pulasa fish
-
గోదావరి నదిలో కనిపించని పులస చేపలు
-
అప్పుచేసి పులస పులుసు
-
వలలెన్ని వేసినా.. పులస జాడ లేదు
సాక్షి ప్రతినిధి, కాకినాడ: గోదావరిలో సీజనల్‌గా దొరికే పులసలు ఈ ఏడాది జాడ లేకుండా పోయాయి. గోదావరికి వరదలు రావడంతోనే వలస వచ్చే పులసల సీజన్ ప్రారంభమవుతుంది. ఏటా గోదావరికి జూలై నుంచి సెప్టెంబర్ వరకు వరద ప్రవాహం వస్తుంది. సాధారణంగా ఆగస్టు నెలలో వరదలు ఎక్కువ వస్తాయి. ఈ ఏడాది జూలైలోనే వరదలు వచ్చి వెళ్లిపోయాయి. వరదల సమయంలో సముద్రం నుంచి గోదావరిలోకి ఎదురీదుతూ పునరుత్పత్తి కోసం గుంపులు గుంపులుగా పులసలు వస్తుంటాయి. కానీ.. ఈ సీజన్లో పులసలు మొహం చాటేశాయి. గోదావరి తీరంలో అక్కడక్కడా ఒకటి, రెండు పులసలు వలలో పడ్డా వేలకు వేలు పెట్టి పులస ప్రియులు ఎగరేసుకుపోతున్నారు. ‘క్వీన్ ఆఫ్ ఫిష్’గా పేరు గోదావరిలో లభించే పులస ‘క్వీన్ ఆఫ్ ఫిష్’ గా ప్రపంచంలోనే పేరుంది. 2015 గణాంకాల ప్రకారం ప్రపంచంలో హిల్షా ఉత్పత్తిలో 50–60 శాతంతో బంగ్లాదేశ్ మొదటి స్థానంలో ఉండగా.. మయన్మార్ 20–25 శాతంతో రెండో స్థానంలోను, 15–20 శాతంతో మన దేశం మూడో స్థానంలో ఉన్నాయి. గోదావరిలో పుట్టిన పులస పిల్లలే సముద్రంలోకి వెళ్లి ఇలసలుగా వృద్ధి చెందుతాయి. సముద్రంలో ఉండే ఇలస రుచిగా ఉండకపోవడానికి అవి కొవ్వుతో ఉండటమే కారణం. ఏటా వరదల సమయంలో సముద్రంలోని ఇలసలు పునరుత్పత్తి కోసం సముద్రంలో 11వేల నాటికల్స్ ప్రయాణించి గోదావరిలోకి ఎదురీదుతాయి. ఇలా ఎదురీత ప్రయాణం వల్ల పులసలో ఉండే కొవ్వు కరిగిపోయి ఎరుపు, గోధుమ రంగులోకి మారి పోషకాలు కలిగిన కొత్త శక్తితో స్మార్ట్‌గా మారుతుంది. కొన్ని రోజులు గోదావరిలోనే ఉండి గుడ్లు పెట్టి తిరిగి సముద్రంలోకి వెళ్లిపోతుంటుంది. ఇలా గోదావరిలోకి వచ్చిన పులసల్ని ఇష్టపడని మాంసాహార ప్రియులు ఉండరు. అర కేజీ దొరకడమే గగనం పులస గతంలో కేజీ నుంచి మూడు కేజీలు వరకు లభించేవి. మూడు కేజీల బరువున్న పులసలు నాలుగైదు చిక్కాయంటే వేటకు వెళ్లిన మత్స్యకారుల పంట పండినట్టే. మూడు కేజీల తూకం ఉండే పులస రూ.20 వేల నుంచి రూ.25 వేలు పలికేది. ప్రస్తుత సీజన్లో అరకిలో పులస దొరకడమే గగనమైపోతోంది. ఆ అరకిలో పులసే ఐదారువేలు పలుకుతోంది. గోదావరి జిల్లాల్లో యా నాం, ఎదుర్లంక, ధవళేశ్వరం, రావు లపాలెం, సిద్ధాంతం, నరసాపురం తదితర తీర ప్రాంతాల్లో ఒకప్పుడు విరివిగా దొరికే పులసలు అరకొరగానే పడుతున్నాయి. సముద్ర ముఖద్వారాల వద్ద ఇసుక తిప్పలు పెరగడం, గోదావరిలోకి సల్ఫర్, అమ్మోనియా, లెడ్ తదితర కర్బనాలు కలిసిపోతుండటం, విచక్షణా రహితంగా సాగే వేట ఈ జాతి రాక తగ్గడానికి కారణంగా పేర్కొంటున్నారు. పులసలు సంతానోత్పత్తి జరిగే సమయంలో వేట సాగడం తగ్గిపోవడానికి మరో కారణం. పులసల మనుగడకు ‘సిఫ్రీ’ కృషి పులస చేప జాతిని పరిరక్షించే దిశగా కోల్‌కతాలోని సిఫ్రీ (సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్రెష్ వాటర్ రీసెర్చ్ ఇన్‌స్టిస్ట్యూట్) కృషి చేస్తోంది. పులస సీడ్‌ను వృద్ధి చేసి బంగాళాఖాతంలో విడిచిపెడుతోంది. ఈ ప్రయత్నం వల్లే ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరంలో పులసలు లభిస్తున్నాయంటున్నారు. కానీ.. గోదావరిలో లభించే పులసలకున్నంత రుచి ఆ ప్రాంతంలో పులసలకు ఉండదు. – చిట్టూరి గోపాలకృష్ణ, మత్స్య శాస్త్రవేత్త పులసల రాక తగ్గిపోతోంది పులసలు రాక క్రమంగా తగ్గిపోతోంది. గతంలో జూలై, ఆగస్టు నెలల్లో మాకు పండగలా ఉండేది. వందలాది పులసలు మా వలల్లో చిక్కేవి. అటువంటిది ఈ సీజన్లో పులసలు జాడ కనిపించడం లేదు. ఇప్పుడా పరిస్థితి కనిపించడం లేదు. – ముదే హరిచంద్ర, మత్స్యకారుడు, యానాం -
పులస వేటలో.. కాసుల పంట
నరసాపురం : వర్షాకాలంలో ఆగస్టు నెల వచ్చిందంటే చాలు గోదావరిలో పులసలు సందడి చేస్తుంటాయి. మత్స్యకారులు సంప్రదాయ పడవల్లో వాటి వేటలో బిజీగా ఉంటారు. అయితే ఈ ఏడాది గోదావరిలో పులసల జాడ ఆగస్టు నెల వచ్చినా కానరావడం లేదు. ప్రస్తుతం వరదల ఉధృతి తగ్గడంతో చేపల వేట సాగుతోంది. గోదావరిలో కేవలం ఎర్ర నీరు ఉన్నప్పుడు మాత్రమే లభ్యమయ్యే పులసల కోసం మత్స్యకారులు వేటను ముమ్మరం చేశారు. కొన్ని రోజులుగా అటు అంబేడ్కర్ కోనసీమ జిల్లా అంతర్వేది నుంచి ఇటు పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం నుంచి సిద్ధాంతం వరకూ గోదావరిలో పులసలు పట్టడం కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. పులసలకు ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా మంచి క్రేజ్ ఉంది. పుస్తెలమ్మయినా పులస తినాలనే నానుడి గోదావరి జిల్లాలో ఎప్పటి నుంచో ఉంది. ఎంత ధరైనా కొని తినాలని ఆరాటపడుతుంటారు. అంత డిమాండ్ ఉన్నందుకే వీటి ధరలు కూడా అంతే స్థాయిలో ఉంటాయి. పులసల సీజన్లో ఈ ప్రాంతం వారు వాటిని కొనుగోలు చేసి హైదరాబాద్, విశాఖపట్నం లాంటి దూర ప్రాంతాల్లోవున్న బంధువులు, స్నేహితులకు పంపుతుంటారు. పలువురు ముఖ్యమంత్రులు, ప్రజాప్రతినిధులు కూడా పులస రుచి చూసి ప్రశంసించారు. సముద్రంలో ఇలసగా పిలిచే చేప గోదావరిలోకి ఎర్రనీరు రాగానే ఈదుకుంటూ వస్తాయి. సముద్రంలో వందల మైళ్లు ప్రయాణించి.. ఎర్రనీటికి ఎదురు ప్రవహించి రావడం వీటి ప్రత్యేకత. గోదావరిలోకి రాగానే వీటి శరీరంలో కొన్ని మార్పులు చోటుచేసుకుంటాయి. దానిలో ఒమేగా ఫ్యాటీ ఆమ్లాలు శాతం పెరగడంతో మంచి రుచి వస్తుంది. నీటికి ఎదురు ప్రవహించే క్రమంలో రెండు మూడు రోజుల్లోనే ఇలస.. పులసగా మారుతుంది. మారిన ఇలస రుచి మంచి వాసనతో నోరూరిస్తుంది. పులస, ఇలస ఒకేలా ఉండడంతో వీటిని గుర్తించడం కొంచెం కష్టం. గోదావరిలో ఎర్రనీరు ఎప్పటి వరకూ ఉంటుందో అప్పటి వరకూ దొరికేవి మాత్రమే పులసలని, మిగతావన్నీ ఇలసలుగా భావించాలని చెబుతారు. పులసలు దొరికేది ఇక్కడే.. ప్రధానంగా నరసాపురం, సిద్ధాంతం, అంతర్వేది ప్రాంతాల్లో పులసలు ఎక్కువగా దొరుకుతాయి. ఈ ప్రాంతంలోనే పెద్ద సంఖ్యలో మత్స్యకారుల వలలకు చిక్కుతాయి. ఇటు సిద్ధాంతం వరకూ అలాగే తూర్పు గోదావరి జిల్లాలోని రాజోలు, గన్నవరం ప్రాంతాల వరకూ పులసల వేట ముమ్మరంగా సాగుతుంది. నరసాపురం, అంతర్వేది మార్కెట్‌ల్లోనూ రావులపాలెం, సిద్ధాంతం, చించినాడ వంతెనల వద్ద పులసల అమ్మకాలు సాగుతాయి. రంగపొల వలలకే పులస చిక్కేది సముద్రంలో వేట సాగించే పెద్ద బోట్ల కంటే చెక్కనావల్లోని వలలకే పులసలు చిక్కుతాయి. పులసల వేట కోసం చెక్కనావలపై మత్స్యకారులు ప్రత్యేక వలలను ఉంచుతారు. వీటిని ‘రంగపొల’ వలలుగా పిలుస్తారు. ఓ వంద వరకూ చెక్కనావల ద్వారా వేట సాగిస్తే ఓ పదిహేను, ఇరవై పడవలకు మాత్రమే పులసలు పడతాయని మత్స్యకారుడు రేవు అప్పారావు చెప్పారు. పెద్ద బోట్ల వలలకు పరిమిత సంఖ్యలోనే పులసలు లభిస్తాయి. పులసలు తెల్లవారుజాము ప్రాంతంలో ఎక్కువగా పడతాయి. దీంతో మత్స్యకారులు అర్ధరాత్రి నుంచి వేట సాగిస్తారు. వేల నుంచి రూ. లక్షల్లో ధర పులసలు అరకిలో నుంచి రెండు కిలోల వరకూ బరువుంటాయి. సైజును బట్టి వీటి ధర లక్షల వరకూ వెళ్లిన సందర్బాలు కూడా ఉన్నాయి. నగరాల్లో పులసలకు డిమాండ్ ఉన్నా ఎగుమతులకు ఆస్కారం లేదు. తక్కువ సంఖ్యలో పులసలు దొరకడమే అందుకు కారణం. అర్ధరాత్రి వేటకు వెళ్తాం ఈ సీజన్లో పులసలు పడతాయి. ఒక్క పులస దొరికినా మాకు రెండు, మూడు నెలలకు సరిపడా డబ్బులు వస్తాయి. మా చెక్క బోట్లకే పులసలు ఎక్కువగా పడతాయి. అందుకే అర్ధరాత్రి గోదావరిలోకి వెళ్ళి ఉదయం వరకూ వేటాడతాం. – మోకా సత్యనారాయణ, మత్స్యకారుడు రంగపొల వలలకే చిక్కుతాయి మా పెద్ద బోటు వలలకు పులసలు పెద్దగా పడవు. చిన్నగా వుండే రంగపొల వలలకే పులసలు చిక్కుతాయి. ఎర్రనీటిలో దొరికేవి మాత్రమే పులసలు. ఇతర రాష్ట్రాల నుంచి పులసలను పోలిఉండే చేపలు పట్టుకొచ్చి అమ్మేస్తున్నారు. – తిరుమాని గంగయ్య, మత్స్యకారుడు -
Pulasa Fish: పేరు పులస.. అమ్మేది విలస
ఆత్రేయపురం: పులస సీజన్ వచ్చేసింది. నకిలీ పులసలు కూడా మార్కెట్లోకి వచ్చాయి. అంటే విలస అన్నమాట. చూసేందుకు పులస, విలస ఒకే రకంగా ఉంటాయి. రుచిలో భారీ తేడా ఉంటుంది. అంతేకాదు. ధరలో కూడా తేడా ఉంటుంది. పులస కేజీ చేప రూ.5 వేల నుంచి రూ.10 వేల వర ధర పలుకుతూండగా నకిలీ పులసను కూడా అదే ధరకు విక్రయిస్తూ పలువురు మోసం చేస్తున్నారు. జూలై, ఆగస్టు నెలల్లో గోదావరికి భారీగా వరద వస్తుంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు ఉపనదులు తోడుగా గోదావరి పోటెత్తుతుంది. నది ఉధృతంగా ప్రవహించి తిరిగి నీటిమట్టం తగ్గుతున్న సమయంలో సముద్రం నుంచి విలసలు గోదావరి నీటిలోకి ఎదురీదుతూ వస్తాయి. ఆ విధంగా కేంద్ర పాలిత ప్రాంతం యానాం సమీపాన సముద్రం నుంచి గోదావరిలోకి ఎదురు ప్రయాణం ప్రారంభించిన విలసలు సుమారు 40 కిలోమీటర్ల మేర గోదావరిలో ఎదురీత పూర్తయ్యే సరికి పులసలుగా రూపాంతరం చెందుతాయని మత్స్యకారులు అంటారు. ఆ పులసలు కొత్తపేట నియోజకవర్గంలో కొత్తపేట, ఆత్రేయపురం, రావులపాలెం, ఆలమూరు మండల గ్రామాలైన ఆత్రేయపురం, బొబ్బర్లంక, పేరవరం, రాజవరం, మెర్లపాలెం, చొప్పెల్ల, రావులపాలెం తదితర ప్రాంతాల్లో పులస దొరుకుతుంది. కానీ విలస చేప మాత్రం సముద్రంలోనే దొరుకుతుంది. దీని ధర కేవలం రూ.200 నుంచి రూ.500 లోపే ఉంటుంది. ఒడిశా, ముంబై, విశాఖ తదితర సముద్ర తీర ప్రాంతాల్లో వీటిని పట్టి ఐస్ బాక్సుల్లో నిల్వ చేసి గోదావరి ప్రాంతాలకు ఈ సీజన్లో తరలించి పులస పేరుతో 10 రెట్లు ఎక్కువ ధరకు విక్రయించి మత్స్య ప్రియులను మోసం చేస్తున్నారు. పుస్తెలు అమ్మి అయినా ఏడాదికి ఒక్కసారి పులస కూర తినాలనే నానుడి ఉన్న కోనసీమ వాసులు ఎంత ధరయినా వెనకాడకుండా పులసలు కొని తృప్తిగా ఆరగిస్తున్నారు. అయితే ఈ పులసలు గోదావరిలో ఎర్ర నీరు ఉన్నంత వరకూ మాత్రమే దొరికే అవకాశం ఉండటంతో నకిలీ పులసలను తెచ్చి కొందరు వ్యాపారం చేస్తున్నారు. కొత్తగా పులస చేపల కొనుగోలుకు వస్తున్న వారు విలస బారిన పడి మోసపోతున్నారు. ఇంతకీ పులసకు, విలసకు తేడా గమనిస్తే.. పులస చేప నిగనిగలాడుతూ ఉంటుంది. ఎటువంటి రంగూ లేకుండా పూర్తి తెలుపు రంగులో ఉంటుంది. చల్లదనం అసలే ఉండదు. చేప మొత్తం జిగురుగా అంటే పట్టుకుంటే జారిపోయేలా ఉంటుంది. కేవలం గోదావరి బ్యారేజీల వద్ద లేదా పరీవాహక ప్రాంతంలో మాత్రమే పులస చిక్కుతుంది. విలసగా ఉన్న చేప సముద్రం నుంచి 40 లేదా 50 కిలోమీటర్లు గోదావరికి ఎదురీదుతూ వచ్చి పులసగా మార్పు చెందుతుంది. వీటిని వండిన తరువాత వారం రోజులైనా కూర రుచిగానే ఉంటుంది. విలస (నకిలీ పులస) చేపకు నిగారింపు ఉండదు. ఎరుపు, పసుపు రంగుల్లో ఉంటుంది. చల్లగా ఉంటుంది. ఎందుకంటే ఐస్ బాక్స్‌ల్లో నిల్వ చేస్తారు. చేప పట్టుకుంటే పెద్ద జిగురుగా ఉండదు. ఎక్కడబడితే అక్కడ వీటిని విక్రయిస్తూ ఉంటారు. కేవలం సముద్రంలో మాత్రమే ఇవి దొరుకుతాయి. అక్కడ నుంచి ఐస్ బాక్సుల్లో నిల్వచేసి పులసలు అమ్మే ప్రాంతానికి తరలించి పులస ధరకే వీటిని విక్రయిస్తుంటారు. వీటిని వండిన మరుసటి రోజుకే కూర రుచి తగ్గుతుంది. చేప ప్రియులను మోసం చేస్తున్నారు సముద్రంలో పుట్టిన విలసను గోదావరి జిల్లాలకు తీసుకువచ్చి పులస పేరుతో మత్స్య ప్రియులను మోసం చేస్తున్నారు. పులస కేవలం సముద్రంలోనే పుడుతుంది. అది 20 నుంచి 40 కిలోమీటర్ల మేర గోదావరిలో ఎదురీదిన తరువాత పులసగా మారుతుంది. ఐస్ బాక్సుల్లో విలసను తెచ్చి మత్స్యప్రియులను మోసం చేస్తున్నారు. దాని వల్ల మాలాంటి జాలర్లు నష్టపోతున్నాం. – లంకె వెంకటకృష్ణ, మత్స్యకారుడు, ఆత్రేయపురం -
యాండే.. పులసొచ్చిందండీ.. ఓ చూపు చూడండే! (ఫొటోలు)
-
ఈ సీజన్లో వలలో పడ్డ ఫస్ట్ పులస.. ధర ఎంతంటే..
-
పులస సీజన్ వచ్చేసింది.. రికార్డులు షురూ
సాక్షి, కాకినాడ: అత్యంత అరుదైన.. విలువైందిగా భావించే చేప ‘పులస’ సీజన్ మొదలైంది. యానాం గోదావరికి ఎర్ర నీరు పోటెత్తిన సమయంలోనే పులసలు లభ్యమవుతాయని తెలిసిందే. ఈ క్రమంలో మార్కెట్లోకి మొదటి చేప వచ్చి.. మాంచి రేటుకే అమ్ముడుపోయింది. తాజాగా కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో వేటకు వెళ్లిన మత్స్యకారులకు వారం తర్వాత మొట్టమొదటి పులస వలకి చిక్కిందట. రెండు కేజీల దాకా బరువు ఉన్న దీనిని రూ.15 వేల రూపాయలకు అమ్మినట్లు మహిళ చెబుతోంది. పులసల కోసం కాకినాడ, రాజమండ్రి నుంచే కాదు.. హైదరాబాద్ నుంచి కూడా జనం వస్తుంటారని సదరు మహిళ అంటోంది. దీంతో ఈ ఏడాది పులస గరిష్టంగా ఏ రేటుకు అమ్ముడుపోతుందో అనే ఆసక్తి నెలకొంది. గోదావరి జిల్లాల్లో ‘పుస్తెలు అమ్మినా సరే.. పులస తినాలి’ అని నానుడి. పులస చేప దొరకడమే చాలా అరుదు.. అందుకే జీవితంలో ఒక్కసారైనా పులస చేపను తినాలని భావిస్తుంటారు. నదీ ప్రవాహానికి అతివేగంగా ఎదురీదడం ఈ చేప ప్రత్యేకత. దీంతో ఎంత రేటైనా కొనుగోలు చేసేందుకు జనం వెనుకాడరు. పులసలు.. గోదావరి నదిలో మాత్రమే లభిస్తుంటాయి. ఇదే చేప సముద్రంలో దొరికితే దానిని ‘వలస చేప’ అంటారు. సంతానోత్పత్తి కోసం ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, టాంజానియా వంటి సుదూర ప్రాంతాల నుంచి ఖండాలను దాటి హిందూ మహాసముద్రం మీదుగా ప్రయాణించి అవి బంగాళాఖాతంలో ప్రవేశిస్తాయి. గోదావరి నుంచి వరద నీరు వచ్చి అంతర్వేది వద్ద సముద్రంలో కలిసే సమయంలో గుడ్లు పెట్టడం కోసం గోదావరిలోకి ఎదురీదుకుంటూ ప్రవేశిస్తాయి. ఇదంతా జూన్ నుంచి ఆగస్టు మాసాల మధ్య జరుగుతుంది. గుడ్లు పెట్టిన తరువాత మళ్లీ అక్టోబరు నాటికి సముద్రంలో ప్రవేశిస్తాయి. గోదావరి వరదనీటిలో సంతానోత్పత్తికి గుడ్లు పొదగడానికి వచ్చి వలలో పడతాయి. వలలో పడిన వెంటనే చనిపోవడం, రెండురోజులైనా పాడవకుండా ఉండడం కూడా పులసల విశిష్టత. గోదావరి తీపి నీటిలోకి వచ్చేసరికి ఈ చేప రంగు, రుచీ మారి పులసగా మారుతోంది. అలాగని గోదావరి అంతటా ఈ పులసలుండవు. కేవలం ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి సముద్రంలో కలిసే మధ్యలోనే ఇవి దొరుకుతాయి. -
అమ్మ బాబోయ్ పులస.. అంత రేటా?
శ్రీకాకుళం: కేంద్రపాలిత ప్రాంతం యానంలో గౌతమీగోదావరిలో మంగళవారం మధ్యాహ్నం పులస చేప మత్స్యకారుల వలకు చిక్కింది. దీనిని స్ధానిక రాజీవ్ రివర్ బీచ్ వద్ద వేలం పాట వేశారు. వేలం పాటలో పులస రూ. 19,000 రేటు పలికింది. -
‘పులస’ ప్రియులకు ఈ ఏడాది నిరాశేనా?
ఏదీ ఆ రుచి? ఆ అమోఘమైన రుచి ఏమైనట్టు? అద్భుతమైన ఆ రుచి ఎటు పోయినట్టు? పుస్తెలు అమ్మైనా పులస తినాలంటారే.. అసలు ఈ ఏడాది పులసల జాడేది? అవి లేకుంటే జిహ్వ చాపల్యం తీరేదెలా? మైమరపించే ఆ రుచిపై మోజు తీరేదెలా? పులసమ్మా.. పులసమ్మా.. ఏమైతివే? ఎటు పోతివే? కాసింత కానరావే..! సాక్షిప్రతినిధి, కాకినాడ: గోదావరి వరద ఉధృతి పులసను ఓడించింది. లక్షలాది క్యూసెక్కుల ప్రవాహానికి ఎదురీదలేక పులస తలవంచింది. సముద్రంలో ఇలసలు గోదావరికి ఎదురీదుతూ పులసలుగా మారతాయి. జూలై – ఆగస్టు నెలల మధ్య పులసల సీజన్. ఆగస్టు వచ్చి మూడు వారాలు గడచినా గోదావరి తీరంలో పులసల జాడ లేదు. మత్స్యకారుల వలకు చిక్కడం లేదు. దీంతో పులసలంటే పడిచచ్చే మాంసాహార ప్రియులు ఉసూరుమంటున్నారు. పులసల సీజన్లో మూడొంతులు గోదావరికి వరదలతోనే గడిచిపోయింది. మునుపెన్నడూ లేని స్థాయిలో జూలైలో వరదలు గోదావరిని ముంచెత్తాయి. అదే వరద ఒరవడి ఆగస్టు ఒకటో తేదీ నుంచి ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. దీంతో సముద్రంలోని ఇలసలు గోదావరికి ఎదురీదలేక వెనక్కి పోతున్నాయని మత్స్యకారులు చెబుతున్నారు. గోదావరిలో ఆగస్టు 10 నుంచి మొదటి, రెండో ప్రమాద హెచ్చరికలు కొనసాగుతున్నాయి. వరద ఉధృతి తీవ్రంగా ఉండటమే పులసలు రాకపోవడానికి ప్రధాన కారణంగా చెబుతున్నారు. సముద్రంలో ఉండే ఇలస(హిల్స)చేప పునరుత్పత్తి కోసం ఎదురీదుతూ గోదావరికి వచ్చే సరికి పులస అవుతుంది. గోదావరి నుంచి సముద్రానికి వచ్చే నీటి ప్రవాహాన్ని తట్టుకుని ఈదుకుంటూ రావాలి. లక్షన్నర నుంచి మూడు లక్షల క్యుసెక్కులు స్థాయిలో గోదావరి నుంచి సముద్రానికి నీటి విడుదల ఉంటే.. సముద్రం వైపు నుంచి విలసలు గోదావరికి రాగలుగుతాయి. ఆగస్టులో వరదలు మొదటి పది రోజులు మూడు లక్షలు, అప్పటి నుంచి 20–8–2022 వరకు ఏ రోజూ 10 లక్షల క్యుసెక్కులకు తక్కువ కాకుండా మిగులు జలాల (వరద నీరు)ను సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. అలా రోజూ లక్షల క్యుసెక్కుల నీరు సముద్రానికి చేరుతుంటే.. ఆ నీటి ఉధృతిని తట్టుకుని విలసలు సముద్రం నుంచి గోదావరికి ఎదురీదలేకపోతున్నాయి. అలాగే గోదావరి, బంగాళాఖాతం కలిసే సీ మౌత్(నదీ ముఖద్వారం వద్ద)లు మొగలు పూడుకుపోవడం కూడా పులస రాకకు అడ్డుగా మారి ఉండొచ్చని మత్స్యశాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో విలసలు గోదావరి వైపు రాకుండా పశ్చిమ బెంగాల్, ఒడిశా వైపు తరలిపోతున్నాయి. ఆ రుచికి.. ఈ రుచికి అసలు పొంతనే లేదు గోదావరిలో పులసలు లభించకపోవడంతో ఒడిశా సముద్ర జలాల్లో లభిస్తున్న విలసలను గోదావరి జిల్లాలకు తెచ్చి జోరుగా విక్రయిస్తున్నారు. ఒడిశా నుంచి ఎదుర్లంక, యానాం, కోటిపల్లి తదితర ప్రాంతాలకు వ్యాన్లలో తీసుకొచ్చి మరీ అమ్ముతున్నారు. అరకిలో విలస రూ.1,000 నుంచి రూ.1,500 పలుకుతోంది. అంతగా రుచి లేకున్నా పులస ప్రియులు అలా సర్దుకుపోతున్నారు. గోదావరిలో లభించే పులస రుచికి, ఈ విలస రుచికి అసలు పొంతనే లేదంటున్నారు. గత సీజన్లో పులసలు ఒక్కోటి కిలో నుంచి నాలుగైదు కిలోల పరిమాణంలో లభించేవి. ధర రూ.10 వేలకు పైనే పలికేది. ఎదురీదలేక.. గోదావరికి ఉధృతంగా వరదలు రావడంతో పులసలు ఎదురీదలేకపోతున్నాయి. దీంతో గోదావరిలో పులసలు కానరావడం లేదు. ప్రస్తుతానికి ఒడిశాలో దొరికిన విలసలను అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాం. – నాటి పార్వతి, మత్స్యకార మహిళ, యానాం. విచక్షణ రహిత వేటతో పులసలకు ప్రమాదం విచక్షణ రహితంగా సాగుతున్న వేట కారణంగానే గోదావరిలో పులసల సంఖ్య నానాటికీ తగ్గిపోతుంది. గతంలో దాదాపు ఆరు కిలో మీటర్ల మేర మాత్రమే సముద్రంలో వేట సాగేది. ప్రస్తుతం ఆధునిక బోట్లు, వలల కారణంగా వంద కిలో మీటర్లు కూడా వేట సాగుతోంది. ఫలితంగా పలు రకాల చేపలు అంతరించిపోతున్నాయి. అందులో పులస జాతి కూడా ఉంది. – పీవీ కృష్ణారావు, అసిస్టెంట్ డైరెక్టర్, ఫిషరీస్, రాజమహేంద్రవరం -
PULASA FISH: రేటు ఎంతైనా.. రుచి చూడాల్సిందే!
పెనుగొండ: ప్రతి ఏటా జూలై నెల వస్తే గోదావరి పరివాహక ప్రాంతంలో పులసలు సందడి చేస్తుంటాయి. ఆస్ట్రేలియా తీర ప్రాంతం నుంచి బంగాళాఖాతంలోకి వచ్చి గోదావరి ఎర్రనీటిలో ప్రవేశించే పులసలంటే రాష్ట్ర వ్యాప్తంగా క్రేజ్.. పుస్తెలు అమ్మైనా పులస తినాలనే నానుడిని నిజం చేస్తూ ధరలోనూ అధరహో అనిపిస్తాయి. ఏడాదికి రెండు మూడు నెలలు మాత్రమే లభించే పులసలను వేలు ఖర్చు చేసి కొంటారు చేపల ప్రియులు. గోదావరికి వరద నీరు వచ్చినప్పటి నుంచి ఇంచుమించుగా జూలై నెలలో ప్రారంభమై సెప్టెంబర్ వరకూ పులసలు దొరుకుతుంటాయి. సిద్ధాంతం నుంచి ప్రారంభమై మల్లేశ్వరం, ఖండవల్లి, తీపర్రు, పెండ్యాల, గౌతమి నదిలో జొన్నాడ, ఆలమూరు, చెముడులంక, కేదారిలంక ప్రాంతాల్లో అధికంగా జాలర్లకు పులసలు చిక్కుతుంటాయి. సాధారణంగా బ్రతికి ఉన్న పులసలు దొరకడం కష్టం. వలకు చిక్కగానే పులసలు చనిపోతుంటాయి. గోదావరి తీరం జాతీయ రహదారిలో ఉండడంతో ఈ ప్రాంతంలో ఎక్కువగా అమ్మకాలు సాగిస్తుంటారు. వారం రోజులుగా అందుబాటులోకి.. గోదావరికి వరదనీరు పోటెత్తడంతో పులసలు దొరకడం ప్రారంభమయ్యాయి. అరకొరగా దొరుకుతున్న పులసల ధరలు అధికంగానే ఉన్నాయి. సామాన్య కుటుంబాలు పులస కొనాలంటే కష్టమే. కేజీ పులసలు రూ.2000 నుంచి రూ.6000 వరకూ అమ్ముతున్నారు. సాధారణంగా పులస దొరకాలంటే కష్టమైనే పనే. దీంతో ఇలసల్ని అమ్మేస్తుంటారు. తెలియని వారు వీటినే పులసలుగా భావించి కొంటుంటారు. గోదావరికి వరద నీరు ముందుగానే రావడంతో ఈ ఏడాది పులసలు ఎక్కువ కాలం దొరికే అవకాశం ఉందని జాలర్లు అంటున్నారు. ఇలసలనే పులసలుగా అమ్మకం ఒడిశా సముద్ర తీరంలో విరివిగా లభించే ఇలసలను తక్కువ ధరకు తీసుకొచ్చి పులసలుగా అమ్ముతుంటారు. వీటి మధ్య తేడాను గుర్తించడం కష్టసాధ్యం. నిజమైన పులస ఎర్రనీటి ప్రయాణం చేయడంతో.. శరీరంపై ఎర్రటి చాయలు వెండి రంగు ధగధగలు ఉంటాయి. ఇలసలు తెలుపుగా కనిపిస్తాయి. సంతానోత్పత్తి కోసం