుపుతో కళ్ల నీళ్లను తుడుచుకుంది భార్గవి. రిగ్రెషన్ థెరపీతో కరిగిన దుఃఖం కోమలి సమస్య విన్న కౌన్సెలర్ ఆమెకు థెరపీ ఇవ్వడం మొదలుపెట్టారు. ఈ థెరపీలో కోమలి అంతర్గత ప్రయాణం మొదలైంది. 1...2...3...4...5 నిశ్శబ్దంగా నిమిషాలు దొర్లిపోతున్నాయి.ధ్యానప్రక్రియలో తనను తాను చూసుకుంటూ, బాల్య దశలో ఆగింది కోమలి. గుండెను మెలిపెట్టిన ఆ ఘటనను చెప్పడం మొదలుపెట్టింది. ‘నాకు ఎనిమిదేళ్లు. అమ్మనాన్న నన్ను మా మేనత్త ఇంటికి తీసుకెళ్లారు. ‘నువ్వు కొన్ని రోజులు ఇక్కడే ఉండాలి తల్లీ, మళ్లీ వచ్చి తీసుకెళతాం. వచ్చేటప్పుడు నీకు బోలెడు బొమ్మలు తీసుకొస్తాం’ అని అమ్మ చెబుతోంది. నాకు భయంగా ఉంది. అమ్మ వెళుతుంటే గట్టిగా పట్టుకుని ఏడుస్తున్నాను. అమ్మ దగ్గర నుంచి నన్ను మా మేనత్త ఇంట్లోకి లాక్కెళ్ళింది. నేను ఏడుస్తూ పడుకున్నాను. రోజూ ఏడుస్తున్నాను. వాళ్ల ఇంటిలో తినడానికి అన్నీ ఉన్నాయి. కానీ, నాకేమీ మిగిలేది కాదు. నాకు ఇష్టం లేనిది పెట్టేవారు. ఆకలితోనే ఏడ్చి ఏడ్చి నిద్రపోయేదాన్ని’ కోమలి ఏడుస్తూనే బాల్యంలోని బాధను చెబుతోంది. ఆమె దుఃఖం తీరాక.. ‘కోమలీ.. మరో ఎనిమిదేళ్లు వెనక్కి ప్రయాణించండి. తల్లిగర్భంలో మీరున్న స్థితిని చూస్తూ అటు నుంచి గత జన్మ ప్రయాణం మొదలుపెట్టండి. ఎక్కడ మీకు అపరిమితమైన బాధ కలిగిందో దానిని దర్శించండి’ అని చెబుతున్న కౌన్సెలర్ సూచనలు అందుకున్న కోమలి గతంలోకి ప్రయాణించడం మొదలుపెట్టింది. తల్లి గర్భంలో ఉన్న స్థితి నుంచి గత జన్మలోకి ప్రయాణాన్ని కొనసాగించింది. కోమలిలో తెరలు తెరలుగా దుఃఖం. ఏడుస్తూనే నాటి తన పరిస్థితిని వివరిస్తోంది. ‘నాకు తినడానికి తిండి లేదు. నన్ను చూసుకోవడానికి ఎవరూ లేరు. నాకు జబ్బు చేసింది. తిండి పెట్టేవారు లేరు. ఆకలితో పేగులు లుంగలు చుట్టుకుపోతున్నాయి. భరించలేక మట్టి తింటున్నాను. నాకు మంచి తిండి తినే యోగ్యతే లేదు’ చెబుతున్న కోమలి దుఃఖం తీరేదాకా ఎదురుచూసిన కౌన్సెలర్ సూచనలు ఇవ్వడం మొదలుపెట్టారు. ఖాళీ మనసును ప్రేమతో నింపాలి ‘కోమలీ.. గత జన్మలో మీరు ఎదుర్కొన్న ఆకలి బాధను దర్శించారు. ఇక ఈ జన్మకు రండి. ఈ జన్మలో మీకు కావల్సినంత తిండి ఉంది. మిమ్మల్ని కంటికిరెప్పలా చూసుకోవడానికి అమ్మానాన్నా ఉన్నారు. గత జన్మ భయంతో ఈ జన్మలో తిండి దొరకదేమో అని కనిపించిందంతా తినేయాలనుకుంటున్నారు. అది ఒక రుగ్మతలా మారి మిమ్మల్ని బాధిస్తోంది. గత జన్మ లేమిని ఇప్పటి ఉన్నత స్థితి ఆలోచనతో నింపేయండి. ఇక ఈ జన్మలో బాల్యంలో తమ పరిస్థితుల దృష్ట్యా మిమ్మల్ని దూరంగా పెట్టిన అమ్మానాన్నలను క్షమించండి. బాధ స్థానంలో ప్రేమను నింపండి. మీ మనసును ఆనందమయం చేసుకోండి. మీకు అందమైన భవిష్యత్తును ఇవ్వడానికి అమ్మానాన్నలు పడిన కష్టాన్ని గుర్తించండి’ అంటూ చెప్పిన సూచనలతో కోమలి మనసు ప్రశాంతంగా మారింది. మనసు నిండితే జీవితం ఆనందం ‘అమ్మా! చూడు ఆరు నెలల్లో నా బ్యూటీషియన్ కోర్సు కంప్లీట్ అయ్యింది. ఇంకో ఆరునెలల్లో నేనే సొంతంగా బ్యూటీ క్లినిక్ కూడా పెట్టేస్తాను. ఇదిగో నా కోర్స్ సర్టిఫికెట్’ అంటున్న కోమలితో ‘ఉండరా, నీ నోరు తీపి చేస్తాను’ అని వెళుతున్న తల్లిని ఆపింది కోమలి. ‘అమ్మా, నీ ప్రేమే నాకు పండగ. నువ్వు నాకు ప్రతిక్షణం సపోర్ట్‌గా ఉన్నావు. నా గురించి నాకు తెలిసేలా చేసి నాకు మళ్లీ జన్మనిచ్చావు. చాలా థాంక్స్ అమ్మా’ అంటూ భార్గవి బుగ్గ మీద ముద్దుపెట్టింది కోమలి. ‘అమ్ములూ.. మూడు నెలలుగా ఆపుతున్న ఆ పెళ్లి సంబంధానికి ఇప్పటికైనా ఓకే చెప్పమంటావా’ అంటున్న తండ్రి మాటలకు ఫక్కున నవ్వింది కోమలి. కూతురి నవ్వులతో తల్లీదండ్రి జతకలిపారు. – నిర్మలారెడ్డి చిల్కమర్రి అదుపు సాధించాలి మనసులో శూన్యం ఏర్పడితే దానిని పూడ్చటానికి రకరకాల వ్యాపకాలను ఎంచుకుంటాం. వాటిలో అతిగా తినడం ఒకటి. దీంతో బరువు మీద అదుపు కోల్పోతాం. ఫలితంగా అభద్రత, భయం.. వంటివి పెరుగుతాయి. దీనివల్ల నలుగురిలో కలవలేం. ఎవరూ మన మనసుకు దగ్గరగా లేరని నిరంతరం బాధపడుతుంటాం. మనసులో లోటును భర్తీ చేయడానికి కొందరు అవసరానికి మించి షాపింగ్ చేస్తుంటారు. ఇంకొందరు భవిష్యత్తులో ఎప్పుడైనా పనికివస్తాయేమో అని ఇప్పుడే వస్తువులను కొని పెట్టేస్తుంటారు. కొందరు అత్యంత పిసినారులుగా మారుతారు. ఇంకొందరు అతి శుభ్రతను పాటిస్తుంటారు. మరికొందరు అదేపనిగా మాట్లాడుతుంటారు. వీటన్నింటికీ వారి గత జీవితం, గత జన్మతాలూకు బాధల అవశేషాలే కారణం. గతం తాలూకు ఆ బ్లాక్స్‌ను తొలగించి, ఇన్నర్‌చైల్డ్ సంతోషంగా ఉండేలా చేస్తే ఇలాంటి వారిలో ఉండే మానసిక రుగ్మతలు తగ్గిపోతాయి. భవిష్యత్తును దర్శింపజేస్తే.. జీవితంపై ఆశ కలుగుతుంది. ‘సాధించగలం’ అనే నమ్మకం ఏర్పడుతుంది. అవగాహన పెరిగి జీవన ప్రయాణాన్ని అందంగా మలుచుకుంటారు. – డా.హరికుమార్, జనరల్ సర్జన్, ఫ్యూచర్ థెరపిస్ట్ గమనిక : ‘పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ థెరపీ’ అంతర్జాతీయంగా ప్రోత్సాహకరమైన ఫలితాలను ఇస్తోంది. అయితే ఈ ప్రక్రియకు విస్తృతమైన ఆమోదం లభించకపోయినా.. థెరపీ ప్రయోజనాలపై ఆసక్తికరమైన కథనాలు వినిపిస్తున్నాయి. వాటిలో ఇవి కొన్ని.