పులస ఏమవుతోంది! | Pulasa is the most expensive fish | Sakshi
Sakshi News home page

Pulasa: పులస ఏమవుతోంది!

Published Thu, Dec 26 2024 5:20 AM | Last Updated on Thu, Dec 26 2024 11:38 AM

Pulasa is the most expensive fish

నదిలోకి వలస వచ్చాక తిరిగిసముద్రంలోకి వెళుతోందా

లేక నదిలోనే ఉండిపోతోందా

శాస్త్రవేత్తలను వెంటాడుతున్న సందేహాలు

ట్యాగింగ్‌తో ట్రాక్‌ చేస్తేనే సందేహాల నివృత్తి

పులస మైగ్రేషన్‌ డైనమిక్స్‌ను అధ్యయనం చేయాల్సిందే

ఏయూ క్యాంపస్‌ (విశాఖ): సముద్రంలో ఇలసగా పిలిచే చేప నీటికి ఎదురీదుకుంటూ నదిలోకి చేరుతుంది. అక్కడ తన రంగు, రుచి, పోషకాలను పూర్తిగా మార్పు చేసుకుంటుంది. అత్యంత ఖరీదైన చేపగా మారుతుంది. ప్రధానంగా వర్షాకాలంలో గోదావరి జిల్లాల్లో పులస చేప వలలో పడిందంటే మత్స్యకా­రుల సంతోషానికి అవధులు ఉండవు. 

ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్న పులస చేప (Pulasa Fish) ప్రస్థానం, పోషకాల మార్పులపై సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫిషరీస్‌ టెక్నాలజీ (సీఐఎఫ్‌టీ) ప్రత్యేక అధ్యయనం చేసింది. కానీ.. ఇలస నదిలోకి వలస వచ్చాక పులసగా మారి సముద్రంలోకి తిరిగి వెళుతోందా లేక నదిలోనే ఉండిపోతోందా అనే సందేహాలు శాస్తవేత్తలను వెంటాడుతున్నాయి. 

లోతైన పరిశోధన చేస్తేనే..
గుడ్లు పెట్టేందుకు గోదావరి (Godavari) నదిలోకి వచ్చే సమయంలోనే పులసలు మత్స్యకారుల వలలో చిక్కి ఆహారంగా మారిపోతున్నాయా అనే సందేహాన్ని శాస్త్రవేత్తలు వ్యక్తం చేస్తున్నారు. పులసల్ని వచ్చినవి వచ్చినట్టుగా పట్టేస్తుంటే పులసల పునరుత్పత్తి దెబ్బతిని ఆ చేప జాతి అంతరించిపోయే ప్రమాదం ఉందంటున్నారు. అదేవిధంగా గోదావరిలో పుట్టిన పులస పిల్లలు సము­ద్రంలోకి వెళుతున్నాయా లేదా అనే విషయాన్ని కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుందని చెబు­తు­న్నారు. 

ఇందుకు లోతైన పరిశోధనలు చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేస్తున్నారు. పులసల గమ­నాన్ని ప్రత్యేకంగా ట్యాగింగ్‌ చేసి ట్రాకింగ్‌ చేయాలని సూచిస్తున్నారు. అదేవిధంగా వీటి మైగ్రేషన్‌ డైనమిక్స్‌­ని సైతం అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయ­పడుతున్నారు. అప్పుడే పులస చేపలను సంరక్షించడం సాధ్యపడుతుందని పేర్కొంటున్నారు. కనీసం 20 శాతం పులసలు పునరుత్పత్తి చేసే విధంగా చూడాల్సిన అవసరం ఉందని స్పష్టం చేస్తున్నారు.

భారత్‌లో గంగ, గోదావరి నదులకే రాక
బంగాళాఖాతం, అరేబియా సముద్రం, వియత్నాం, ఎర్రసముద్రం, పర్షియన్‌ గల్ఫ్‌ ప్రాంతంలో హిల్సా చేపలు లభిస్తాయి. బంగ్లాదేశ్‌లోని పద్మా నది, ఇరాక్‌లో యూప్రటిస్, మయన్మార్‌లోని ఇరావడి, పాకిస్తాన్‌లో సింధు, భారత్‌లోని గంగా, గోదావరి నదీ ప్రాంతాల్లోకి ఇవి వలస వచ్చి పులసలుగా రూపాంతరం చెందుతాయి. 

నది నుంచి సముద్రంలోకి ప్రవాహం కలిసే ప్రాంతంలో ఇవి లభిస్తాయి. వీటి లభ్యత ఇటీవల కాలంలో తగ్గిపోతోంది. గోదావరి తీరంలో లభించే పులస మెరుస్తూ ఉంటుంది. వీటిని సాధారణ ప్రజలు గుర్తించడం కష్టమే. నిపుణులు మాత్రమే గుర్తిస్తారు. 

