krisna
-
విమానాలకు విహంగాల బెడద
అంతర్జాతీయ విమానాశ్రయ గుర్తింపు పొందినప్పటికీ గన్నవరం విమానాశ్రయం ఇంకా బాలారిష్టాల నుంచి గట్టెక్కలేదు. విమానాశ్రయ పరిసర గ్రామాల వారు ఆ చుట్టుపక్కల ప్రాంతాన్ని డంపింగ్ యార్డులా వాడేసుకుంటున్నారు. వారు పడవేసిన వ్యర్థాల కోసం వస్తున్న పక్షులతో అడపాదడపా విమానాలకు ప్రమాదాలు వాటిల్లుతున్నాయి. అయితే ప్రమాదాల నివారణకు తాత్కాలికంగా బాణసంచా పేల్చి చేతులు దులుపుకొంటున్నారు తప్ప...సమస్య శాశ్వత పరిష్కారానికి ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. సాక్షి, గన్నవరం: అంతర్జాతీయ విమానాశ్రయ గుర్తింపు పొందిన గన్నవరం ఎయిర్‌పోర్టులో విమానాల రాకపోకలకు పక్షుల బెడద తప్పడం లేదు. విమానాశ్రయ పరిసరాల్లో యథేచ్ఛగా డంప్ చేస్తున్న జంతు కళేబరాలు, మాంసం వ్యర్థాలు, చెత్తాచెదారం కారణంగా పక్షుల సంచారం విపరీతంగా పెరిగింది. ఫలితంగా తరుచూ విమానాల టేకాఫ్, ల్యాండింగ్ సమయాల్లో తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది. గతంలో ఇక్కడ పలుమార్లు విమానాలకు పక్షులు ఢీకొన్న సంఘటనలు కూడా ఉన్నాయి. ఆ సమయాల్లో విమానాలకు తృటిలో ప్రమాదాలు తప్పినా అధికారులు మాత్రం అప్రమత్తం కావడం లేదు. ఈ తరహా సంఘటనలు జరిగినప్పుడు అధికారులు అక్రమ చెత్త డంపింగ్ నివారణపై చెత్త సమావేశాలు నిర్వహించి హడావుడి చేయడం తప్ప ఆచరణాత్మక విధానాలేవీ అమల్లో పెట్టడం లేదు. అయితే విమానాశ్రయ పరిసర గ్రామాల్లో పారిశుద్ధ్యం మెరుగుపర్చేందుకు ఎయిర్పోర్ట్ ఆధారిటీ ఆఫ్ ఇండియా నుంచి ఎటువంటి సహకారం అందించడం లేదు. యథేచ్ఛగా డంపింగ్ విమానాశ్రయం చుట్టూ ఉన్న గ్రామాలు ఎయిర్‌పోర్టు పరిసర ప్రాంతాలను డంపింగ్ యార్డులుగా ఉపయోగిస్తున్నాయి. విమానాశ్రయ రన్‌వేకు అతి సమీపంలో ఉన్న కొత్తపేట వద్ద పాటిగోతుల్లో మాంసం దుకాణదారులు వ్యర్థాలను మూటలు కట్టి తీసుకువచ్చి పడవేస్తున్నారు. దీనికితోడు జంతు కళేబరాలను, చెత్తచెదారం యథేచ్ఛగా ఇక్కడ డంప్ చేస్తున్నారు. దీంతో వీటి కోసం వచ్చే గెద్దలు పక్కనే ఉన్న రన్‌వేపైకి చేరుతున్నాయి. రాజీవ్‌నగర్‌తో పాటు ఎయిర్‌పోర్టు తూర్పు వైపు ఉన్న వాగు కూడా పక్షుల సంచారానికి కారణమైంది. ఇంకా రాజీవ్‌నగర్‌కాలనీ, బుద్దవరం వైపు విమానాశ్రయ పరిసరాల్లో పారిశుద్ధ్యం అధ్వానంగా ఉంది. దీనికితోడు విజయవాడలోని హోటళ్లకు చెందిన వ్యర్ధాలను రాత్రి వేళల్లో ఆటోల్లో తీసుకువచ్చి కేసరపల్లి, ఎయిర్‌పోర్టు పరిసరాల్లో డంప్ చేస్తున్నారు. వీటివల్ల పక్షుల సంచారం పెరిగి విమానాల రాకపోకల సమయంలో ఆటంకం ఏర్పడుతోంది. దీంతో విమానాల రాకపోకల సమయంలో పక్షులను బెదరకొట్టేందుకు ఎయిర్‌పోర్టు సిబ్బంది బాణసంచా ఉపయోగించాల్సిన పరిస్ధితి నెలకొంది. గుణపాఠం నేర్వని అధికారులు గత పదేళ్ల వ్యవధిలో ఇక్కడ ఏడుసార్లకు పైగా విమానాలను పక్షులు ఢీకొన్నాయి. తరుచూ విమానాల ల్యాండింగ్, టేకాఫ్ సమయాల్లో పక్షుల వల్ల విమాన పైలెట్లు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. పక్షులు ఢీకొనడం వల్ల ఇప్పటివరకు ఎయిరిండియా, స్పైస్‌జెట్, ఎయిర్ కోస్తా, జెట్ ఎయిర్వేస్కు చెందిన విమానాలు సర్వీస్‌లు రద్దు చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. అంతేకాకుండా పక్షులు ఢీకొన్నప్పుడు విమాన రెక్కలు, ఇంజన్ భాగాలు దెబ్బతిని సదరు విమాన సంస్థలకు ఆర్థికంగా నష్టం కూడా వాటిల్లింది. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు జిల్లా కలెక్టర్ నేతృత్వంలో ఎయిర్‌పోర్టు అధికారులు సమావేశాలు నిర్వహించి పక్షుల నివారణ, అక్రమ డంపింగ్ అరికట్టేందుకు ఆదేశాలు ఇస్తున్నారు. అయితే క్షేత్రస్థాయిలో పంచాయితీ, రెవెన్యూ అధికారుల పర్యవేక్షణ లోపించడంతో అనధికార డంపింగ్ యథావిధిగా కొనసాగుతోంది. దీంతో విమానాలకు పక్షుల బెడద తప్పడం లేదు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఎయిర్‌పోర్టు పరిసరాల్లో మాంసం వ్యర్థాలు, జంతు కళేబరాలు, చెత్తచెదారం డంప్ చేయకుండా చర్యలు తీసుకోవాలని విమాన ప్రయాణికులు కోరుతున్నారు. కొరవడిన ఎయిర్‌పోర్టు సహకారం విమానాశ్రయ పరిసర గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణకు ఎయిర్‌పోర్టు నుంచి సహకారం కొరవడింది. సామాజిక బాధ్యత పథకం కింద ఎయిర్‌పోర్టు అథారిటీ గ్రామ పంచాయతీల్లో పారిశుద్ధ్యాన్ని మెరుగుపర్చేందుకు అవసరమైన సామగ్రిని అందించే వెసులుబాటు ఉంది. దీనికోసం ప్రతియేటా జరిగే పర్యావరణ సమావేశంలో ఎయిర్‌పోర్టు చుట్టూ ఉన్న బుద్దవరం, కేసరపల్లి, అల్లాపురం, గన్నవరం గ్రామ పంచాయతీల నుంచి ప్రతిపాదనలు తీసుకుంటున్నారు. అయా గ్రామాల్లో చెత్త నిర్వహణకు ట్రాక్టర్లు, రిక్షాలు, డస్ట్బిన్లు, ఎస్సీ, బీసీ ఏరియాల్లో డ్రైనేజీ నిర్మాణాలకు ఎయిర్‌పోర్టు అధికారులకు ప్రతిపాదనలు ఇస్తున్నప్పటికీ ఇంతవరకు ఒక్క రూపాయి కూడా సహకరం అందించలేదని పంచాయతీ కార్యదర్శులు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా పారిశుద్ధ్య నిర్వహణకు ఎయిర్‌పోర్టు సహకారం అందించాలని కోరుతున్నారు. -
ఘనంగా కృష్ణాష్టమి
-
వస్త్ర దుకాణంలో ఘోర అగ్నిప్రమాదం
ఇల్లెందు, న్యూస్‌లైన్: ఇల్లెందు పట్టణంలోని ప్రముఖ వస్త్రదుకాణంలో ఆదివారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో సుమారు రూ. 50లక్షల వరకు ఆస్తినష్టం వాటిల్లింది. స్థానికుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. ఇల్లెందుకు చెందిన బాలకిషన్ ఖండేల్వాల్ స్థానిక ఆంబజార్‌లో గురుకృపా వస్త్ర దుకాణం నిర్వహిస్తున్నాడు. శనివారం రాత్రి ఆయన షాపు నిర్వహణ బాధ్యతలను కుటుంబ సభ్యులకు అప్పగించి హైదరాబాద్ వెళ్లారు. తెల్లవారుజామున దుకాణం నుంచి మంటలు వస్తుండడంతో స్థానికులు గమనించి షాపు యజమాని సతీమణి రచనకు సమాచారం అందించారు. అలాగే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అప్పటికే మంటలు పెద్ద ఎత్తున చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలు ఆర్పేందుకు యత్నించినా ఫలితం కరువైంది. సమాచారం అందుకున్న డీఎస్పీ కృష్ణ సింగరేణి యాజమాన్యంతో మాట్లాడి ప్రత్యేక వాటర్ ట్యాంకు తెప్పించారు. మరోవైపు అగ్నిమాపక సిబ్బంది, సింగరేణి, మున్సిపల్ వాటర్ ట్యాంక్‌ల ద్వారా మంటలను ఆర్పివేశారు. రెండంతస్తుల భవనంలో షాపు నిర్వహిస్తుండడంతో పై అంతస్తులోని దుస్తులకు ఎలాంటి ప్రమాదం జరుగలేదు. ఈ ప్రమాదంలో సుమారు రూ. 50లక్షల వరకు నష్టం వాటిల్లింది. నాలుగు గంటల పాటు మంటలు చెలరేగడంతో పక్కనే ఉన్న ఇళ్ల వారు ఆందోళన చెందారు. చివరకు మంటలు ఆర్పివేయడంతో వారు ఊపిరిపీల్చుకున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న సింగరేణి మర్చంట్ అసోసియేషన్ సభ్యులు సురేష్‌లాహోటీ, జుగల్కిషోర్, సుధీర్‌తోత్లా, మల్లిఖార్జున్, శ్రావణ్‌కుమార్, అనిల్ కుమార్, దీపక్, బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. సంఘటనకు గల కారణాలను డీఎస్పీకి వివరించారు. సంఘటనకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. -
ఓరుగల్లు నేత సారథ్యంలో కొత్త పార్టీ
వరంగల్ సిటీ, న్యూస్‌లైన్: ఓరుగల్లుకు చెందిన నేత సారథ్యంలో కొత్త పార్టీ ఆవిర్భవించింది. మహాజన సోషలిస్ట్ పార్టీ(ఎంఎస్పీ) వ్యవస్థాపకుడు మంద కృష్ణమాదిగ జిల్లా నేత కావడం విశేషం. వరంగల్ నగర పరిధిలోని న్యూశాయంపేటకు చెందిన మంద కొమురమ్మ, మంద చిన్న ఓదెలు మూడో సంతానంగా కృష్ణ జన్మించారు. తొలుత విప్లవ భావాలతో సాధారణ జీవితాన్ని గడిపిన కృష్ణ.. 1992లో దళిత, విప్లవ నేతలు కేజీ సత్యమూర్తి, సాంబశివరావు ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా ఈదుమూడిలో జరిగిన సమావేశంలో ఎస్సీ వర్గీకరణ లక్ష్యంగా ఎమ్మార్పీఎస్ ఏర్పాటు చేశారు. ఆయన నేతృత్వంలో 1994 జులైలో జిల్లాలో ఎమ్మార్పీఎస్ ఉద్యమం ప్రారంభమైంది. రాష్ట్రంలో మాదిగలను ఐక్యం చేశారు. రెండు దశాబ్దాలుగా మాదిగ దండోరా, వికలాంగుల హక్కుల ఉద్యమం నడిపారు. తెలంగాణ ఉద్యమంలో కూడా భాగస్వాములయ్యూరు. అంధుల ఆరాధ్య దైవం లూయీ బ్రెయిలీ జయంతి సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో ఎంఎస్పీ ఆవిర్భావ ప్రకటన చేశారు. పార్టీ ఏర్పాటుతో ఎమ్మార్పీఎస్ శ్రేణులు హర్షం ప్రకటించాయి. జిల్లాలో పార్టీని విస్తరింపజేసేందుకు ఈ నెల 6, 7 తేదీల్లో ఎర్రగట్టు వద్ద రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు. తాను పుట్టిన గడ్డ నుంచే పార్టీని బలోపేతం చేయాలని మంద కృష్ణమాదిగ భావిస్తున్నారు. స్కాలర్షిప్ కోసం దరఖాస్తుల ఆహ్వానం నక్కలగుట్ట, న్యూస్‌లైన్ : ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల్లో చదువుతున్న ఎస్సీ విద్యార్థులు స్కాలర్‌షిప్‌ల కోసం దరఖాస్తు చేసుకోవాలని జిల్లా సాంఘిక సంక్షేమశాఖ ఇన్చార్జ్ డిప్యూటీ డైరక్టర్, అదనపు జాయింట్ కలెక్టర్ బి.సంజీవయ్య సూచించారు. ఈ విద్యాసంవత్సరంలో స్కాలర్‌షిప్‌ల రెన్యూవల్ కోసం 20,344 మంది విద్యార్థులు అర్హులని తెలిపారు. -
మూడు నదుల అనుసంధానం....ముందుతరాలకు జీవనాధారం
సూర్యాపేట, న్యూస్‌లైన్: సూర్యాపేట నియోజకవర్గంలో బిరబిరా పొంగే కృష్ణమ్మ.. గలగల పారే గోదారమ్మ జలాలు పరుగులు తీస్తున్నాయి. ఎగిసి పడే మూసీ ప్రవాహపు జలసిరులు ఉన్నాయి. అయినా సాగు, తాగు నీటి కొరత వేధిస్తూనే ఉంది. ఎస్సారెస్పీ, ఏఎమ్మార్పీ కాలువలను మూసీ నదిలోకి అనుసంధానం చేస్తే ఈ ప్రాంతమంతా సస్యశ్యామలమవుతుంది. ఈ నేపథ్యంలోనే త్రివేణి సంగమం తెరపైకి వచ్చింది. దీనికోసం కొందరు పోరుబాట పట్టారు. అనుసంధానం ఇలా.. సూర్యాపేట నియోజకవర్గంలోని సోలిపేట గ్రామం వద్ద 1954లో మూసీ ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టారు. రంగారెడ్డి జిల్లా వికారాబాద్, అనంతగిరి పర్వతశ్రేణుల నుంచి ప్రవహిస్తూ వస్తున్న మూసీ నీటిని నిల్వ ఉంచేందుకు ఇక్కడ ఏర్పాటుచేసిన ప్రాజెక్ట్ 1958నాటికి పూర్తయింది. ఎడమ కాలువ 41 కి.మీ, కుడి కాలువ 38 కి.మీ ప్రవహించి 40 గ్రామాల ప్రజలకు సాగునీరు ఇస్తుంది. 595 అడుగుల లోతు, 571 క్యూసెక్కుల నీటినిల్వ సామర్థ్యంతో 30 క్రస్ట్‌గేట్లతో ప్రాజెక్ట్ నిర్మించారు. ఎడమ కాలువ ద్వారా సూర్యాపేట, చివ్వెంల, పెన్‌పహాడ్ మండలాల్లో 20వేల ఎకరాల వ్యవసాయ భూములకు నీరందుతుంది. కృష్ణాజలాలు మూసీలో ఎలా.. ఎక్కడ కలుస్తాయంటే.. మూసీ ప్రాజెక్ట్‌లోకి కృష్ణానీటిని వదిలితే ఎక్కు వ భూమి సాగులోకి వచ్చే అవకాశం ఉంది. 1972లో అప్పటి ముఖ్యమంత్రి టి.అంజయ్య ఎస్ఎల్బీసీ పనులు సర్వే చేయించగా 1983లో అధికారం చేపట్టిన ఎన్టీ రామారావు *52 కోట్లు విడుదల చేసి పనులకు శంకుస్థాపన చేశారు. దీంతో 30 టీఎంసీల నీటిని 3లక్షల ఎకరాలకు నీరివ్వాలాని ప్రతిపాదించారు. లిఫ్ట్ ద్వారా 22టీఎంసీల నీటిని అక్కంపల్లి, పానగల్లు (ఉదయసముద్రం) నుంచి మూసీ రిజర్వాయర్లకు నీటిని అందిస్తే 2.20 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వచ్చని ప్రణాళిక రూపొందిం చారు. దీని ప్రకారం ఉదయసముద్రం నుంచి ఏఎమ్మార్పీ ప్రధాన కాలువ ద్వారా కట్టంగూరు మండలం అయిటిపాముల చెరువుకు 2003లో కృష్ణా జలాలు చేరుకున్నాయి. 2004లో నకిరేకల్ మండలం నోముల గ్రామం వరకు నీటిని పంపే ఏర్పాటు చేశారు. ఏఎమ్మార్పీ చివరి పాయింట్ మూసీ నది అయినప్పటికీ కృష్ణాజలాలు మూసీలో కలవడంలేదు. నోముల వరకు ఉన్న ఏఎమ్మార్పీ కాలువను మూసీలో కలిపితే కృష్ణానీరు మూసీలో కలుస్తుంది. గోదావరి జలాలు.. 1969లో అప్పటి ప్రభుత్వం శ్రీరాంసాగర్ ప్రాజెక్టు (ఎస్సారెస్పీ) రెండో దశ నిర్మాణం చేపట్టి నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాలకు నీరందిస్తామని ప్రకటించింది. 1996లో ఎస్సారెస్పీ కాలువ పనులకు అనుమతిచ్చింది. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయిన వెంటనే 2004 నుంచి పనులు వేగవంతమై 2009 నాటికి నీరు విడుదల అయ్యింది. జిల్లా వ్యాప్తంగా దీని ద్వారా 2లక్షల 57వేల 508 ఎకరాలు పంట పొలాలకు నీరందనుంది. ఒక్క సూర్యాపేట నియోజకవర్గంలోనే 95 వేల354 ఎకరాలకు నీరందేలా కాలువలు తవ్వారు. కానీ, నేటికీ నీటి విడుదల కాలేదు. ఉపయోగం సరిగా లేదు. ఎస్సారెస్పీ రెండో దశ ద్వారా వస్తున్న గోదావరి నీటిని ప్రధాన కాలువ ద్వారా మూసీ ప్రాజెక్ట్‌కు తరలిస్తే ఈ ప్రాంత భూములు మరింత ఉపయోగంలోకి వస్తాయి. ఎస్సారెస్పీ ప్రధాన కాలువను మూసీ ఉప నది బిక్కేరు వాగులో కలిపితే గోదావరి జలాలు మూసీ ప్రాజెక్ట్‌కు అందుతాయి. ఈ రకంగా మూసీ ప్రాజెక్ట్‌కు అత్యంత చేరువగా ఉన్న కృష్ణా, గోదావరి జలాలను మూసీలో కలిపితే మూడు నదులు కలిసి త్రివేణి సంగమంగా ఏర్పడటమే కాదు.. తవ్విన అన్ని కాలువలకు నీరందుతుంది. మూసీ నదిలో కృష్ణా, గోదావరి జలాలను కలిపిన తరువాత మూసీ ప్రాజెక్ట్ నుంచి అర్వపల్లి మండలం తిమ్మాపురం గ్రామం వద్ద ఉన్న ఎస్సారెస్పీ కాలువల్లోకి నీటిని లిఫ్ట్ ద్వారా చేర్చితే ఆత్మకూర్(ఎస్), చివ్వెంల, పెన్‌పహాడ్ మండలాల్లోని కాలువలు జలకళ సంతరించుకుని రైతులకు ప్రయోజనం కలుగుతుంది. త్రివేణిసంగమ పోరుయాత్ర.. మూడు నదుల అనుసంధానం చేసి త్రివేణి సంగమంగా ఏర్పాటు చేయాలనే నినాదంతో ఇటీవల సూర్యాపేట నియోజకవర్గంలో కొంతమంది ఆత్మకూర్(ఎస్) సింగిల్‌విండో చైర్మన్ బీరెల్లి శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో నియోజకవర్గ వ్యాప్తంగా పోరుయాత్ర నిర్వహించారు. వివిధ రాజకీయపార్టీల ముఖ్య నేతలను కలిసి వినతిపత్రాలు అందజేశారు. ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు గ్రామాల్లో పర్యటించారు.