సృష్టిలో ఏ జీవి అయినా సంతానోత్పత్తి కోసం పుట్టింటికే వెళుతుంది. సముద్ర జలాల్లో జీవించే ఇలసలు సైతం సంతానోత్పత్తి కోసం వేలాది కిలోమీటర్ల దూరం ప్రయాణించి తమ పుట్టినిల్లయిన గోదావరి నదిలోకి చేరుకుంటాయి. గోదావరి నీటిలోని తీపిని ఆస్వాదిస్తూ.. నదిలోనే సంతానాన్ని వృద్ధి చేస్తాయి. ఈ క్రమంలో వాటి శరీరంలో మార్పులు సంభవించి.. తెల్లటి ఇలసలు కాస్తా ఎరుపు, గోధుమ వర్ణాలను సంతరించుకుని పులసలుగా మారతాయి. సంతానోత్పత్తి అనంతరం తిరిగి సముద్రంలోకి చేరుకుని ఇలసలుగా రూపాంతరం చెందుతాయి.
ఇలస.. పులస అవుతుందిక్కడ ఆస్ట్రేలియా, థాయ్‌లాండ్ వంటి దేశాల్లోని సముద్ర జలాల్లో జీవించే ఈ అరుదైన చేప సంతానోత్పత్తి కోసం హిందూ మహాసముద్రాన్ని దాటి బంగాళాఖాతంలోకి చేరుకుంటుంది. ఆయా ప్రాంతాల్లో దీనిని హిల్సా, హిల్సా హెర్రింగ్, ఇలిషా పేర్లతో పిలుస్తారు. మన ప్రాంతంలో మాత్రం సముద్ర జలాల్లో ఉన్నప్పుడు వీటిని ఇలస అంటారు. వేల కిలోమీటర్ల దూరాన్ని ఈదుకుంటూ గోదావరి, సముద్రం కలిసే ప్రాంతానికి చేరుకుంటాయి. వరదల సమయంలో వచ్చే ఇలసలు ఎర్ర నీటిలోని తీపిదనాన్ని ఆస్వాదిస్తూ.. గోదావరి ప్రవాహానికి ఎదురీదుకుంటూ ముందుకొస్తాయి. ఈ నదిలోనే సంతానాన్ని ఉత్పత్తి చేస్తాయి. ఈ క్రమంలో వాటి శరీరంలో మార్పులు సంభవిస్తాయి. తెల్లటి ఇలసలు కాస్తా ఎరుపు, గోధుమ వర్ణాలను సంతరించుకుని పులసలుగా మారతాయి. సంతానాన్ని వృద్ధి చేశాక పిల్లలతో తిరిగి బంగాళాఖాతం గుండా హిందూ మహాసముద్రంలోకి వెళ్లిపోతాయి.
సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: ఏడాదిలో ఒక్కసారి మాత్రమే లభించే పులస ఉనికి కోల్పోతోందా. అవుననే అంటున్నారు మత్స్య రంగ నిపుణులు. గోదావరికి వరద (ఎర్ర నీరు) వచ్చినప్పుడు మాత్రమే కనిపించే పులస రాక దారుణంగా తగ్గిపోయింది. పులసల సీజన్ మొదలై రెండు నెలలు గడిచిపోయింది. చివరి దశకు చేరుతోంది. అయినా.. గోదావరిలో ఈ ఏడాది పులసల జాడ పెద్దగా కనిపించలేదు. గతంలో కేజీ నుంచి నాలుగైదు కేజీలుండే పులసలు లభించేవి. ఒక్కొక్కటీ రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు ధర పలికేవి. ప్రస్తుత సీజన్‌లో అరకిలో పులస దొరకడమే గగనమైపోయింది. తూర్పు గోదావరి జిల్లా యానాం, కోటిపల్లి, ఎదుర్లంక, ధవళేశ్వరం, రావులపాలెం, కేదార్లంక, పశ్చిమ గోదావరి జిల్లా సిద్ధాంతం, మల్లేశ్వరం, ఖండవల్లి, తీపర్రు, పెండ్యాల, ఆచంట, యలమంచిలి మండలాల్లోని గోదావరి తీరంలో పులసలు విరివిగా దొరికేవి. ప్రస్తుతం ఎక్కడా వీటి జాడ కనబడటం లేదు.
తగ్గడానికి కారణాలివీ..
