ఏదీ ఆ రుచి? ఆ అమోఘమైన రుచి ఏమైనట్టు? అద్భుతమైన ఆ రుచి ఎటు పోయినట్టు? పుస్తెలు అమ్మైనా పులస తినాలంటారే.. అసలు ఈ ఏడాది పులసల జాడేది? అవి లేకుంటే జిహ్వ చాపల్యం తీరేదెలా? మైమరపించే ఆ రుచిపై మోజు తీరేదెలా? పులసమ్మా.. పులసమ్మా.. ఏమైతివే? ఎటు పోతివే? కాసింత కానరావే..!
సాక్షిప్రతినిధి, కాకినాడ: గోదావరి వరద ఉధృతి పులసను ఓడించింది. లక్షలాది క్యూసెక్కుల ప్రవాహానికి ఎదురీదలేక పులస తలవంచింది. సముద్రంలో ఇలసలు గోదావరికి ఎదురీదుతూ పులసలుగా మారతాయి. జూలై – ఆగస్టు నెలల మధ్య పులసల సీజన్. ఆగస్టు వచ్చి మూడు వారాలు గడచినా గోదావరి తీరంలో పులసల జాడ లేదు. మత్స్యకారుల వలకు చిక్కడం లేదు. దీంతో పులసలంటే పడిచచ్చే మాంసాహార ప్రియులు ఉసూరుమంటున్నారు. పులసల సీజన్‌లో మూడొంతులు గోదావరికి వరదలతోనే గడిచిపోయింది. మునుపెన్నడూ లేని స్థాయిలో జూలైలో వరదలు గోదావరిని ముంచెత్తాయి.
అదే వరద ఒరవడి ఆగస్టు ఒకటో తేదీ నుంచి ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. దీంతో సముద్రంలోని ఇలసలు గోదావరికి ఎదురీదలేక వెనక్కి పోతున్నాయని మత్స్యకారులు చెబుతున్నారు. గోదావరిలో ఆగస్టు 10 నుంచి మొదటి, రెండో ప్రమాద హెచ్చరికలు కొనసాగుతున్నాయి. వరద ఉధృతి తీవ్రంగా ఉండటమే పులసలు రాకపోవడానికి ప్రధాన కారణంగా చెబుతున్నారు. సముద్రంలో ఉండే ఇలస(హిల్స)చేప పునరుత్పత్తి కోసం ఎదురీదుతూ గోదావరికి వచ్చే సరికి పులస అవుతుంది. గోదావరి నుంచి సముద్రానికి వచ్చే నీటి ప్రవాహాన్ని తట్టుకుని ఈదుకుంటూ రావాలి.
లక్షన్నర నుంచి మూడు లక్షల క్యుసెక్కులు స్థాయిలో గోదావరి నుంచి సముద్రానికి నీటి విడుదల ఉంటే.. సముద్రం వైపు నుంచి విలసలు గోదావరికి రాగలుగుతాయి. ఆగస్టులో వరదలు మొదటి పది రోజులు మూడు లక్షలు, అప్పటి నుంచి 20–8–2022 వరకు ఏ రోజూ 10 లక్షల క్యుసెక్కులకు తక్కువ కాకుండా మిగులు జలాల (వరద నీరు)ను సముద్రంలోకి విడుదల చేస్తున్నారు.
అలా రోజూ లక్షల క్యుసెక్కుల నీరు సముద్రానికి చేరుతుంటే.. ఆ నీటి ఉధృతిని తట్టుకుని విలసలు సముద్రం నుంచి గోదావరికి ఎదురీదలేకపోతున్నాయి. అలాగే గోదావరి, బంగాళాఖాతం కలిసే సీ మౌత్(నదీ ముఖద్వారం వద్ద)లు మొగలు పూడుకుపోవడం కూడా పులస రాకకు అడ్డుగా మారి ఉండొచ్చని మత్స్యశాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో విలసలు గోదావరి వైపు రాకుండా పశ్చిమ బెంగాల్, ఒడిశా వైపు తరలిపోతున్నాయి.
ఆ రుచికి.. ఈ రుచికి అసలు పొంతనే లేదు
గోదావరిలో పులసలు లభించకపోవడంతో ఒడిశా సముద్ర జలాల్లో లభిస్తున్న విలసలను గోదావరి జిల్లాలకు తెచ్చి జోరుగా విక్రయిస్తున్నారు. ఒడిశా నుంచి ఎదుర్లంక, యానాం, కోటిపల్లి తదితర ప్రాంతాలకు వ్యాన్‌లలో తీసుకొచ్చి మరీ అమ్ముతున్నారు. అరకిలో విలస రూ.1,000 నుంచి రూ.1,500 పలుకుతోంది. అంతగా రుచి లేకున్నా పులస ప్రియులు అలా సర్దుకుపోతున్నారు. గోదావరిలో లభించే పులస రుచికి, ఈ విలస రుచికి అసలు పొంతనే లేదంటున్నారు. గత సీజన్‌లో పులసలు ఒక్కోటి కిలో నుంచి నాలుగైదు కిలోల పరిమాణంలో లభించేవి. ధర రూ.10 వేలకు పైనే పలికేది.
ఎదురీదలేక..
గోదావరికి ఉధృతంగా వరదలు రావడంతో పులసలు ఎదురీదలేకపోతున్నాయి. దీంతో గోదావరిలో పులసలు కానరావడం లేదు. ప్రస్తుతానికి ఒడిశాలో దొరికిన విలసలను అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాం.
– నాటి పార్వతి, మత్స్యకార మహిళ, యానాం.
విచక్షణ రహిత వేటతో పులసలకు ప్రమాదం
విచక్షణ రహితంగా సాగుతున్న వేట కారణంగానే గోదావరిలో పులసల సంఖ్య నానాటికీ తగ్గిపోతుంది. గతంలో దాదాపు ఆరు కిలో మీటర్ల మేర మాత్రమే సముద్రంలో వేట సాగేది. ప్రస్తుతం ఆధునిక బోట్లు, వలల కారణంగా వంద కిలో మీటర్లు కూడా వేట సాగుతోంది. ఫలితంగా పలు రకాల చేపలు అంతరించిపోతున్నాయి. అందులో పులస జాతి కూడా ఉంది.
– పీవీ కృష్ణారావు, అసిస్టెంట్ డైరెక్టర్, ఫిషరీస్, రాజమహేంద్రవరం
Comments
Please login to add a commentAdd a comment