ellendu
-
మెకానిక్‌లమని చెప్పి అంబులెన్స్ అపహరణ
సాక్షి, ఇల్లెందు/గుండాల: తాము మెకానిక్‌లమని చెప్పి 102 అంబులెన్స్ డ్రైవర్ నుంచి తాళాలు తీసుకుని ట్రయిల్ వేస్తామంటూ ఉడాయించారు. వెంటనే సమాచారం అందించగా, పోలీ సులు వెంబడించారు. దీంతో ఇల్లెందు వద్ద వదిలి పారిపోయారు. ఈ సంఘటన మండలంలో సోమవారం చోటు చేసుకుంది. స్థానిక ప్రభుత్వాసుపత్రి పరిధిలో తిరిగే 102 అంబులెన్స్‌ను రిపేరు చేయాలని ముగ్గురు గుర్తు తెలియ ని వ్యక్తులు కారులో వచ్చి ట్రయల్ వేస్తామని తాళాలు తీసుకున్నారు. ఓ వ్యక్తి అంబులెన్స్‌ను తీసుకుని వెళ్లాడు. కొద్దిసేపటి తర్వాత మిగిలిన ఇద్దరు కూడా వెళ్లిపోయారు. ఎంతసేపటికీ రాకపోవడంతో అనుమానం వచ్చిన డ్రైవర్ పోలీసులను ఆశ్రయించి జరిగిన విషయం చెప్పాడు. వెంటనే కాచనపల్లి, ఇల్లెందు పోలీసులకు సమాచారం అందించారు. కాచనపల్లి నుంచి అంబులెన్స్‌ను వెంబడించగా ఇల్లెందు దగ్గర వదిలి పారిపోయాడు. వెంటనే పోలీసులు 102 వాహనాన్ని ఆస్పత్రి సిబ్బందికి అప్పగించారు. -
పురిటి కోసం అష్టకష్టాలు
ఇల్లెందు: పురుడు పోసుకోవడానికి ఓ మహిళ అష్టకష్టాలు పడింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు పట్టణంలోని 21 ఏరియాకు చెందిన పూనెం శిరీష పురిటి నొప్పులతో గురువారం తెల్లారుజామున ఇల్లెందు ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చింది. అప్పటికే కడుపులోని పాప కాళ్లు బయటకొచ్చాయి. వైద్యులు డెలివరీ కోసం ప్రయత్నించకుండా ఖమ్మం రిఫర్ చేసి చేతులు దులుపుకున్నారు. దీంతో శిరీషను ఆటోలో ఖమ్మం తరలిస్తుండగా మధ్యలోనే ప్రసవించింది. కానీ సకాలంలో వైద్యం అందక పాప మృతి చెందింది. దీంతో తిరిగి ఇల్లెందు వైద్యశాలకు తీసుకురాగానే మరో పాపకు జన్మనిచ్చింది. రెండో అమ్మాయి ఆరోగ్యంగానే ఉన్నప్పటికీ ఏడు నెలలకే డెలివరీ కావడంతో ఇన్క్యుబేటర్ బాక్స్‌లో పెట్టాలని వైద్యులు సూచించారు. -
ఇంట్లో నీటి ఊట..భయంలో ప్రజలు
టేకులపల్లి ఖమ్మం : టేకులపల్లిలోని భీంసింగ్ తండాలో ఓ గిరిజన కుటుంబం బిక్కుబిక్కుమంటోంది. ఈ తండాలోని ఓ ఇంటిలో బానోతు లచ్చు–గమ్లీ దంపతులు, వారి కుమారుడు బిచ్చు, కోడలు అనూష, మనుమలు, మనుమరాలు ఉంటున్నారు. రెక్కాడితే కాని డొక్కాడని కుటుంబం వీరిది. వర్షాలు పడితే చాలు.. వీరు భయంతో వణుకుతున్నారు. వర్షాల కారణంగా ఇంట్లో ఊట ఏర్పడింది. అందులో నుంచి నీరు ఉబికి వస్తోంది. ఇంట్లోని నేల, పునాదులు కుంగుతున్నాయయి. ఇటీవలి వర్షాలతో ఊట మరీ ఎక్కువైంది. ఉన్నతాధికారులు స్పందించి ఆదుకోవాలని, డబుల్ బెడ్ రూం ఇల్లు మంజూరు చేయాలని ఈ కుటుంబం వేడుకుంటోంది. -
‘రైతుబంధు’లో రాబందులు
ఇల్లెందురూరల్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి అమలు చేస్తున్న ‘రైతుబంధు’ప«థకంలోకి రాబందులు చొరబడ్డాయి. రెవెన్యూ, వ్యవసాయ అధికారులు మూడు నెలలు కుస్తీ పట్టి భూ రికార్డులను కొలిక్కి తెచ్చారు. అయినా రికార్డులను తారుమారు చేసి, ఫొటోలను మార్ఫింగ్ చేసి దర్జాగా నిధులు స్వాహా చేశారు. లబ్ధిదారులకు చెక్కులు అందకపోవటంతో వ్యవసాయశాఖ కార్యాలయానికి వెళ్లి వాకబు చేయగా అసలు బండారం బయట పడింది. కారేపల్లి మండలం మంగళతండాకు చెందిన రైతులు పిల్లలమర్రి మంగీకి రైతుబంధు పథకంలో రూ.24వేల చెక్కు మంజూరైంది. మంగీ ఆధార్‌కార్డును నెహ్రునగర్‌కు చెందిన బోడ పార్వతి(దళారీ బావమరిది భార్య) ఫొటోతో మార్ఫింగ్ చేసి చెక్కును తీసుకొని బ్యాంకుకు వెళి నగదు డ్రా చేసుకున్నారు. ఇల్లెందు మండలం చల్లసముద్రం రెవెన్యూ గ్రామానికి చెందిన జాటోత్ రమేశ్, తేజావత్ కృష్ణ, జాటోత్ సత్యం, బానోత్ చందర్, తేజావత్ వర్మ, తేజావత్ బరత్, భూక్య శ్రీను, మాలోత్ వస్ర తదితర రైతుల చెక్కులను మార్ఫింగ్ చేసి నగదు పొందారు. ఇదే గ్రామానికి చెందిన మృతి చెందిన రైతులు బానోత్ బాలు నాలుగు ఎకరాలకు చెందిన రూ.16వేల చెక్కును, భూక్య మల్లుకు చెందిన నాలుగు ఎకరాలకు చెందిన రూ.16వేలు, బానోత్ భీముడుకు చెందిన రూ.27వేల చెక్కును కూడా తీసుకుని నగదు పొందారు. మంగళతండాకు చెందిన నాయకుడు చెక్కుల గురించి రైతులకు సమాచారం ఇవ్వగా.. బుధవారం వారు మండల వ్యవసాయ శాఖ కార్యాలయానికి వెళ్లి తమకు చెక్కులు రాలేదని ఏఓ నరసింహారావును ప్రశ్నించారు. అయితే చెక్కులన్నీ పంపిణీ పూర్తయిందని, మీకు కూడా అందజేశామని అన్నారు. తమకు అందలేని రైతులు నిలదీయగా జాబితాను పరిశీలించగా చెక్కులు పొంది బ్యాంకులో డ్రా అయినట్లు తేలటంతో అధికారులు అవాక్కయ్యారు. క్షుణ్ణంగా పరిశీలన చేయగా ఆధార్‌కార్డులను మార్ఫింగ్ చేసినట్లు తేటతెల్లమైంది. ఈ వ్యవహారం తమ దృష్టికి వచ్చిందని, విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఇల్లెందు తహసీల్దార్ శ్రీనివాసులు తెలిపారు. -
పోలీసుల అదుపులో ఎన్డీ దళ నేత
ఇల్లెందు ఖమ్మం : న్యూడెమోక్రసీ రాయల వర్గం మణుగూరు ఏరియా దళ నేత భట్టు సురేష్ అలియాస్ ప్రసాద్‌ను పోలీసులు సోమవారం తెల్లారుజామున ఇల్లెందు మండలం రొంపేడు కొత్తగుంపులో విశ్రాంతి తీసుకుంటుండగా అదుపులోకి తీసుకున్నారు. ఆళ్లపల్లి మండలం రాయిగూడెం గ్రామానికి చెందిన భట్టు సురేష్ అలియాస్ ప్రసాద్ 12 ఏళ్ల క్రితం అజ్ఞాతంలోకి వెళ్లారు. గుండాల, ఆళ్లపల్లి, మణుగూరు, కొత్తగూడెం, పాల్వంచ, బంగారుచెలక, అశ్వాపురం, మణుగూరు, పినపాక ఏరియాలో వివిధ దళాల్లో సభ్యుడుగా, డిప్యూటీ కమాండర్‌గా, కమాండర్‌గా పనిచేశారు. ఐదారేళ్లుగా మణుగూరు ఏరియాలో దళ కమాండర్‌గా పని చేస్తున్నాడు. రెండు రోజుల క్రితం అనారోగ్యంతో రొంపేడులోని తన అత్తగారి ఇంటికి చేరాడు. అక్కడే కుటుంబ సభ్యులతో విశ్రాంతి తీసుకుంటున్నాడు. పక్కా సమాచారంతో సోమవారం తెల్లారుజామున ప్రసాద్ అత్తగారింటిని చుట్టుముట్టి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి బోడు పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు తెలిసింది. అజ్ఞాతంలోకి వెళ్లక ముందే ప్రసాద్‌కు భార్య వీరాకుమారి, పిల్లలు నవీన్‌కుమార్, నందినిలున్నారు. తండ్రి బట్టు పాపయ్య కూడా 20 ఏళ్ల క్రితం తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలో అజ్ఞాత దళ నేతగా కొంత కాలం పనిచేశారు. ప్రస్తుతం ప్రసాద్ 38 ఏళ్ల వయస్సు ఉంటుందని, 12 ఏళ్లుగా అజ్ఞాతంలో పని చేస్తున్నట్లు ఎన్డీ రాయల వర్గం పేర్కొంది. ప్రసాద్‌ను విడుదల చేయాలని ఎన్డీ ఆందోళన మణుగూరు ఏరియా దళ నేత భట్టు సురేష్ అలియాస్ ప్రసాద్‌ను పోలీసులు అరెస్టు చేయటాన్ని నిరశసిస్తూ ఎన్డీ రాయలవర్గం సోమవారం ఇల్లెందు లో ర్యాలీ నిర్వహించారు. పట్టణ ప్రధాన వీధుల గుండా సాగిన ర్యాలీలో ఆ పార్టీ నేతలు రాజు, తుపాకుల నాగేశ్వరరావు, కిన్నెరనర్సయ్య, నర్సింహారావు, సారంగపాణి, భాస్కర్ పాల్గొన్నారు. -
దుష్ప్రచారం చేసినా.. గెలుపు ఖాయం
ఇల్లెందు: ఇల్లెందు సమీపంలోని కోటమైసమ్మ తల్లి సన్నిధిలో ఎమ్మెల్యే కోరం కనకయ్య నేతృత్వంలో ఆదివారం కీలక సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, కౌన్సిలర్లు, పార్టీ మండల అధ్యక్షులు, ముఖ్యనేతలు సమావేశానికి హాజరయ్యారు. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా 35 మంది ఎమ్మెల్యేలు డేంజర్ జోన్లో ఉన్నారనే ప్రచారం నేపథ్యంలో ఈ సమావేశం నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ సమావేశానికి మీడియాను అనుమతించకుండా కేవలం ఫొటోలకే పరిమితం చేశారు. ఆయా ప్రాంతాల్లో అభివృద్ధి, పార్టీ పరిస్థితి, ఎమ్మెల్యే పని తీరుపట్ల నాయకులు, ప్రజాప్రతినిధుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం సమావేశంలో చర్చించిన విషయాలు ఇలా ఉన్నాయి... ఇప్పటి వరకు 8 దఫాలుగా సాగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇల్లెందు నుంచి ఎన్డీ, టీడీపీ, సీపీఐ తరపున గెలిచిన ఎమ్మెల్యేలకు, కోరం కనకయ్య మధ్య వ్యత్యాసాన్ని చర్చించారు. కనకయ్య హయాంలో నిధుల వరద పారుతున్నా