సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే కోరం కనకయ్య
ఇల్లెందు: ఇల్లెందు సమీపంలోని కోటమైసమ్మ తల్లి సన్నిధిలో ఎమ్మెల్యే కోరం కనకయ్య నేతృత్వంలో ఆదివారం కీలక సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, కౌన్సిలర్‌లు, పార్టీ మండల అధ్యక్షులు, ముఖ్యనేతలు సమావేశానికి హాజరయ్యారు. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా 35 మంది ఎమ్మెల్యేలు డేంజర్ జోన్‌లో ఉన్నారనే ప్రచారం నేపథ్యంలో ఈ సమావేశం నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది.
అయితే ఈ సమావేశానికి మీడియాను అనుమతించకుండా కేవలం ఫొటోలకే పరిమితం చేశారు. ఆయా ప్రాంతాల్లో అభివృద్ధి, పార్టీ పరిస్థితి, ఎమ్మెల్యే పని తీరుపట్ల నాయకులు, ప్రజాప్రతినిధుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం సమావేశంలో చర్చించిన విషయాలు ఇలా ఉన్నాయి... ఇప్పటి వరకు 8 దఫాలుగా సాగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇల్లెందు నుంచి ఎన్డీ, టీడీపీ, సీపీఐ తరపున గెలిచిన ఎమ్మెల్యేలకు, కోరం కనకయ్య మధ్య వ్యత్యాసాన్ని చర్చించారు.
కనకయ్య హయాంలో నిధుల వరద పారుతున్నా ఆయనపై వ్యతిరేక ప్రచారం పట్ల కలత చెందారు. ప్రతిపక్షాలు సాగిస్తున్న ప్రచారాన్ని కూడా ప్రధానంగా చర్చించారు. దీనికి తోడు మెజార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు తమ ప్రాంతాల్లో అధికారులు సక్రమంగా పనులు చేయకపోవటంతో కూడా చెడు పేరు వస్తుందని సభ దృష్టికి తెచ్చారు.
ఇక అధికార టీఆర్‌ఎస్‌లో ఉద్యమకాలం నాటి టీఆర్‌ఎస్ నేతలు ఒకవైపు, కాంగ్రెస్, టీడీపీ, ఇతర పార్టీల నుంచి వలస వచ్చిన నేతలు మరొక వైపు ఎవరికి వారే అన్నచందంగా ఉంటున్నారని, వీరిని ఐక్యం చేసేందుకు పార్టీ కమిటీలు లేకపోవడంతో సమన్వయ లోపం కొట్టొచ్చినట్టుగా కనిపిస్తోందని అభిప్రాయపడ్డారు.
దీంతో పాటు మరికొంత మంది మనసులోని మాట చెప్పకుండా.. పైకి మాత్రం అంతా బాగానే ఉందని చెప్పినట్టు తెలిసింది. కోట్ల రూపాయాల అభివృద్ధి పనులు చేపడుతున్నా వ్యతిరేక ప్రచారం సాగుతుండడం, దీనికి అడ్డుకట్ట వేయలేక పోవడానికి గల కారణాలను సమావేశంలో విశ్లేషించారు. ఇదంతా మీడియా ప్రచారమే.. కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే వచ్చే ఎన్నికల్లో కోరం కనకయ్యను భారీ మెజార్టీతో గెలిపిస్తాయని పలువురు నేతలు ధీమా వ్యక్తం చేశారు.
ఎమ్మెల్యే కనకయ్యను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియా, ఇతర ప్రచార సాధనాల దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ప్రకటించారు. ఎమ్మెల్యే నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ రోజు ఐదారు గ్రామాలు తిరుగుతూ ప్రజల సమస్యలు పరిష్కరిస్తున్నారని, ప్రభుత్వ పథకాలు పర్యవేక్షిస్తున్నారని, మునుపెన్నడూ జరగని అభివృద్ధిని ఈ నియోజకవర్గంలో సాధించారని గుర్తు చేశారు.
అయినా ఎమ్మెల్యే అంటే గిట్టని వ్యక్తుల సమాచారాన్ని పరిగణలోకి తీసుకుని మీడియా ప్రచారం చేయటం సరైంది కాదన్నారు. పార్టీని పటిష్టపరిచే చర్యలు వేగవంతం చేయాలని, రానున్న కాలంలో ఆయా మండలాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి పనులను తన దృష్టికి తీసుకురావాలని, ప్రస్తుతం సాగుతున్న అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేసేలా నేతలు, ప్రజాప్రతినిధులు పర్యవేక్షించాలని ఎమ్మెల్యే కోరం కనకయ్య ఈ సందర్భంగా సూచించారు.
సమావేశంలో గ్రంధాలయ చైర్మన్ దిండిగల రాజేందర్, జడ్పీటీసీలు లక్కినేని సురేందర్, మేకల మల్లిబాబు యాదవ్, మున్సిపల్ కో ఆప్షన్ సభ్యులు మడత వెంకట్‌గౌడ్, మున్సిపల్ చైర్ పర్సన్ మడత రమ, బయ్యారం మండల వైస్ ఎంపీపీ మూల మధుకర్‌రెడ్డి, టేకులపల్లి ఎంపీపీ భూక్య లక్ష్మి, ఆత్మ చైర్మన్ ముక్తి కృష్ణ, మార్కెట్ చైర్మన్ నాగేశ్వరరావు, తాటి భిక్షం, కనగాల పేరయ్య, పులిగళ్ల మాదవరావు, సుదిమళ్ల సర్పంచ్ నాగరత్నమ్మ, అక్కిరాజు గణేష్, సిలివేరు సత్యనారాయణ, గందె సదానందం తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment