తల్లి శాంతమ్మ కాళ్లు మొక్కుతున్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్
తల్లిని మించిన దైవం లేదు. కనిపించని దేవతల కన్నా.. నిత్యం మనకు కన్పించే తల్లిదండ్రులే నా దృష్టిలో అసలైన దేవుళ్లు. వాళ్ల ఆశీర్వాదం ఉంటే ప్రపంచాన్నైనా జయించొచ్చన్నది నా అభిప్రాయం. వాళ్ల మనస్సును బాధపెట్టి ఏ ఒక్కడూ హాయిగా బతకలేడు. అందుకే నేను ఇంటి నుంచి ఎప్పుడు బయటికి వెళ్లినా ముందు మా అమ్మ కాళ్లు మొక్కుతా. కొన్ని సందర్భాల్లో నేను ఇతర ప్రాంతాల్లో ఉంటే ఫోన్‌లోనైనా కచ్చితంగా నా తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకుంటా. తల్లి నవ మాసాలు బిడ్డను తన కడుపులో మోస్తే.. తండ్రి ఆ నవమాసాలు తన ఆలోచనల్లో బిడ్డల గురించి ఆలోచిస్తూనే ఉంటాడు.
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: సాధారణ కుటుంబం నుంచి వచ్చిన అసాధారణమైన వ్యక్తి ఆయన. ఓ ఉద్యోగిగా సమాజానికి పరిచయమై.. తల్లిదండ్రులు, అన్ని వర్గాల ప్రజల ఆశీస్సులు.. తెలంగాణ ప్రజానీకం ఆశీర్వాదంతో రాష్ట్రానికే మంత్రిగా వ్యవహరిస్తోన్న జననేత. ఒంటిపై తెల్ల బట్టలు.. ఎప్పుడూ ముఖంలో చిరునవ్వు అందరినీ ఆప్యాయంగా పలకరించే తత్వం ఆయనకే సొంతం. ప్రజాసేవనే పరమావధిగా భావించే గొప్ప నేత ఆయన. పేదోడి గుండెలోనే దేవుడుంటాడని నమ్మి.. ప్రజా సంక్షేమం కోసం పరితపించే ప్రజా నాయకుడతను. సమాజమే తన కుటుంబంగా.. మతాలు.. కులాలు అన్నీ తనవే అని భావించే నాయకుడు.
అందరూ బాగుండాలి.. అందు లో నేనుండాలి అనే సిద్ధాంతాన్ని నమ్మి ప్రజాసేవకే అంకితమైన మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే, రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తో ‘సాక్షి’ పర్సనల్ టచ్ ఆయన మాటల్లోనే.. మాది మహబూబ్‌నగర్ జిల్లా అడ్డాకుల మండలం రాచాల గ్రామం. నాన్న నారాయణగౌడ్ ప్రధానోపాధ్యాయుడిగా పని చేసి పదవీ విరమణ పొందారు. అమ్మ శాంతమ్మ గృహిణి. మేం ఇద్దరం అన్నదమ్ములం. ఓ చెల్లి. తమ్ముడు శ్రీకాంత్ గౌ డ్ మహబూబ్‌నగర్‌లోనే ఉంటాడు. చెల్లి శ్రీదేవికి పెళ్ల యింది. బావ చంద్రశేఖర్‌గౌడ్ ట్రాన్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్‌లో పని చేస్తారు. 1991లో పొల్కంపల్లికి చెందిన శార దతో వివాహమైంది. మాది పెద్దలు కుదిర్చిన సంబంధం. మాకు ఇద్దరు కూతుళ్లు. శ్రీ హిత, శ్రీహర్షి ఇద్దరూ ఎంటెక్ చదివారు. శ్రీహిత పెళ్లయింది. అల్లుడు డాక్టర్ శరత్ చంద్ర సన్‌షైన్ హాస్పిటల్‌లో పని చేస్తారు.
మతాలు.. కులాలన్నీ నాయే
వేంకటేశ్వరస్వామి, షిరిడీ సాయి నా ఇష్ట దైవాలు. అలా అని నేడు గుడికి మాత్రమే వెళ్లను.. దర్గాకూ వెళ్తా.. చర్చికీ వెళ్తా.. గురుద్వారకూ వెళ్తా. అన్ని మతాల సారాంశం ఒక్కటే అని నమ్మే వాడిని నేను. ఒక్కో మతం ఒక్కో దారిని చూపించింది దారులన్నీ మోక్షానికి తీసుకెళ్తాయి. కుల, మతాల పట్టింపులు నాకు లేవు. అంతకు మించి చెప్పాలంటే పేదోడి గుండెలోనే దేవుడు కొలువై ఉంటాడనేది నా అభిప్రాయం. అవసరం ఉన్న వారిని ఆదుకుంటే జీవితానికి సార్థకత లభించినట్టే. ఉపవాసాలు.. దానధర్మాలు.. పూజలు పురస్కారాల కంటే పేదోడి సేవలోనే ఎక్కున పుణ్యం లభిస్తుందనేది నా విశ్వాసం.
బెస్ట్ ఫాదర్ అండ్ మదర్: శ్రీహర్షి
మా తల్లిదండ్రులే మాకు రోల్ మోడల్. బెస్ట్ ఫాదర్ అండ్ బెస్ట్ మదర్. నాన్న ప్రజాజీవితంలో బిజీగా ఉన్నప్పటికీ ఏనాడూ మమ్మల్ని విస్మరించలేదు. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఏనాడూ ఇద్దరు కనీసం చిన్న వాగ్వాదం కూడా చేసుకోలేదు. నాన్న మా భవిష్యత్‌పై ఎంత శ్రద్ధ తీసుకుంటున్నారో.. ప్రజల బాగోగుల గురించి అంతే డిస్కస్ చేస్తారు. నాన్న ఎంత బిజీలైఫ్‌గా ఉన్నా రాత్రయితే కచ్చితంగా ఇంటికొస్తారు. మాతో కనీసం పది నిమిషాలైన గడుపుతారు. చదువు, ఇతర అవసరాల గురించి చర్చిస్తారు. ఇలాంటి అమ్మానాన్నలు ఉండడం మా అదృష్టం.
కొడుకులు లేరనే బాధ లేదు
సహజంగా ప్రతి తల్లిదండ్రులకు కొడుకు ఉంటే బాగుంటుంది. వంశాన్ని ముందుకు తీసుకెళ్తాడనే అభిప్రాయం ఉంటుంది. కానీ నాకు ఇద్దరూ ఆడపిల్లలే. అయినా నేను, శారద మాకు కొడుకులు లేరని ఏనాడూ నిరాశ చెందలే. వాస్తవంగా కొడుకుల కంటే కూతుళ్లే తల్లిదండ్రుల బాగోగులు చేసుకుంటారనేది మా అభిప్రాయం. ఇది నా జీవితంలో మాత్రం నూటికి నూరు శాతం నిజమైంది. నా ఇద్దరు బిడ్డలకు నేనంటే ప్రాణం. నాకు ఏ సమస్య వచ్చినా తట్టుకోలేరు. నేనూ వాళ్లను విడిచిపెట్టి ఉండలేను.
కోపం తగ్గించుకున్నారు: శారద
ఉద్యోగం చేస్తున్నప్పుడు..ఉద్యమ సమయంలో మా ఆయనకు కోపం ఎక్కువగా ఉండేది. కొన్ని సందర్భాల్లో నేనే భయపడే దాన్ని. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. ప్రజాజీవితంలో అడుగుపెట్టిన తర్వాత ఆయనలో కోçపం పూర్తిగా తగ్గింది. ఎవరు ఏమ న్నా ఓర్పుతో వింటారు. ఇక కుటుంబ విషయానికి వస్తే ఆయన ఏనాడూ కుటుంబంలో ఎవరినీ విస్మరించలేదు. అత్తమామల కోసం, మా కోసం కచ్చితంగా సమయం కేటాయిస్తారు. బంధువుల ఇళ్లలో పెళ్లిళ్లు, శుభకార్యాలు ఏవైనా ఉంటే దాదాపు వస్తారు. మా ఆయన రాష్ట్రానికి మంత్రిగా వ్యవహరించడం, ప్రజల సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేస్తుంటే గర్వంగా ఉంది.
‘సిరీక్ష’ నా ప్రాణం...!
నా మనవరాలు సిరీక్ష అంటే నాకు ప్రాణం. నా చిన్నారిని చూడకుండా ఒక్క రోజు కూడా ఉండలేను. నా ఇద్దరు కూతుళ్ల చిన్నతనంలో నేను ఉద్యోగం, ఇతర కార్యక్రమాల్లోనే ఎక్కువ సమయం గడిపా. ఇంటి నుంచి ఉదయం బయటికి వెళ్తే వచ్చే వరకు రాత్రయ్యేది. అప్పటికే శ్రీ హిత, శ్రీ హర్షి నిద్రపోయేవారు లేదా చదువులో నిమగ్నమంగా ఉండే వారు. ఆ సమయంలో వారి చదువు, నిద్రకు భంగం కలిగించకపోయే వాడిని. చూస్తూనే వాళ్లిద్దరూ ఎదిగారు. వాళ్ల బాల్యాన్ని చూసింది తక్కువే. తర్వాత చాలాసార్లు నాకు అనిపించేంది.. నా పిల్లలతో ఎక్కువ సమయం కేటాయించలేకపోయాయని. తరుచూ బాధపడేవాడిని. కానీ ఇప్పుడు మనవరాలు, శ్రీ హిత బిడ్డ సిరీక్షతో నాకు అటాచ్‌మెంట్ పెరిగింది. ఇప్పుడు ప్రజాసేవలో ఉన్నప్పటికీ సిరీక్షను వదిలిపెట్టి ఒక్కరోజు కూడా ఉండలేను. ఎక్కడికి వెళ్లినా రాత్రికి ఇంటికి తిరిగి వచ్చేస్తా. అప్పటి వరకు నా చిట్టి తల్లి ఈ తాతా కోసం ఎదురుచూస్తూ ఉంటుంది.
మంత్రినవుతానని ఊహించలేదు
30ఏళ్ల కిత్రం నేను మున్సిపాలిటీలో పబ్లిక్ హెల్త్ ఇన్‌స్పెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన. అప్పుడు ఆ ఉద్యోగం వచ్చినందుకు చాలా సంతోషపడ్డ. శాఖలోనే ప్రమోషన్లు వస్తాయి. ఏదో ఉన్నత పోస్టు నుంచి రిటైర్డ్ అవుతానని భావించిన. కానీ తెలంగాణ ఉద్యమం నాకు ఈ రోజు మంత్రి హోదా తెచ్చిపెట్టిందని భావిస్తున్న. ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించి ఉద్యోగులందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చిన నాకు కేసీఆర్ ఎమ్మెల్యే టికెట్ ఇస్తే జనం ఓటేసి ఆశీర్వదించారు. నేను రాష్ట్రానికి మంత్రినవుతానని ఏనాడూ అనుకోలేదు.
కేసీఆర్ రోల్ మోడల్
సీఎం కేసీఆర్ నాకు రోల్ మోడల్. ప్రాణాలను లెక్క చేయకుండా ఉద్యమాన్ని తారాస్థాయికి తీసుకొచ్చి.. ఆమరణ దీక్ష చేపట్టి ఎట్టకేలకు ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్‌కే దక్కింది. 2001లో కేసీఆర్ టీఆర్‌ఎస్ పార్టీ ఏర్పాటు చేసినప్పటి నుంచి ఆయన వెంటే ఉన్న. 2004లో తెలంగాణ ఉద్యోగుల జేఏసీకి సెక్రటరీ జనరల్‌గా పనిచేశా. 2009లో పొలిటీకల్ జేఏసీ కో– చైర్మన్‌గా పని చేశా.
- పెళ్లి రోజు వేడుకైనా.. జన్మదినోత్సవ వేడుకలైనా అనాథ పిల్లల మధ్య జరుపుకోవడం అలవాటు. తర్వాత స్నేహితులు.. బంధుమిత్రులు వచ్చి శుభాకాంక్షలు తెలుపుతారు. వాళ్లతో, నా బిడ్డలతో కలిసి ఇంట్లో వండుకుని తింటాం.
- సహజంగా నాకు ఖాళీ సమయం అనేది దొర కదు. మంత్రిగా ఇప్పుడు మరింత బిజీగా ఉంటున్న. అయినా కొంత ఖాళీ సమయం దొరికితే. పెండింగ్‌లో ఉన్న ప్రజా సమస్యలను ఎలా పరిష్కరించాలి.? అనే దానిపై ఆలోచిస్తా. అలాగే ప్రజలకు నేను ఇచ్చిన హామీలు ఏ మేరకు నెరవేర్చాను? అని తెలుసుకునే ప్రయత్నం చేస్తా.
- మానవసేవే మాధవసేవ అనే సిద్ధాంతాన్ని నమ్ముతా. పేదలే నా బలం.. నా బలహీనత. వాళ్లు సంతోషంగా ఉంటే నేనూ సంతోషంగా ఉన్నట్టే. ఆపదలో ఉన్న వారిని చూసి తట్టుకోలేను. ఎవరికీ ఏ ఇబ్బంది వచ్చినా నా దగ్గరికి వస్తారు. అలాంటి వాళ్లను ఆదుకోవడంలో ఉన్న తృప్తి నాకు ఎందులోనూ దొరకదు. ఎవరైనా ఏ జబ్బుతోనైనా ఆస్పత్రిలో చేరిన విషయం నా దృష్టికి వస్తే కచ్చితంగా వారి పరామర్శకు వెళ్తా. దీన్ని నేను ఓ అలవాటుగా మార్చుకున్న. దేవుడు ఎక్కడో లేడు పేదోడి గుండెల్లోనే ఉన్నడు. అలాంటి వారికి సహాయం చేస్తే జీవితానికి సార్థకత.
పోరు‘సత్వం’ పుచ్చుకున్న
ఉద్యమపోరునే నేను వారసత్వంగా పుచ్చుకున్న. 1969లో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తునా సాగుతోన్న క్రమంలో మా నాన్న గారు ముసాపేట జిల్లా పరిషత్ హైస్కూల్‌లో ప్రధానోపాధ్యాకుడిగా పని చేస్తున్నారు. ఆ సమయంలో మా నాన్న పిల్లలతో కలిసి అక్కడ రోడ్డుపై రాస్తారోకో చేశారు. బస్సులు ఆపారు. అప్పుడు ఎవరూ గుర్తు తెలియని వ్యక్తులు మా నాన్నను పొడిచారు. చనిపోయాడనుకుని అక్కడి పోలీస్ స్టేషన్‌లో పడేసి వెళ్లిపోయారు. కానీ దేవుడి దయవల్ల నాన్న బతికారు. ఆ సంఘటన మరిచిపోలేకపోతున్న. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఎంత అవసరమో అని అప్పుడే నాకు తెలిసింది. 1988లో మున్సిపల్ కార్యాలయంలో హెల్త్ ఇన్‌స్పెక్టర్‌గా నా ఉద్యోగ ప్రస్తానం మొదలుపెట్టా. తర్వాత అంచెలంచెలుగా పదోన్నతులు సాధించి హైదరాబాద్, శేరిలింగంపల్లి, కాప్రా, అల్వాల, రాజేంద్రనగర్ మున్సిపాలిటీలకు కమిషనర్‌గా బాధ్యతలు నిర్వర్తించా.
ఉద్యోగులకు కిరణం
ఆంధ్రా వలసవాదుల పాలనలో నేను ప్రభుత్వ ఉద్యోగిగా పని చేస్తున్నప్పుడు తెలంగాణ ఉద్యోగులు ఎన్నో రకాల సమస్యలు.. ఇబ్బందులకు గురయ్యే వారు. వారి సమస్యల గురించి ఎవరూ పట్టించుకోలేదు. ఆ సమయంలో 2005లోనే నేను ఉద్యోగుల కిరణం అనే మాస పత్రికను స్థాపించాను. అందులో తెలంగాణలో ఉద్యోగులు పడుతోన్న బాధలు, శాఖల వారీగా అవసరమైన సమాచారాన్ని ప్రచురించడం ప్రారంభించా. తెలంగాణ ఉద్యమ వార్తలు ప్రచురించి ఉద్యోగుల్లో ఉద్యమ ఆకాంక్షను బలోపేతం చేశా. అప్పట్నుంచీ నేనే ఆ పత్రికకు ఎడిటర్‌గా ఉన్న. పద్నాలుగేళ్ల నుంచి ఈ పత్రికను నేనే నడుపుతున్నందుకు గర్వంగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment