సాక్షి, నిజామాబాద్: సాధారణ ఎన్నికల నేపథ్యంలో ఆయా పార్టీల అభ్యర్థులు ప్రచారం చేస్తున్నప్పటికీ.. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి స్మార్ట్ ప్రచారానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుండడం గమనార్హం. ప్రజల నుంచి సైతం సోషల్ మీడియా ప్రచారానికి ఎక్కువ ఆసక్తి కనిపించడం విశేషం. దీంతో గతానికి భిన్నంగా విచ్చలవిడిగా కరపత్రాలు పంచడం, ప్రెస్‌మీట్లు పెట్టడం లాంటి కార్యక్రమాలు తగ్గించారు.
ప్రతి ఒక్కరికీ స్మార్ట్ ఫోన్ ఉండడం, ఇంటర్‌నెట్ అపరిమితంగా వినియోగిస్తున్న నేపథ్యంలో సామాజిక మాధ్యమాల ద్వారా భారీ ఎత్తున ప్రచారం చేసేందుకు అభ్యర్థులు ప్రత్యేక ఏర్పాట్లు చేసుకున్నారు. ఇందులో భాగంగా నియోజకవర్గం, మండలం, గ్రామం, వార్డుల వారీగా, కులాలు, సంఘాల వారీగా, యువజన సంఘాల పేరిట ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసుకున్నారు.
సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారాన్ని నిర్వహించేందుకు గాను ప్రత్యేకంగా జీతాలు ఇచ్చి మరీ సాంకేతిక పరిజ్ఞానం ఉన్న నిపుణులను ఉపయోగిస్తున్నారు. నియోజకవర్గంలో ఎక్కడ ప్రచారం చేసినా ఆయా ప్రచారం అన్ని గ్రూపుల్లో వచ్చేవిధంగా ప్లాన్ చేసుకుని ముందుకు వెళుతున్నారు. ఫేస్‌బుక్ లైవ్‌లు, యూట్యూబ్ లైవ్‌లు సైతం పెట్టుకుని ప్రచారం సాగిస్తున్నారు.
పార్టీల మేనిఫెస్టోలోని పథకాల గురించి ప్రచారం చేస్తూనే స్థానిక అంశాలనూ ప్రచారాస్త్రాలుగా చేసుకుంటున్నారు. కరపత్రాలను పరిమిత సంఖ్యలో ముద్రించి, వాటిని పీడీఎఫ్ ఫైల్ తయారు చేయించి వాట్సాప్ గ్రూపుల ద్వారా భారీగా వైరల్ చేస్తున్నారు. వాట్సాప్ స్టేటస్‌లకు సైతం మరింత ప్రాధాన్యత పెరగడం గమనార్హం. వ్యక్తుల వాట్సాప్ స్టేటస్‌లను బట్టి సదరు వ్యక్తి ఆలోచనలను అంచనా వేసుకుంటూ అందుకు అనుగుణంగా అలాంటి వ్యక్తులను కన్విన్స్ చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.
'కొందరు యువకులు మాత్రం జిల్లాలో పార్టీలకు అతీతంగా ప్రభుత్వ వైఫల్యాలు, అపరిష్కృత సమస్యలు, పోటీ పరీక్షల విషయమై ప్రభుత్వం వైఫల్యాలు, పేపర్ లీక్‌లు తదితర అంశాలను వైరల్ చేస్తుండగా, స్థానిక సమస్యలను విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.
ఇటీవల నందిపేట మండలంలోని పలు గ్రామాలకు చెందిన యువకులు ధ్వంసమైన రోడ్ల గురించి ఎమ్మెల్యేను విమర్శిస్తూ సైటెరికల్‌గా చేసిన వీడియో వైరల్ అయింది. అదేవిధంగా ప్రభుత్వ పథకాల్లో అధికార పార్టీ నాయకులు కమీషన్లు తీసుకుంటున్నారని ఆర్మూర్‌కు చెందిన యువకులు చేసిన వీడియోలు బాగా వైరల్‌అయ్యాయి. ఇలా సోషల్ వార్ మరింత విస్తరిస్తోంది.'
Comments
Please login to add a commentAdd a comment