అరగని ఆకలి | special story on Food Rules | Sakshi
Sakshi News home page

అరగని ఆకలి

Published Mon, Apr 10 2017 10:37 PM | Last Updated on Thu, Oct 4 2018 5:10 PM

అరగని ఆకలి - Sakshi

అరగని ఆకలి

జీవితంలో ఫెయిల్యూర్‌  ఒక శూన్యాన్ని సృష్టిస్తుంది.ఆ శూన్యాన్ని ఎన్నో రకాలుగా నింపచ్చు. తల్లిదండ్రుల ప్రేమతో...స్నేహితుల ఆసరాతో... ఒక మంచి హాబీతో ...! కాని  వైఫల్యం తెచ్చిన ఈ శూన్యాన్ని ఒక్కోసారి కొందరు అతిగా తినటం ద్వారా నింపడానికి ట్రై చేస్తుంటారు.ఇది ఒక తరగని శూన్యంలా, అరగని ఆకలిలా మిగిలిపోతుంది.

ఆందోళన తగ్గించుకునే క్రమంలో రకరకాల వ్యాపకాల మీదకు దృష్టి మళ్లుతుంది. అవి వ్యసనాలకు దారి తీయవచ్చు.  

ప్రేమ నిండిన మనసులో భయానికి, అభద్రతకు చోటు ఉండదు.

కుటుంబసభ్యుల మధ్య దగ్గరి తనం, ప్రేమ, అటెన్షన్‌ ఇలాంటి వారికి చాలా అవసరం.

మనందరం లావు అవుతాం. అందుకు రుచి కారణం కానక్కర్లేదు. రుచి మొగ్గలూ కారణం కానక్కర్లేదు. థైరాయిడ్‌ ఒక్కటే కారణం కాకపోవచ్చు. వంశపారంపర్యం కూడా కాకపోవచ్చు. ఇలాంటివేవీ లేకుండానే లావు అవుతుంటే ఏం చేయాలి?! ఊబకాయాన్ని శాపంగా మోస్తున్న కోమలి సమస్య ఇది. ఆ సమస్య నుంచి ఆమె ఎలా బయటపడింది?!

అడ్డుగోడగా నిలిచిన అలవాటు
పెళ్లిచూపులకు వచ్చి కోమలిని చూసిన వారు వెళుతూ ‘ఏ విషయం ఇంటికి వెళ్లాక చెబుతాం’ అన్నారు. అది విని‘ఈ సంబంధం కూడా కుదరనట్టే’ సోఫాలో కూలబడుతూ నీరసంగా అన్నాడు కోమలి తండ్రి పురుషోత్తమ్‌. ఆ మాటలు విన్న తల్లి భార్గవి కూతురు వైపు కోపంగా చూసి, ఏమీ అనలేక మౌనంగా లోపలికి వెళ్లిపోయింది. వారి బాధ చూడలేకపోయింది కోమలి. తల్లి వెనకాలే వచ్చి ‘అమ్మా! పెళ్లి చేసుకోకపోతే ఏం, ఇలాగే ఉంటాను’ అంది. ఆ మాటలకు విరుచుకుపడింది భార్గవి. ‘ముప్పై ఏళ్లు దగ్గర పడుతున్నాయి. చుట్టుపక్కల వాళ్లు నీ కూతురు పెళ్లెప్పుడు అని అడుగుతుంటే.. తలకొట్టేసినట్టుగా ఉంది.

 నీ పెళ్లి చేయలేనేమో అనే బెంగతో ఇప్పటికే మీ నాన్నకు రెండుసార్లు గుండెపోటు వచ్చింది. ఇంకోసారి వస్తే ఆయన నాకు దక్కరు. దీనికంతటికీ నీ తిండి పిచ్చే కదా కారణం. కాస్తయినా కంట్రోల్‌ ఉంటుందా తిండి మీద. నిన్ను నువ్వు అద్దంలో చూసుకుంటున్నావా ఎలా ఉన్నావో. ఏది పడితే అది తింటూ ఎనభై కేజీలయ్యావు’ తల్లి కోపంగా అంటున్న మాటలకు ఏమీ సమాధానం చెప్పలేక మౌనంగా అక్కణ్ణుంచి వెళ్లిపోయింది కోమలి.