► సముద్ర ముఖ ద్వారాల నుంచి పులస గోదావరి నదిలోకి ప్రయాణిస్తుంది. అఖండ గోదావరి సముద్రంలో కలిసే ముందు ఏడు పాయలుగా విడిపోయింది. ప్రధాన పాయలైన వశిష్ట, వైనతేయ, గౌతమి పాయల వద్ద ఉండే సముద్ర ముఖద్వారాల నుంచి ధవళేశ్వరం వరకూ సుమారు 60 కిలోమీటర్ల మేర గోదావరి నదిలోకి ఎదురీదుకుంటూ వస్తాయి. కృష్ణా, గోదావరి (కేజీ బేసిన్)లో చమురు కార్యకలాపాలు, ధ్వని కాలుష్యం పెరిగిపోవడంతో పులసలు సముద్రం నుంచి గోదావరి నదిలోకి రావడం లేదు.
► గోదావరి, బంగాళాఖాతం కలిసే ముఖద్వారం వద్ద రిలయన్స్, ఓఎన్‌జీసీ, కెయిర్న్ ఎనర్జీ తదితర చమురు సంస్ధలు చమురు వెలికితీత పనులు నిర్వహిస్తున్నాయి. ఈ కార్యకలాపాల వల్ల సముద్ర జలాల్లో కంపనాల (వైబ్రేషన్స్)కు భయపడి పులసలు గోదావరి జలాల వైపు రావడం లేదు.
► మరోవైపు సముద్ర ముఖద్వారాల వద్ద ఇసుక మేటలు వేయడం కూడా వాటి రాకకు అడ్డుపడుతున్నాయి.
► గోదావరి పొడవునా రాజమహేంద్రవరం, అంతర్వేది, కరవాక, యానాం సమీప ప్రాంతాల్లో పారిశ్రామిక వ్యర్థాలు గోదావరిలో కలిసిపోతున్నాయి. సల్ఫర్, అమోనియా, లెడ్, పాదరసం ఇతర కర్బనాలు నదిలో కలుస్తున్నాయి. తీరం వెంబడి వేలాది ఎకరాల్లోని రొయ్యల చెరువుల సాగు వ్యర్థాలు నేరుగా గోదావరిలోనే కలుస్తున్నాయి. దాదాపు అన్ని నదీపాయల పరిధిలో రొయ్యల సాగు జరుగుతోంది. ఈ పాయల పరిధిలో డంపింగ్ యార్డులు కూడా ఉన్నాయి. ఆక్వా సాగులో యాంటీ బయోటిక్స్‌తో పాటు పటిక(అం) వినియోగిస్తారు. గోదావరి నుంచి ఈ అవశేషాలన్నీ సముద్రంలో కలుస్తుండటంతో పులస గోదావరిలోకి రావడం తగ్గిపోయింది.
► సముద్రంలో చేపల వేట విచక్షణా రహితంగా సాగటం కూడా పులస అంతరించిపోవడానికి మరో కారణం.
కాలుష్యంతో పులస మనుగడకే ముప్పు
గోదావరి నది కాలుష్యంతో పాటు విచక్షణా రహితంగా సాగుతున్న వేట వల్ల గోదావరి నదిలో పులసల సంఖ్య పదేళ్లుగా తగ్గుతూ వస్తోంది. ఆధునిక వలలతో లోతు జలాల్లో వేట సాగుతోంది. దీనివల్ల పులసల పునరుత్పత్తి తగ్గిపోతోంది. ఈ తగ్గుదల ఆందోళనకరంగా ఉంది. మత్స్యకారులకు సూచనలు చేసినా పెద్దగా ఫలితం ఉండడం లేదు.
– పీవీ కృష్ణారావు,అసిస్టెంట్ డైరెక్టర్, ఫిషరీస్
చమురు కార్యకలాపాలూ ప్రధాన కారణం
సముద్ర జలాల్లో చమురు కార్యకలాపాలే పులసల తగ్గుదలకు ప్రధాన కారణం. అధిక వేట, నీటి కాలుష్యం కూడా దీనికి కారణాలే. బ్రీడింగ్ సమయంలో వేట నిషేధం కఠినతరం చేయాలి. పరిశ్రమలు, పట్టణాల కాలుష్యం గోదావరిలోకి వదిలేయటాన్ని నివారించాలి.
– డాక్టర్ చంద్రశేఖర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, జువాలజీ విభాగం యానాం
Comments
Please login to add a commentAdd a comment