ఆయనపై వ్యతిరేక ప్రచారం పట్ల కలత చెందారు. ప్రతిపక్షాలు సాగిస్తున్న ప్రచారాన్ని కూడా ప్రధానంగా చర్చించారు. దీనికి తోడు మెజార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు తమ ప్రాంతాల్లో అధికారులు సక్రమంగా పనులు చేయకపోవటంతో కూడా చెడు పేరు వస్తుందని సభ దృష్టికి తెచ్చారు. ఇక అధికార టీఆర్ఎస్లో ఉద్యమకాలం నాటి టీఆర్ఎస్ నేతలు ఒకవైపు, కాంగ్రెస్, టీడీపీ, ఇతర పార్టీల నుంచి వలస వచ్చిన నేతలు మరొక వైపు ఎవరికి వారే అన్నచందంగా ఉంటున్నారని, వీరిని ఐక్యం చేసేందుకు పార్టీ కమిటీలు లేకపోవడంతో సమన్వయ లోపం కొట్టొచ్చినట్టుగా కనిపిస్తోందని అభిప్రాయపడ్డారు. దీంతో పాటు మరికొంత మంది మనసులోని మాట చెప్పకుండా.. పైకి మాత్రం అంతా బాగానే ఉందని చెప్పినట్టు తెలిసింది. కోట్ల రూపాయాల అభివృద్ధి పనులు చేపడుతున్నా వ్యతిరేక ప్రచారం సాగుతుండడం, దీనికి అడ్డుకట్ట వేయలేక పోవడానికి గల కారణాలను సమావేశంలో విశ్లేషించారు. ఇదంతా మీడియా ప్రచారమే.. కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే వచ్చే ఎన్నికల్లో కోరం కనకయ్యను భారీ మెజార్టీతో గెలిపిస్తాయని పలువురు నేతలు ధీమా వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే కనకయ్యను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియా, ఇతర ప్రచార సాధనాల దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ప్రకటించారు. ఎమ్మెల్యే నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ రోజు ఐదారు గ్రామాలు తిరుగుతూ ప్రజల సమస్యలు పరిష్కరిస్తున్నారని, ప్రభుత్వ పథకాలు పర్యవేక్షిస్తున్నారని, మునుపెన్నడూ జరగని అభివృద్ధిని ఈ నియోజకవర్గంలో సాధించారని గుర్తు చేశారు. అయినా ఎమ్మెల్యే అంటే గిట్టని వ్యక్తుల సమాచారాన్ని పరిగణలోకి తీసుకుని మీడియా ప్రచారం చేయటం సరైంది కాదన్నారు. పార్టీని పటిష్టపరిచే చర్యలు వేగవంతం చేయాలని, రానున్న కాలంలో ఆయా మండలాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి పనులను తన దృష్టికి తీసుకురావాలని, ప్రస్తుతం సాగుతున్న అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేసేలా నేతలు, ప్రజాప్రతినిధులు పర్యవేక్షించాలని ఎమ్మెల్యే కోరం కనకయ్య ఈ సందర్భంగా సూచించారు. సమావేశంలో గ్రంధాలయ చైర్మన్ దిండిగల రాజేందర్, జడ్పీటీసీలు లక్కినేని సురేందర్, మేకల మల్లిబాబు యాదవ్, మున్సిపల్ కో ఆప్షన్ సభ్యులు మడత వెంకట్‌గౌడ్, మున్సిపల్ చైర్ పర్సన్ మడత రమ, బయ్యారం మండల వైస్ ఎంపీపీ మూల మధుకర్‌రెడ్డి, టేకులపల్లి ఎంపీపీ భూక్య లక్ష్మి, ఆత్మ చైర్మన్ ముక్తి కృష్ణ, మార్కెట్ చైర్మన్ నాగేశ్వరరావు, తాటి భిక్షం, కనగాల పేరయ్య, పులిగళ్ల మాదవరావు, సుదిమళ్ల సర్పంచ్ నాగరత్నమ్మ, అక్కిరాజు గణేష్, సిలివేరు సత్యనారాయణ, గందె సదానందం తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డుప్రమాదంలో నలుగురికి గాయాలు
ఇల్లెందురూరల్: రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో వాటిలో ప్రయాణిస్తున్న నలుగురికి గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాలు... ఇల్లెందులోని మయూరి హోటల్ వ్యాపారి లక్ష్మి, ఆమె భర్త రవీందర్ కలిసి కారులో కొత్తగూడెం నుంచి తిరిగొస్తున్నారు. ఇల్లెందు మండలంలోని బొజ్జాయిగూడెం గ్రామంలోని సమ్మక్క–సారక్క గద్దెల వద్ద ఎదురుగా వస్తున్న మరో కారు ఢీకొంది. లక్ష్మి తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఎదురుగా వస్తున్న కారులోని మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. వీరిని 108 సిబ్బంది ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తీవ్రం గాయపడిన లక్ష్మిని మెరుగైన వైద్యం కోసం ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ప్రమాదంలో రెండు కార్లు ధ్వంసమయ్యాయి. -
భార్యను కిడ్నాప్ చేసి చంపేశాడు
ఇల్లెందు(భద్రాద్రి కొత్తగూడెం): భార్యను కిడ్నాప్ చేసి.. హత్య చేసిన ఉదంతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందులో గురువారం రాత్రి జరిగింది. టేకులపల్లిలో ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న ఇల్లెందుకు చెందిన పుల్లిగండ్ల పద్మ(30), కారేపల్లి మండలం తొడిదలగూడేనికి చెందిన ఆటో డ్రైవర్ బండారు ప్రభాకర్ 12 ఏళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రభాకర్ మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ.. తరచూ భార్యను హింసించటం మొదలు పెట్టాడు. భార్యపై అనుమానం పెంచుకున్నాడు. ఆమెకు టేకులపల్లి నుంచి జెడ్పీకి బదిలీ కావడంతో ఖమ్మానికి మకాం మార్చారు. అక్కడ కూడా తరచూ వేధించడంతో పద్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చినా, పెద్దలు పంచాయితీ చేసినా ప్రభాకర్‌లో మార్పు రాలేదు. వేధింపులు తాళలేక రెండు నెలలుగా పద్మ పిల్లలతో కలిసి ఇల్లెందులోని పుట్టింటిలో ఉంటోంది. అక్కడి నుంచి ఉద్యోగ రీత్యా రోజూ ఖమ్మం నుంచి ఇల్లెందుకు రాకపోకలు సాగిస్తోంది. ఈ క్రమంలో గురువారం రాత్రి 7.30 గంటలకు ఇల్లెందులో బస్సు దిగి ఇంటికి వెళ్తోంది. పద్మ కోసం కాపు కాసిన ప్రభాకర్ మరో ఇద్దరితో కలిసి కిడ్నాప్ చేసి ఆటోలో తీసుకెళ్లారు. కేకలు వేస్తుండటంతో ఆటోలోనే చున్నీని మెడకు చుట్టి చంపేశాడు. మృతదేహాన్ని మొట్లగూడెం వెళ్లే దారిలో రోడ్డు పక్కన పడేశారు. నిందితులు ప్రభాకర్‌తో పాటు ఈ దారుణానికి ఒడిగట్టిన మరో ఇద్దర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. నిందితులు పరారీలో ఉన్నారని, త్వరలో పట్టుకుంటామని డీఎస్పీ జి. ప్రకాశరావు తెలిపారు. -
పొరు గడ్డలో ... హొరు
పోరాటాలకు పురిటి గడ్డ...సింగరేణి జడలో విరబూసిన మందారం... ఇల్లెందు. 1978లో ఎస్టీలకు రిజర్వు అయిన ఈ నియోజకవర్గంలో గిరిజన తెగలైన లంబాడా, కోయ సామాజిక వర్గాల ప్రభావం బాగా ఉంటుంది. ఇక్కడి నుంచి ఆరు సార్లు సీపీఐఎంఎల్ (న్యూడెమొక్రసీ) విజయం సాధించింది. ఆ పార్టీ తరఫున ఐదు దఫాలు గుమ్మడి నర్సయ్య అసెంబ్లీలో అడుగు పెట్టారు. అసెంబ్లీలో తన గళాన్ని ఎలుగెత్తి చాటిన ఆయన ఇప్పటికీ సాదాసీదాగానే ఉంటారు. ఇక్కడి నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన ఊకె అబ్బయ్యకు టీడీపీ టికెట్ నిరాకరించడంతో ఆయన అనూహ్యంగా టీఆర్ఎస్ నుంచి రంగంలోనికి దిగారు. కాంగ్రెస్ నుంచి కోరం కనకయ్య, టీడీపీ నుంచి బానోతు హరిప్రియ పోటీ చేస్తున్నారు. వైఎస్సార్సీపీ అభ్యర్థిగా డాక్టర్ రవిబాబు నాయక్ బరిలో ఉన్నారు. ఆయనకు సీపీఎం పార్టీ మద్దతు ప్రకటించింది. విద్యాధికుడు, యువకుడు అయిన రవిబాబు నియోకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఇల్లందుల నాగేశ్వరరావు,ఇల్లెందు ఎస్టీ నియోజకవర్గంగా 1978లో అవతరించినప్పటినుంచి ఇక్కడ కాంగ్రెస్ ఒక్కసారి కూడా గెలవలేదు. తెలంగాణ ఇచ్చింది తామేనని చెప్పుకోవటం మినహా ఇక్కడ కాంగ్రెస్‌కు అనుకూలించే అంశమేదీ లేదు. ఐదేళ్లుగా ఇక్కడి నుంచి టీడీపీ ఎమ్మెల్యే ఊకె అబ్బయ్య ప్రాతినిధ్యం వహించారు. నియోజకవర్గాన్ని విస్మరించారని ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. సొంత పార్టీ నేతలే గతంలో ఆయన పనితీరుపై చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగిన కోరం కనకయ్యకు సొంత పార్టీలోని రేణుక వర్గం సహకరించటం లేదు. పార్టీఅభ్యర్థులందరినీ ఓడించాలన్న ధ్యేయంతో ఈ వర్గం పనిచేస్తుందన్న వాదన వినిపిస్తోంది. బంజారాలకు జిల్లాలో ఒక్క సీటు కూడా కేటాయించలేదని ఆ సామాజిక వర్గం కాంగ్రెస్ మీద వ్యతిరేకతతో ఉంది. కనకయ్య వెంట ఉన్న నాయకులు కూడా ఆయన గెలిస్తే అధికారాన్ని చెలాయించాలని ఆశిస్తున్నవారేనన్న విమర్శలున్నాయి. బాబే లక్ష్యంగా.. సిట్టింగ్ అయిన తనను కాదని రాత్రికి రాత్రి బానోత్ హరిప్రియకు కేటాయించడం పట్ల అసంతృప్తితో అబ్బయ్య టీఆర్ఎస్లో చేరారు. గిజనుడిని కావడంవల్లనే జిల్లాలోని సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో తన ఒక్కడికే టికెట్టివ్వలేదని చెబుతూ ఆయన జనంలోకి వెళుతున్నారు. నియోజకవర్గంలో తన సామాజిక వర్గానికి తనకు జరిగిన అన్యాయం గురించి వివరించి టీడీపీ ఓటు బ్యాకును తాను చీల్చుతానంటున్నారు. తెలంగాణ ఉద్యమం జోరుగా సాగినా ఇక్కడ టీఆర్ఎస్ ఆ స్థాయిలో ఇక్కడ బలపడలేకపోయింది. అబ్బయ్య సొంత బలంతో పాటు సెంటిమెంటు మీద ఆశతో ఉంది. న్యూ డెమొక్రసీ రెండు వర్గాలుగా చీలింది. గుమ్మడి నర్సయ్య వ్యక్తిగత ప్రతిష్టతోనే గట్టెక్కుతారన్న దీమాతో ఉన్నారు. సామాజిక వర్గం అండ... వైఎఎస్సార్ సీపీ తరఫున యువకుడు, విద్యావంతుడు, వైద్యుడు, బంజారా సామాజిక వర్గానికి చెందిన డాక్టర్ జి. రవిబాబు బరిలోకి దిగారు. అత్యధిక ఓటు బ్యాంకు అయిన పొంత సామాజికవర్గం రవిబాబుకు అండగా ఉండనుంది. వైఎస్సార్ ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాపై ప్రజలనుంచి కనిపిస్తున్న ఆదరణ ఆయనకు అనుకూలించనుంది. మిగతాపార్టీల్లో ఉన్న అసంతృప్తులు కూడా ఆయనకు అనుకూలించే అవకాశం ఉంది. అసెంబ్లీ నియోజకవర్గం ఇల్లెందు ఎవరెన్నిసార్లు గెలిచారు: న్యూడెమోక్రసీ - 6, సీపీఐ - 1, టీడీపీ-1 ప్రస్తుత ఎమ్మెల్యే: ఊకె అబ్బయ్య (టీడీపీ - ప్రస్తుతం టీఆర్ఎస్) రిజర్వేషన్: ఎస్టీ నియోజకవర్గ ప్రత్యేకతలు: రాజకీయ చైతన్యం ఎక్కువ. ఇక్కడ లంబాడా ఓట్లు ఎక్కువ. గెలుపు ఓటములను ప్రభావితం చేసేది గిరిజనేత రులే ప్రస్తుతం బరిలో నిలిచింది: 15 ప్రధాన అభ్యర్థులు వీరే.. డాక్టర్ జి.రవిబాబు (వైఎస్సార్సీపీ) కోరం కనకయ్య (కాంగ్రెస్) ఊకె అబ్బయ్య (టీఆర్ఎస్) బానోత్ హరిప్రియ (టీడీపీ) గుమ్మడి నర్సయ్య (ఎన్డీ) ల్లెందు మంచినీటి చెరువు అభివృద్ధి ఇల్లెందు చెరువులోకి దుమ్ముగూడెం కాలువలను మళ్లించటం. బయ్యారంలో పెద్ద చెరువు అభివృద్ధి.. తులారం ప్రాజెక్టు అభివృద్ధి. గార్లలో మున్నేరు ప్రాజెక్టు నిర్మాణం బయ్యారంలో ఉక్కు పరిశ్రమ నెలకొల్పేందుకు కృషి - గుమ్మడి నర్సయ్య(ఎన్డీ) ఇల్లెందు, బయ్యారం చెరువులను అభివృద్ధి వైద్యశాలను అభివృద్ధి చేయడం. తులారం ప్రాజెక్టు అభివృద్ధి, గార్లలో మున్నేరు ప్రాజెక్టు నిర్మాణం -తాగునీటి ఎద్దడి తీర్చటం. కామేపల్లి మండలం రాయిమాధారం చెక్‌డ్యాం, సీపీడబ్ల్యూ స్కీం ఏర్పాటు చేసి అన్ని గ్రామాలకు తాగునీటిని సరఫరా -డాక్టర్ జి.రవిబాబు (వైఎస్సార్సీపీ) బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు కృషి ఇల్లెందు బస్టాండ్ అభివృద్ధి పర్చటం విద్యావైద్యసదుపాయాలు కల్పించటం మంచీనిటి చెరువు అభివృద్ధి బేతంపూడి,రాయిమాధారం సీపీడబ్ల్యూ స్కీంల ఏర్పాటు, గ్రామాల ప్రజల దాహార్తి తీర్చటం - ఊకె అబ్బయ్య(టీఆర్ఎస్) ఇల్లెందు పట్టణంలో క్రమబద్ధీకరణ మంచినీటి చెరువు అభివృద్ధి బయ్యారంలో ఉక్కు పరిశ్రమ నెలకొల్పటం, యువతకు ఉపాధి కల్పించటం, విద్యవైద్య సదుపాయాలు కల్పించటం - కోరం కనకయ్య(కాంగ్రెస్) బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు. ఇల్లెందు బస్టాండ్ అభివృద్ధి పర్చటం మంచీనిటి చెరువు అభివృద్ధి బయ్యారంలో పెద్ద చెరువు అభివృద్ధి.. తులారం ప్రాజెక్టు అభివృద్ధి, గార్లలో మున్నేరు ప్రాజెక్టు నిర్మాణం- తాగునీటి ఎద్దడి తీర్చటం. - బానోత్ హరిప్రియ (టీడీపీ) -
వస్త్ర దుకాణంలో ఘోర అగ్నిప్రమాదం
ఇల్లెందు, న్యూస్‌లైన్: ఇల్లెందు పట్టణంలోని ప్రముఖ వస్త్రదుకాణంలో ఆదివారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో సుమారు రూ. 50లక్షల వరకు ఆస్తినష్టం వాటిల్లింది. స్థానికుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. ఇల్లెందుకు చెందిన బాలకిషన్ ఖండేల్వాల్ స్థానిక ఆంబజార్‌లో గురుకృపా వస్త్ర దుకాణం నిర్వహిస్తున్నాడు. శనివారం రాత్రి ఆయన షాపు నిర్వహణ బాధ్యతలను కుటుంబ సభ్యులకు అప్పగించి హైదరాబాద్ వెళ్లారు. తెల్లవారుజామున దుకాణం నుంచి మంటలు వస్తుండడంతో స్థానికులు గమనించి షాపు యజమాని సతీమణి రచనకు సమాచారం అందించారు. అలాగే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అప్పటికే మంటలు పెద్ద ఎత్తున చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలు ఆర్పేందుకు యత్నించినా ఫలితం కరువైంది. సమాచారం అందుకున్న డీఎస్పీ కృష్ణ సింగరేణి యాజమాన్యంతో మాట్లాడి ప్రత్యేక వాటర్ ట్యాంకు తెప్పించారు. మరోవైపు అగ్నిమాపక సిబ్బంది, సింగరేణి, మున్సిపల్ వాటర్ ట్యాంక్‌ల ద్వారా మంటలను ఆర్పివేశారు. రెండంతస్తుల భవనంలో షాపు నిర్వహిస్తుండడంతో పై అంతస్తులోని దుస్తులకు ఎలాంటి ప్రమాదం జరుగలేదు. ఈ ప్రమాదంలో సుమారు రూ. 50లక్షల వరకు నష్టం వాటిల్లింది. నాలుగు గంటల పాటు మంటలు చెలరేగడంతో పక్కనే ఉన్న ఇళ్ల వారు ఆందోళన చెందారు. చివరకు మంటలు ఆర్పివేయడంతో వారు ఊపిరిపీల్చుకున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న సింగరేణి మర్చంట్ అసోసియేషన్ సభ్యులు సురేష్‌లాహోటీ, జుగల్కిషోర్, సుధీర్‌తోత్లా, మల్లిఖార్జున్, శ్రావణ్‌కుమార్, అనిల్ కుమార్, దీపక్, బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. సంఘటనకు గల కారణాలను డీఎస్పీకి వివరించారు. సంఘటనకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.