సూర్యాపేట, న్యూస్‌లైన్: సూర్యాపేట నియోజకవర్గంలో బిరబిరా పొంగే కృష్ణమ్మ.. గలగల పారే గోదారమ్మ జలాలు పరుగులు తీస్తున్నాయి. ఎగిసి పడే మూసీ ప్రవాహపు జలసిరులు ఉన్నాయి. అయినా సాగు, తాగు నీటి కొరత వేధిస్తూనే ఉంది. ఎస్సారెస్పీ, ఏఎమ్మార్పీ కాలువలను మూసీ నదిలోకి అనుసంధానం చేస్తే ఈ ప్రాంతమంతా సస్యశ్యామలమవుతుంది. ఈ నేపథ్యంలోనే త్రివేణి సంగమం తెరపైకి వచ్చింది. దీనికోసం కొందరు పోరుబాట పట్టారు.
అనుసంధానం ఇలా..
సూర్యాపేట నియోజకవర్గంలోని సోలిపేట గ్రామం వద్ద 1954లో మూసీ ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టారు. రంగారెడ్డి జిల్లా వికారాబాద్, అనంతగిరి పర్వతశ్రేణుల నుంచి ప్రవహిస్తూ వస్తున్న మూసీ నీటిని నిల్వ ఉంచేందుకు ఇక్కడ ఏర్పాటుచేసిన ప్రాజెక్ట్ 1958నాటికి పూర్తయింది. ఎడమ కాలువ 41 కి.మీ, కుడి కాలువ 38 కి.మీ ప్రవహించి 40 గ్రామాల ప్రజలకు సాగునీరు ఇస్తుంది. 595 అడుగుల లోతు, 571 క్యూసెక్కుల నీటినిల్వ సామర్థ్యంతో 30 క్రస్ట్‌గేట్లతో ప్రాజెక్ట్ నిర్మించారు. ఎడమ కాలువ ద్వారా సూర్యాపేట, చివ్వెంల, పెన్‌పహాడ్ మండలాల్లో 20వేల ఎకరాల వ్యవసాయ భూములకు నీరందుతుంది.
కృష్ణాజలాలు మూసీలో ఎలా..
ఎక్కడ కలుస్తాయంటే..
మూసీ ప్రాజెక్ట్‌లోకి కృష్ణానీటిని వదిలితే ఎక్కు వ భూమి సాగులోకి వచ్చే అవకాశం ఉంది. 1972లో అప్పటి ముఖ్యమంత్రి టి.అంజయ్య ఎస్‌ఎల్‌బీసీ పనులు సర్వే చేయించగా 1983లో అధికారం చేపట్టిన ఎన్టీ రామారావు *52 కోట్లు విడుదల చేసి పనులకు శంకుస్థాపన చేశారు. దీంతో 30 టీఎంసీల నీటిని 3లక్షల ఎకరాలకు నీరివ్వాలాని ప్రతిపాదించారు. లిఫ్ట్ ద్వారా 22టీఎంసీల నీటిని అక్కంపల్లి, పానగల్లు (ఉదయసముద్రం) నుంచి మూసీ రిజర్వాయర్‌లకు నీటిని అందిస్తే 2.20 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వచ్చని ప్రణాళిక రూపొందిం చారు.
దీని ప్రకారం ఉదయసముద్రం నుంచి ఏఎమ్మార్పీ ప్రధాన కాలువ ద్వారా కట్టంగూరు మండలం అయిటిపాముల చెరువుకు 2003లో కృష్ణా జలాలు చేరుకున్నాయి. 2004లో నకిరేకల్ మండలం నోముల గ్రామం వరకు నీటిని పంపే ఏర్పాటు చేశారు. ఏఎమ్మార్పీ చివరి పాయింట్ మూసీ నది అయినప్పటికీ కృష్ణాజలాలు మూసీలో కలవడంలేదు. నోముల వరకు ఉన్న ఏఎమ్మార్పీ కాలువను మూసీలో కలిపితే కృష్ణానీరు మూసీలో కలుస్తుంది.
గోదావరి జలాలు..
1969లో అప్పటి ప్రభుత్వం శ్రీరాంసాగర్ ప్రాజెక్టు (ఎస్సారెస్పీ) రెండో దశ నిర్మాణం చేపట్టి నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాలకు నీరందిస్తామని ప్రకటించింది. 1996లో ఎస్సారెస్పీ కాలువ పనులకు అనుమతిచ్చింది. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయిన వెంటనే 2004 నుంచి పనులు వేగవంతమై 2009 నాటికి నీరు విడుదల అయ్యింది. జిల్లా వ్యాప్తంగా దీని ద్వారా 2లక్షల 57వేల 508 ఎకరాలు పంట పొలాలకు నీరందనుంది. ఒక్క సూర్యాపేట నియోజకవర్గంలోనే 95 వేల354 ఎకరాలకు నీరందేలా కాలువలు తవ్వారు. కానీ, నేటికీ నీటి విడుదల కాలేదు. ఉపయోగం సరిగా లేదు.
ఎస్సారెస్పీ రెండో దశ ద్వారా వస్తున్న గోదావరి నీటిని ప్రధాన కాలువ ద్వారా మూసీ ప్రాజెక్ట్‌కు తరలిస్తే ఈ ప్రాంత భూములు మరింత ఉపయోగంలోకి వస్తాయి. ఎస్సారెస్పీ ప్రధాన కాలువను మూసీ ఉప నది బిక్కేరు వాగులో కలిపితే గోదావరి జలాలు మూసీ ప్రాజెక్ట్‌కు అందుతాయి. ఈ రకంగా మూసీ ప్రాజెక్ట్‌కు అత్యంత చేరువగా ఉన్న కృష్ణా, గోదావరి జలాలను మూసీలో కలిపితే మూడు నదులు కలిసి త్రివేణి సంగమంగా ఏర్పడటమే కాదు.. తవ్విన అన్ని కాలువలకు నీరందుతుంది. మూసీ నదిలో కృష్ణా, గోదావరి జలాలను కలిపిన తరువాత మూసీ ప్రాజెక్ట్ నుంచి అర్వపల్లి మండలం తిమ్మాపురం గ్రామం వద్ద ఉన్న ఎస్సారెస్పీ కాలువల్లోకి నీటిని లిఫ్ట్ ద్వారా చేర్చితే ఆత్మకూర్(ఎస్), చివ్వెంల, పెన్‌పహాడ్ మండలాల్లోని కాలువలు జలకళ సంతరించుకుని రైతులకు ప్రయోజనం కలుగుతుంది.
త్రివేణిసంగమ పోరుయాత్ర..
మూడు నదుల అనుసంధానం చేసి త్రివేణి సంగమంగా ఏర్పాటు చేయాలనే నినాదంతో ఇటీవల సూర్యాపేట నియోజకవర్గంలో కొంతమంది ఆత్మకూర్(ఎస్) సింగిల్‌విండో చైర్మన్ బీరెల్లి శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో నియోజకవర్గ వ్యాప్తంగా పోరుయాత్ర నిర్వహించారు. వివిధ రాజకీయపార్టీల ముఖ్య నేతలను కలిసి వినతిపత్రాలు అందజేశారు. ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు గ్రామాల్లో పర్యటించారు.
మూడు నదుల అనుసంధానం....ముందుతరాలకు జీవనాధారం
Published Wed, Dec 25 2013 2:09 AM | Last Updated on Sat, Sep 2 2017 1:55 AM
Advertisement
Advertisement