వచ్చి... ఆ్రస్టేలియా, థాయ్‌లాండ్ సముద్ర ప్రాంతాల్లో హిల్షా ఇలీషాగా పిలిచే ఈ చేప సంతానోత్పత్తి కోసం సుదూర ప్రాంతాల నుంచి ఈదుకొని బంగాళాఖాతం చేరుకుంటుంది. గోదావరి, సముద్రం కలిసే ప్రాంతానికి చేరుకొని ఎర్రనీటిలో ప్రయాణిస్తూ గుడ్లను పెడుతుంది. గోదావరి ఎర్రనీటిలో ప్రవేశించినప్పుడు పులసగా పిలుస్తారు. పులసలను ఉన్నతాధికారులకు, బాస్‌లకు గిఫ్ట్‌లుగా పంపుతారు. గోదావరి పరిసర ప్రాంతాల నుంచి ఇతర రాష్ట్రాలకు వీటిని పంపుతుంటారు. వండడం కూడా ప్రత్యేకమే పులస పులుసు తయారీ కూడా ప్రత్యేకమే. ఇతర చేపల్లాగా వండకూడదు. మట్టి కుండలో పులసను వండాలి. ముళ్లు అధికంగా ఉండడంతో ప్రత్యేకంగా వీటిని వండుతుంటారు. ముందుగా చేపముక్కలకు వెన్న, ఆముదం పూసి కొంత సమయం పాటు ఉంచి వీటిని పిడకలు, లేదా కట్టెల పొయ్యి పై తక్కువ మంటపై ఎక్కువ సమయం వండాలి. ఆవకాయ ఊట, వంకాయ, బెండకాయ వంటి వాటిని వేసి వండుతారు. మర్నాడు తింటే దీని రుచి అమోఘంగా ఉంటుందని చేప ప్రియుల చెబుతుంటారు. -
పులస.. తగ్గుతోంది వలస
సృష్టిలో ఏ జీవి అయినా సంతానోత్పత్తి కోసం పుట్టింటికే వెళుతుంది. సముద్ర జలాల్లో జీవించే ఇలసలు సైతం సంతానోత్పత్తి కోసం వేలాది కిలోమీటర్ల దూరం ప్రయాణించి తమ పుట్టినిల్లయిన గోదావరి నదిలోకి చేరుకుంటాయి. గోదావరి నీటిలోని తీపిని ఆస్వాదిస్తూ.. నదిలోనే సంతానాన్ని వృద్ధి చేస్తాయి. ఈ క్రమంలో వాటి శరీరంలో మార్పులు సంభవించి.. తెల్లటి ఇలసలు కాస్తా ఎరుపు, గోధుమ వర్ణాలను సంతరించుకుని పులసలుగా మారతాయి. సంతానోత్పత్తి అనంతరం తిరిగి సముద్రంలోకి చేరుకుని ఇలసలుగా రూపాంతరం చెందుతాయి. ఇలస.. పులస అవుతుందిక్కడ ఆస్ట్రేలియా, థాయ్‌లాండ్ వంటి దేశాల్లోని సముద్ర జలాల్లో జీవించే ఈ అరుదైన చేప సంతానోత్పత్తి కోసం హిందూ మహాసముద్రాన్ని దాటి బంగాళాఖాతంలోకి చేరుకుంటుంది. ఆయా ప్రాంతాల్లో దీనిని హిల్సా, హిల్సా హెర్రింగ్, ఇలిషా పేర్లతో పిలుస్తారు. మన ప్రాంతంలో మాత్రం సముద్ర జలాల్లో ఉన్నప్పుడు వీటిని ఇలస అంటారు. వేల కిలోమీటర్ల దూరాన్ని ఈదుకుంటూ గోదావరి, సముద్రం కలిసే ప్రాంతానికి చేరుకుంటాయి. వరదల సమయంలో వచ్చే ఇలసలు ఎర్ర నీటిలోని తీపిదనాన్ని ఆస్వాదిస్తూ.. గోదావరి ప్రవాహానికి ఎదురీదుకుంటూ ముందుకొస్తాయి. ఈ నదిలోనే సంతానాన్ని ఉత్పత్తి చేస్తాయి. ఈ క్రమంలో వాటి శరీరంలో మార్పులు సంభవిస్తాయి. తెల్లటి ఇలసలు కాస్తా ఎరుపు, గోధుమ వర్ణాలను సంతరించుకుని పులసలుగా మారతాయి. సంతానాన్ని వృద్ధి చేశాక పిల్లలతో తిరిగి బంగాళాఖాతం గుండా హిందూ మహాసముద్రంలోకి వెళ్లిపోతాయి. సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: ఏడాదిలో ఒక్కసారి మాత్రమే లభించే పులస ఉనికి కోల్పోతోందా. అవుననే అంటున్నారు మత్స్య రంగ నిపుణులు. గోదావరికి వరద (ఎర్ర నీరు) వచ్చినప్పుడు మాత్రమే కనిపించే పులస రాక దారుణంగా తగ్గిపోయింది. పులసల సీజన్ మొదలై రెండు నెలలు గడిచిపోయింది. చివరి దశకు చేరుతోంది. అయినా.. గోదావరిలో ఈ ఏడాది పులసల జాడ పెద్దగా కనిపించలేదు. గతంలో కేజీ నుంచి నాలుగైదు కేజీలుండే పులసలు లభించేవి. ఒక్కొక్కటీ రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు ధర పలికేవి. ప్రస్తుత సీజన్లో అరకిలో పులస దొరకడమే గగనమైపోయింది. తూర్పు గోదావరి జిల్లా యానాం, కోటిపల్లి, ఎదుర్లంక, ధవళేశ్వరం, రావులపాలెం, కేదార్లంక, పశ్చిమ గోదావరి జిల్లా సిద్ధాంతం, మల్లేశ్వరం, ఖండవల్లి, తీపర్రు, పెండ్యాల, ఆచంట, యలమంచిలి మండలాల్లోని గోదావరి తీరంలో పులసలు విరివిగా దొరికేవి. ప్రస్తుతం ఎక్కడా వీటి జాడ కనబడటం లేదు. తగ్గడానికి కారణాలివీ.. ► సముద్ర ముఖ ద్వారాల నుంచి పులస గోదావరి నదిలోకి ప్రయాణిస్తుంది. అఖండ గోదావరి సముద్రంలో కలిసే ముందు ఏడు పాయలుగా విడిపోయింది. ప్రధాన పాయలైన వశిష్ట, వైనతేయ, గౌతమి పాయల వద్ద ఉండే సముద్ర ముఖద్వారాల నుంచి ధవళేశ్వరం వరకూ సుమారు 60 కిలోమీటర్ల మేర గోదావరి నదిలోకి ఎదురీదుకుంటూ వస్తాయి. కృష్ణా, గోదావరి (కేజీ బేసిన్)లో చమురు కార్యకలాపాలు, ధ్వని కాలుష్యం పెరిగిపోవడంతో పులసలు సముద్రం నుంచి గోదావరి నదిలోకి రావడం లేదు. ► గోదావరి, బంగాళాఖాతం కలిసే ముఖద్వారం వద్ద రిలయన్స్, ఓఎన్జీసీ, కెయిర్న్ ఎనర్జీ తదితర చమురు సంస్ధలు చమురు వెలికితీత పనులు నిర్వహిస్తున్నాయి. ఈ కార్యకలాపాల వల్ల సముద్ర జలాల్లో కంపనాల (వైబ్రేషన్స్)కు భయపడి పులసలు గోదావరి జలాల వైపు రావడం లేదు. ► మరోవైపు సముద్ర ముఖద్వారాల వద్ద ఇసుక మేటలు వేయడం కూడా వాటి రాకకు అడ్డుపడుతున్నాయి. ► గోదావరి పొడవునా రాజమహేంద్రవరం, అంతర్వేది, కరవాక, యానాం సమీప ప్రాంతాల్లో పారిశ్రామిక వ్యర్థాలు గోదావరిలో కలిసిపోతున్నాయి. సల్ఫర్, అమోనియా, లెడ్, పాదరసం ఇతర కర్బనాలు నదిలో కలుస్తున్నాయి. తీరం వెంబడి వేలాది ఎకరాల్లోని రొయ్యల చెరువుల సాగు వ్యర్థాలు నేరుగా గోదావరిలోనే కలుస్తున్నాయి. దాదాపు అన్ని నదీపాయల పరిధిలో రొయ్యల సాగు జరుగుతోంది. ఈ పాయల పరిధిలో డంపింగ్ యార్డులు కూడా ఉన్నాయి. ఆక్వా సాగులో యాంటీ బయోటిక్స్‌తో పాటు పటిక(అం) వినియోగిస్తారు. గోదావరి నుంచి ఈ అవశేషాలన్నీ సముద్రంలో కలుస్తుండటంతో పులస గోదావరిలోకి రావడం తగ్గిపోయింది. ► సముద్రంలో చేపల వేట విచక్షణా రహితంగా సాగటం కూడా పులస అంతరించిపోవడానికి మరో కారణం. కాలుష్యంతో పులస మనుగడకే ముప్పు గోదావరి నది కాలుష్యంతో పాటు విచక్షణా రహితంగా సాగుతున్న వేట వల్ల గోదావరి నదిలో పులసల సంఖ్య పదేళ్లుగా తగ్గుతూ వస్తోంది. ఆధునిక వలలతో లోతు జలాల్లో వేట సాగుతోంది. దీనివల్ల పులసల పునరుత్పత్తి తగ్గిపోతోంది. ఈ తగ్గుదల ఆందోళనకరంగా ఉంది. మత్స్యకారులకు సూచనలు చేసినా పెద్దగా ఫలితం ఉండడం లేదు. – పీవీ కృష్ణారావు,అసిస్టెంట్ డైరెక్టర్, ఫిషరీస్ చమురు కార్యకలాపాలూ ప్రధాన కారణం సముద్ర జలాల్లో చమురు కార్యకలాపాలే పులసల తగ్గుదలకు ప్రధాన కారణం. అధిక వేట, నీటి కాలుష్యం కూడా దీనికి కారణాలే. బ్రీడింగ్ సమయంలో వేట నిషేధం కఠినతరం చేయాలి. పరిశ్రమలు, పట్టణాల కాలుష్యం గోదావరిలోకి వదిలేయటాన్ని నివారించాలి. – డాక్టర్ చంద్రశేఖర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, జువాలజీ విభాగం యానాం -
పుస్తెలమ్మైనా పులస తినాల్సిందే.. ఎందుకంటారా?
