
ఐసీసీసీలోకి గుర్తుతెలియని వ్యక్తి ప్రవేశించడంపై పోలీస్ వర్గాల్లో చర్చ
ముమ్మాటికీ భద్రతా వైఫల్యమే అని విమర్శలు
బంజారాహిల్స్: బంజారాహిల్స్ రోడ్ నెం.12లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్(ఐసీసీసీ)కు ఇటీవల కాలంలో సీఎం రేవంత్‌రెడ్డి, ఇతర మంత్రులు, ఉన్నతాధికారులు సమీక్షా సమావేశాలకు హాజరవుతున్నారు. ఇంతటి కీలకమైన ఐసీసీసీలోకి గుర్తు తెలియని వ్యక్తి ప్రవేశించి..టాస్‌్కఫోర్స్ పోలీసునంటూ తిరగడం పోలీసు వర్గాల్లో చర్చనీయాంశం అయింది. ఐసీసీసీలోకి ఎవరు వెళ్లాలన్నా చెకింగ్ పాయింట్‌లో అన్ని వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. గుర్తింపు కార్డు కూడా చూపించాలి. ఎవరిని కలవాలో చెప్పాలి. నకిలీ టాస్క్‌ఫోర్స్ కానిస్టేబుల్ ఐసీసీసీలోకి మూడుసార్లు వెళ్లి రావడం పట్ల పోలీసులు ఆరా తీస్తున్నారు. లోపలికి ఎలా వచ్చాడు ఎవరిని కలిశాడు, ఏం చెప్పి వచ్చాడు అన్నదానిపై ఉన్నతాధికారులు, నిఘా వర్గాలు ఆరా తీస్తున్నాయి.
కూకట్‌పల్లికి చెందిన జ్ఞాన సాయి ప్రసాద్ అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ను ఎదురుగా ఉన్న నిలోఫర్ కేఫ్‌లో కలుసుకున్న నకిలీ టాస్‌్కఫోర్స్ కానిస్టేబుల్..తన పేరు హరిజన గోవర్ధన్‌గా పరిచయం చేసుకొని హోటల్ బిజినెస్‌లో లాభాలు వస్తాయంటూ రూ.2.82 లక్షలు వసూలు చేశాడు. మూడు విడతలుగా ఇదే హోటల్‌లో బాధితుడు చెల్లించడం జరిగింది. ఈ మూడుసార్లు నిందితుడు హరిజన గోవర్దన్ ఐసీసీసీ నుంచి బయటికి వచ్చి బాధితుడిని నమ్మించాడు. బాధితుడు కూడా నేరుగా కమాండ్ కంట్రోల్‌సెంటర్ నుంచి సదరు వ్యక్తి వస్తుండటంతో అందులో పని చేస్తున్న వ్యక్తిగానే భావించాడు. ఇక్కడే బాధితుడు దెబ్బతిన్నాడు. అడిగినంత డబ్బు చెల్లించుకొని తీరా మోసపోయిన తర్వాత బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఐసీసీసీలో సీసీ ఫుటేజీలు పరిశీలించగా నిందితుడు మూడుసార్లు రావడం పోలీసులు గుర్తించారు. ఇంతటి కీలకమైన కమాండ్ కంట్రోల్ సెంటర్‌లోకి అది కూడా సీఎం రోజూ హాజరవుతున్న ప్రాంతంలోకి నకిలీ పోలీసు వెళ్ళడం దిగ్భ్రాంతికి గురి చేస్తున్నది ఈ వ్యవహారంపై పోలీసు ఉన్నతాధికకారులు లోతుగా విచారిస్తున్నారు. నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. బాధితుడి నుంచి మరింత సమాచారం రాబడుతున్నారు. గతంలో నిందితుడు ఇలాంటి మోసాలకు పాల్పడి ఉంటాడా..అనే కోణంలో కూడా పాత నేరస్తుల కదలికలపై దృష్టి పెట్టారు. మొన్నటికి మొన్న సచివాలయంలో నకిలీ అధికారులు సంచలనం సృష్టించగా తాజాగా సీఎం సమీక్షలకు వస్తున్న కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఈ ఘటన పోలీసులకు సవాల్‌గా మారింది.
Comments
Please login to add a commentAdd a comment