మోదీతో అభిజిత్‌ బెనర్జీ భేటీ | Nobel Prize winner Abhijit Banerjee Meets Modi | Sakshi
Sakshi News home page

మోదీతో అభిజిత్‌ బెనర్జీ భేటీ

Published Tue, Oct 22 2019 12:11 PM | Last Updated on Tue, Oct 22 2019 2:58 PM

Nobel Prize winner Abhijit Banerjee Meets Modi - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఆర్థిక శాస్త్రంలో ఈ ఏడాది నోబెల్‌ బహుమతి పొందిన అభిజిత్‌ బెనర్జీ మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. సెవెన్‌, లోక్‌కళ్యాణ్‌మార్గ్‌లోని ప్రధాని మోదీ నివాసంలో ఈ భేటీ జరిగింది. దేశ ఆర్థిక వ్యవస్థతో పాటు వారు పలు అంశాలు చర్చించినట్టు సమాచారం. ప్రతిష్టాత్మక మసాచుసెట్స్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎంఐటీ)లో ప్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్తున్న ఇండో అమెరికన్‌ అభిజిత్‌కు అంతర్జాతీయ పేదరిక నిర్మూలనకు ప్రయోగాత్మక వైఖరితో కూడిన పరిష్కారాలను అన్వేషిస్తున్నందుకు ఎస్తర్‌ డఫ్లో, మైఖేల్‌ క్రిమర్‌లతో కలిపి నోబెల్‌ ఎకనమిక్స్‌ అవార్డు లభించిన సంగతి తెలిసిందే.

ప్రతిష్టాత్మక నోబెల్‌ దక్కిన అనంతరం అభిజిత్‌ తొలిసారిగా భారత్‌ను సందర్శించారు. మంగళవారం సాయంత్రం ఆయన కోల్‌కతాలో తన తల్లిని పరామర్శించి రెండు రోజులు నగరంలో గడుపుతారు. మరోవైపు అభిజిత్‌కు నోబెల్‌ అవార్డు దక్కిన నేపథ్యంలో బీజేపీ, విపక్ష నేతల మధ్య ఆయన నేపథ్యంపై మాటల దాడి సాగిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్‌ ఎన్నికల హామీ అయిన న్యాయ్‌ పథకం అభిజిత్‌ ఆలోచనేనని, ఆయన వామపక్ష భావజాలం కలిగిన వారని బీజేపీ చెబుతోంది. సార్వత్రిక ఎన్నికల్లో అభిజిత్‌ సిద్ధాంతాన్ని ప్రజలు తిరస్కరించారని కేంద్ర మంత్రి పీయూష్‌ గోయెల్‌ పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement