బేఫికర్
వారంతా ఒకప్పుడు రెక్కలు ముక్కలు చేసుకొని బొగ్గుబావుల్లో పనిచేసినవారు. ఇప్పుడు పదవీ విరమణ చేసి వృద్ధాప్యంలో ఉన్నారు. 70 ఏళ్ల క్రితం వీరి కోసం ఇల్లెందు 21 పిట్ ఏరియాలో కట్టించిన క్వార్టర్లు కూడా వీరితో పాటే వృద్ధాప్యానికి చేరాయి. ఒకప్పుడు ఇక్కడున్న బొగ్గు బావులను మూసివేశారు. ఇక్కడ పనిచేస్తున్న కార్మికులు వేరే ప్రాంతానికి బదిలీ అయ్యారు. పదవీ విరమణ చేసిన కార్మికులు మాత్రం ఈ క్వార్టర్లనే పట్టుకొని ఉంటున్నారు. 325 క్వార్టర్లలో కేవలం పదింటిలోనే ప్రస్తుత కార్మికులుంటుండగా మిగిలిన వాటిలో మాజీ కార్మికులు నివసిస్తున్నారు.
ఈ కాలనీ బాగోగులు చూడాల్సిన సింగరేణి యాజమాన్యం పట్టించుకోవడం మానేసింది. ఇక్కడి ప్రజలు నీరు, విద్యుత్, పారిశుధ్యం, రోడ్లు తదితర సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నా ఎవరూ కన్నెత్తై చూడటం లేదు. ‘సాక్షి’ వీఐపీ రిపోర్టర్‌గా ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య ఈ ప్రాంతాన్ని ఆదివారం సందర్శించారు. కాలనీ ప్రజలకు అండగా ఉంటానని..క్వార్టర్లు ఖాళీ చేయాల్సిన పనిలేదని భరోసా ఇచ్చారు.
కోరం కనకయ్య : బాగున్నరామ్మా..మన కాలనీ ఇబ్బందులు తెలుసుకుందామని వచ్చినా..చెప్పండి?
మర్రి లక్ష్మి : సారూ కాలనీ నిండా సమస్యలే ఉన్నయి. జమానలో మా ఆయన బొగ్గు గనుల్లో పని చేసిండ్రు. పదవీ విరమణ పొందిన తర్వాత ఇక్కడే ఉంటున్నం. సింగరేణి అధికారులు కొన్నేళ్లుగా మా కాలనీ బాగోగులు పట్టించుకోవట్లేదు. క్వార్టర్లు కూల్చి ఇక్కడి నుంచి మమ్మల్ని సాగనంపాలని చూస్తుండ్రు. మేము ఎక్కడికి పోయి బతకాలి సారు?.
కోరం కనకయ్య : నీ పరిస్థితి ఏంటమ్మా?
ఆగమ్మ : మా ఆయన కూడా బొగ్గుబాయిల పనిచేసి దిగిండ్రు. నాడు సింగరేణి ఇచ్చిన డబ్బులు కుటుంబ జీవనానికి సరిపోవట్లేదు. పింఛన్ కోసం ఎన్నో సార్లు దరఖాస్తు చేసుకున్నం. దయచేసి పింఛన్ ఇప్పించడయ్యా.
కోరం కనకయ్య : ఏం తాతా ఇదేనా మీ ఇల్లు?
బాలమల్లు : అవునయ్యా.. నాకు ఇల్లులేకనే గిట్ట రేకుల షెడ్డు వేసుకున్న. పెద్ద మనసు చేసుకొని నేను, మా ముసలిది ఉండేందుకు పక్కా ఇల్లు ఇప్పించడయ్యా. వర్షాకాలంలో ఈ షెడ్లె ఉండలేకపోతున్నం. ఇల్లు కోసం దరఖాస్తు పెట్టుకున్నం జర ఇప్పించడయ్యా.
కోరం కనకయ్య : నీ సమస్య ఏంటమ్మా?
లక్ష్మి : నా బిడ్డ అంగవైకల్యం, బుద్ది మాంధ్యంతో 35 ఏళ్లగా బాధపడుతుందయ్యా. పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్నం. జర ఇప్పించడయ్యా.
కోరం కనకయ్య : అక్కా.. కాలనీ ఇబ్బందులేంటి?
తులస్య : కాలనీలో పందులు, కోతులు బాగున్నయయ్యా..కోతుల దాడిలో పిల్లకాయలు గాయపడ్డరు. పందులు విపరీతంగా ఉండటంతో రోగాలు వస్తున్నాయి. వీటిని అరికట్టండయ్యా.
కోరం కనకయ్య : చిన్నా ఏం చదువుతున్నారు? మీకేమైన బాధలున్నాయా?
కుమార్, జావిద్, నరేందర్ : సార్..మేము బీటెక్ చదువుతున్నాం. ఫీజు రీయింబర్స్‌మెంట్ రాలేదు. కాలేజీ యాజమాన్యం ఒత్తిడి చేస్తోంది. రీయింబర్స్ వచ్చేలా చూడండి సార్.
కోరం కనకయ్య : కుటుంబరావు బాగున్నావా? మీ వాడ సమస్యలేంటి?
బిందె కుటుంబరావు : మా కాలనీకి ట్రాన్స్‌కో ద్వారా విద్యుత్ సౌకర్యం కల్పించండి. సింగరేణి ఏర్పాటు చేసిన విద్యుత్ స్తంభాలున్నాయి. కొత్త స్తంభాలు వేయాలంటే కంపెనీ నగదు చెల్లించాలంటున్నారు. మీరే మార్గం చూపించండి సార్.
కోరం కనకయ్య : నీ ప్రాబ్లమ్ ఏంటి చిన్నా..?
మొహినుద్దీన్ : సర్.. నేను ఐటీఐ సెకండియర్ చదువుతున్నా. కాలనీలో వీధిలైట్లు, రోడ్లు వేయించండి సార్. శానిటేషన్ సమస్యను కూడా పరిష్కరించండి సార్.
కోరం కనకయ్య : ఏం తమ్మి ఎలా ఉన్నవ్? నీ సమస్య ఏంటి?
మంద కుమార్ : మూడెకరాల పోడు భూమి ఉంది. ఎన్నో ఏళ్లుగా ఆ భూమిపై ఆధారపడి బతుకుతున్నాం. ఈ మధ్య ఫారెస్ట్ అధికారులు పోడు భూములు చేయొద్దంటున్నారు. హద్దులు ఏర్పాటు చేస్తున్నారు. ఉన్న భూమి గుంజుకుంటే బతికేదెట్టా.
కోరం కనకయ్య : ఏంటి చెల్లి..పింఛన్ వస్తుందా?
అరుణ : సార్ మా ఆయన ఈ మధ్యే చనిపోయారు. నాకు ఇద్దరు అమ్మాయిలు. పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్నా. ఇవ్వలేదు సార్..మీరైనా ఇప్పించండి.
కోరం కనకయ్య : సాహెబ్‌గారూ బాగున్నారా? కాలనీలో సమస్యలున్నాయా?
మహబూబ్ అలీ : సింగరేణిని నమ్ముకొని జీవిస్తున్నమయ్యా. దిగిపోయిన కార్మికులను సంస్థ చిన్నచూపు చూస్తోందయ్యా. క్వార్టర్లు ఖాళీ చేయాలంటున్నారు..మేము ఎక్కడికి వెళ్లాలయ్యా.
కోరం కనకయ్య : ఏం తాతా..ఆరోగ్యం బాగుందా? ఏమైనా బాధలున్నాయా?
కనకయ్య : 20 ఏళ్ల క్రితం బాయి పని దిగిన. పింఛన్ సరిపోవట్లేదు. ప్రభుత్వ పింఛన్ ఇప్పించడయ్యా.
కోరం కనకయ్య : ఓ అవ్వ ..ఎలా ఉన్నావ్? పింఛన్ వస్తుందా?
చంద్రమ్మ : అప్పట్లో వచ్చింది. గీ మధ్య సర్వే అధికారులు తొలగించిండ్రు. పింఛన్ ఇప్పించి పుణ్యం కట్టుకోండి సారూ.
కోరం కనకయ్య : ఏమ్మా నీ సమస్య చెప్పు?
ప్రమీల : గతంలో రేషన్‌కార్డు ఇచ్చిండ్రు. ఇప్పుడు ఆహారభద్రత కూపన్ల కోసం దరఖాస్తు చేసుకుంటే నా పేరు తొలగించిండ్రు. మీరైనా ఇప్పించండి.
కోరం కనకయ్య : ఓ సర్పంచ్ అక్క.. మనూరు ఎట్టుంది? సమస్యలేంటో చెప్పు?
పార్వతి (సర్పంచ్) : 21 పిట్ కాలనీలో తాగునీరు, వీధిలైట్లు, రోడ్లు, డ్రెయినేజీలు ఏవీ సరిగా లేవు. కాలనీ వాసులు ఇ బ్బందులు పడుతున్నరు. సింగరేణి యాజమాన్యంతో చ ర్చించి కాలనీని పంచాయతీకి అప్పజెప్పండి సారు. పంచాయతీ నిధులతో కాలనీలో మౌలిక వసతులు కల్పిస్తాం.