సాక్షి, పశ్చిమగోదావరి: సుదూర ప్రాంతాలనుంచి మైళ్ల కొద్దీ ఈదుకుని వచ్చి సముద్రం నుంచి గోదావరి ఎర్రనీటిలో ప్రవేశించే పులసలంటే ఎంతో క్రేజీ. రాష్ట్రంలో కేవలం ఉభయ గోదావరి జిల్లాల్లో గోదావరి పరివాహక ప్రాంతంలో మాత్రమే లభించే వీటిని పుస్తెలమ్మైనా పులస తినాలనే నానుడిని నిజం చేస్తూ ధరలోనూ అధరహో అంటూ రుచికి చేపల్లో రారాజుగా నిలిచిపోయింది. ఏడాదిలో రెండు మూడు నెలలు మాత్రమే లభిస్తుండగా, సీజన్లో వేలకు వేలు ఖర్చు చేసి మరీ కొనుగోలు చేసి జిహ్వ చాపల్యాన్ని సంతృప్తి పరచుకుంటారు చేపల ప్రియులు. గోదావరికి వరద నీరు మొదలైనప్పటి నుంచి ఇంచుమించుగా జూలైలో ప్రారంభమై సెప్టెంబర్ వరకూ నర్సాపురం నుంచి దవళేశ్వరం వరకూ పులసలు విరివిగా జాలర్లకు చిక్కుతుంటాయి. ఎర్రనీటిలో ఎంత దూరం ప్రయాణిస్తే అంత రుచిగా ఉంటాయి. వశిష్టా గోదావరిలో సిద్ధాంతం నుంచి ప్రారంభమై మల్లేశ్వరం, ఖండవల్లి, తీపర్రు, పెండ్యాల్లోనూ, గౌతమి నదిలో జొన్నాడ ఆలమూరు, చెముడు లంక, కేదారిలంక ప్రాంతాల్లో అధికంగా జాలర్ల వలకు ఈ చేపలు చిక్కుతూ ఉంటాయి. దీంతో జాతీయ రహదారిలో పులసల అమ్మకాలు ఎక్కువగా జరుగుతుంటాయి. జాతీయ రహదారిలో పయనించే ఇతర జిల్లా వాసులు వీటిని ఎగబడి మరీ కొనుగోలు చేస్తుంటారు. చదవండి: ఇలస చేప.. పులసగా ఎలా మారుతుందో తెలుసా? సంతానోత్పత్తి కోసం వచ్చి.. ఆ్రస్టేలియా, థాయ్‌లాండ్ వంటి దేశాల్లో ఉండే ఈ ఆరుదైన చేప సంతానోత్పత్తి కోసం సుదూర ప్రాంతాల నుంచి హిందూ మహాసముద్రాన్ని ఈదుకుంటూ బంగాళాఖాతం చేరుకొని గోదావరి, సముద్రం కలిసే ప్రాంతానికి చేరుకుని ఎర్రనీటిలో ప్రయాణిస్తూ సంతానం ఉత్పత్తి చేస్తుంటాయి. హిల్సా ఇలీషా నామంతో ఆయా ప్రాంతాల్లో పిలిచే ఈ చేప గోదావరి ఎర్రనీటిలో ప్రవేశించేటప్పటికి పులసగా పిలవబడుతుంది. గరావిపాలెం వద్ద పులస అమ్మకాలు ఇలసలే పులసలుగా అమ్మకాలు పులసకు ఉండే డిమాండ్‌తో కొన్ని ప్రాంతాల్లో ఇలసలను పులసలుగా అమ్మకాలు సాగిస్తున్నారు. ఒడిశా సముద్రతీరంలో విరివిగా లభించే ఇలసలను తక్కువ ధరకు తీసుకువచ్చి పులసలుగా ఇక్కడ కొందరు అమ్మకాలు సాగిస్తుంటారు. అయితే వీటి మధ్య తేడాను గుర్తించడం కష్టసాధ్యమే. నిజమైన పులస ఎర్రనీటి ప్రయాణం చేసి కొద్దిపాటి ఎర్రనీటిఛాయతో వెండి రంగుతో, ధగధగమంటూ గోధమవర్ణంలో కనిపిస్తుంటాయి. ఇలసలు తెలుపుగానే కనిపిస్తాయి. దీంతో వీటి మధ్య తేడా గుర్తించడంలో కష్టం కావడంతో ఇలసలే పులసలుగా భావించి కొనుగోలు చేసేవారూ అధికంగానే ఉంటారు. దీంతో పులస ప్రియులు వీటిని ఆచితూచి కొనుగోలు చేయాల్సిందే. రూ.1500 నుంచి రూ.6000 వరకూ.. నానుడికి తగ్గట్టుగానే పులస ధర సైతం నిజంగా పుస్తేలు అమ్ముకునే స్థాయిలోనే ఉంటాయి. సామాన్య కుటుంబాలకు పులస కొనాలంటే కలగానే మిగిలిపోతుంది. కేజీ బరువుండే పులసలు రూ.1500 నుంచి రూ.6000 వరకూ సమయాన్ని బట్టి అమ్మకాలు సాగిస్తుంటారు. సాధారణంగా పులస దొరకాలంటే కష్టసాధ్యంగానే ఉంటుంది. దీంతో ఇలసలు లభించే ప్రాంతాల్లో వీటి ధర రూ.1000 వరకూ అమ్ముతుంటారు. తెలియని వారు వీటినే పులసలుగా భావించి కొనుగోలు చేస్తుంటారు. కోవిడ్ ప్రభావంతో నష్టం కోవిడ్ ప్రభావం పులసల అమ్మకందారులకు తగిలింది. గత ఏడాది కోవిడ్ నిబంధనలు కఠినంగా ఉండడంతో పులసలు కొనేనాథుడు లేకపోయాడు. జాతీయ రహదారిలో ప్రయాణాలపై ఆంక్షలు ఉండడంతో దుకాణాలు నిర్వహించలేని పరిస్థితి నెలకొంది. దీంతో గత ఏడాది పులసల సీజన్లో వ్యాపారులు తీవ్రంగానే నష్టపోయారు. పులుసు తయారీలోనూ ప్రత్యేక పద్ధతులు పులస చేపకున్న క్రేజీతో పాటు పులస పులుసు తయారీలో ప్రత్యేక పద్ధతులు పాటిస్తారు. పులసను ఇతర చేపల వలే వండడం కుదరని పని. దీనికోసం ప్రత్యేక పద్ధతులు పాటించి వండుతూ ఉంటారు. మట్టి కుండలో పులస వంటకం రుచిని మరింత పెంచుతుంది. ముళ్లు అధికంగా ఉండడంతో ప్రత్యేక విధానాలు అవలంబిస్తారు. ముందుగా చేప ముక్కలకు వెన్న, ఆముదం పూసి కొంత సమయం పాటు ఉంచి వీటిని పిడకల పొయ్యిపై అతి తక్కువ మంటపై ఎక్కువ సమయం వండవలసి ఉంటుంది. ఆవకాయ ఊట, వంకాయ, బెండకాయ వంటి వాటిని వేసీ మరీ వండుతుంతారు. వంటకం పూర్తవగానే తినకుండా మర్నాడు తింటే దీని రుచి అమోఘంగా ఉంటుందని చేప ప్రియులు అంటుంటారు. -
ఇలస చేప.. పులసగా ఎలా మారుతుందో తెలుసా?
పెనుగొండ(పశ్చిమ గోదావరి జిల్లా): గోదావరికి ఎర్రనీరు వచ్చిందంటే చాలు సముద్రం నుంచి పులసలు ఎర్రెక్కుతాయి. వారం రోజులుగా గోదావరిలో ఎర్రటి నీరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో పులసలు లభ్యమయ్యే కాలం ఆసన్నమైంది. ఇప్పటికే గోదావరి పరీవాహక ప్రాంతాల్లో పులసల జాడ కనిపిస్తోంది. సముద్రంలో జీవించే ఇలస చేప గోదావరికి వరద నీరు రాగానే ఎర్రదనంలోని తీపిని ఆస్వాదిస్తూ బంగాళాఖాతం నుంచి ఎదురీతుకుంటూ నదిలోకి వస్తుంది. ముఖ్యంగా వశిష్ట గోదావరిలో సిద్ధాంతం నుంచి ప్రారంభమై మల్లేశ్వరం, ఖండవల్లి, తీపర్రు, పెండ్యాల, గౌతమి గోదావరిలో జొన్నాడ, ఆలమూరు, చెముడులంక, కేదారిలంక ప్రాంతాల్లో జాలర్లకు చిక్కుతుంటాయి. ధవళేశ్వరం ఆనకట్ట వరకూ పులసల జాడ కనిపిస్తుంటుంది. వారం రోజులుగా గోదావరి వరద నీరు ఉధృతంగా సముద్రంలో కలుస్తుండటంతో పులసలు సమృద్ధిగా దొరికే అవకాశాలు కనిపిస్తున్నాయి. అ‘ధర’హో.. ‘పుస్తెలు అమ్మి అయినా పులస తినాలి’ ఇది గోదావరి ప్రాంతంలో నానుడి. ఏడాదికి ఓసారి మాత్రమే లభించే పులసల కోసం మాంసప్రియులు ఎక్కువ ఆసక్తి చూపుతుంటారు. ధర ఎంతైనా కొనేందుకు వెనుకాడరు. దీంతో వీటికి డిమాండ్ అధికంగానే ఉంటుంది. బరువును బట్టి చేప ఒకటి రూ.1,500 నుంచి రూ.6 వేల వరకు ధర పలుకుతుంది. ఇలసలను పులసలుగా.. పులసల డిమాండ్ నేపథ్యంలో కొన్ని ప్రాంతాల్లో ఇలసలను పులసలుగా చెబుతూ విక్రయిస్తుంటారు. ఒడిషా సముద్ర తీరంలో విరివిగా లభించే ఇలసలను తక్కువ ధరలకు తీసుకొచ్చి జిల్లాలో పులసలుగా అమ్ముతుంటారు. వీటి మధ్య తేడా గుర్తించడం కూడా కష్టమే. ఎర్రనీటిలో ప్రయాణించడం వల్ల పులసలు ఎరుపు, గోధుమ వర్ణంలో కనిపిస్తుంటాయి. ఇలసలు తెలు పు రంగులోనే ఉంటాయని జాలర్లు అంటున్నారు. -
దీని దారి రహదారే
సాక్షి, అమరావతి: పులస చేపల స్వేచ్ఛా విహారం కోసం పోలవరం ప్రాజెక్టులో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. పులస చేపలు ఎగువకు, దిగువకు రాకపోకలు సాగించడానికి వీలుగా స్పిల్ వే రెండో పియర్‌లో ఫిష్ ల్యాడర్ గేట్లను అమర్చుతోంది. ప్రపంచంలో ఈ ఏర్పాట్లు ఉన్న అతి పెద్ద జలాశయం పోలవరం ప్రాజెక్టే కావడం గమనార్హం. పుస్తెలమ్మైనా సరే పులస తినాలన్నది ఉభయ గోదావరి జిల్లాల్లో నానుడి. దీన్ని బట్టే పులసకున్న ప్రాధాన్యతను, దాని రుచిని ఊహించుకోవచ్చు. గోదావరి వరద ప్రవాహం సముద్రంలో కలిసే సమయంలో అంటే.. జూన్ నాలుగో వారం నుంచి జూలై, ఆగస్టు మధ్యన సముద్రంలో జీవించే ఇలస రకం చేపలు సంతానోత్పత్తి కోసం నదిలోకి ఎదురీదుతాయి. ఇలా గోదావరిలోకి చేరాక పులసలుగా రూపాంతరం చెందుతాయి. ప్రపంచంలో ఎక్కడా, మరే ఇతర సముద్రపు చేపలు నదుల్లోకి ఎదురీదే ఉదంతాలు లేవు. వరదల సమయంలో ధవళేశ్వరం బ్యారేజీ గేట్లను ఎత్తి ఉంచడం వల్ల గోదావరి సముద్రంలో కలిసే అంతర్వేది నుంచి దాదాపుగా భద్రాచలం వరకు ఈ చేప నదిలో ఎదురీదుతుంది. సంతానోత్పత్తి చేశాక తిరిగి సముద్రంలోకి చేరి మళ్లీ ఇలసగా మారుతుంది. పోలవరం ప్రాజెక్టును నిర్మిస్తే అత్యంత అరుదైన పులస చేపల రాకపోకలకు విఘాతం కల్పించినట్లు అవుతుందని కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ అనుమానాలు వ్యక్తం చేసింది. అయితే తగిన ఏర్పాట్లు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించడంతో ప్రాజెక్టుకు అనుమతి ఇచ్చింది. చేప సైకాలజీపై అధ్యయనం ఇలస రాక, పులస పోక ఎలాంటి ఆటంకం లేకుండా జరిగేందుకు వీలుగా పోలవరం ప్రాజెక్టుకు గేట్ల ఏర్పాటుపై అధ్యయనం బాధ్యతను కొల్‌కతాలోని ప్రఖ్యాత సీఐఎఫ్ఆర్ఐ (సెంట్రల్ ఇన్‌ల్యాండ్ ఫిషరీష్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్)కు రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. రాకపోకల సమయంలో చేప ప్రవర్తించే తీరుపై సుమారు ఐదేళ్ల అధ్యయనానంతరం సీఐఎఫ్ఆర్ఐ.. ఫిష్ ల్యాడర్ గేట్లను డిజైన్ చేసింది. కేంద్ర జల సంఘం ఆమోదించిన మేరకు ఈ గేట్లను తయారు చేయించిన ప్రభుత్వం స్పిల్ వే రెండో పియర్‌కు అమర్చుతోంది. ఏ స్థాయిలో ప్రవాహం ఉన్నా.. గోదావరి నదిలో వరద ప్రవాహం ఏ స్థాయిలో ఉన్నా పులసలు స్వేచ్ఛగా తిరిగేలా మూడు చోట్ల ఫిష్ ల్యాడర్ గేట్లను అమర్చుతున్నారు. ఫిష్ ల్యాడర్ 252 మీటర్ల పొడవు ఉంటుంది. దీనికి నాలుగు గేట్లు ఉంటాయి. స్పిల్ వే రెండో పియర్‌కు క్రస్ట్ లెవల్లో అంటే 25 మీటర్ల స్థాయిలో ఫిష్ ల్యాడర్‌కు ఒకటి, రెండు గేట్లను.. 34 మీటర్ల స్థాయిలో మూడో గేటును.. 41 మీటర్ల స్థాయిలో నాలుగో గేటును పెడుతున్నారు. పోలవరం ప్రాజెక్టు గరిష్ట నీటి మట్టం 45.72 మీటర్లు, కనిష్ట నీటి మట్టం 25.72 మీటర్లు. అంటే.. గోదావరిలో నీటి మట్టం గరిష్టంగా ఉన్నా, సాధారణంగా ఉన్నా, కనిష్టంగా ఉన్నా ఈ చేప ఎగువకు, దిగువకు రాకపోకలు సాగించేందుకు ఈ గేట్లు అనుకూలంగా ఉంటాయన్న మాట. ప్రపంచంలో ఒక చేప జాతి సైకాలజీపై అధ్యయనం చేసి.. దాని స్వేచ్ఛకు విఘాతం కల్పించకుండా నిర్మిస్తున్న ఏకైక ప్రాజెక్టు పోలవరమేనని పర్యావరణ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. -
ముప్పు ముంగిట్లో 'పులస'
సాక్షి, అమరావతి : దేశంలోనే అత్యంత రుచికరమైన, ఖరీదైన చేపగా ప్రసిద్ధిగాంచిన గోదావరి పులస చేప కనుమరుగయ్యే దశకు చేరుకుంది. ఏ ఏటికా ఏడు మార్కెట్లో పులస కనిపించడమే గగనంగా మారింది. సముద్రంలో నుంచి గోదావరిలోకి ఎదురు ఈదలేక పులస గుడ్లు తేలేస్తోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. తీర ప్రాంతంలో వాతావరణ మార్పులపై ఎంఎస్ స్వామినాథన్ రీసెర్చి ఫౌండేషన్ ఇటీవల కాకినాడలో నిర్వహించిన సదస్సులో పులస జాతి అంతరించిపోయే దశలో ఉన్నట్లు పలువురు నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇక సీఐఎఫ్ఆర్ఐ (సెంటర్ ఇన్‌ల్యాండ్ ఫిషరీస్ రీసెర్చి ఇనిస్టిట్యూట్) అధ్యయనంలో అయితే.. సముద్రం నుంచి గంగా, గోదావరి, నర్మద, యమున తదితర నదుల్లోకి వెళ్లే హిల్సా (గోదావరిలో పులస అంటారు) చేపల ఉత్పత్తి తగ్గిపోతున్నట్లు తేలింది. ఉప్పు నీటి నుంచి మంచినీటిలోకి.. ప్రతి సంవత్సరం వర్షాకాలంలో జులై నుంచి సెప్టెంబర్ మధ్య పులస చేపలు దొరుకుతాయి. పునరుత్పత్తి (గుడ్లు పెట్టేటప్పుడు) సమయంలో ఉప్పు నీటి నుంచి గోదావరిలోకి ఈదుకుంటూ వచ్చే ఈ చేపల్లో ఓమేగా ఆయిల్స్, కొవ్వులు అధికంగా ఉంటాయి. దీనివల్ల ఈ చేపలతో చేసే పులుసు బాగా రుచికరంగా ఉంటుందంటారు. నర్సాపురం, ధవళేశ్వరం, ఎదుర్లంక, రావులపాలెం, సిద్ధాంతం, రాజమండ్రి ప్రాంతాల్లో మత్స్యకారులు నాటు పడవల్లో ప్రత్యేక వలలు వేసి వీటిని పడతారు. కేజీ చేపను డిమాండ్‌ను బట్టి రూ.1,500 నుంచి మూడు, ఐదు వేల వరకూ విక్రయిస్తారు. గతంలో వరదల సమయంలో పులస చేపలు గోదావరి ఒడ్డున, స్థానిక మార్కెట్లో విరివిగా కనిపించేవి. కానీ, గత కొన్నేళ్లుగా పులస దొరకడమే గగనంగా మారిందని మత్స్యకారులు చెబుతున్నారు. కాలుష్యంతోనే కనుమరుగు ఖ్యాతిని ఆర్జించిన ఈ చేపలు కొన్నేళ్లుగా కాలుష్యం కోరల్లో చిక్కుకుని విలవిల్లాడుతున్నాయి. గోదావరి, సముద్ర జలాల్లో అంతకంతకూ పెరిగిపోతున్న కాలుష్య ప్రభావం పులస మనుగడపై తీవ్రంగా కనిపిస్తోంది. పరిశ్రమల వ్యర్థాలు.. నగరాలు, పట్టణాల నుంచి విడుదలవుతున్న మురుగు పెద్దఎత్తున కలుస్తుండడం, చమురు నిక్షేపాల కోసం చేస్తున్న డ్రిల్లింగ్, గ్లోబల్ వార్మింగ్ తదితర కారణాలవల్ల సముద్ర జలాలు కాలుష్యమయంగా మారాయని స్వామినాథన్ ఫౌండేషన్ నిర్వహించిన సదస్సులో ప్రొఫెసర్లు వివరించారు. అంతేకాదు.. - నీటిలో కాలుష్యం కారణంగా అమ్మోనియా, నైట్రేట్ వంటి రసాయనాలవల్ల నీటిలో జిడ్డు ఎక్కువగా ఉంటోంది. దీంతో సముద్రం నుంచి గోదావరిలోకి పులసలు రాలేకపోతున్నాయి. - సముద్ర తీరం నుంచి 25 కిలోమీటర్ల లోపు చమురు తవ్వకాలు, కాలుష్య ప్రభావం ఎక్కువగా ఉండడంతో పులస మనుగడ కష్టంగా మారింది. అక్కడా తగ్గుతున్న ఉత్పత్తి నదుల్లోకి రాకముందు సముద్రంలో దొరికే పులస చేపను హిల్సాగా పిలుస్తారు. దీని శాస్త్రీయ నామం ఇలీష. ఒడిశా, పశ్చిమబెంగాల్, బంగ్లాదేశ్ సముద్ర జలాల్లో ఇవి ఎక్కువగా దొరుకుతాయి. కోల్‌కత మార్కెట్లో హిల్సాకు విపరీతమైన డిమాండ్ ఉంది. కానీ, కాలుష్యంవల్ల ఆ ప్రాంతాల్లోనూ వీటి ఉత్పత్తి బాగా తగ్గిపోయిందని చెబుతున్నారు. గోదావరిలో పులస దొరక్కపోవడంతో ఒడిశా, బెంగాల్ నుంచి హిల్సా చేపలను స్థానిక మార్కెట్లకు దిగుమతి చేసుకుని పులసలుగా విక్రయిస్తున్నారు. పులస చేపలకు అనువైన పరిస్థితుల్లేవు విపరీతమైన కాలుష్యంతో పాటు అనేక ఇతర కారణాల వల్ల పులస చేపలు గోదావరికి ఎదురీది రాలేకపోతున్నాయి. అందుకే గతంలో బాగా కనిపించే ఈ చేపలు ఇప్పుడు కనుమరుగవుతున్నాయి. గ్లోబల్ వార్మింగ్, కాలుష్యం కారణంగా సముద్రంలో తీవ్ర మార్పులు చోటుచేసుకుంటున్నాయి. మత్స్య సంపదపై దీని ప్రభావం చాలా తీవ్రంగా ఉంది. – నాగేశ్వరరావు, రిటైర్డ్ ప్రొఫెసర్, ఆంధ్రా యూనివర్సిటీ పులస దొరకడంలేదు గతంలో వేటకు వెళ్తే పులసలు బాగా వలకు పడేవి. కొన్నేళ్లుగా అవి పెద్దగా కనిపించడంలేదు. వరదలప్పుడు ఒకటి, రెండు చేపలు మాత్రమే పడుతున్నాయి. ఈ సంవత్సరం అయితే అసలు పులస కనపడనేలేదు. రానురానూ అవి దొరకవనిపిస్తోంది. – నారాయణస్వామి, మత్స్యకారుడు, రావులపాలెం -
‘పులస’ ముక్క పంటికి తగిలితే..ఆహా..
సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: అది అన్ని చేపల్లాంటిదీ కాదు. దాని రాక, పుట్టుక.. రుచి, ధర.. అన్నీ ప్రత్యేకమే. ఏడాదికోసారి మాత్రమే.. అదీ ఈ సీజన్లోనే.. అందునా వరద గోదావరిలోనే.. అది కూడా ధవళేశ్వరం బ్యారేజి నుంచి సాగరసంగమం వరకు ఉన్న పాయల్లోనే దొరికే చేప. పేరు ‘పులస’. ఆ పేరు వింటేనే మాంసాహార ప్రియుల నోట్లో నీరూరుతూంటుంది. వండిన తరువాత ఆ ముక్క పంటికి తగిలితే.. ఆ రుచికి నాలుక వహ్వా అంటుంది. జీవితంలో ఒకసారి పులస రుచి చూస్తే ఏటా లొట్టలేసుకుని తినాలి్సందే.అత్యంత ఖరీదైన డిష్ ఈ పులస చేప. కిలో పులస కావాలంటే ఐదారు వేల రూపాయలు పెట్టాల్సిందే. అయినప్పటికీ ‘పుస్తెలు అమ్మి అయినా సరే పులస తినాలి్సందే’నని గోదావరి జిల్లాల్లోని మాంసాహార ప్రియులు అంటారు. ‘పులస’ నేపథ్యం ఎంతో ఆసక్తికరంగా ఉంటాయి. పునరుత్పత్తి కోసం.. పసిఫిక్ మహాసముద్రం ప్రాంతంలోని ఆస్ట్రేలి యా, న్యూజిలాండ్ తదితర దేశాల సముద్ర జలా ల్లో జీవించే ఈ పులసను క్యుఫిడే కుటుంబానికి చెం దిన కార్డేటాగా శాస్త్రవేత్తలు వర్గీకరించారు. పులస ప్రజాతి హిల్సా. జాతి ఇల్సా. ఈ ‘ఇల్సా’ కాస్తా సముద్రంలో ఉన్నప్పుడు ‘విలస’గా.. గోదావరిలోకి ప్రవేశించాక ‘పులస’గా మారుతుంది. ఈ చేపలు పునరుత్పత్తి కోసం పసిఫిక్ మహాసముద్రం నుంచి హిందూ మహాసముద్రం, బంగాళాఖాతం మీదుగా.. సుమారు 11 వేల నాటికల్ మైళ్లు ప్రయాణించి గోదావరిలోకి వలస వస్తాయి. ఇందుకోసం అవి 30 నుంచి 40 రోజుల పాటు జీవ గడియారం (బయోలాజికల్ క్లాక్) ఆధారంగా ఏకధాటిగా ప్రయాణిస్తాయి. సైబీరియా పక్షులు, ఆలివ్ రిడ్లే తాబేళ్ల మాది రిగానే.. పులసలు కూడా పునరుత్పత్తి కోసం వేల కిలోమీటర్ల దూరాన్ని అలవోకగా అధిగమించి.. ఏటా ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో గోదావరి నదికి ఎర్రనీరు (వరద) వచ్చే సమయానికి గుడ్లు పెట్టడానికి వలస వస్తాయి. ఆడ, మగ పులసలు గోదావరిలో ఇసుక, గులక రాళ్లు ఉన్న ప్రాంతాల్లో మాత్రమే సంగమించి గుడ్లు పెడతాయి. ఆ గుడ్లు ఒకటి రెండు రోజుల్లోనే చేప పిల్లలుగా ఎదుగుతాయి. పులస చేప పిల్లలను ‘జట్కా’ అని పిలుస్తారు. పునరుత్పత్తి పూర్తయ్యాక వచ్చిన సముద్ర మార్గంలోనే సంతానం(జట్కాలు)తో కలిసి తిరిగి వచ్చిన చోటకే వెళ్లిపోతాయి. ఇందుకు మరో నెల రోజులు సమయం పడుతుంది. వీటిల్లో కొన్ని గోదావరిలో వలలకు చిక్కి, మత్స్యకారులకు సిరులు కురిపిస్తాయి. ఇవి ఉభయ గోదావరి జిల్లాల్లోని గౌతమి, వృద్ధ గౌతమి, వైనతేయ, వశిష్ట గోదావరి పాయల్లో మాత్రమే లభిస్తాయి. 100 కి.మీ. వేగంతో.. ఏటికి ఎదురీదుతూ.. గోదావరికి వరదలు వచ్చే జూలై చివరి నుంచి ఆగస్టు నెలాఖరు వరకు పులసలు లభిస్తాయి. కొన్ని సార్లు సెప్టెంబర్‌లో కూడా దొరుకుతాయి.. సముద్రం నుంచి గోదావరిలోకి ప్రవేశించాలంటే అవి ఏటికి ఎదురీదుకుంటూ రావాలి్సందే. మహోగ్ర వడితో పరవళ్లు తొక్కే వరద గోదావరికి ఎదురీదడమంటే మాటలు కాదు. అందుకు తగినట్టుగానే పులసలు 100 కిలోమీటర్ల వేగంతో గోదావరికి ఎదురీదుతాయి. గోదావరి జిల్లాల్లో సముద్ర ముఖద్వారం నుంచి గోదావరి నదిలో సుమారు 100 కిలోమీటర్లు ప్రయాణిస్తాయి. అంత దూరం అంత వేగంతో ఎదురీదడంతో ఈ చేపల్లో కెమికల్ రియాక్షన్ విపరీతంగా జరిగి దీని కండరాల్లో ప్రోటీన్లు ఉత్పత్తి అవుతాయి. పులసలకు స్వేదగ్రంధులు ఉండవు. మామూలుగా చేపల్లో ఒమేగా–3 పేట్రియాసిడ్స్ (ఆమ్లాలు) ఉంటాయి. కానీ ఈ ఆమ్లాలు పులసల్లో మూడు రెట్లు అధికంగా ఉంటాయని, అందువల్లనే వీటికి మంచి రుచి వస్తుందని చెబుతారు. నకిలీల బెడద మాంసాహార ప్రియులు ఎంతగానో ఇష్టపడి తినే ఈ పులసలకు కూడా నకిలీల బెడద తప్పడం లేదు. పులసలపై అవగాహన ఉన్న గోదావరి వాసులు నకిలీ పులసలను సులువుగా గుర్తిస్తున్నారు. గోదావరిలో దొరికే పులస దిగువన చర్మం బంగారు రంగులో మెరుస్తూ ఉంటుంది. అదే ఒడిశా నుంచి వచ్చే నకిలీ పులస చర్మం కొద్దిగా ఎరుపు రంగులో ఉన్నా మెరుపు ఉండదు. కేజీ బేసిన్లో చమురు, సహజవాయువు నిక్షేపాల కోసం జరుగుతున్న డ్రిల్లింగ్ కారణంగా జలకాలుష్యం పెరిగిపోవడం వలన గోదావరిలో పులసల రాక తగ్గుతోందని చెబుతున్నారు. సముద్ర గర్భంలో రిగ్గింగ్, బ్లాస్టింగ్ వంటి కార్యకలాపాల వల్ల ఈ చేపల వలసలు తగ్గాయని మత్స్యకారులు అంటున్నారు. ఆరోగ్యానికి మేలు కేవలం రుచే కాదు.. ఆరోగ్యానికి కూడా పులస ఎంతో మేలు చేస్తుంది. ఒమేగా–3, ఒమేగా–6 ఫ్యా టీ ఆమ్లాలు అధికంగా ఉన్నందువలన పులస ఆరో గ్యానికి ఎంతో మంచిదని చెబుతారు. గర్భిణులకు పులస ఎంతో మేలు చేస్తుందని వైద్యులు చెబుతా రు. ఈ చేప తినడం గుండెకు మంచిదని అంటారు. సముద్ర ముఖద్వారం నుంచి బయలుదేరే పులస.. గోదావరిలో ఎంత దూరం ఎదురీదితే రుచి అంతగా ఉంటుంది. అందుకే సాగర సంగమ ప్రదేశాలైన యానాం, బోడసకుర్రు తదితర ప్రాంతాల్లో కంటే అఖండ గోదావరి (ధవళేశ్వరం బ్యారేజీ) వద్దకు వెళ్లే చేప రుచి, పరిమాణం ఎక్కువగా ఉంటాయి. దీనికి తగినట్టుగానే ధవళేశ్వరం, బొబ్బర్లంక, ఊబలంక తదితర ప్రాంతాల్లో లభించే చేపల ధర కూడా కిలో రూ.5 వేల నుంచి రూ.6 వేలు ఉంటుంది. వరదల సీజన్లో మాత్రమే దొరికే అరుదైన పులసల కోసం ధరతో నిమిత్తం లేకుండా మరీ ఎదురు చూస్తారు. మార్కెట్లోకి వచ్చిందంటే చాలు.. ఈ చేప క్షణాల్లో అమ్ముడైపోతుందంటే దీనికి ఎంత డిమాండ్ ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. గర్భిణులకు ఎంతో మేలు ఆరోగ్యానికి పులస ఎంతో తోడ్పడుతుంది. ముఖ్యంగా గర్భిణులకు ఒమేగా–3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా అవసరమవుతాయి. ఇవి మిగిలిన జలచరాల కంటే పులస చేపలో ఎక్కువగా ఉంటాయి. గోదావరికి ఎదురీదటంతో సహజ సిద్ధంగా జనించే ఆమ్లాలు పులసలో రుచికి ప్రత్యేక కారణంగా చెప్పవచ్చు. వరద గోదావరిలో లభించే ప్రత్యేక ఆహారం కోసమే అవి ఇక్కడి వరకూ వస్తాయి. – చిట్టూరి గోపాలకృష్ణ,మత్స్యశాఖ అభివృద్ధి అధికారి, అమలాపురం పులుసు అమోఘం పులసను పులుసుగానే ఎక్కువగా వండుతారు. ఇప్పటి తరం మహిళలు దీనిని వండినా అంత రుచి రాదనే అంటారు. పులస పులుసును ప్రత్యేక తరహాలో తయారు చేయాల్సిందే. పాత తరం అంటే ఇప్పుడు 60, 70 ఏళ్లు వయస్సున్న గ్రామీణ మహిళలు పులస పులుసు పెడితే ఆ రుచి అమోఘంగా ఉంటుంది. మసాలా దట్టించి మట్టికుండలో చింతపండు పులుసుతో దీనిని వండుతారు. చింతనిప్పులు లేదా కట్టెల పొయ్యి లేదా పిడకల మంటపైనే దీనిని వారు వండుతారు. పొయ్యిపై కూర ఉడికేటప్పుడు బెండకాయలు, వంకాయలు, మిరపకాయలు కోయకుండా ఉన్నవి ఉన్నట్టుగా వేస్తారు. అలాగే ఆవకాయలో తేరిన ఎర్రటి నూనె, కొత్తివీుర వేస్తారు. కుండలో వండితేనే దీనికి అసలైన రుచి వస్తుంది. పులుసు వండడం పూర్తయ్యాక అదే కుండలో ఉంచి 24 గంటల తరువాత తింటే దాని రుచే వేరని పలువురు లొట్టలు వేసుకుని తింటారు. పులస చేపకు ముళ్లు ఎక్కువగా ఉండటంతో చాలా నేర్పుగా తినాల్సి ఉంటుంది. ఇందులో వేసిన బెండకాయ, వంకాయ, పచ్చిమిర్చి కూడా భలే రుచిగా ఉంటాయి. గోదావరి జిల్లాల వాసుల్లో పలువురు హైదరాబాద్, విజయవాడ వంటి ప్రాంతాల్లోని తమవారికి, ప్రజా ప్రతినిధులకు, ఉన్నతాధికారులకు ఘుమఘుమలాడే పులస పులుసు తీసుకువెళుతుంటారు. ఎన్నో ప్రత్యేకతలు పులసకు ఉన్నంత రుచి, వాసన మరో చేపకు ఉండవు. దీంతో దీనిని అంతర్జాతీయంగా క్వీన్ ఆఫ్ ది ఫిష్ (చేపల రారాణి)గా పిలుస్తారు. పులస చేప కిలో నుంచి 3 కిలోల బరువు మాత్రమే ఉంటుంది. 3 కిలోల బరువున్న పులస 60 సెంటీమీటర్ల పొడవు ఉంటుంది. దీని ఆయుష్షు గరిష్టంగా 3 సంవత్సరాలు. వలలో చిక్కిన వెంటనే పులసలు చనిపోతాయి. అయితే రక్తప్రసరణ ఎక్కువగా ఉండడంతో రెండు రోజుల వరకు ఈ చేప పాడైపోకుండా ఉంటుంది.పులస ప్రపంచంలో మూడే మూడు ప్రాంతాల్లో మాత్రమే లభిస్తుంది. బంగ్లాదేశ్‌లోని పద్మా నది, పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీ నది, మన రాష్ట్రంలోని గోదావరి నది. గోదావరిలో కూడా కేవలం మూడే మూడు ప్రాంతాల్లో లభించే పులస రుచి పసందుగా ఉంటుంది. ఆ ప్రాంతాలు తూర్పు గోదావరి జిల్లాలోని ధవళేశ్వరం, పశ్చిమ గోదావరి జిల్లాలోని సిద్ధాంతం, నర్సాపురం. బంగ్లాదేశ్‌లో పులస జాతీయ చేపగా గుర్తింపు పొందింది. అఖండ గోదావరి ధవళేశ్వరం దిగువన ఏడుపాయలుగా విడిపోతుంది. వీటినే ‘సప్త గోదావరులు’ అని పిలుస్తారు. అవి గౌతమి, వైనతేయ, వశిష్ట, తుల్య భాగ, భరద్వాజ, ఆత్రేయ, కశ్యప. ఈ ఏడు పాయలు చివరకు మూడు పాయలు(గౌతమి, వైనతేయ, వశిష్ట)గా సముద్రంలో కలుస్తాయి. అలా నదీపాయలు సముద్రంలో కలిసే సఖినేటిపల్లి మండలం అంతర్వేది అన్నాచెళ్లెళ్ల గట్టు, బోడసకుర్రు సమీపాన ఓడలరేవు – కరవాక మధ్య, కాట్రేనికోన మండలం బ్రహ్మసమేథ్యం సమీపాన కొత్తపాలెం ప్రాంతాల్లో సముద్ర మొగ(సీ మౌత్)లు ఏర్పడ్డాయి. ఈ మూడుచోట్ల నుంచే పులసలు గోదావరిలోకి ప్రవేశిస్తాయి. -
యాండే.. పులసొచ్చిందండీ
నరసాపురం: ‘చేపలందు పులస చేప రుచే వేరండి’ అంటారు గోదావరి ప్రియులు. పుస్తెలమ్మి అయినా పులస తినాలనే నానుడి కూడా గోదావరి జిల్లాల్లో ఉంది. వీటిని చూస్తేనే మీన ప్రియులకు పులసంటే ఎంత మక్కువో ఇట్టే అర్థమవుతుంది. ఈ ఏడాది మళ్లీ గోదావరి ప్రజలకు పులస సీజన్ వచ్చేసింది. నది పాయల్లోకి ఈదుకుంటూ వస్తున్న పులసలను ఒడిసి పట్టుకోవడానికి మత్స్యకారులు ఒక పక్క శ్రమపడుతుంటే.. మరోపక్క చేపల్ని కొనడానికి స్థానికులు ఎగబడుతున్నారు. ఎగువ ప్రాంతాల్లో భారీగా కురిసిన వర్షాలతో గోదావరికి వరద వచ్చింది. ఆ ఎర్ర నీటిలో గుడ్లు పెట్టడానికి పులస చేపలు ఎదురు ఈదుకుంటూ వస్తున్నాయి. ఏటా వర్షాల సీజన్లో మాత్రమే పులస చేపలు గోదావరి పాయల్లోకి వస్తాయి. దీంతో కొన్ని రోజులుగా మత్స్యకారులు గోదావరి సముద్ర సంగమం నుంచి ధవళేశ్వరం ఆనకట్ట వరకూ పులస వేట కొనసాగిస్తున్నారు. ఎక్కడి నుంచి వస్తుంది.. పులస నిజానికి సముద్ర చేప. దీని శాస్త్రీయ నామం హిల్సాహిల్సా. దీనినే ఇంగ్లిష్‌లో ఇలిష్ అని కూడా అంటారు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ప్రాంతాల్లోని సముద్ర జలాల్లో సంచరిస్తుంది. సంతానోత్పత్తి సమయంలో గుడ్లు పెట్టడానికి అంత దూరం నుంచి ఈదుకుంటూ గోదావరిలోకి వస్తుంది. ఆషాడ, శ్రావణ మాసాల్లో ఇక్కడ గుడ్లు పెట్టిన తర్వాత మళ్లీ సముద్రంలోకి వెళ్లిపోతుంది. అందువల్లే ఈ చేపను చెరువుల్లో పెంచడానికి వీలుండదు. బంగ్లాదేశ్, ఒడిశా తీరాల్లో ఈ చేప దొరికినా.. గోదావరి చేపకున్న రుచి ఉండదని చెబుతారు. ‘ఇలస’ పులసయ్యేదిక్కడే సముద్రంలో పులసను ఇలసగా పిలుస్తారు. వర్షాలు పడి గోదావరిలోకి ఎర్రనీరు రాగానే సముద్రంలోని ఇలసలు ఈదుకుంటూ వస్తాయి. గోదావరిలోకి వచ్చిన తర్వాత రెండు మూడు రోజుల్లోనే ఇలస పులసగా మారుతుందని మత్స్యకారులు చెబుతారు. రుచిలో కూడా మార్పు వస్తుందంటారు. ప్రధానంగా పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం వద్దనున్న వశిష్ట గోదావరి పాయలో పులసలు ఎక్కువగా దొరుకుతాయి. ఇక్కడికి పది కిలోమీటర్లు దూరంలో ఉన్న అంతర్వేది వద్ద గోదావరి, సముద్ర సంగమ ప్రాంతం నుంచి నదిలోకి ఈ చేపలు వస్తాయి. ఇక తూర్పుగోదావరి జిల్లాలోని గోదావరి తీర ప్రాంతాలైన రాజోలు, గన్నవరం, ఎదుర్లంకలలో పులసల వేట ముమ్మరంగా సాగుతుంది. ప్రస్తుతం నరసాపురం, అంతర్వేది మార్కెట్‌ల్లోనూ రావులపాలెం, సిద్ధాంతం, చించినాడ వంతెనల వద్ద పులసల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. దీంతో ఆ ప్రాంతాలు కొనుగోలుదారులతో కళకళలాడుతున్నాయి. తాము రుచి చూడటమే కాకుండా.. దూర ప్రాంతంలోని తమ వారికి పంపడానికి ఎంత ఖర్చయినా లెక్కచేయకుండా స్థానికులు పులసలను కొనుగోలు చేస్తున్నారు. సంప్రదాయ పద్ధతిలోనే వేట గోదావరిలో పులసల వేట సంప్రదాయ నాటు పడవలతోనే సాగుతుంది. పులసల వేట కోసం చెక్క నావలపై మత్స్యకారులు ప్రత్యేక వలలను ఉంచుతారు. వీటిని ‘రంగపొల’ వలలుగా పిలుస్తారు. 20 మీటర్లు పొడవు ఉండే ఈ చిన్నపాటి వలలకే పులసలు చిక్కుతాయని మత్స్యకారులు చెబుతారు. సముద్రంలో వేట సాగించే పెద్ద బోట్లు ద్వారా సాగించే వేటకు ఎక్కువ పులసలు లభించవు. మరో విషయం ఏమిటంటే ఈ చేపలు ఎక్కువగా వేకువజామునే వలలకు చిక్కుతాయి. దీంతో మత్స్యకారులు అర్ధరాత్రి నుంచి వేట సాగిస్తారు. ఎగుమతులకు ఆస్కారం లేదు.. మిగిలిన చేపల్లా మూడేసి, నాలుగేసి కిలోల చొప్పున పులసలు బరువుండవు. అరకిలో నుంచి కిలోన్నర వరకే బరువు ఉంటాయి. సైజు, డిమాండ్‌ను బట్టి వీటి రూ. 2 వేల నుంచి రూ. 5 వేల వరకు అమ్ముతున్నారు. పులసలకు పెద్దగా డిమాండ్ ఉన్నా ఎగుమతులకు ఆస్కారం లేదు. తక్కువ సంఖ్యలో పులసలు దొరకడమే ఇందుకు కారణం. అయితే పులస మనుగడపై పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విస్తృత వేట, గోదావరి నీరు కలుషితం కారణంగా ఈ చేప జాతి మనుగడ ప్రశ్నార్థకమవుతోందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
పులస చేప.. మంచి విందు!
‘‘గోదావరిపై చాలా సినిమాలొచ్చాయి. సత్యం, ఇళయరాజా వంటి గొప్ప గొప్ప సంగీత దర్శకులు గోదావరిపై మంచి పాటలు స్వరపరిచారు. ఈ సినిమాలో నేను గోదావరి ఫేమస్ పులస చేపపై పాట చేశా. దానికి మంచి స్పందన వస్తోంది. వీనుల విందుగా ఉందని అందరూ అంటున్నారు. గొప్ప పాటల సరసన ఈ పాట నిలుస్తుందని నమ్ముతున్నా’’ అన్నారు సంగీత దర్శకుడు రఘు కుంచె. రాజా రామ్మోహన్ చల్లా దర్శకత్వంలో తూము రామారావు, రాజేశ్ రంబాల, బొమ్మన సుబ్బారాయుడు నిర్మించిన సినిమా ‘కేరాఫ్ గోదావరి’. ఈ నెల 24న రిలీజవుతోన్న ఈ చిత్రానికి రఘు కుంచె సంగీత దర్శకుడు. దర్శకుడు మాట్లాడుతూ – ‘‘గోదావరి, ఆ నదిలో ప్రయాణం గురించి ఎంత చెప్పినా తక్కువే. కొత్త హీరో హీరోయిన్లతో గోదావరి నదిపై తీసిన ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తుందని ఆశిస్తున్నా’’ అన్నారు. నిర్మాతల్లో ఒకరైన బొమ్మన సుబ్బారాయుడు సహా చిత్ర బృందం పాల్గొన్నారు. -
ఆన్లైన్లో పులస చేపల విక్రయం
-
గోదావరి జిల్లాలో పూలస చేప సందడి
-
పులస కేజీన్నర @ రూ.3 వేలు
కాకినాడ (మలికిపురం) : గోదావరికి వరదనీరు తగలడంతో పులసల తాకిడి మొదలైంది. వశిష్ట నదిలో తొలిసారిగా పెదలంక మత్స్యకారులకు బుధవారం పులస చేప చిక్కింది. దాన్ని మలికిపురం మార్కెట్లో అమ్మకానికి పెట్టారు. సుమారు కేజీన్నర బరువున్న ఈ పులస రూ. 3 వేలకు అమ్ముడైంది. -
పులస @ రూ. 2 వేలు!
-
పులస @ రూ. 4 వేలు!
పుస్తెలమ్మై పులస తినాల్సిందే అన్నది నానుడి. వీటికున్న విశిష్టత అటువంటిది. ఎంతైనా వెచ్చించి పులస చేపల్ని కొనేందుకు మాంస ప్రియులు ఎగబడుతుంటారు. ఏటా ఆగస్టు, సెప్టెంబర్‌లో వచ్చే వరదల సమయంలో గోదావరిలో పులసలు లభిస్తుంటాయి. ఈసారి కొద్దిగా ఆలస్యంగా చించినాడ సమీపంలోని గోదావరి పరివాహక ప్రాంతాల్లో పులసలు కనిపిస్తున్నాయి. కిలో చేప రూ. 2 వేల నుంచి రూ. 4 వేల వరకు ధర పలుకుతోంది. పులస పేరు వింటేనే జనం పుల కరించిపోతారు. రాష్ట్రంలో కోస్తా తీరంలో మాత్రమే దొరికే పులస చేప ఖ్యాతి ఖండాంతరాలు దాటింది. ఒక్క కోస్తా నదీ తీరప్రాంతాల్లోనే లభించడంతో దీని కోసం ఈ సీజన్లో హైదరాబాద్, విజయవాడ, విశాఖ తదితర ప్రాంతాల నుంచి పులసప్రియులు వచ్చి ఎంత ధరయినా కొనుగోలు చేసి తీసుకెళ్తుంటారు. ఒకసారి పులస రుచి చూసిన వారు వేల రూపాయలైనా పోటీ పడి కొనుగోలు చేస్తుంటారు. దీంతో పులస చేప ధరలు ఏటేటా ఎగబాకుతున్నాయి. దీని ధరలను చుక్కలను తాకుతుండడంతో సామాన్యులకు అందకుండా పోతోంది.