koram kanakaiah
-
ఇల్లెందులో వీగిన అవిశ్వాసం
ఇల్లెందు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావుపై కొందరు కౌన్సిలర్లు ప్రతిపాదించిన అవిశ్వాసం వీగిపోయింది. సమావేశానికి త గిన కోరం లేనందున అవిశ్వాసం వీగిపోయినట్టుగా ఎన్నిక ల అధికారిగా వ్యవహరించిన కొత్తగూడెం ఆర్డీఓ శిరీష ప్రక టించారు. కౌన్సిలర్ల అవిశ్వాసం నేపథ్యంలో సోమవారం ఉదయం 11 గంటలకు మున్సిపల్ కార్యాలయంలో ఈవో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. మొత్తం 24 మంది కౌన్సి లర్లకు గాను కోరం సరిపోవాలంటే 17 మంది హాజరు కావా ల్సి ఉంది. అయితే సమావేశ సమయానికి ఇద్దరు తక్కువగా 15 మంది మాత్రమే హాజరయ్యారు. దీంతో కొంత సమయం ఇస్తూ సమావేశం వాయిదా వేశారు. తర్వాత 12 గంటలకు మరోమారు సమావేశపర్చగా అప్పటికీ 15 మంది మాత్రమే ఉండడంతో కోరం లేదని ఈవో ప్రకటించారు.17 మంది రాత్రికే చేరుకున్నా..: అవిశ్వాస పరీక్ష నేపథ్యంలో మున్సిపల్ కార్యాలయం పక్కనే ఉన్న పెన్షనర్ భవన్ లోకి ఆదివారం రాత్రికే 17 మంది కౌన్సిలర్లు చేరుకున్నారు. సోమవారం ఉదయం 11 గంటల సమయంలో వారంతా మున్సిపల్ కార్యాలయంలోకి పరుగులు తీశారు. అయితే మున్సిపల్ కార్యాలయం ఎదుట వేచి ఉన్న ఎమ్మెల్యే కోరం కనకయ్య, మాజీ ఎమ్మెల్యే హరిప్రియ వారిని గమనించారు. కొక్కు నాగేశ్వరరావు అనే కౌన్సిలర్‌ను కాంగ్రెస్ శ్రేణులు ఎత్తుకుని ఎదురుగా ఉన్న ఎంపీడీఓ కార్యాలయంలోకి వెళ్లి, వెనుక నుంచి రోడ్డుపైకి తీసుకెళ్లి అప్పటికే సిద్ధంగా ఉంచిన ఓ కారులో హైదరాబాద్‌కు తరలించారు. ఇదే క్రమంలో పెన్షనర్ భవన్లో దాక్కుని ఉన్న సీపీఐ కౌన్సిలర్ కుమ్మరి రవీందర్ బయటకు రాగానే కాంగ్రెస్, దాని మిత్రపక్ష సీపీఐ శ్రేణులు ఎత్తుకెళ్లే ప్రయత్నం చేశారు. కానీ పోలీసులు అడ్డుకుని విడిపించారు. అయితే అప్పటికే మున్సిపాలిటీలో తమ సభ్యుడి కోసం కాచుకుని కూర్చున్న సీపీఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా రవీందర్‌తో మాట్లాడటంతో ఆయన కార్యాలయం వెనుక గోడ దూకి పారిపోయారు. ఇలా ఇద్దరు సభ్యులు తక్కువ కావడంతో కోరం చాలక అవిశ్వాసం వీగిపోయింది. ఈ నేపథ్యంలో పోలీసులతో బీఆర్ఎస్ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే హరిప్రియ తదితరులు వాగ్వాదానికి దిగారు. గంట పాటు కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. అక్కడి నుంచి ర్యాలీగా పోలీస్ స్టేషన్‌కు చేరుకుని అధికార పార్టీ నేతలు, ఎమ్మెల్యే కోరం కనకయ్య, చైర్మన్ వెంకటేశ్వరావుపై ఫిర్యాదు చేశారు. కోరం కనకయ్యపై కేసు నమోదు తన భర్తను కిడ్నాప్ చేశారంటూ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కొక్కు నాగేశ్వరరావు సతీమణి వెంకటలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో ఎమ్మెల్యే కోరం కనకయ్యతో పాటు 17 మందిపై కేసు నమోదు చేసినట్లు సీఐ కరుణాకర్ తెలిపారు. ఎంపీపీ నాగరత్నమ్మ, ఆమె భర్త జానీ తదితరులపై కేసు నమోదైందని వివరించారు. -
దుష్ప్రచారం చేసినా.. గెలుపు ఖాయం
ఇల్లెందు: ఇల్లెందు సమీపంలోని కోటమైసమ్మ తల్లి సన్నిధిలో ఎమ్మెల్యే కోరం కనకయ్య నేతృత్వంలో ఆదివారం కీలక సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, కౌన్సిలర్లు, పార్టీ మండల అధ్యక్షులు, ముఖ్యనేతలు సమావేశానికి హాజరయ్యారు. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా 35 మంది ఎమ్మెల్యేలు డేంజర్ జోన్లో ఉన్నారనే ప్రచారం నేపథ్యంలో ఈ సమావేశం నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ సమావేశానికి మీడియాను అనుమతించకుండా కేవలం ఫొటోలకే పరిమితం చేశారు. ఆయా ప్రాంతాల్లో అభివృద్ధి, పార్టీ పరిస్థితి, ఎమ్మెల్యే పని తీరుపట్ల నాయకులు, ప్రజాప్రతినిధుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం సమావేశంలో చర్చించిన విషయాలు ఇలా ఉన్నాయి... ఇప్పటి వరకు 8 దఫాలుగా సాగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇల్లెందు నుంచి ఎన్డీ, టీడీపీ, సీపీఐ తరపున గెలిచిన ఎమ్మెల్యేలకు, కోరం కనకయ్య మధ్య వ్యత్యాసాన్ని చర్చించారు. కనకయ్య హయాంలో నిధుల వరద పారుతున్నా ఆయనపై వ్యతిరేక ప్రచారం పట్ల కలత చెందారు. ప్రతిపక్షాలు సాగిస్తున్న ప్రచారాన్ని కూడా ప్రధానంగా చర్చించారు. దీనికి తోడు మెజార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు తమ ప్రాంతాల్లో అధికారులు సక్రమంగా పనులు చేయకపోవటంతో కూడా చెడు పేరు వస్తుందని సభ దృష్టికి తెచ్చారు. ఇక అధికార టీఆర్ఎస్లో ఉద్యమకాలం నాటి టీఆర్ఎస్ నేతలు ఒకవైపు, కాంగ్రెస్, టీడీపీ, ఇతర పార్టీల నుంచి వలస వచ్చిన నేతలు మరొక వైపు ఎవరికి వారే అన్నచందంగా ఉంటున్నారని, వీరిని ఐక్యం చేసేందుకు పార్టీ కమిటీలు లేకపోవడంతో సమన్వయ లోపం కొట్టొచ్చినట్టుగా కనిపిస్తోందని అభిప్రాయపడ్డారు. దీంతో పాటు మరికొంత మంది మనసులోని మాట చెప్పకుండా.. పైకి మాత్రం అంతా బాగానే ఉందని చెప్పినట్టు తెలిసింది. కోట్ల రూపాయాల అభివృద్ధి పనులు చేపడుతున్నా వ్యతిరేక ప్రచారం సాగుతుండడం, దీనికి అడ్డుకట్ట వేయలేక పోవడానికి గల కారణాలను సమావేశంలో విశ్లేషించారు. ఇదంతా మీడియా ప్రచారమే.. కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే వచ్చే ఎన్నికల్లో కోరం కనకయ్యను భారీ మెజార్టీతో గెలిపిస్తాయని పలువురు నేతలు ధీమా వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే కనకయ్యను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియా, ఇతర ప్రచార సాధనాల దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ప్రకటించారు. ఎమ్మెల్యే నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ రోజు ఐదారు గ్రామాలు తిరుగుతూ ప్రజల సమస్యలు పరిష్కరిస్తున్నారని, ప్రభుత్వ పథకాలు పర్యవేక్షిస్తున్నారని, మునుపెన్నడూ జరగని అభివృద్ధిని ఈ నియోజకవర్గంలో సాధించారని గుర్తు చేశారు. అయినా ఎమ్మెల్యే అంటే గిట్టని వ్యక్తుల సమాచారాన్ని పరిగణలోకి తీసుకుని మీడియా ప్రచారం