ఇలస, పులసలో పోషకాల వ్యత్యాసం ఇలా..
సముద్రంలోని ఉప్పునీటిలో ఉండే ఇలసలో 12 శాతం శాచురేటెడ్‌ ఫ్యాటీ యాసిడ్స్‌ ఉంటాయి. 100 గ్రాముల ఇలసలో సోడియం 183 మి.గ్రా., పొటాషియం 573 మి.గ్రా., క్యాల్షియం 133 మి.గ్రా., ఫాస్పరస్‌ 910 మి.గ్రా., ఐరన్‌ 29 మి.గ్రా. ఉన్నట్టు సీఐఎఫ్‌టీ పరిశోధనలో వెల్లడైంది. పులస విషయానికి వస్తే.. కొవ్వు శాతం 8నుంచి 11 శాతం మాత్రమే ఉన్నట్టు గుర్తించారు. పులసలో అన్‌శాచురేటెడ్‌ ఫ్యాటీ యాసిడ్స్‌ ఉన్నాయి. 

ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఈపీఏ, డీహెచ్‌ఏ ఒమేగా–3 ఆమ్లాలు అధికంగా ఉన్నాయి. 100 గ్రాముల పులసలో సోడియం 83 మి.గ్రా., పొటాషియం 1,187 మి.గ్రా., క్యాల్షియం 166 మి.గ్రా., పాస్ఫరస్‌ 1,151 మి.గ్రా., ఐరన్‌ అధికంగా 32.5 మి.గ్రా. ఉన్నట్టు గుర్తించారు. రివర్‌ మౌత్‌ వద్ద లభించే ఇలస చేపల్లో కొవ్వు శాతం అత్యధికంగా 17 శాతం ఉన్నట్టు గుర్తించారు. 

ఇలస నుంచి పులసగా మారే సమయంలో దీని పోషకాలలో వ్యత్యాసం, మార్పులు స్పష్టంగా తెలుస్తున్నాయి. గుడ్లు పెట్టడానికి, పిల్లలుగా మారడానికి అవసరమైన విధంగా తన శరీరాన్ని, పోషకాలను మార్పు చేసుకోవడం ఈ చేపల విశేషం. ఉప్పు నీటి నుంచి మంచి నీటికి వచ్చే సమయంలో తట్టుకోవడానికి సైతం ఇవి ఎంతో ఉపయుక్తంగా నిలుస్తాయి.

సీఐఎఫ్‌టీ అధ్యయనం ఏం చెబుతోందంటే..
సముద్రంలో పెరిగే చేపను ఇలస (హిల్సా) అని పిలుస్తారు. అవి వయ­సుకు వచ్చాక సముద్రంలో నుంచి, మంచినీటి నదిలోనికి ఎదు­రీదుతూ వెళ్తాయి. నదిలోనే గుడ్లు పెడతాయి. సముద్రపు నీటిలో ఇలసకు, మంచి నీటిలో పులసగా రూ­పాంతరం చెందిన చేపకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. 

తాము జన్మించిన స్థానానికే వచ్చి పులస మళ్లీ గుడ్లు పెడుతుందని సెంట్రల్‌ ఇన్‌స్టి­ట్యూట్‌ ఆఫ్‌ ఫిషరీస్‌ టెక్నాలజీ (సీఐ­ఎఫ్‌టీ) (central institute of fisheries technology) అధ్య­యనం చెబు­తోంది. జూన్, జూలై నెలల్లో రుతు­పవనాలు, వర్షాకాలం ప్రారంభం అయ్యే సమ­యంలో సముద్రంలోని ఇలసలు నదుల వైపు ప్ర­యా­ణం మొదలు­పెడతాయి. 

నదు­­ల్లోకి వీటి రాక నవంబర్‌ వరకు కొన­సాగుతుంది. వర్షం కురి­సిన సమయంలో నదు­ల్లోని బురద నీరు సముద్రంలో కలుస్తుంది. దీనిని గుర్తించి ఉప్పు­నీటి నుంచి మంచి­నీటి దిశగా ఇలస తన ప్రయా­ణం ప్రారంభిస్తుంది. వర్షం తగినంత లేక­పోతే వీటి వలస ఆగిపోతుంది.

పులస జాతిని సంరక్షించాలి
పులస జాతిని సంరక్షించుకోవా­ల్సిన అవసరం ఎంతో ఉంది. ప్రధా­న­ంగా నదులు కలు­షితం కాకుండా చూ­డాలి. అప్పుడే ఆరోగ్యకరమైన చేపలు లభిస్తాయి. ముఖ్యంగా ఇలస నుంచి పులసగా మారే మార్గంలో వాటి ప్రయాణానికి అవరోధాలు లేకుండా చూడటం ఎంతో అవస­రం. వీటిని పట్టుకోవడంలో ఒక నియమం అనేది లేదు. నదిలోకి వచ్చిన వాటిని వచ్చినట్టుగా పట్టేస్తూ ఉంటే పునరుత్పత్తి దెబ్బ­తింటుంది. 

అదేవిధంగా పుట్టిన పిల్లలు సముద్రంలోకి వెళుతున్నాయా లేదా అనే విషయం కూడా గమనించాల్సిన అవసరం ఉంది. గుడ్లు పెట్టిన పులస నదిలోనే ఉండిపోతోందా లేక సముద్రంలోకి తిరిగి వెళుతోందా అనే విషయాలను అధ్యయనం చేయాల్సి ఉంది.
– డాక్టర్‌ బి.మధుసూదనరావు, ప్రిన్సిపల్‌ సైంటిస్ట్, ఐసీఏఆర్‌–సీఐఎఫ్‌టీ, విశాఖపట్నం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement