కృష్ణా డెల్టాకు గోదావరి జలాల మళ్లింపుపై కేడబ్ల్యూడీటీ ముందు తేల్చిచెప్పిన ఏకే గోయల్
సాక్షి, అమరావతి: కృష్ణా డెల్టాకు గోదావరి నుంచి మళ్లించే 80 టీఎంసీలకుగాను.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు మిగిలే 45 టీఎంసీల కృష్ణా జలాలు ఆంధ్రప్రదేశ్‌కే దక్కుతాయని కేడబ్ల్యూడీటీ–2కు రాష్ట్ర ప్రభుత్వం తరఫు సాక్షి, కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) మాజీ డైరెక్టర్ అనిల్ కుమార్ (ఏకే) గోయల్ స్పష్టం చేశారు. విభజన చట్టం 11వ షెడ్యూలులోని ప్రాజెక్టులకు ఆ 45 టీఎంసీలను వినియోగించుకోవచ్చునని చెప్పారు.
జస్టిస్ బ్రిజేష్‌కుమార్ నేతృత్వంలోని కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్ (కేడబ్ల్యూడీటీ)–2 విచారణ శుక్రవారం కొనసాగింది. ఏపీ ప్రభుత్వం తరఫు సాక్షి ఏకే గోయల్‌ను తెలంగాణ ప్రభుత్వం తరఫు న్యాయవాదులు క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. కృష్ణా డెల్టాకు గోదావరి నుంచి 80 టీఎంసీలను మళ్లిస్తున్నందున నాగార్జున సాగర్ నుంచి ఆ మేరకు కృష్ణా డెల్టాకు విడుదల చేసే నీటిని తగ్గించుకోవచ్చు కదా అంటూ తెలంగాణ న్యాయవాది అడిగిన ప్రశ్నలకు తగ్గించుకోవచ్చునని గోయల్ చెప్పారు.
కృష్ణా డెల్టాకు గోదావరి జలాలను మళ్లించిన సంవత్సరంలో మాత్రమే.. సాగర్ నుంచి విడుదల చేసే నీటిని తగ్గించుకోవచ్చునని చెప్పారు. గోదావరి జలాలను కృష్ణా డెల్టాకు మళ్లించే ఒప్పందం 1978 ఆగస్టు 4న ఉమ్మడి రాష్ట్రంలోనే బేసిన్‌లోని రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య జరిగిందన్నారు. గోదావరి జలాలను మళ్లించే ప్రాంతం, మళ్లించిన జలాలను వినియోగించుకునే ప్రదేశం రెండూ ఆంధ్రప్రదేశ్‌లోనే ఉన్నందున.. మళ్లించిన గోదావరి జలాలకుగానూ కృష్ణా జలాల్లో అదనంగా దక్కే 45 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్‌కే దక్కాలని తేల్చిచెప్పారు.
గోదావరి నుంచి 80 టీఎంసీలను మళ్లిస్తే.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కృష్ణా బేసిన్‌లో 45 టీఎంసీల లభ్యత అదనంగా ఉందన్నది వాస్తవమేనా అని తెలంగాణ న్యాయవాది ప్రశ్నించగా.. ఆ అంశాన్ని ట్రిబ్యునల్ తేల్చాలని గోయల్ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం 11వ షెడ్యూలులో ఏఎమ్మార్పీ (ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు), ఎస్సెల్బీసీ (శ్రీశైలం ఎడమ గట్టు కాలువ)లను గుర్తించలేదని తెలిపారు. ఎస్సెల్బీసీ పూర్తయ్యేంత వరకూ ఏఎమ్మార్పీ ద్వారా నీటిని వాడుకోవచ్చునని, ఎస్సెల్బీసీ పూర్తయిన తర్వాత శ్రీశైలం ప్రాజెక్టు జల విస్తరణ ప్రాంతం నుంచి గ్రావిటీ ద్వారా నీటిని తరలించాలనే ప్రతిపాదన ఉందని చెప్పారు.
మీరు రూపొందించిన ప్రాజెక్టుల నిర్వహణ నియమావళిలో విభజన చట్టంలో 11వ షెడ్యూలులోని ప్రాజెక్టులను చేర్చారని, కానీ నెట్టెంపాడు ఎత్తిపోతలను ఎందుకు చేర్చలేదని తెలంగాణ న్యాయవాది అడగ్గా.. ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, సాగర్‌కు మాత్రమే ఆ నియమావళిని రూపొందించానని గోయల్ చెప్పారు.
జూరాల ప్రాజెక్టు నుంచి మిగులు జలాలను నెట్టెంపాడు ఎత్తిపోతల ద్వారా తరలిస్తారని ఎత్తిచూపారు. సాక్షిగా మీరు స్వతంత్రంగా వాంగ్మూలం ఇస్తున్నట్లు లేదని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తరఫు సాక్షిగా పూర్తిగా అవాస్తవాలు చెబుతున్నారు కదా అన్న తెలంగాణ న్యాయవాది వాదనను గోయల్ తోసిపుచ్చారు.
ముగిసిన సాక్షుల విచారణ
ఏపీ ప్రభుత్వం తరఫు సాక్షిని తెలంగాణ ప్రభుత్వ న్యాయవాదుల క్రాస్ ఎగ్జామినేషన్, మౌఖిక వాంగ్మూలం ముగిసినట్లు ట్రిబ్యునల్ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఈనెల 2న దాఖలు చేసిన ఇంటర్‌లొకేటరీ అప్లికేషన్ (ఐఏ)పై కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇందుకు రెండు వారాల గడువు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తికి అంగీకరించింది. తదుపరి విచారణను జనవరి 16, 17కు వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment