ఇల్లెందు, న్యూస్‌లైన్: ఇల్లెందు పట్టణంలోని ప్రముఖ వస్త్రదుకాణంలో ఆదివారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో సుమారు రూ. 50లక్షల వరకు ఆస్తినష్టం వాటిల్లింది. స్థానికుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. ఇల్లెందుకు చెందిన బాలకిషన్ ఖండేల్‌వాల్ స్థానిక ఆంబజార్‌లో గురుకృపా వస్త్ర దుకాణం నిర్వహిస్తున్నాడు. శనివారం రాత్రి ఆయన షాపు నిర్వహణ బాధ్యతలను కుటుంబ సభ్యులకు అప్పగించి హైదరాబాద్ వెళ్లారు. తెల్లవారుజామున దుకాణం నుంచి మంటలు వస్తుండడంతో స్థానికులు గమనించి షాపు యజమాని సతీమణి రచనకు సమాచారం అందించారు. అలాగే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.
అప్పటికే మంటలు పెద్ద ఎత్తున చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలు ఆర్పేందుకు యత్నించినా ఫలితం కరువైంది. సమాచారం అందుకున్న డీఎస్పీ కృష్ణ సింగరేణి యాజమాన్యంతో మాట్లాడి ప్రత్యేక వాటర్ ట్యాంకు తెప్పించారు. మరోవైపు అగ్నిమాపక సిబ్బంది, సింగరేణి, మున్సిపల్ వాటర్ ట్యాంక్‌ల ద్వారా మంటలను ఆర్పివేశారు. రెండంతస్తుల భవనంలో షాపు నిర్వహిస్తుండడంతో పై అంతస్తులోని దుస్తులకు ఎలాంటి ప్రమాదం జరుగలేదు. ఈ ప్రమాదంలో సుమారు రూ. 50లక్షల వరకు నష్టం వాటిల్లింది.
నాలుగు గంటల పాటు మంటలు చెలరేగడంతో పక్కనే ఉన్న ఇళ్ల వారు ఆందోళన చెందారు. చివరకు మంటలు ఆర్పివేయడంతో వారు ఊపిరిపీల్చుకున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న సింగరేణి మర్చంట్ అసోసియేషన్ సభ్యులు సురేష్‌లాహోటీ, జుగల్‌కిషోర్, సుధీర్‌తోత్లా, మల్లిఖార్జున్, శ్రావణ్‌కుమార్, అనిల్ కుమార్, దీపక్, బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. సంఘటనకు గల కారణాలను డీఎస్పీకి వివరించారు. సంఘటనకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
వస్త్ర దుకాణంలో ఘోర అగ్నిప్రమాదం
Published Mon, Jan 27 2014 3:40 AM | Last Updated on Wed, Sep 5 2018 9:45 PM
Advertisement
Advertisement