చేయటం సరైంది కాదన్నారు. పార్టీని పటిష్టపరిచే చర్యలు వేగవంతం చేయాలని, రానున్న కాలంలో ఆయా మండలాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి పనులను తన దృష్టికి తీసుకురావాలని, ప్రస్తుతం సాగుతున్న అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేసేలా నేతలు, ప్రజాప్రతినిధులు పర్యవేక్షించాలని ఎమ్మెల్యే కోరం కనకయ్య ఈ సందర్భంగా సూచించారు. సమావేశంలో గ్రంధాలయ చైర్మన్ దిండిగల రాజేందర్, జడ్పీటీసీలు లక్కినేని సురేందర్, మేకల మల్లిబాబు యాదవ్, మున్సిపల్ కో ఆప్షన్ సభ్యులు మడత వెంకట్‌గౌడ్, మున్సిపల్ చైర్ పర్సన్ మడత రమ, బయ్యారం మండల వైస్ ఎంపీపీ మూల మధుకర్‌రెడ్డి, టేకులపల్లి ఎంపీపీ భూక్య లక్ష్మి, ఆత్మ చైర్మన్ ముక్తి కృష్ణ, మార్కెట్ చైర్మన్ నాగేశ్వరరావు, తాటి భిక్షం, కనగాల పేరయ్య, పులిగళ్ల మాదవరావు, సుదిమళ్ల సర్పంచ్ నాగరత్నమ్మ, అక్కిరాజు గణేష్, సిలివేరు సత్యనారాయణ, గందె సదానందం తదితరులు పాల్గొన్నారు. -
బేఫికర్
వారంతా ఒకప్పుడు రెక్కలు ముక్కలు చేసుకొని బొగ్గుబావుల్లో పనిచేసినవారు. ఇప్పుడు పదవీ విరమణ చేసి వృద్ధాప్యంలో ఉన్నారు. 70 ఏళ్ల క్రితం వీరి కోసం ఇల్లెందు 21 పిట్ ఏరియాలో కట్టించిన క్వార్టర్లు కూడా వీరితో పాటే వృద్ధాప్యానికి చేరాయి. ఒకప్పుడు ఇక్కడున్న బొగ్గు బావులను మూసివేశారు. ఇక్కడ పనిచేస్తున్న కార్మికులు వేరే ప్రాంతానికి బదిలీ అయ్యారు. పదవీ విరమణ చేసిన కార్మికులు మాత్రం ఈ క్వార్టర్లనే పట్టుకొని ఉంటున్నారు. 325 క్వార్టర్లలో కేవలం పదింటిలోనే ప్రస్తుత కార్మికులుంటుండగా మిగిలిన వాటిలో మాజీ కార్మికులు నివసిస్తున్నారు. ఈ కాలనీ బాగోగులు చూడాల్సిన సింగరేణి యాజమాన్యం పట్టించుకోవడం మానేసింది. ఇక్కడి ప్రజలు నీరు, విద్యుత్, పారిశుధ్యం, రోడ్లు తదితర సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నా ఎవరూ కన్నెత్తై చూడటం లేదు. ‘సాక్షి’ వీఐపీ రిపోర్టర్‌గా ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య ఈ ప్రాంతాన్ని ఆదివారం సందర్శించారు. కాలనీ ప్రజలకు అండగా ఉంటానని..క్వార్టర్లు ఖాళీ చేయాల్సిన పనిలేదని భరోసా ఇచ్చారు. కోరం కనకయ్య : బాగున్నరామ్మా..మన కాలనీ ఇబ్బందులు తెలుసుకుందామని వచ్చినా..చెప్పండి? మర్రి లక్ష్మి : సారూ కాలనీ నిండా సమస్యలే ఉన్నయి. జమానలో మా ఆయన బొగ్గు గనుల్లో పని చేసిండ్రు. పదవీ విరమణ పొందిన తర్వాత ఇక్కడే ఉంటున్నం. సింగరేణి అధికారులు కొన్నేళ్లుగా మా కాలనీ బాగోగులు పట్టించుకోవట్లేదు. క్వార్టర్లు కూల్చి ఇక్కడి నుంచి మమ్మల్ని సాగనంపాలని చూస్తుండ్రు. మేము ఎక్కడికి పోయి బతకాలి సారు?. కోరం కనకయ్య : నీ పరిస్థితి ఏంటమ్మా? ఆగమ్మ : మా ఆయన కూడా బొగ్గుబాయిల పనిచేసి దిగిండ్రు. నాడు సింగరేణి ఇచ్చిన డబ్బులు కుటుంబ జీవనానికి సరిపోవట్లేదు. పింఛన్ కోసం ఎన్నో సార్లు దరఖాస్తు చేసుకున్నం. దయచేసి పింఛన్ ఇప్పించడయ్యా. కోరం కనకయ్య : ఏం తాతా ఇదేనా మీ ఇల్లు? బాలమల్లు : అవునయ్యా.. నాకు ఇల్లులేకనే గిట్ట రేకుల షెడ్డు వేసుకున్న. పెద్ద మనసు చేసుకొని నేను, మా ముసలిది ఉండేందుకు పక్కా ఇల్లు ఇప్పించడయ్యా. వర్షాకాలంలో ఈ షెడ్లె ఉండలేకపోతున్నం. ఇల్లు కోసం దరఖాస్తు పెట్టుకున్నం జర ఇప్పించడయ్యా. కోరం కనకయ్య : నీ సమస్య ఏంటమ్మా? లక్ష్మి : నా బిడ్డ అంగవైకల్యం, బుద్ది మాంధ్యంతో 35 ఏళ్లగా బాధపడుతుందయ్యా. పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్నం. జర ఇప్పించడయ్యా. కోరం కనకయ్య : అక్కా.. కాలనీ ఇబ్బందులేంటి? తులస్య : కాలనీలో పందులు, కోతులు బాగున్నయయ్యా..కోతుల దాడిలో పిల్లకాయలు గాయపడ్డరు. పందులు విపరీతంగా ఉండటంతో రోగాలు వస్తున్నాయి. వీటిని అరికట్టండయ్యా. కోరం కనకయ్య : చిన్నా ఏం చదువుతున్నారు? మీకేమైన బాధలున్నాయా? కుమార్, జావిద్, నరేందర్ : సార్..మేము బీటెక్ చదువుతున్నాం. ఫీజు రీయింబర్స్మెంట్ రాలేదు. కాలేజీ యాజమాన్యం ఒత్తిడి చేస్తోంది. రీయింబర్స్ వచ్చేలా చూడండి సార్. కోరం కనకయ్య : కుటుంబరావు బాగున్నావా? మీ వాడ సమస్యలేంటి? బిందె కుటుంబరావు : మా కాలనీకి ట్రాన్స్‌కో ద్వారా విద్యుత్ సౌకర్యం కల్పించండి. సింగరేణి ఏర్పాటు చేసిన విద్యుత్ స్తంభాలున్నాయి. కొత్త స్తంభాలు వేయాలంటే కంపెనీ నగదు చెల్లించాలంటున్నారు. మీరే మార్గం చూపించండి సార్. కోరం కనకయ్య : నీ ప్రాబ్లమ్ ఏంటి చిన్నా..? మొహినుద్దీన్ : సర్.. నేను ఐటీఐ సెకండియర్ చదువుతున్నా. కాలనీలో వీధిలైట్లు, రోడ్లు వేయించండి సార్. శానిటేషన్ సమస్యను కూడా పరిష్కరించండి సార్. కోరం కనకయ్య : ఏం తమ్మి ఎలా ఉన్నవ్? నీ సమస్య ఏంటి? మంద కుమార్ : మూడెకరాల పోడు భూమి ఉంది. ఎన్నో ఏళ్లుగా ఆ భూమిపై ఆధారపడి బతుకుతున్నాం. ఈ మధ్య ఫారెస్ట్ అధికారులు పోడు భూములు చేయొద్దంటున్నారు. హద్దులు ఏర్పాటు చేస్తున్నారు. ఉన్న భూమి గుంజుకుంటే బతికేదెట్టా. కోరం కనకయ్య : ఏంటి చెల్లి..పింఛన్ వస్తుందా? అరుణ : సార్ మా ఆయన ఈ మధ్యే చనిపోయారు. నాకు ఇద్దరు అమ్మాయిలు. పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్నా. ఇవ్వలేదు సార్..మీరైనా ఇప్పించండి. కోరం కనకయ్య : సాహెబ్‌గారూ బాగున్నారా? కాలనీలో సమస్యలున్నాయా? మహబూబ్ అలీ : సింగరేణిని నమ్ముకొని జీవిస్తున్నమయ్యా. దిగిపోయిన కార్మికులను సంస్థ చిన్నచూపు చూస్తోందయ్యా. క్వార్టర్లు ఖాళీ చేయాలంటున్నారు..మేము ఎక్కడికి వెళ్లాలయ్యా. కోరం కనకయ్య : ఏం తాతా..ఆరోగ్యం బాగుందా? ఏమైనా బాధలున్నాయా? కనకయ్య : 20 ఏళ్ల క్రితం బాయి పని దిగిన. పింఛన్ సరిపోవట్లేదు. ప్రభుత్వ పింఛన్ ఇప్పించడయ్యా. కోరం కనకయ్య : ఓ అవ్వ ..ఎలా ఉన్నావ్? పింఛన్ వస్తుందా? చంద్రమ్మ : అప్పట్లో వచ్చింది. గీ మధ్య సర్వే అధికారులు తొలగించిండ్రు. పింఛన్ ఇప్పించి పుణ్యం కట్టుకోండి సారూ. కోరం కనకయ్య : ఏమ్మా నీ సమస్య చెప్పు? ప్రమీల : గతంలో రేషన్‌కార్డు ఇచ్చిండ్రు. ఇప్పుడు ఆహారభద్రత కూపన్ల కోసం దరఖాస్తు చేసుకుంటే నా పేరు తొలగించిండ్రు. మీరైనా ఇప్పించండి. కోరం కనకయ్య : ఓ సర్పంచ్ అక్క.. మనూరు ఎట్టుంది? సమస్యలేంటో చెప్పు? పార్వతి (సర్పంచ్) : 21 పిట్ కాలనీలో తాగునీరు, వీధిలైట్లు, రోడ్లు, డ్రెయినేజీలు ఏవీ సరిగా లేవు. కాలనీ వాసులు ఇ బ్బందులు పడుతున్నరు. సింగరేణి యాజమాన్యంతో చ ర్చించి కాలనీని పంచాయతీకి అప్పజెప్పండి సారు. పంచాయతీ నిధులతో కాలనీలో మౌలిక వసతులు కల్పిస్తాం. -
ఇల్లెందు ఎమ్మెల్యేకు షోకాజ్
పార్టీ ఫిరాయింపుపై వివరణ కోరిన శాసనసభ కార్యదర్శి స్పీకర్‌కు ఫిర్యాదు చేసిన జానారెడ్డి సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య పార్టీ ఫిరాయింపుపై షోకాజ్ నోటీస్ జారీ అయింది. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొంది టీఆర్ఎస్లో చేరిన కనకయ్యపై పార్టీ ఫిరాయింపుల చట్టం కింద ఎందుకు చర్య తీసుకోకూడదో వివరించాలంటూ తెలంగాణ శాసనసభ కార్యాలయ కార్యదర్శి నోటీస్‌జారీ చేశారు. పార్టీ మారిన రెండు నెలల తర్వాత ఈ నోటీస్ రావడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇటీవల జరిగిన సాధారణ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా ఇల్లెందు నియోజకవర్గం నుంచి గెలిచిన కోరం కనకయ్య ఆ తర్వాత కొద్ది నెలలకే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అనుసరిస్తున్న విధానాలు, అభివృద్ధి పట్ల ఆకర్షితుడినయ్యానంటూ టీఆర్ఎస్లో చేరారు. పార్టీలో చేరినప్పుడు కాంగ్రెస్ పార్టీనుంచి పెద్దగా వ్యతిరేకత రాలేదు. పార్టీలోని సీనియర్ నేతలు ఈ అంశంపై విమర్శలు చేయకపోవడంతో కనకయ్య టీఆర్ఎస్లో చేరడంపై పార్టీనుంచి ఎవరికీ పెద్దగా వ్యక్తిగత అభ్యంతరాలు లేవన్న అభిప్రాయం అప్పట్లో కలిగింది. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గుర్తుపై గెలిచి అధికార పార్టీలో చేరిన పలు జిల్లాల శాసనసభ్యులతోపాటు కనకయ్యకు శాసనసభ కార్యదర్శి నోటీస్ జారీ చేశారు. ప్రతిపక్ష కాంగ్రెస్ నేత కుందూరు జానారెడ్డి కాంగ్రెస్ పార్టీ టికెట్‌పై గెలిచి టీఆర్ఎస్లోకి ఫిరాయించిన శాసనసభ్యులపై అనర్హత వేటు వేయాలంటూ శాసనసభ స్పీకర్ మధుసూదనాచారికి అధికారికంగా ఫిర్యాదు ఇవ్వడంతో..ఈనోటీసు జారీ చేసినట్లు తెలిసింది. సోమవారం మధ్యాహ్నం వరకు ఇల్లెందులోనే ఉన్న కనకయ్య నోటీస్ జారీ కాగానే హుటాహుటిన హైదరాబాద్ చేరుకుని న్యాయ నిపుణులను సంప్రదిస్తున్నారు. -
కాంగ్రెస్‌కు ఇల్లెందు ఎమ్మెల్యే రాజీనామా
ఇల్లెందు: ఖమ్మం జిల్లా ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఆదివారం ఆయన ఇల్లెందులో విలేకరులతో మాట్లాడుతూ ఈ విషయం వెల్లడించారు. తన అనుచరులతో కలసి సోమవారం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సమక్షంలో టీఆర్ఎస్లో చేరుతున్నట్లు ప్రకటించారు. నియోజకవర్గ సమగ్రాభివృద్ధి కోసం కార్యకర్తలతో చర్చించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. త్వరలో మరికొందరు ప్రజాప్రతినిధులు కూడా టీఆర్ఎస్లో చేరుతారని తెలిపారు.