విమానాలకు విహంగాల బెడద | Birds Causing Problems To Flight Services In Gannavaram Airport | Sakshi
Sakshi News home page

విమానాలకు విహంగాల బెడద

Published Wed, Jul 3 2019 12:03 PM | Last Updated on Wed, Jul 3 2019 12:03 PM

Birds Causing Problems To Flight Services In Gannavaram Airport - Sakshi

రన్‌వే మీదకు దిగుతున్న విమానం, కొత్తపేట వద్ద పడవేసిన మాంసం వ్యర్థాలు 

అంతర్జాతీయ విమానాశ్రయ గుర్తింపు పొందినప్పటికీ గన్నవరం విమానాశ్రయం ఇంకా బాలారిష్టాల నుంచి గట్టెక్కలేదు. విమానాశ్రయ పరిసర గ్రామాల వారు ఆ చుట్టుపక్కల ప్రాంతాన్ని డంపింగ్‌ యార్డులా వాడేసుకుంటున్నారు. వారు పడవేసిన వ్యర్థాల కోసం వస్తున్న పక్షులతో అడపాదడపా విమానాలకు ప్రమాదాలు వాటిల్లుతున్నాయి. అయితే ప్రమాదాల నివారణకు తాత్కాలికంగా బాణసంచా పేల్చి చేతులు దులుపుకొంటున్నారు తప్ప...సమస్య శాశ్వత పరిష్కారానికి ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు.

సాక్షి, గన్నవరం: అంతర్జాతీయ విమానాశ్రయ గుర్తింపు పొందిన గన్నవరం ఎయిర్‌పోర్టులో విమానాల రాకపోకలకు పక్షుల బెడద తప్పడం లేదు. విమానాశ్రయ పరిసరాల్లో యథేచ్ఛగా డంప్‌ చేస్తున్న జంతు కళేబరాలు, మాంసం వ్యర్థాలు, చెత్తాచెదారం కారణంగా పక్షుల సంచారం విపరీతంగా పెరిగింది. ఫలితంగా తరుచూ విమానాల టేకాఫ్, ల్యాండింగ్‌ సమయాల్లో తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది. గతంలో ఇక్కడ పలుమార్లు విమానాలకు పక్షులు ఢీకొన్న సంఘటనలు కూడా ఉన్నాయి. ఆ సమయాల్లో విమానాలకు తృటిలో ప్రమాదాలు తప్పినా అధికారులు మాత్రం అప్రమత్తం కావడం లేదు. ఈ తరహా సంఘటనలు జరిగినప్పుడు అధికారులు అక్రమ చెత్త డంపింగ్‌ నివారణపై చెత్త సమావేశాలు నిర్వహించి హడావుడి చేయడం తప్ప ఆచరణాత్మక విధానాలేవీ అమల్లో పెట్టడం లేదు. అయితే విమానాశ్రయ పరిసర గ్రామాల్లో పారిశుద్ధ్యం మెరుగుపర్చేందుకు ఎయిర్‌పోర్ట్‌ ఆధారిటీ ఆఫ్‌ ఇండియా నుంచి ఎటువంటి సహకారం అందించడం లేదు.

యథేచ్ఛగా డంపింగ్‌
విమానాశ్రయం చుట్టూ ఉన్న గ్రామాలు ఎయిర్‌పోర్టు పరిసర ప్రాంతాలను డంపింగ్‌ యార్డులుగా ఉపయోగిస్తున్నాయి. విమానాశ్రయ రన్‌వేకు అతి సమీపంలో ఉన్న కొత్తపేట వద్ద పాటిగోతుల్లో మాంసం దుకాణదారులు వ్యర్థాలను మూటలు కట్టి తీసుకువచ్చి పడవేస్తున్నారు. దీనికితోడు జంతు కళేబరాలను, చెత్తచెదారం యథేచ్ఛగా ఇక్కడ డంప్‌ చేస్తున్నారు. దీంతో వీటి కోసం వచ్చే గెద్దలు పక్కనే ఉన్న రన్‌వేపైకి చేరుతున్నాయి. రాజీవ్‌నగర్‌తో పాటు ఎయిర్‌పోర్టు తూర్పు వైపు ఉన్న వాగు కూడా పక్షుల సంచారానికి కారణమైంది.  ఇంకా రాజీవ్‌నగర్‌కాలనీ, బుద్దవరం వైపు విమానాశ్రయ పరిసరాల్లో పారిశుద్ధ్యం అధ్వానంగా ఉంది. దీనికితోడు విజయవాడలోని హోటళ్లకు చెందిన వ్యర్ధాలను రాత్రి వేళల్లో ఆటోల్లో తీసుకువచ్చి కేసరపల్లి, ఎయిర్‌పోర్టు పరిసరాల్లో డంప్‌ చేస్తున్నారు. వీటివల్ల పక్షుల సంచారం పెరిగి విమానాల రాకపోకల సమయంలో ఆటంకం ఏర్పడుతోంది. దీంతో విమానాల రాకపోకల సమయంలో పక్షులను బెదరకొట్టేందుకు ఎయిర్‌పోర్టు సిబ్బంది బాణసంచా ఉపయోగించాల్సిన పరిస్ధితి నెలకొంది.

గుణపాఠం నేర్వని అధికారులు
గత పదేళ్ల వ్యవధిలో ఇక్కడ ఏడుసార్లకు పైగా విమానాలను పక్షులు ఢీకొన్నాయి. తరుచూ విమానాల ల్యాండింగ్, టేకాఫ్‌ సమయాల్లో పక్షుల వల్ల విమాన పైలెట్లు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. పక్షులు ఢీకొనడం వల్ల ఇప్పటివరకు ఎయిరిండియా, స్పైస్‌జెట్, ఎయిర్‌ కోస్తా, జెట్‌ ఎయిర్‌వేస్‌కు చెందిన విమానాలు సర్వీస్‌లు రద్దు చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. అంతేకాకుండా పక్షులు ఢీకొన్నప్పుడు విమాన రెక్కలు, ఇంజన్‌ భాగాలు దెబ్బతిని సదరు విమాన సంస్థలకు ఆర్థికంగా నష్టం కూడా వాటిల్లింది. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు జిల్లా కలెక్టర్‌ నేతృత్వంలో ఎయిర్‌పోర్టు అధికారులు సమావేశాలు నిర్వహించి పక్షుల నివారణ, అక్రమ డంపింగ్‌ అరికట్టేందుకు ఆదేశాలు ఇస్తున్నారు. అయితే క్షేత్రస్థాయిలో పంచాయితీ, రెవెన్యూ అధికారుల పర్యవేక్షణ లోపించడంతో అనధికార డంపింగ్‌ యథావిధిగా కొనసాగుతోంది. దీంతో విమానాలకు పక్షుల బెడద తప్పడం లేదు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఎయిర్‌పోర్టు పరిసరాల్లో మాంసం వ్యర్థాలు, జంతు కళేబరాలు, చెత్తచెదారం డంప్‌ చేయకుండా చర్యలు తీసుకోవాలని విమాన ప్రయాణికులు కోరుతున్నారు.

కొరవడిన ఎయిర్‌పోర్టు సహకారం
విమానాశ్రయ పరిసర గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణకు ఎయిర్‌పోర్టు నుంచి సహకారం కొరవడింది. సామాజిక బాధ్యత పథకం కింద ఎయిర్‌పోర్టు అథారిటీ గ్రామ పంచాయతీల్లో పారిశుద్ధ్యాన్ని మెరుగుపర్చేందుకు అవసరమైన సామగ్రిని అందించే వెసులుబాటు ఉంది. దీనికోసం ప్రతియేటా జరిగే పర్యావరణ సమావేశంలో ఎయిర్‌పోర్టు చుట్టూ ఉన్న బుద్దవరం, కేసరపల్లి, అల్లాపురం, గన్నవరం గ్రామ పంచాయతీల నుంచి ప్రతిపాదనలు తీసుకుంటున్నారు. అయా గ్రామాల్లో చెత్త నిర్వహణకు ట్రాక్టర్లు, రిక్షాలు, డస్ట్‌బిన్‌లు, ఎస్సీ, బీసీ ఏరియాల్లో డ్రైనేజీ నిర్మాణాలకు ఎయిర్‌పోర్టు అధికారులకు ప్రతిపాదనలు ఇస్తున్నప్పటికీ ఇంతవరకు ఒక్క రూపాయి కూడా సహకరం అందించలేదని పంచాయతీ కార్యదర్శులు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా పారిశుద్ధ్య నిర్వహణకు ఎయిర్‌పోర్టు సహకారం అందించాలని కోరుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement