AK Goyal
-
ఆ 45 టీఎంసీలూ ఏపీవే
సాక్షి, అమరావతి: కృష్ణా డెల్టాకు గోదావరి నుంచి మళ్లించే 80 టీఎంసీలకుగాను.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు మిగిలే 45 టీఎంసీల కృష్ణా జలాలు ఆంధ్రప్రదేశ్‌కే దక్కుతాయని కేడబ్ల్యూడీటీ–2కు రాష్ట్ర ప్రభుత్వం తరఫు సాక్షి, కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) మాజీ డైరెక్టర్ అనిల్ కుమార్ (ఏకే) గోయల్ స్పష్టం చేశారు. విభజన చట్టం 11వ షెడ్యూలులోని ప్రాజెక్టులకు ఆ 45 టీఎంసీలను వినియోగించుకోవచ్చునని చెప్పారు. జస్టిస్ బ్రిజేష్‌కుమార్ నేతృత్వంలోని కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్ (కేడబ్ల్యూడీటీ)–2 విచారణ శుక్రవారం కొనసాగింది. ఏపీ ప్రభుత్వం తరఫు సాక్షి ఏకే గోయల్‌ను తెలంగాణ ప్రభుత్వం తరఫు న్యాయవాదులు క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. కృష్ణా డెల్టాకు గోదావరి నుంచి 80 టీఎంసీలను మళ్లిస్తున్నందున నాగార్జున సాగర్ నుంచి ఆ మేరకు కృష్ణా డెల్టాకు విడుదల చేసే నీటిని తగ్గించుకోవచ్చు కదా అంటూ తెలంగాణ న్యాయవాది అడిగిన ప్రశ్నలకు తగ్గించుకోవచ్చునని గోయల్ చెప్పారు. కృష్ణా డెల్టాకు గోదావరి జలాలను మళ్లించిన సంవత్సరంలో మాత్రమే.. సాగర్ నుంచి విడుదల చేసే నీటిని తగ్గించుకోవచ్చునని చెప్పారు. గోదావరి జలాలను కృష్ణా డెల్టాకు మళ్లించే ఒప్పందం 1978 ఆగస్టు 4న ఉమ్మడి రాష్ట్రంలోనే బేసిన్‌లోని రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య జరిగిందన్నారు. గోదావరి జలాలను మళ్లించే ప్రాంతం, మళ్లించిన జలాలను వినియోగించుకునే ప్రదేశం రెండూ ఆంధ్రప్రదేశ్‌లోనే ఉన్నందున.. మళ్లించిన గోదావరి జలాలకుగానూ కృష్ణా జలాల్లో అదనంగా దక్కే 45 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్‌కే దక్కాలని తేల్చిచెప్పారు. గోదావరి నుంచి 80 టీఎంసీలను మళ్లిస్తే.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కృష్ణా బేసిన్లో 45 టీఎంసీల లభ్యత అదనంగా ఉందన్నది వాస్తవమేనా అని తెలంగాణ న్యాయవాది ప్రశ్నించగా.. ఆ అంశాన్ని ట్రిబ్యునల్ తేల్చాలని గోయల్ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం 11వ షెడ్యూలులో ఏఎమ్మార్పీ (ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు), ఎస్సెల్బీసీ (శ్రీశైలం ఎడమ గట్టు కాలువ)లను గుర్తించలేదని తెలిపారు. ఎస్సెల్బీసీ పూర్తయ్యేంత వరకూ ఏఎమ్మార్పీ ద్వారా నీటిని వాడుకోవచ్చునని, ఎస్సెల్బీసీ పూర్తయిన తర్వాత శ్రీశైలం ప్రాజెక్టు జల విస్తరణ ప్రాంతం నుంచి గ్రావిటీ ద్వారా నీటిని తరలించాలనే ప్రతిపాదన ఉందని చెప్పారు.మీరు రూపొందించిన ప్రాజెక్టుల నిర్వహణ నియమావళిలో విభజన చట్టంలో 11వ షెడ్యూలులోని ప్రాజెక్టులను చేర్చారని, కానీ నెట్టెంపాడు ఎత్తిపోతలను ఎందుకు చేర్చలేదని తెలంగాణ న్యాయవాది అడగ్గా.. ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, సాగర్‌కు మాత్రమే ఆ నియమావళిని రూపొందించానని గోయల్ చెప్పారు. జూరాల ప్రాజెక్టు నుంచి మిగులు జలాలను నెట్టెంపాడు ఎత్తిపోతల ద్వారా తరలిస్తారని ఎత్తిచూపారు. సాక్షిగా మీరు స్వతంత్రంగా వాంగ్మూలం ఇస్తున్నట్లు లేదని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తరఫు సాక్షిగా పూర్తిగా అవాస్తవాలు చెబుతున్నారు కదా అన్న తెలంగాణ న్యాయవాది వాదనను గోయల్ తోసిపుచ్చారు.ముగిసిన సాక్షుల విచారణఏపీ ప్రభుత్వం తరఫు సాక్షిని తెలంగాణ ప్రభుత్వ న్యాయవాదుల క్రాస్ ఎగ్జామినేషన్, మౌఖిక వాంగ్మూలం ముగిసినట్లు ట్రిబ్యునల్ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఈనెల 2న దాఖలు చేసిన ఇంటర్‌లొకేటరీ అప్లికేషన్ (ఐఏ)పై కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇందుకు రెండు వారాల గడువు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తికి అంగీకరించింది. తదుపరి విచారణను జనవరి 16, 17కు వాయిదా వేసింది. -
పోలవరంలో పర్యావరణ పర్యవేక్షణకు కమిటీ
సాక్షి, న్యూఢిల్లీ: పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా పర్యావరణ పర్యవేక్షణకు హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో కమిటీ నియమిస్తామని జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) పేర్కొంది. విశ్రాంత న్యాయమూర్తి ఎవరనేది ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఎన్జీటీ చైర్పర్సన్ జస్టిస్ ఏకే గోయెల్ తెలిపారు. పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో డంపింగ్ యార్డ్‌పై పెంటపాటి పుల్లారావు దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ గోయెల్ నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం విచారించింది. 2015 నుంచి పలు దఫాలుగా పర్యావరణ ఉల్లంఘనలపై కేసులు వేసినా సమస్య పరిష్కారం కాలేదని పిటిషనర్ తరఫు న్యాయవాది శ్రావణ్‌కుమార్ తెలిపారు. 2016లో అదనపు భూసేకరణ జరిపి పర్యావరణ అనుమతులు లేకుండా, డంపింగ్ వల్ల తలెత్తే ప్రభావాల్ని అధ్యయనం చేయకుండా ప్రాజెక్టు వ్యర్థాలను డంపింగ్ చేయడం ప్రారంభించారని తెలిపారు. అనాలోచిత డంపింగ్ వల్ల 2018, 2019 ఫిబ్రవరిలో భూప్రకంపనలు రావడంతోపాటు ప్రాజెక్టు సమీపంలో రహదారులు పగుళ్లు వచ్చాయని తెలిపారు. కాఫర్ డ్యాం నిర్మాణంలో జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల ఎగువ ప్రాంతాలు భారీగా మునిగి ప్రజలు నష్టపోయారని తెలిపారు. కమిటీలు పలు సూచనలు చేసినా అమలు చేయలేదన్నారు. పర్యావరణ ఉల్లంఘనలపై కేసు వేసినందుకు పిటిషనర్, కుటుంబ సభ్యులకు పరిహారం ఇవ్వలేదని తెలిపారు. పర్యావరణ ప్రభావంపై ప్రాజెక్టు నిర్మాణ తొలి దశ నుంచే అంచనా చేయాలి కానీ సమస్యలు ఉత్పన్నమయ్యాక కాదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. పిటిషనర్‌కు పరిహారం అందజేయాలని ధర్మాసనం పేర్కొంది. ప్రాజెక్టు పనులు చేపట్టడానికి ముందే ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని తర్వాత బాధ్యత ఇతరులపై వేయడం సరికాదని విషయ నిపుణుడు నాగిన్‌నందా వ్యాఖ్యానించారు. పర్యావరణ పర్యవేక్షణ కమిటీలో ఐఐటీ ఢిల్లీ, ఐఐటీ హైదరాబాద్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సాయిల్ రీసెర్చ్ సహా పలువురు నిపుణులు ఉంటారని ధర్మాసనం పేర్కొంది. కమిటీకి అవసరమైన సహకారాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందించాలని సూచించింది. ఏపీ కాలుష్య నియంత్రణ మండలి అందించిన నివేదికను పరిగణనలోకి తీసుకుంటున్నట్లు ధర్మాసనం తెలిపింది. పూర్తి లిఖిత పూర్వక ఆదేశాలు బుధవారం వెలువడనున్నాయి. -
వందకోట్ల భారీ జరిమానా విధించిన ఎన్జీటీ..!
సిమ్లా: అక్రమ మైనింగ్‌ను ఆపలేకపోయిన కారణంగా మేఘాలయ ప్రభుత్వానికి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) భారీ జరిమానా విధించింది. ప్రభుత్వానికి 100 కోట్లు జరిమాన విధిస్తున్నట్లు సంస్థ చైర్మన్ ఏకే గోయల్ శనివారం తీర్పును వెలువరించారు. నిబంధనలకు విరుద్ధంగా లైసెన్స్ లేకుండా మైనింగ్‌ను నిర్వహిస్తున్న కంపెనీలకు రద్దు చేయాలని 2014లో ఎన్జీటీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అనంతరం రాష్ట్రంలోని మైనింగ్ పరిశీలనకు పర్యటించిన కమిటీ ఈఏడాది జనవరి 2న ఎన్జీటీకి నివేదికను అందించింది. రాష్ట్రంలో 24వేలకు పైగా అక్రమ మైనింగ్ కంపెనీలు ఉన్నట్లు కమిటీ గుర్తించింది. అక్రమ మైనింగ్ కారణంగా నీరు, గాలి, వాతావరణం కాలుష్యానికి గురువుతోందని తీర్పులో పేర్కొన్నారు. రెండు నెలల్లోగా కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు (సీపీసీబీ) వద్ద రూ.100 కోట్లు జమ చేయాలని గోయల్ ఆదేశించారు. మేఘాలయలోని బొగ్గు గనుల్లో ఇటీవల 15 మంది కార్మికులు చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. దట్టమైన చెట్లు ఉన్న కొండపై ఎలుక బొరియల్లా ఉండే గనుల్లో అక్రమంగా బొగ్గు తవ్వేందుకు కూలీలు లోపలికి వెళ్లారు. పక్కనే ప్రవహిస్తున్న లిటిల్ నది నీరు గనిలోకి ముంచెత్తడంతో కార్మికులు అందులోనే చిక్కుకుపోయారు. కొందరు ప్రాణాలతో బయటపడ్డారు. చిక్కుకుపోయిన వారిని కాపాడేందుకు ఎన్డీఆర్ఎఫ్, వైమానిక దళం, అగ్నిమాపక దళం రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపడుతున్నారు. ఘటన జరిగి రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు కార్మికుల ఆచూకి ఇప్పటివరకు దొరకటేదు. -
ఈ–లెర్నింగ్‌లో తెలంగాణ నంబర్ వన్
సాక్షి, హైదరాబాద్ : ‘ఈ లెర్నింగ్ శిక్షణలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ముందుంద’ని ప్రభుత్వ సలహాదారు ఏకే గోయల్ తెలిపారు. మర్రి చెన్నారెడ్డి మానవ అభివృద్ధి సంస్థ (ఎంసీఆర్ హెచ్ఆర్డీ) సోమవారం నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గోయల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ లెర్నింగ్ శిక్షణలో తెలంగాణ రాష్ట్రం మిగతా 28 రాష్ట్రాల కంటే ముందుండే విధంగా ఎంసీఆర్ హెచ్ఆర్డీ సంస్థ కృషి చేస్తోందని పేర్కొన్నారు. ఆ సంస్థ ప్రధాన కార్యదర్శి బి.పి.ఆచార్య మాట్లాడుతూ.. ‘ఇప్పటి వరకు 16,510 మందికి శిక్షణ ఇచ్చాం. మరో 60 వేల మందికి శిక్షణ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం. విద్యార్థులకు సమయ పాలన , నాయకత్వ లక్షణాలు, కమ్యూనికేషన్‌పై శిక్షణ ఇస్తూ, బంగారు తెలంగాణలో అందరూ భాగస్వాములు అయ్యేలా తయారు చేస్తున్నాం’అని చెప్పారు. -
మిషన్ కాకతీయతో విప్లవాత్మక మార్పు: గోయల్
సాక్షి, హైదరాబాద్: మిషన్ కాకతీయ పథకం నీటి వనరుల ఉపయోగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ఏకే గోయల్ వెల్లడించారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల అధికారులకు రీఓరియెంటేషన్, కెపాసిటీ బిల్డింగ్ అనే అంశంపై శుక్రవారం హెచ్ఆర్డీలో ఏర్పాటు చేసిన ఒక రోజు శిక్షణ కార్యక్రమాన్ని ఆయన జ్యోతి వెలిగించి ప్రారంభించారు. కొత్త జిల్లాలకు అనుగుణంగా ఉద్యోగుల అవసరాలకు తగిన శిక్షణ కార్యక్రమాలు, అందుకు సంబంధించిన క్యాలెండర్‌ను రూపొందిస్తామని ప్రణాళిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఎంసీహెచ్ఆర్డీ డైరెక్టర్ జనరల్ బీపీ ఆచార్య వెల్లడించారు. స్వచ్ఛ హైదరాబాద్ ద్వారా నగరాన్ని విశ్వనగరంగా మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని జీహెచ్ఎంసీ కమిషనర్ బి.జనార్దన్‌రెడ్డి వివరించారు. రాష్ట్ర ఆర్థికాభివృద్ధిలో హైదరాబాద్ కీలక పాత్ర వహించేలా ఉద్యోగులు తమ బాధ్యతలు నిర్వర్తించాలని, శిక్షణ తరగతులు అందుకు ఉపకరిస్తాయని జిల్లా కలెక్టర్ రాహుల్‌బొజ్జా అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలోని పరిణామాలకు అనుగుణంగా ఉద్యోగులు తమ నైపుణ్యాలను ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకోవాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ రఘునందన్‌రావు సూచించారు. ప్రభుత్వ ప్రాధాన్య కార్యక్రమాలను ప్రజలకు చేరవేసేందుకు ఈ కార్యక్రమాలు దోహదపడాలని ఆకాంక్షించారు.