TPCC President Revanth Reddy Comments Over CM KCR - Sakshi
Sakshi News home page

కేసీఆర్‌కు వెయ్యి ఎకరాల్లో ఫామ్‌హౌస్‌

Published Mon, Jul 31 2023 1:32 AM | Last Updated on Mon, Jul 31 2023 5:19 PM

Revanth reddy comments over kcr - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పాలమూరు జిల్లా ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేతిలో మోసపోయిందని టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. కేసీఆర్‌కు వెయ్యి ఎకరాలలో, కేటీఆర్‌కు వంద ఎకరాలలో ఫామ్‌ హౌస్‌లు, రూ.వేల కోట్ల ఆస్తులు, వందల ఎకరాల భూములు, టీవీలు, పేపర్లు వచ్చాయి కానీ దత్తత తీసుకున్న పాలమూరు మాత్రం పడావు పడిందన్నారు. ఉద్యమ సమయంలో ఎంపీగా గెలిపించిన మహబూబ్‌నగర్‌ జిల్లాకు, జిల్లా ప్రజలకు ఇచ్చిన హామీలలో ఒక్కటీ నెరవేర్చలేదని ఆరోపించారు.

ఆదివారం జూబ్లిహిల్స్‌లోని తన నివాసంలో కాంగ్రెస్‌లో చేరిన మహబూబ్‌ నగర్‌ మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ రాధ అమర్, మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ అమరెందర్‌ రాజు, కౌన్సిలర్‌ రమాదేవితో పాటు ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌ కుమార్‌ ఆధ్వర్యంలో కాంగ్రెస్‌లో చేరిన పలువురు బీఆర్‌ఎస్‌ నాయకులకు కండువాలు కప్పి పార్టీలోకి ఆహా్వనించారు.

ఈ సందర్భంగా రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ ఎంపీగా గెలిపిస్తే తన ఇల్లును అమ్మి పాలమూరును అభివృద్ధి చేస్తానని చెప్పిన కేసీఆర్‌ సీఎం అయి తొమ్మిదేళ్లయినా అతీగతీ లేకుండా పోయిందన్నారు. పాలమూరు జిల్లాను అద్దంలా మారుస్తానన్న హామీ ఏమైందన్నారు. 

వక్ఫ్‌ భూములనూ వదలని మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ 
జిల్లాలో మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ భూకబ్జాలకు పాల్పడుతున్నారని, వక్ఫ్‌ భూములను సైతం వదలకుండా ఆక్రమణలకు పాల్పడుతున్నారని రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. ల్యాండ్, శాండ్, మైన్, వైన్‌.. ఏ దందాలో చూసినా బీఆరెస్‌ నేతలే ఉన్నారని, వాళ్ల అరాచకాలను ఎదిరించేందుకు కాంగ్రెస్‌లో చేరడం అభినందనీయమన్నారు. పోలీసులు, అధికారులు బీఆర్‌ఎస్‌ కార్యకర్తల్లా వ్యవహరించవద్దని, అక్రమ కేసులు పెడితే మిత్తితో సహా చెల్లిస్తామని రేవంత్‌ హెచ్చరించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement