ఆత్రేయపురం: పులస సీజన్ వచ్చేసింది. నకిలీ పులసలు కూడా మార్కెట్‌లోకి వచ్చాయి. అంటే విలస అన్నమాట. చూసేందుకు పులస, విలస ఒకే రకంగా ఉంటాయి. రుచిలో భారీ తేడా ఉంటుంది. అంతేకాదు. ధరలో కూడా తేడా ఉంటుంది. పులస కేజీ చేప రూ.5 వేల నుంచి రూ.10 వేల వర ధర పలుకుతూండగా నకిలీ పులసను కూడా అదే ధరకు విక్రయిస్తూ పలువురు మోసం చేస్తున్నారు. జూలై, ఆగస్టు నెలల్లో గోదావరికి భారీగా వరద వస్తుంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు ఉపనదులు తోడుగా గోదావరి పోటెత్తుతుంది.
నది ఉధృతంగా ప్రవహించి తిరిగి నీటిమట్టం తగ్గుతున్న సమయంలో సముద్రం నుంచి విలసలు గోదావరి నీటిలోకి ఎదురీదుతూ వస్తాయి. ఆ విధంగా కేంద్ర పాలిత ప్రాంతం యానాం సమీపాన సముద్రం నుంచి గోదావరిలోకి ఎదురు ప్రయాణం ప్రారంభించిన విలసలు సుమారు 40 కిలోమీటర్ల మేర గోదావరిలో ఎదురీత పూర్తయ్యే సరికి పులసలుగా రూపాంతరం చెందుతాయని మత్స్యకారులు అంటారు.
ఆ పులసలు కొత్తపేట నియోజకవర్గంలో కొత్తపేట, ఆత్రేయపురం, రావులపాలెం, ఆలమూరు మండల గ్రామాలైన ఆత్రేయపురం, బొబ్బర్లంక, పేరవరం, రాజవరం, మెర్లపాలెం, చొప్పెల్ల, రావులపాలెం తదితర ప్రాంతాల్లో పులస దొరుకుతుంది. కానీ విలస చేప మాత్రం సముద్రంలోనే దొరుకుతుంది. దీని ధర కేవలం రూ.200 నుంచి రూ.500 లోపే ఉంటుంది.
ఒడిశా, ముంబై, విశాఖ తదితర సముద్ర తీర ప్రాంతాల్లో వీటిని పట్టి ఐస్ బాక్సుల్లో నిల్వ చేసి గోదావరి ప్రాంతాలకు ఈ సీజన్‌లో తరలించి పులస పేరుతో 10 రెట్లు ఎక్కువ ధరకు విక్రయించి మత్స్య ప్రియులను మోసం చేస్తున్నారు. పుస్తెలు అమ్మి అయినా ఏడాదికి ఒక్కసారి పులస కూర తినాలనే నానుడి ఉన్న కోనసీమ వాసులు ఎంత ధరయినా వెనకాడకుండా పులసలు కొని తృప్తిగా ఆరగిస్తున్నారు. అయితే ఈ పులసలు గోదావరిలో ఎర్ర నీరు ఉన్నంత వరకూ మాత్రమే దొరికే అవకాశం ఉండటంతో నకిలీ పులసలను తెచ్చి కొందరు వ్యాపారం చేస్తున్నారు. కొత్తగా పులస చేపల కొనుగోలుకు వస్తున్న వారు విలస బారిన పడి మోసపోతున్నారు.
ఇంతకీ పులసకు, విలసకు తేడా గమనిస్తే..
పులస చేప నిగనిగలాడుతూ ఉంటుంది. ఎటువంటి రంగూ లేకుండా పూర్తి తెలుపు రంగులో ఉంటుంది. చల్లదనం అసలే ఉండదు. చేప మొత్తం జిగురుగా అంటే పట్టుకుంటే జారిపోయేలా ఉంటుంది. కేవలం గోదావరి బ్యారేజీల వద్ద లేదా పరీవాహక ప్రాంతంలో మాత్రమే పులస చిక్కుతుంది. విలసగా ఉన్న చేప సముద్రం నుంచి 40 లేదా 50 కిలోమీటర్లు గోదావరికి ఎదురీదుతూ వచ్చి పులసగా మార్పు చెందుతుంది. వీటిని వండిన తరువాత వారం రోజులైనా కూర రుచిగానే ఉంటుంది.
విలస (నకిలీ పులస)
చేపకు నిగారింపు ఉండదు. ఎరుపు, పసుపు రంగుల్లో ఉంటుంది. చల్లగా ఉంటుంది. ఎందుకంటే ఐస్ బాక్స్‌ల్లో నిల్వ చేస్తారు. చేప పట్టుకుంటే పెద్ద జిగురుగా ఉండదు. ఎక్కడబడితే అక్కడ వీటిని విక్రయిస్తూ ఉంటారు. కేవలం సముద్రంలో మాత్రమే ఇవి దొరుకుతాయి. అక్కడ నుంచి ఐస్ బాక్సుల్లో నిల్వచేసి పులసలు అమ్మే ప్రాంతానికి తరలించి పులస ధరకే వీటిని విక్రయిస్తుంటారు. వీటిని వండిన మరుసటి రోజుకే కూర రుచి తగ్గుతుంది.
చేప ప్రియులను మోసం చేస్తున్నారు
సముద్రంలో పుట్టిన విలసను గోదావరి జిల్లాలకు తీసుకువచ్చి పులస పేరుతో మత్స్య ప్రియులను మోసం చేస్తున్నారు. పులస కేవలం సముద్రంలోనే పుడుతుంది. అది 20 నుంచి 40 కిలోమీటర్ల మేర గోదావరిలో ఎదురీదిన తరువాత పులసగా మారుతుంది. ఐస్ బాక్సుల్లో విలసను తెచ్చి మత్స్యప్రియులను మోసం చేస్తున్నారు. దాని వల్ల మాలాంటి జాలర్లు నష్టపోతున్నాం.
– లంకె వెంకటకృష్ణ, మత్స్యకారుడు, ఆత్రేయపురం
Comments
Please login to add a commentAdd a comment