మరణమే పరిష్కారమా!
కోమలి పుట్టిన రోజు. కూతురికి ఇష్టమని భార్గవి పాయసం చేసి ఇచ్చింది. తృప్తిగా తింది కోమలి. తర్వాత తల్లి బుగ్గమీద ముద్దిస్తూ ‘ఇక నా వల్ల మీకు కష్టాలు  ఉండవమ్మా’ అంటూనే కూలబడిపోయింది. అపస్మారకంలోకి వెళ్లిన కూతురు విషం మింగిందని అర్ధమై ఆసుపత్రిలో చేర్చారు. కొద్దిలో ప్రాణభయం తప్పిన కూతురిని చూస్తూ ఆలోచనలో పడిపోయింది భార్గవి.

‘పదేళ్ల వయసు నుంచే దీనికి తిండి పిచ్చి పట్టుకుంది. పెళ్లికో, పేరంటానికో.. చివరకు బంధువులింటికోతీసుకెళ్లాలన్నా భయపడేంత స్థితికి తెచ్చింది. ఎదురుగా తిండి పదార్థాలు కనపడితే చాలు.. ఎవరున్నారు, ఏమనుకుంటారు అనే ధ్యాస కూడా ఉండదు. నయానా భయానా చెప్పినా ఫలితం లేదు. ఏం చేసినా ఈ సమస్య మాత్రం తగ్గలేదు. అప్పుడంటే చిన్నతనం. బొద్దుగా ఉన్నా ఫర్వాలేదు అనుకున్నాను. కానీ, పెద్దయ్యాక ‘లావు’ అనే కారణం వల్ల ఎగతాళి చేస్తున్నారని కాలేజీ చదువు మానేసింది.

అమ్మాయికి ఏదైనా ట్రీట్‌మెంట్‌ ఇప్పించకపోయారా అని పదే పదే బంధుమిత్రులు ఇచ్చే సలహాల వల్ల నలుగురిలోకి తీసుకెళ్లడమే కష్టంగా ఉంది. పెళ్లి చేసి బాధ్యత తీర్చుకుందామంటే ‘లావు’ అనే కారణంతో ఇప్పటికే పాతిక సంబంధాలు తప్పిపోయాయి. కొన్నాళ్లు పట్టుబట్టి జిమ్‌కి పంపినా ఫలితం లేదు. లైపోసక్షన్‌ చేయిద్దామంటే సైyŠ  ఎఫెక్ట్స్‌ వస్తాయేమో అని భయం. ఏం చేయాలో తెలియడం లేదు’ అనుకుంటూ భర్త పిలుపుతో కళ్ల నీళ్లను తుడుచుకుంది భార్గవి.

రిగ్రెషన్‌ థెరపీతో కరిగిన దుఃఖం
కోమలి సమస్య విన్న కౌన్సెలర్‌ ఆమెకు థెరపీ ఇవ్వడం మొదలుపెట్టారు. ఈ థెరపీలో కోమలి అంతర్గత ప్రయాణం మొదలైంది.

1...2...3...4...5 నిశ్శబ్దంగా
నిమిషాలు దొర్లిపోతున్నాయి.ధ్యానప్రక్రియలో తనను తాను చూసుకుంటూ, బాల్య దశలో ఆగింది కోమలి. గుండెను మెలిపెట్టిన ఆ ఘటనను చెప్పడం మొదలుపెట్టింది. ‘నాకు ఎనిమిదేళ్లు. అమ్మనాన్న నన్ను మా మేనత్త ఇంటికి తీసుకెళ్లారు. ‘నువ్వు కొన్ని రోజులు ఇక్కడే ఉండాలి తల్లీ, మళ్లీ వచ్చి తీసుకెళతాం.

