వెంచిర్యాలలో ఎస్సీలకు భూ పంపిణీ చేయడానికి పూజ చేస్తున్న అర్గుల్ రాజారాం (ఫైల్)
సాక్షి, నిజామాబాద్: బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసి, ఆర్మూర్, బాల్కొండ, నియోజకవర్గాల ప్రజల మనస్సుల్లో నిలిచిపోయిన మహా మనీషి అర్గుల్ రాజారాం. ఆర్మూర్ నుంచి ఒకసారి, బాల్కొండ నుంచి వరసగా నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుపొంది ఉన్నత మంత్రి పదవులు నిర్వహించారు. బీసీ నేతగా ఎదిగి ఆదర్శప్రాయమైన రాజకీయాలతో తనదైన ముద్ర వేసుకున్నారు.
ఆయన వద్ద రాజకీయ ఓనమాలు దిద్దిన ఆయన శిష్యులు పీసీసీ మాజీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్, మాజీ మంత్రి శనిగరం సంతోష్‌రెడ్డి తదితరులు రాష్ట్ర రాజకీయాల్లోనే క్రియాశీల పాత్ర పోశించారు. ఆయన చేసిన సేవలకు గుర్తుగా నిజాంసాగర్ చివరి ఆయకట్టు ప్రాంతమైన ఆర్మూర్ ప్రాంతంలోని 38 వేల 792 ఎకరాలకు సాగునీరందించే గుత్ప ఎత్తిపోతల పథకానికి అర్గుల్ రాజారాం పేరు పెట్టారు. ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో దివంగత నేత అర్గుల్ రాజారాం కుటుంబీకులు ఏర్పాటు చేసిన విగ్రహాన్ని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 2008 మార్చి 18న ఆవిష్కరించారు.
ఆదర్శం ఆయన రాజకీయ జీవితం..
జక్రాన్‌పల్లి మండలం అర్గుల్ గ్రామంలోని మధ్య తరగతి, బలహీన వర్గానికి చెందిన అర్గుల్ రాజన్న, రాజవ్వ దంపతులకు జన్మించారు. ఉస్మానియా యూనివర్సిటీలో బికాం పట్టా పొందారు. విద్యార్థి దశనుంచే సోషలిస్టు భావాలతో ముందుకుసాగారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం 1969లో జరిగిన తొలి విడత ఉద్యమంలో మర్రి చెన్నారెడ్డితో కలిసి క్రియాశీలంగా పాల్గొన్నారు.
► సోషలిస్టు నాయకుడు జయప్రకాష్ నారాయణ శిష్యరికంతో 1952లో ఆర్మూర్ నియోజకవర్గం నుంచి సోషలిస్టు పార్టీ అభ్యర్థిగా పోటీలో నిలిచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.
► 1957లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బాల్కొండ నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలుపొందారు.
► 1962లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఫత్తేపూర్ శ్రీధర్‌రెడ్డిపై బాల్కొండ ఎమ్మెల్యేగా గెలుపొందారు.
► 1967లో బాల్కొండ ఎమ్మెల్యేగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
► పీవీ నర్సింహారావు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జౌళి, చేనేత, చక్కర పరిశ్రమల శాఖ మంత్రిగా పని చేశారు.
► 1969లో తెలంగాణ ఉద్యమంలో అగ్రనేతగా ముందున్నారు. మర్రి చెన్నారెడ్డితో పాటు రాజమండ్రిలో జైలు జీవితాన్ని గడిపారు.
► 1972లో ధర్మోరా రాజేశ్వర్‌రెడ్డిపై అర్గుల్ రాజారాం బాల్కొండ స్థానానికి పోటీ చేసి అత్యధిక మెజారిటీతో గెలుపొందారు.
► 1972లో విద్యుత్ శాఖ మంత్రి, పశు గణాంక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.
► 1978లో ఇందిరా కాంగ్రెస్ అభ్యర్థిగా బాల్కొండ నుంచి పోటీ చేసి అత్యధిక మెజారిటీతో గెలుపొందారు.
► ఇదే సమయంలో అర్గుల్ రాజారాం అనుచరుడు శనిగరం సంతోష్‌రెడ్డిని ఆర్మూర్ ఎమ్మెల్యేగా నిలబెట్టి గెలిపించారు.
► శనిగరం సంతోష్‌రెడ్డి, ధర్మపురి శ్రీనివాస్‌లతో పాటు ఆర్మూర్ పంచాయతి సమితి మాజీ అధ్యక్షుడు కుంట గంగారాం, మగ్గిడి గంగాధర్, పడిగల హన్మాండ్లు, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ గంట సదానందం, కుద్వాన్‌పూర్ రామారావ్, మగ్గిడి గంగాధర్‌రావు ఆయన అనుచరగణంలోని వారే.
Comments
Please login to add a commentAdd a comment