
సమస్యలన్నీ తీరుస్తా..
చెన్నూర్ : ‘మూడేళ్లుగా అరకొర వసతుల మధ్య అద్దె భవనంలో ఉంటూ విద్యాభ్యాసం చేస్తున్నం. మా పాఠశాలలో చాలా సమస్యలు రాజ్యమేలుతున్నాయి. వర్షాకాలంలో వర్షానికి గదులు నీటిమయం అవుతున్నాయి. కిటికీలు సక్రమంగా లేవు. చలికాలం కావడంతో తీవ్ర చలికి వణికిపోతున్నం. మరుగుదొడ్లు సక్రమంగా లేవు. స్నానాలు చేసేందుకు ఒకే బోరుపంపు ఉంది. ఒక్కొక్కరు స్నానం చేయాలంటే సమయం వృథా అవుతోంది. క్రీడా స్థలం లేదు. ఆడుకునేందుకు సామగ్రి లేదు. పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు పుస్తకాలు అందుబాటులో లేవు.
మూడేళ్లుగా రగ్గులు సరఫరా కాలేదు. కాస్మోటిక్స్ చార్జీలు రాక మూడు నెలలైతంది. ఇళ్ల నుంచి నెలకు రూ.100 తెచ్చుకుంటే సరిపోవడం లేదు. రగ్గులు ఇప్పించి, కాస్మోటిక్స్ చార్జీలు వచ్చేలా చూడండి సారూ..’ అంటూ విద్యార్థినులు తమ గోడు వినిపించారు. విద్యార్థినుల సమస్యలు తెలుసుకునేందుకు జిల్లా పరిషత్ చైర్మన్ మూల రాజిరెడ్డి ‘సాక్షి’ వీఐపీ రిపోర్టర్‌గా మారారు.
చెన్నూర్‌లోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం(కేజీబీవీ)ను సందర్శించి విద్యార్థినులతో మాట్లాడారు. వారి ఇబ్బందులు తెలుసుకున్నారు. అన్ని తరగతి గదుల్లోకి వెళ్లి పరిశీలించారు. వారి కష్టాలు విని చలించిన ఆయన దశలవారీగా సమస్యలన్నీ పరిష్కరిస్తానని హామీనిచ్చారు. జిల్లాలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతానని స్పష్టం చేశారు. విద్యార్థినులతో సంభాషణ ఇలా సాగింది..
మూల రాజిరెడ్డి : అందరికీ నమస్కారములు.. అమ్మాయిలు బాగున్నారా..
విద్యార్థినులు : కూర్చున్న విద్యార్థినులు లేచి నిలబడి.. బాగున్నాం సార్..
రాజిరెడ్డి : నా పేరు రాజిరెడ్డి, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్‌ను.. ‘సాక్షి’ వీఐపీ రిపోర్టర్‌గా మీ సమస్యలు తెలుసుకునేందుకు వచ్చాను. నిర్భయంగా మీ సమస్యలు చెప్పండి.
విద్యార్థినులు : ఒకే సార్.. మీరు మాకు తెలుసు..
రాజిరెడ్డి : అమ్మాయి నీపేరేంటి..
విద్యార్థిని : నాపేరు అగ్గు లక్ష్మీ, మూడేళ్ల నుంచి మాకు బెడ్ షీట్లు రాలేదు.
రాజిరెడ్డి : బెడ్ షీట్ల కోసం అధికారులతో మాట్లాడుతాను. చలి తీవ్రంగా ఉంది కాబట్టి మూడు రోజుల్లో స్వంత ఖర్చులతో మీ అందరికీ రగ్గులు కొని ఇస్తా.
అగ్గు స్వాతి : కాస్మోటిక్స్ చార్జీలు రావడం లేదు సార్. ఇబ్బందవుతుంది.
రాజిరెడ్డి : కలెక్టర్‌తో మాట్లాడి కాస్మోటిక్స్ చార్జీలు వెంటనే విడుదల చేయిస్తా
చింత మానస : అద్దె భవనం శిధిలావస్థకు చేరింది. భయం వేస్తుంది.
రాజిరెడ్డి : భవనం పనులు ప్రారంభమయ్యాయి. త్వరితగతిన పనులు పూర్తి చేయించి వచ్చే విద్యా సంవత్సరం కొత్త భవనంలోనే మీరు చదువుకునేందుకు కృషి చేస్తా.
ఎడ్ల శీర్షిష : ఆటలంటే ఇష్టం ఉంది. పరికరాలు లేవు.
రాజిరెడ్డి : పీవోతో మాట్లాడి క్రీడా పరికరాలు మంజూరు చేయిస్తా. జనవరి 26 రోజున కొన్ని క్రీడా పరికరాలు నా స్వంత ఖర్చులతో అందజేస్తా.
పి.శ్రీమతి : గత నెల రోజుల నుంచి పామాయిల్ సరఫరా చేస్తున్నారు. ఈ ఆయిల్‌ను వాడడంతో అరోగ్యాలు బాగుంటలేవు.
రాజిరెడ్డి : నిత్యావసర సరుకులు సరఫరా చేసే కాంట్రాక్టర్‌తో చెప్పి నాణ్యమైన నూనె సరఫరా చేసేలా చర్యలు తీసుకుంటా.
కందుగల అంజలి : నిరుపేదలం సార్.. సబ్బుల బిల్లులు రావడంలేదు. ఇబ్బంది అవుతుంది.
రాజిరెడ్డి : ఇప్పటికిప్పుడు బిల్లులు మంజూరు కావడం సాధ్యం కాదు. రెండు రోజుల్లో దాతల సహకారంతో నెలకు సరిపడా సబ్బులు అందజేస్తా.
పాకాల రాజేశ్వరి : ట్రంక్ పెట్టెలు రాలేదు. బట్టలు, పుస్తకాలు పెట్టుకునేందుకు ఇబ్బందైతంది.
రాజిరెడ్డి : కలెక్టర్‌తో మాట్లాడి పెట్టెలు మంజూరు చేయిస్తా.
ప్రవళిక : ప్లేట్లు, గ్లాసులు లేక ఇబ్బంది అవుతుంది.
రాజిరెడ్డి : గ్లాస్‌లు, ప్లేట్లు దాతల సహకారంతో త్వరలోనే అందజేస్తా.
ఎ.చామంతి : క్విజ్ పోటీలు, పోటీ పరీక్షలకు వెళాలంటే పుస్తకాలు అందుబాటులో లేవు.
రాజిరెడ్డి : ప్రస్తుతానికి గ్రంథాలయం నుంచి పుస్తకాలు అందించేలా చూస్తాను. రానున్న రోజుల్లో పాఠశాలలోనే గ్రంథాలయం ఏర్పాటుకు కృషి చేస్తా.
నల్లకుంట లావణ్య : 8వ తరగతి నుంచి ప్రాజెక్ట్ వర్క్ చేయాలి. పరికరాలు అందుబాటులో లేవు.
రాజిరెడ్డి : ఈ విద్యా సంవత్సరం దగ్గర పడుతుంది. వచ్చే ఏడాది. కొత్త భవనంలో ల్యాబ్ సౌకర్యం కల్పిస్తాం.
నల్లకుంట సౌందర్య : ఫ్యాన్లులేవు.. రాత్రి వేళల్లో దోమలు కుడుతున్నాయి.
రాజిరెడ్డి : అన్ని రూముల్లో ఫ్యాన్లు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తాను.
సత్యవతి : ఇరుకు గదుల్లో ఇబ్బంది అయితాంది..
రాజిరెడ్డి : అన్ని సమస్యలు తీరాలంటే కొత్త భవన నిర్మాణం ఒక్కటే.
బెజ్జాల రాణి : స్కూల్‌ల్లో చేతిపంపు ఉంది. స్నానాలు చేసేందుకు క్యూ కట్టాల్సి వస్తుంది. ప్రార్థన సమయానికి అందలేకపోతున్నం.
రాజిరెడ్డి : చేతిపంపునకు మోటారు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తాను.