వచ్చేటప్పుడు నీకు బోలెడు బొమ్మలు తీసుకొస్తాం’ అని అమ్మ చెబుతోంది. నాకు భయంగా ఉంది. అమ్మ వెళుతుంటే గట్టిగా పట్టుకుని ఏడుస్తున్నాను. అమ్మ దగ్గర నుంచి నన్ను మా మేనత్త ఇంట్లోకి లాక్కెళ్ళింది. నేను ఏడుస్తూ పడుకున్నాను. రోజూ ఏడుస్తున్నాను. వాళ్ల ఇంటిలో తినడానికి అన్నీ ఉన్నాయి. కానీ, నాకేమీ మిగిలేది కాదు. నాకు ఇష్టం లేనిది పెట్టేవారు. ఆకలితోనే ఏడ్చి ఏడ్చి నిద్రపోయేదాన్ని’ కోమలి ఏడుస్తూనే బాల్యంలోని బాధను చెబుతోంది.

ఆమె దుఃఖం తీరాక..  ‘కోమలీ.. మరో ఎనిమిదేళ్లు వెనక్కి ప్రయాణించండి. తల్లిగర్భంలో మీరున్న స్థితిని చూస్తూ అటు నుంచి గత జన్మ ప్రయాణం మొదలుపెట్టండి. ఎక్కడ మీకు అపరిమితమైన బాధ కలిగిందో దానిని దర్శించండి’ అని చెబుతున్న కౌన్సెలర్‌ సూచనలు అందుకున్న కోమలి గతంలోకి ప్రయాణించడం మొదలుపెట్టింది. తల్లి గర్భంలో ఉన్న స్థితి నుంచి గత జన్మలోకి ప్రయాణాన్ని కొనసాగించింది. కోమలిలో తెరలు తెరలుగా దుఃఖం.

 ఏడుస్తూనే నాటి తన పరిస్థితిని వివరిస్తోంది. ‘నాకు తినడానికి తిండి లేదు. నన్ను చూసుకోవడానికి ఎవరూ లేరు. నాకు జబ్బు చేసింది. తిండి పెట్టేవారు లేరు. ఆకలితో పేగులు లుంగలు చుట్టుకుపోతున్నాయి. భరించలేక మట్టి తింటున్నాను. నాకు మంచి తిండి తినే యోగ్యతే లేదు’ చెబుతున్న కోమలి దుఃఖం తీరేదాకా ఎదురుచూసిన కౌన్సెలర్‌ సూచనలు ఇవ్వడం మొదలుపెట్టారు.

ఖాళీ మనసును ప్రేమతో నింపాలి
‘కోమలీ.. గత జన్మలో మీరు ఎదుర్కొన్న ఆకలి బాధను దర్శించారు. ఇక ఈ జన్మకు రండి. ఈ జన్మలో మీకు కావల్సినంత తిండి ఉంది. మిమ్మల్ని కంటికిరెప్పలా చూసుకోవడానికి అమ్మానాన్నా ఉన్నారు. గత జన్మ భయంతో ఈ జన్మలో తిండి దొరకదేమో అని కనిపించిందంతా తినేయాలనుకుంటున్నారు. అది ఒక రుగ్మతలా మారి మిమ్మల్ని బాధిస్తోంది. గత జన్మ లేమిని ఇప్పటి ఉన్నత స్థితి ఆలోచనతో నింపేయండి.

 ఇక ఈ జన్మలో బాల్యంలో తమ పరిస్థితుల దృష్ట్యా మిమ్మల్ని దూరంగా పెట్టిన అమ్మానాన్నలను క్షమించండి. బాధ స్థానంలో ప్రేమను నింపండి. మీ మనసును ఆనందమయం చేసుకోండి. మీకు అందమైన భవిష్యత్తును ఇవ్వడానికి అమ్మానాన్నలు పడిన కష్టాన్ని గుర్తించండి’ అంటూ చెప్పిన సూచనలతో కోమలి మనసు ప్రశాంతంగా మారింది.

మనసు నిండితే జీవితం ఆనందం
‘అమ్మా! చూడు ఆరు నెలల్లో నా బ్యూటీషియన్‌ కోర్సు కంప్లీట్‌ అయ్యింది. ఇంకో ఆరునెలల్లో నేనే సొంతంగా బ్యూటీ క్లినిక్‌ కూడా పెట్టేస్తాను. ఇదిగో నా కోర్స్‌ సర్టిఫికెట్‌’ అంటున్న కోమలితో ‘ఉండరా, నీ నోరు తీపి చేస్తాను’ అని వెళుతున్న తల్లిని ఆపింది కోమలి. ‘అమ్మా, నీ ప్రేమే నాకు పండగ. నువ్వు నాకు ప్రతిక్షణం సపోర్ట్‌గా ఉన్నావు.

నా గురించి నాకు తెలిసేలా చేసి నాకు మళ్లీ జన్మనిచ్చావు. చాలా థాంక్స్‌ అమ్మా’ అంటూ భార్గవి బుగ్గ మీద ముద్దుపెట్టింది కోమలి. ‘అమ్ములూ.. మూడు నెలలుగా ఆపుతున్న ఆ పెళ్లి సంబంధానికి ఇప్పటికైనా ఓకే చెప్పమంటావా’ అంటున్న తండ్రి మాటలకు ఫక్కున నవ్వింది కోమలి. కూతురి నవ్వులతో తల్లీదండ్రి జతకలిపారు.
– నిర్మలారెడ్డి చిల్కమర్రి

అదుపు సాధించాలి
మనసులో శూన్యం ఏర్పడితే దానిని పూడ్చటానికి రకరకాల వ్యాపకాలను ఎంచుకుంటాం. వాటిలో అతిగా తినడం ఒకటి. దీంతో బరువు మీద అదుపు కోల్పోతాం. ఫలితంగా అభద్రత, భయం.. వంటివి పెరుగుతాయి. దీనివల్ల నలుగురిలో కలవలేం. ఎవరూ మన మనసుకు దగ్గరగా లేరని నిరంతరం బాధపడుతుంటాం. మనసులో లోటును భర్తీ చేయడానికి కొందరు అవసరానికి మించి షాపింగ్‌ చేస్తుంటారు. ఇంకొందరు భవిష్యత్తులో ఎప్పుడైనా పనికివస్తాయేమో అని ఇప్పుడే వస్తువులను కొని పెట్టేస్తుంటారు. కొందరు అత్యంత పిసినారులుగా మారుతారు. ఇంకొందరు అతి శుభ్రతను పాటిస్తుంటారు. మరికొందరు అదేపనిగా మాట్లాడుతుంటారు.

వీటన్నింటికీ వారి గత జీవితం, గత జన్మతాలూకు బాధల అవశేషాలే కారణం. గతం తాలూకు ఆ బ్లాక్స్‌ను తొలగించి, ఇన్నర్‌చైల్డ్‌ సంతోషంగా ఉండేలా చేస్తే ఇలాంటి వారిలో ఉండే మానసిక రుగ్మతలు తగ్గిపోతాయి. భవిష్యత్తును దర్శింపజేస్తే.. జీవితంపై ఆశ కలుగుతుంది. ‘సాధించగలం’ అనే నమ్మకం ఏర్పడుతుంది. అవగాహన పెరిగి జీవన ప్రయాణాన్ని అందంగా మలుచుకుంటారు.
– డా.హరికుమార్, జనరల్‌ సర్జన్, ఫ్యూచర్‌ థెరపిస్ట్‌

గమనిక : ‘పాస్ట్‌ లైఫ్‌ రిగ్రెషన్‌ థెరపీ’ అంతర్జాతీయంగా ప్రోత్సాహకరమైన ఫలితాలను ఇస్తోంది. అయితే ఈ ప్రక్రియకు విస్తృతమైన ఆమోదం లభించకపోయినా.. థెరపీ ప్రయోజనాలపై ఆసక్తికరమైన కథనాలు వినిపిస్తున్నాయి. వాటిలో ఇవి కొన్ని.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement